Monday, January 4, 2016

అమెరికాలో హిందూ సంస్కృతీ సౌరభం : వనం జ్వాలా నరసింహా రావు

అమెరికాలో హిందూ సంస్కృతీ సౌరభం
ఆంధ్రభూమి దినపత్రిక (04-01-2016)
వనం జ్వాలా నరసింహా రావు

          అమెరికాలో ఎక్కడికెళ్లినా, శెలవు దినాల్లో వెళ్లాల్సిన ప్రధానమైన వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అక్కడి దేవాలయాలు. మేం వెళ్లిన అన్ని ప్రదేశాలలోను తప్పకుండా దేవాలయాలను చూసే వాళ్లం. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో (చిన్న చిన్న ప్రదేశాల్లో కూడా) హిందు సంస్కృతి-సాంప్రదాయాలకు నిలయమైన అనేక దేవాలయాలు నెలకొల్పారు మన తెలుగు వారు. పిట్స్ బర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్తు తిరుమల దేవాలయంతో పోల్చడం అందరికి తెలిసిన విషయమే. దరిమిలా అమెరికాలోని పలు ప్రాంతాల్లో పిట్స్ బర్గ్ కు ధీటుగా దేవాలయాలు వెలిశాయి. సిన్స్ నాటిలో, డేటన్ లో వున్న దేవాలయాలను చూశాం. పిట్స్ బర్గ్ కు వెళ్లినప్పుడు, అక్కడున్న సాయిబాబా గుడిని కూడా చూశాం. అవి ఏవీ కూడా మన దేశంలోని పురాతన దేవాలయాలకు తీసిపోవు. పూజా-పునస్కారాలు కూడా శాస్త్రోక్తంగా, పాండిత్యం తెలిసిన అర్చకులే నిర్వహిస్తుంటారు. అన్నింటికన్నా విశేషం, మన మతాన్ని గౌరవిస్తూ, మన దేవాలయాల నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమెరికన్ ప్రభుత్వం రక్షణ కలిగించడం. సెక్యులరిజం అనేది మనదేశంలో ఎంతవరకు పాటిస్తున్నామో చెప్పలేం కాని, ఇక్కడ మాత్రం మన భావాలను గౌరవిస్తున్నారు. ఇక్కడ దేవాలయాల్లో అర్చకులుగా వచ్చేవారికి, రెలిజియస్ కోటా కింద వీసాలు జారీ అవుతాయి. కొందరు పూజారులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు తీసిపోకుండా సంపాదించుకుంటున్నారు. తమ లాంటి వారిని ఇండియా నుంచి పిలిపించి, వారికి జీవనోపాధి కలిగిస్తున్నారు.

