Friday, January 15, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-22 : రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపిన దశరథుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-22
రామలక్ష్మణులను విశ్వామిత్రుడి 
వెంట పంపిన దశరథుడు
వనం జ్వాలా నరసింహారావు

తనకిష్ఠం లేకున్నా, తన హితులు చెప్పినట్లు చేస్తే శ్రేయస్కరమని భావించాడు దశరథుడు. వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు, సంతోషించి, మునివెంట పంపేందుకై, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని నిండు మనస్సుతో పిలిచాడు. (రామలక్ష్మణులిద్దరిదీ అవినాభావ సంబంధం కాబట్టే, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని పిలిచాడు అని అనటం జరిగింది).

తండ్రి పిలవగానే కులోచితమైన ధర్మకార్యనిర్వహణకు తమను ఉపయోగించబోతున్నాడు కదాననీ- సాధువర్తనులైన ఋషులను రక్షించేందుకు, వారికి కీడు కలిగించనున్న అధర్మవర్తనులను శిక్షించే సమయం వచ్చింది కదా ననీ-అవతార ప్రయోజనం సమకూరడం ప్రారంభమయిందికదాననీ -మనస్సులో సంతోషం ఉప్పొంగుతుండగా వచ్చిన కొడుకులకు తొలుత తల్లితండ్రులు మంగళా శాసనం కావించారు. (తల్లితండ్రులు దీవించారనడం సమాసంకొరకు కాదు. శ్రేష్ఠత్వాన్ని బట్టి తల్లి ముందు చెప్పబడింది. మహాకార్యార్థమై పంపేటప్పుడు తల్లితండ్రులు దీవించి పంపాలి. అయితే తల్లి దీవనే ప్రధానం). తరువాత పురోహితుడు శుభమైన మాటలతో వారి హితం కోరి-వారికి రాక్షసులవల్ల బాధలుకలుగకుండా మంత్రించారు. దశరథుడు శ్రీరామచంద్రుడిని తన దగ్గరకు పిల్చి, శిరం వాసనచూచి, మీద చేయి వేసి, మహా ప్రీతితో అంతరాత్మ సంతోషిస్తుండగా, బ్రహ్మ సమానుడైన విశ్వామిత్రుడికి రామలక్ష్మణులను అప్పగించాడు.

’కౌసల్యా నందనుడైన’ శ్రీరామచంద్రమూర్తి అవతార ప్రయోజనానికి అంకురార్పణ చేయబోతున్నాడు కాబట్టి, దేవతలు శుభశకునాలను ప్రదర్శించారు. (దశరథ నందనుడు అనకుండా-కౌసల్యా నందనుడు అనడానికి కారణముంది. దశరథుడిలాగా కౌసల్య ఎదురు మాట్లాడకుండా, తన కొడుకుకు - చిన్ననాడైనప్పటికీ, ఘనకార్యం చేసే అవకాశం వచ్చిందికదానని సంతోషంతో అనుమతించింది కనుక అలా సంబోధించి వుండవచ్చు). భవిష్యత్ లో ఈయనను ఆశ్రయించి, తన కుమారుడైన హనుమంతుడు ధన్యుడై తనకూ కీర్తికలిగించబోతున్నాడన్న సంతోషంతో వాయుదేవుడు ఆయనకు (రాముడికి) మార్గంలో ఆయాసం కలగకుండా, తనకు చేతనైన విధంగా, సువాసనలతో మెల్లమెల్లగా సుఖం కలిగేటట్లు వీచాడు. ఇక తమకు రాక్షసులవల్ల భయం లేదనీ-జయమేనని, ధైర్యంతో, దేవతలు బహిరంగంగా దుందుభులు మోగించారు. భూజాతలు (వృక్షాలు - భూజాతంటే సీత) తలంబ్రాలు పోయబోతున్నట్లుగా పూలవాన కురిపించాయి. సూర్యకిరణాలు వేడి సోకకుండా సన్న తుంపర వాన కురిసింది. దేవతలు కనబర్చిన శుభశకునాలను చూసిన అయోధ్యాపురవాసులు, బ్రహ్మ కుమారుడు - కౌశికనందనుడైన విశ్వామిత్రుడివెంట శుభంగా శ్రీరామచంద్రుడు వెళుతుంటే, శంఖాలను - నగారాలను సంకులంగా మోగించారు.


ముందు తోవ చూపిస్తూ విశ్వామిత్రుడు పోతుంటే, తన వెనుక లక్ష్మణుడు నడుస్తుంటే, ఎడమచేతితో విల్లు ధరించి - సొమ్ములపై సొమ్ములు పెట్టుకున్న విధంగా ముద్దైన జుట్టు కనిపిస్తుంటే - చూసేవారికి సంతోషం కలిగించే విధంగా భూషణాలు మెరుస్తుంటే - తన ప్రకాశంతో దిక్కులన్నీ వెలుగుతుంటే - పురంలో వున్న స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏకాగ్రతతో తననే చూస్తుంటే - కొందరు స్త్రీలు పుష్పాంజలులు చల్లుతుంటే - దిక్కులు పిక్కటిల్లేటట్లు వాద్యాలు మోగుతుంటే - మూడువందల ఏభైమంది తల్లులు వారివారి మేడలమీద నిలబడి కిటికీలనుండి కనబడే వరకూ పరవశలై తొంగి,నిక్కి చూస్తుంటే, శ్రీరామచంద్రమూర్తి వెళ్తున్నాడు. చేతుల్లో విల్లంబులు ధరించి - తలకు ఇరువైపుల రెండు మూపులమీద రెండంబులపొదలు బిగించి - మూడుతలల పాములలాగా కనిపిస్తూ - వేళ్ళకు దెబ్బలు తగులకుండా తిత్తులు తొడుక్కొని - తమదేహకాంతులు పదిదిక్కులవరకూ వ్యాపిస్తుంటే - దేహం నిండా ఆభరణాలు ధరించి - సౌందర్యంలో మన్మధుడిని మించి - నడి కట్టుల్లో ఖడ్గాలనుంచి - బ్రహ్మదేవుడి వెంటపోయే అశ్వినీ దేవతలలాగా, శివుడి వెనుక వెళ్ళే కుమారస్వామిలాగా, శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తోడుకొని పోయాడు.

బల-అతిబల విద్యలను రాముడికి నేర్పిన విశ్వామిత్రుడు

విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులను తీసుకొని ఒకటిన్నర ఆమడ దూరంపోయి, సరయూ నదిని దాటి, దాని దక్షిణంవైపున్న ఒడ్డుకు చేరి, "రామచంద్రా! రఘురామా! నాయనా! నీచేత్తో ఆలస్యం చేయకుండా నీళ్ళు తీసుకొని రా. అస్తమానం కావచ్చింది. నీకు బల-అతిబల అనే రెండు మంత్రాలను శీఘ్రంగా ఉపదేశిస్తాను. అవి నువ్వు పఠిస్తే, దారిలో బడలిక - ఆకలిదప్పులు వుండవు. ఈమంత్రాలవల్ల కలిగే ఫలమింత అని చెప్పలేం. నువ్వు నిద్రపోతున్నా, హెచ్చరికతప్పి పరధ్యానంగా వున్నా, రాక్షసులు నిన్నేం చేయలేరు. భుజబలంలో నీకెవరూ సమానులుండరు. సౌందర్యంలో-వీర్యంలో అసమానుడవవుతావు. నీ కీర్తి లోకంలో పెరిగిపోతుంది. ఈమంత్రాలు బ్రహ్మ సృష్టించినవి కానందున సామాన్యమైనవని అనుకోవద్దు. వీటివల్ల బుద్ధిబలం, యుక్తి, చాతుర్యం లోకోత్తరమై-జ్ఞానాన్ని కలిగిస్తాయి. మహామంత్రాలు జపించేవారికుండాల్సిన బ్రహ్మచర్యం, ధర్మబుద్ధి లాంటి సద్గుణాలు నీలోవున్నాయి. అందుకేనీకిస్తున్నాను. నువ్వనుకున్న పనులన్నీ ఫలవంతమవుతాయి. సందేహం లేదు. వీటిని నేను నీకిస్తున్నానంటే, పాత్రుడికి దానంచేసేవాడికెలాంటి ఉత్తమగతులు కలుగుతాయో, అలాంటివే నాకూ నీవలన కలుగుతాయి." అని రాముడితో తియ్యట మాటలతో అంటాడు. (యోజనం, క్రోసెడు, ఆమడ అనే దూరాలు ఒక్కొక్కరోవీధంగా-భిన్నంగా, చెప్తుంటారు. ఒకటిన్నర ఆమడ-ఆరు క్రోసుల దూరమంటే వారు చేరింది ’గోప్రతారతీర్థం రేవు’ అని అనుకోవాలి. సరయూనదీ తీరంలోనే అయోధ్య వుంది. విశ్వామిత్రుడు పోయిన రేవు దూరంలో వుందనే అనుకోవాలి కాని ఒకటిన్నర ఆమడను దగ్గర లోనే వుందని భావించకూడదు. ఆలస్యం చేయకుండా నీళ్ళు తీసుకొని రమ్మనడమంటే, చీకటిపడేసమయం అయిందనీ, రాత్రివేళల్లో మంత్రాలుపదేశించకూడదనీ అనుకోవాలి. వాళ్ళు అభిజిల్లగ్నంలో బయలుదేరారు కాబట్టి, బాలురు కాబట్టి, 15 మైళ్లు నడిచేందుకు 5 గంటల సమయం పట్టుండవచ్చు. మరో విషయం ఇక్కడ తెలుసుకోవాలి. మంత్రోపదేశం పొందేవాడు శుచిగా-ఆచమించి-ఏకాగ్రచిత్తంతో గ్రహించాలి. మంత్రాలను పాత్రుడికే ఉపదేశించాలి).