          హ్యూస్టన్లో, అష్ట లక్ష్మి దేవాలయంతో పాటు, మరికొన్ని దేవాలయాలు కూడా వున్నాయి. అష్ట లక్ష్మి దేవాలయాన్ని జెట్ వైదిక విజ్ఞాన కేంద్రం" అని కూడా పిలుస్తుంటారు. దేవాలయ నిర్మాణం ఆధునిక పద్ధతుల్లో జరిగినప్పటికీ, భారతీయ ఆగమ సాంప్రదాయానికి భంగం కలగకుండా, తగు జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. సనాతన హిందు దేవాలయాల్లో అనుసరిస్తున్న ఆచార వ్యవహారాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం ఉదయం-సాయంత్రం యథావిధిగా దేవాలయాల్లో నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలకు ఏ లోటు రాకుండా పూజారులు నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు కూడా జరుగుతాయి. శ్రీ శ్రీ శ్రీ త్రి దండి రామానుజ చిన జీయర్ స్వామి బోధనలకనుగుణంగా, వైదిక సాంప్రదాయాన్ని-వేదాల్లోని విజ్ఞానాన్ని, నేటి తరం-భావి తరాల వాళ్ళకు అందించడమనే ప్రధాన ధ్యేయంగా ఈ దేవాలయం వివిధ కార్యక్రమాలను చేపడ్తుంది. పాంచరాత్ర ఆగమ సూత్రాలను తు. చ తప్పకుండా పాటిస్తూ స్థాపించబడిన అష్ట లక్ష్మి దేవాలయం, నిర్వహణలోనూ అవే అనుసరిస్తుంటుంది. చిన జీయర్ స్వామి, పెద జీయర్ స్వామి నిలువెత్తు ఫొటోలు, ఆళ్వార్ల ఫొటోలు, గోదా దేవి ఫొటోలు అక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. లక్ష్మి నారాయణ స్వామిని, ఆయన సరసన ఆది లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, గజ లక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యా లక్ష్మి, ధన లక్ష్మి విగ్రహాలు దర్శనమిస్తాయిక్కడ. నిత్యం అంగరంగ వైభోగంగా దైవిక కార్యక్రమాలతో పాటు, "హ్యూస్టన్ తెలుగు సాహితీ లోకం" లాంటి సాహితీ సంస్థలు నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" తరహా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. హ్యూస్టన్లో వుంటున్న తెలుగు వారు (ప్రధానంగా), ఇతర భారతీయులు తరచుగా కలుసుకునే పుణ్యం-పురుషార్థం కలుగజేసే "సాంప్రదాయ-సాహితీ సంగమం" అష్ట లక్ష్మి దేవాలయం.

          ఒక సాహితీ కార్యక్రమానికి, కిన్నెర వాళ్ల గృహ ప్రవేశం జరిగిన తర్వాత ఒక నాడు, భోగి పండుగ నాడు "గోదా దేవి కల్యాణం" చేయించడానికి కూడా అష్ట లక్ష్మి దేవాలయానికి వెళ్లాం. ప్రతి సంక్రాంతి ముందర వచ్చే భోగి పండుగ నాడు చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే "గోదా దేవి కల్యాణం" ఉత్సవానికి హాజరవడం మాకు అలవాటు. మా నాన్న గారు చనిపోయిన తరువాత ఆయన ఆదేశానుసారం మా గ్రామం (ఖమ్మం జిల్లాలో) ముత్తారం దేవాలయంలో చేయించడం కూడా అలవాటుగా మారింది. జీయర్ స్వామి ఆశ్రమం వెళ్లి, అక్కడ వేలాది మంది భక్తుల సరసన కూర్చొని, గోదా దేవి కల్యాణంలో పాల్గొనేవాళ్లం. అమెరికా హ్యూస్టన్ లో వున్నప్పుడు అష్ట లక్ష్మి దేవాలయానికి వెళ్లి, 51 డాలర్లు చెల్లించి, అందులో పాల్గొన్నాం. చిన జీయర్ స్వామి చేయించిన రీతిలోనే, దాదాపు వేయి మందికి పైగా హాజరయిన భక్తుల సమక్షంలో, వైభవంగా జరిగింది గోదా దేవి కల్యాణ మహోత్సవం.

          అపర జానకీ మాతను గుర్తుకు తెచ్చేదే ఆండాళ్ తల్లి-లేదా-గోదా దేవి. జనక మహారాజు యజ్ఞ శాల నిర్మించేందుకు భూమిని దున్నుతుంటే ఏ విధంగా సీత దొరికిందో, ఆండాళ్‌ కూడా తులసి వనం కొరకు, విష్ణుచిత్తుడు భూమిని దున్నుతుంటే దొరికింది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయం, గోదాదేవి లేని వైష్ణవాలయం (రామాలయంతో సహా) వుండదు. సీతమ్మ శ్రీరాముడిని, ఆండాళ్‌ శ్రీరంగ నాథుడిని- ఇద్దరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో అవతరించిన వారే-వివాహమాడారు. "పేరి ఆళ్వారు" గా పిలువబడే శ్రీ విష్ణుచిత్తుడు, తమిళనాడులోని శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరం వట పత్ర శాయికి మాలా కైంకర్యం చేసుకుంటూ, నిరంతరం ఆ విష్ణు మూర్తి ధ్యానంలోనే గడుపుతుండే వాడు. తులసి వనం కొరకు భూమిని దున్నుతుంటే ఆండాళ్‌ శిశువు భూమిలో కనిపించింది. ఆ పసికూనను, పరమ సంతోషంతో తన ఇంటికి తీసుకెళ్లి, పెంచమని భార్య కిచ్చాడు విష్ణుచిత్తుడు. పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేశారు. గోదా అంటే భూమి అని, భూమిలో ఉద్భవించింది కాబట్టి గోదాదేవి అని పేరు పెట్టారు ఆ దంపతులు. ఆ పసిపిల్లకు చిన్నతనం నుంచే, శ్రీమన్నారాయణుడి మీద అమితమైన భక్తి. పెరిగి పెద్దై, జ్ఞానం వచ్చేసరికి శ్రీమన్నారాయణుడుని తప్ప మానవ మాత్రులనెవరినీ వరించబోనని-వివాహం చేసుకోనని, తన నిశ్చయం తెలిపింది. తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు వటపత్రశాయికి మాలా కైంకర్యం చేయడం చూసి గోదాదేవి పరవశించి పోయేది. తండ్రి కట్టిన మాలలు ఆయనకు తెలియకుండా ధరించి, భావిలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయి, తిరిగి ఆ మాలలను యథాస్థానంలో వుంచేది. ఒక నాడు తండ్రి ఇది చూసి, గోదా చేసింది తప్పని భావించాడు. మాలలు మాలిన్యమై నాయని ఆనాడు వటపత్రశాయికి అవి సమర్పించలేదు. గోదా దేవిని సున్నితంగా మందలించాడు. స్వామికి నిర్ణయించ బడిన పూల దండ ముందర ఆమె ధరించడం అపచారమంటాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూల దండలు తనకెందుకు సమర్పించలేదని విష్ణు చిత్తుడికి కలలో కనబడి ప్రశ్నించాడు వటపత్రశాయి. విష్ణు చిత్తుడు తన కూతురు చేసిన అపరాధాన్ని వివరించి, మాలలను సమర్పించ లేకపోయిన కారణం తెలియ చేశాడు. వాటికి బదులుగా వేరేవి తయారు చేసేందుకు సమయం లేకపోయింది అని విన్నవించుకున్నాడు.


          వటపత్రశాయి చిరునవ్వుతో, గోదాదేవి ముందుగా ధరించిన మాలంటేనే తనకు ఇష్టమని, అదే తాను కోరుకుంటున్నానని అంటాడు. ఆమె తలలో పెట్టుకోని మాలలు తనకొద్దంటాడు. ఆమె విషయం విష్ణు చిత్తుడికి తెలియదని, సాక్షాత్తు లక్ష్మీదేవే భూలోకంలో గోదాదేవిగా అవతరించిందని చెప్పాడు. గోదా దేవికి యుక్త వయస్సు వస్తూనే, గోపికలు కృష్ణుడి మీద చూపిన అనురక్తి లాంటిది ఆమెలో కనిపించ సాగింది. కృష్ణుడు యమునలో జలక్రీడలాడే దృశ్యాన్ని మనస్సులో ఊహించుకుంటుంది. ధనుర్మాసంలో తోటి బాలికలతో కలిసి స్నానం చేసి వటపత్రశాయి దేవాలయం శ్రీకృష్ణుడి గృహం గాను, తోటి బాలికలు గోపికలు గాను, వటపత్రశాయి శ్రీకృష్ణుడి గాను, తాను ఒక గోపాంగన గాను భావించుకుంటుంది. వటపత్రశాయికి ధూప, దీప , నైవేద్యంతో రోజుకొక "పాశురం" ద్రావిడ భాషలో (తమిళం)వ్రాసి వటపత్రుడి సన్నిధిలో పాడుకుంటూ, తోటి బాలికలతో కాత్యాయనీ వ్రతం చేసింది. తన తండ్రిని 108 దివ్య తిరుపతుల లోని మూర్తుల కళ్యాణ గుణాలను వివరించి చెప్పమని అడిగింది. ఆమె కోరినట్లే, పేరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు. ఆ వర్ణనలను వింటూ, శ్రీరంగంలో వేంచేసి వున్న, శ్రీరంగ నాయకుడి మహాదైశ్వర్యవిభూతి సౌందర్యానికి ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడాలని ధృఢంగా నిశ్చయించుకుంది. గోదా దేవికి శ్రీరంగనాథుడుకి వివాహం జరిగేదెలా అని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్రశాయికి మొర పెట్టుకుంటాడు. తన కుమార్తెను శ్రీరంగ నాథుడి సన్నిధికి తీసుకొని పొమ్మని వటపత్రశాయి ఆదేశించాడు. శ్రీరంగనాథుడు అ రోజు రాత్రి విష్ణు చిత్తుడి కలలో కనిపించి ఆయన కూతురుని వివాహం చేసుకుంటానని, దానికి సిద్ధంగా వుండమని చెప్పాడు. మరుసటి దినం శ్రీరంగ నాథుడి అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళ తాళాలతో విష్ణు చిత్తుడి దగ్గర కొచ్చి, గోదా దేవిని విష్ణు చిత్తుడిని శ్రీ రంగనాథుడి కోరికగా, పల్లకిలో శ్రీరంగం తీసుకొని పోయారు.