విశ్వామిత్రుడి మాటలువిన్న శ్రీరామచంద్రమూర్తి, ఆచమించి, శుచిగా ఆరెండు మంత్రాలను గ్రహించాడు. వెంటనే రాముడి తేజం శరత్కాల సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆ తర్వాత గురువుచెప్పినవిధంగా మిగిలిన తతంగమంతా పూర్తిచేసాడు. ఆరాత్రికి ముగ్గురు ఆనదీతీరంలోనే సుఖంగా గడిపారు. దశరథమహారజు కొడుకులైనందువల్ల వారు ఆగర్భశ్రీమంతులు - సుకుమారులు - కష్టమంటే తెలియనివారు. అయినప్పటికీ, వారికి వీలుపడని పచ్చి గడ్డిపైన పండుకొని, విశ్వామిత్రుడి బుజ్జగింపు మాటలు వింటూ, హాయిగా నిద్రపోయారు రామలక్ష్మణులు.

బల-అతిబల మంత్రం:

బలాతిబలయోః  విరాట్పురుష ఋషిః  గాయత్రీ దేవతా గాయత్రీ ఛందః

అకారో  కారమకారా బీజాద్యాః  క్షుధాది నిరసనే వినియోగః

క్లామిత్యాది షడంగన్యాసః  ధ్యానమ్

అమృతకరతలార్ద్రౌ సర్వసంజీవనాఢ్యావఘహరణసుదక్షౌ  వేదసారేమయూఖే

ప్రణవమయవికారౌ భాస్కరాకారదేహౌ సతత మనుభవే  హం  తౌ  బలాతిబలేశౌ

ఓం  హ్రీం  బలే మహాదేవి  హ్రీం  మహాబలే  క్లీం చతుర్విధపురుషార్థసిద్ధిప్రదే 

తత్స వితుర్వరదాత్మికే హ్రీం   వరేణ్యం భర్గో దేవస్య వరదాత్మికే_అతిబలే

సర్వదయామూర్తే బలేసర్వక్షుద్భ్రమోపనాశిని  ధీమహి ధియోయోనర్జాతే

ప్రచుర్యాప్రచోదయాత్మికే ప్రణవశిరస్కాత్మికే హుం ఫట్ స్వాహా

ఏవం విద్వాన్ కృతకృత్యో  భవతి   సావిత్ర్యా  ఏవ   సలోకతాం జయతి


ఇత్యుపనిషత్  ఆప్యాయన్తితి  శాంతిః

No comments:

Post a Comment