          అదే రోజున స్వామి ఆజ్ఞ ప్రకారం, శ్రీ రంగనాథుడి విగ్రహానికి, గోదా దేవినిచ్చి వివాహం చేశారు. గోదా దేవి స్వామిని సేవించడం అందరూ చూస్తుండగా, శ్రీ రంగనాథుడి గర్భాలయంలోకి పోయి ఆయనలో లీనమై పోయింది. శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడిని చూసి, దిగులు పడొద్దని అంటూ, ఆయనకు గౌరవ పురస్కారంగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠ కోపము యిచ్చి, సత్కరించి పంపాడు. గోదా దేవికి ఆండాళ్‌, చూడి కొడుత్తామ్మాల్‌ అని పేర్లు కూడా వున్నాయి. గోదాదేవిని 12 మంది ఆళ్వారులలో చేర్చారు. ధనుర్మాసంలో ఆమె రచించి పాడిన తిరుప్పావై పాశురాలు జగత్‌ విఖ్యాతి చెందాయి. అన్ని వైష్ణవ దేవాలయాలలో, ధనుర్మాసంలో, అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పై రోజులు పాశురాలను పాడుకుంటా, ఆమెను కొలుస్తుంటారు. ఆమె తిరుప్పావై (30 పాశురాలు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురాలు) జగత్‌ విఖ్యాతమై అందరి చేత నుతించ బడుతున్నాయి. తిరుప్పావై ఒక దివ్య ప్రభందం.

          అలాంటి గోదా దేవి కల్యాణం అమెరికాలో జరిగినప్పుడు పాల్గొనడం మాకు ఎంతో తృప్తినిచ్చింది. కల్యాణం సంకల్పం కూడా మాతోనే చేయించారు. అది మరింత తృప్తినిచ్చింది. హ్యూస్టన్లో అష్ట లక్ష్మి దేవాలయం కాకుండా, చిన్మయ మిషన్, సాయి బాబా గుడి, శ్రీ మీనాక్షి దేవాలయం కూడా వున్నాయి. మేం మీనాక్షి గుడికి, సాయి బాబా గుడికి కూడా వెళ్లాం. మీనాక్షి గుడి చాలా పెద్దది. శెలవు రోజుల్లో వచ్చే భక్తులు అక్కడే ఏర్పాటుచేసిన భోజన శాలలో కావాల్సినవేవో తిని పోవడం ఆనవాయితి. ఒక డాలర్ చెల్లిస్తే కడుపునిండా తినవచ్చు. చిన్న పిల్లలు గోదా చరిత్ర-గోదా కల్యాణం నాట్యంగా అభినయిస్తుంటే, మన సంస్కృతీ-సంప్రదాయాలను తల్లి-తండ్రులు మరిచిపోకుండా ఎలా పిల్లలకు తెలియ చేస్తున్నారో అర్థమయింది.

          శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు కూడా మూడు దేవాలయాలను చూశాం. వెళ్లిన కొద్ది రోజులకే, ఫ్రీమాంట్ డేలావేర్ డ్రైవ్ లోని వేదిక్ ధర్మ సమాజ్ నిర్వహణలో వున్న హిందు దేవాలయానికి వెళ్లాం. కాలిఫోర్నియా సాగర తీరంలో నివసిస్తున్న హిందువులందరి కొరకు 1985 లో నిర్మించారీ దేవాలయాన్ని. విశాలమైన ఆవరణలో నిర్మించిన ఈ దేవాలయంలో ప్రార్థన, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లున్నాయి. అవసరమైన వారికి వారి-వారి హిందు ఆచారాలకు అనుగుణంగా పూజలు, వివాహాది శుభ కార్యాలు, మత పరమైన సంస్కారాలు నిర్వహించుకునే వసతి కూడా వుంది. అన్ని రకాల హిందువుల పండుగలను ఘనంగా జరుపుతారిక్కడ. వైదిక సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయం కూడా వుంది. భారత దేశంనుండి వచ్చిన అన్ని ప్రాంతాల వారు ఈ గుడికి వచ్చిపోతుంటారు. శాన్ ఫ్రాన్ సిస్కోలోని మరో ప్రాముఖ్యత సంతరించుకున్న గుడి స్ప్రింగ్ టౌన్ లో వున్న "లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయం". దీన్నే "హిందువుల సంస్కృతీ కేంద్రం" అని కూడా పిలుస్తారు. 1977 లో దీనిని నిర్మించాలన్న తలంపు కలగడం, తొమ్మిది సంవత్సరాలకు శివ-విష్ణు దేవాలయంగా రూపుదిద్దుకోవడం, దరిమిలా అంచలంచలుగా అభివృద్ధి చెందడం, కుంభాభిషేకం-మహా కుంభాభిషేకం జరుపుకొని యావత్ ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతానికే తలమానికమైన హిందు మత ప్రచార కేంద్రంగా రూపాంతరం చెందడం జరిగింది. మొదట్లో తాత్కాలికమైన నిర్మాణం మాత్రమే వున్న గుడికి శాశ్వతమైన భారీ దేవాలయంగా నిర్మించ తలపెట్టినప్పుడు పునాది రాయిని వేసింది నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు. దేవాలయ నిర్మాణ శిల్పులు, ఆగమ పండితులు భారత దేశం నుండి వచ్చారు. సాంస్కృతిక కేంద్రానికి సంబంధించిన ఉత్సవాలను పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ జరిపించారు. విశాలమైన ఆవరణలో వున్న ఈ గుడికి వేల సంఖ్యలో భక్తులొస్తుంటారు. పండుగ దినాల్లో పది వేలకు పైగా భక్తులు దైవ దర్శనానికి వస్తారు. శాన్ ఫ్రాన్ సిస్కోలో చాలా సంవత్సరాలుగా వుంటున్న మా శ్రీమతి వాళ్ల బాబాయి వల్లభి (స్వర్గీయ)అయితరాజు శేషగిరిరావు గారి కొడుకు సురేశ్ వెంకట్-భార్య సంధ్య-పిల్లలు, మేమిద్దరం కలిసి వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఆ దేవాలయం వెళ్లి ఉత్తర (వైకుంఠ) ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నాం.


          ఇలా అమెరికాలో మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను తుచ తప్పకుండా పాటిస్తూంటే, ఇక్కడేమో, రావణుడు, నరకాసురుడు, మహిషాసురుడు లాంటి వాళ్లు దేవుళ్లని, మూల రాజులని విపరీత భాష్యాలు చెపుతున్నారు. వీరిని ఆ దేవుడే రక్షించాలి! End

1 comment: