Friday, January 15, 2016

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-VI : వనం జ్వాలా నరసింహారావు

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-VI

వనం జ్వాలా నరసింహారావు

ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి ఆరవ విడత పది పద్యాలు).

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-51

సీII బలురోగములకు నీ పాదతీర్థమె కాని,
వలపు మందులు నాకు వలదు వలదు;
చెలిమి సేయుచు నీకు సేవ జేసెదగాని
నీ దాసకోటిలో నిలుపవయ్య,
గ్రహభయంబునకు జక్రము దలంచెదగాని,
ఘోరరక్షలు గట్టగోరనయ్య;
పాము కాటుకు నిన్ను భజనజేసెదగాని
దాని మంత్రము నేను తలపనయ్య,
తేII       దొరికితివి నాకు గండివైద్యుడవు నీవు,
వేయికష్టాలు వచ్చిన వెరువనయ్య;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-52

సీII కూటికోసరము నే గొరగాని జనులచే
బలుగద్దరింపులు పడగ వలసె;
దారసుత భ్రమదగిలి యుండగ గదా?
దేశ దేశములెల్ల దిరుగవలసె;
బెను దరిద్రత పైని బెనగి యుండగగదా
చేరి నీచుల సేవ జేయవలసె;
నభిమానములు మదినంటి యుండగ గదా?
పరుల జూచిన భీతిబడగ వలసె;
తేII       నిటుల సంసార వారధి నీదలేక
వేయి విధముల నిన్ను నే వేడుకొంటి
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-53

సీII సాధు సజ్జనులతో జగడమాడిన గీడు,
కవులతో వైరంబు గాంచ గీడు,
పరమదీనుల జిక్కబట్టి కొట్టిన గీడు,
బిచ్చగాండ్రను దుఃఖ పెట్ట గీడు,
నిరుపేదలను జూచి నిందజేసిన: గీడు,
పుణ్యవంతులదిట్ట బొసగు గీడు,
సద్భక్తులను దిరస్కారమాడిన గీడు,
గురుని ద్రవ్యము దోచుకొనిన గీడు,
తేII       దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-54

సీII పరుల ద్రవ్యము మీద భ్రాంతినొందినవాడు,
పరకాంతల నపేక్ష పడెడు వాడు,
అర్థుల విత్తంబు లపహరించెడు వాడు,
దానమీయగ వద్దనెడువాడు,
సభలలోపల నిల్చి చాడి చెప్పెడువాడు,
పక్షపు సాక్ష్యంబు పలుకువాడు,
విష్ణుదాసుల జూచి వెక్కిరించెడువాడు;
ధర్మసాధుల దిట్ట దలచువాడు,
తేII       ప్రజల జంతుల హింసించు పాతకుండు
కాలకింకర గదలచే గష్టమొందు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-55

సీII నరసింహ! నా తండ్రి నన్నేలు నన్నేలు,
కామితార్థము లిచ్చి కావు కావు,
దైత్య సంహార! చాల దయయుంచు దయయుంచు,
దీన పోషక! నీవె దిక్కు దిక్కు;
రత్న భూషిత వక్ష! రక్షించు రక్షించు,
భువన రక్షక! నన్ను బ్రోవు, బ్రోవు,
మారకోటి సురూప! మన్నించు మన్నించు,
పద్మలోచన చేయిబట్టు పట్టు.
తేII       సుర వినుత! నేను నీచాటు జొచ్చినాను,
నా మొరాలింప కడతేర్చు నాగశయన!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర



శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-56

సీII నీ భక్తులను గనుల్ నిండ జూచియు
రెండు చేతుల జోహారు చేయువాడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ
వినయమందుచు జాల వినెడివాడు,
తన గృహంబునకు నీ దాసులు రా జూచి
పీటపై గూర్చుండ బెట్టువాడు,
నీ సేవకుల జాతి నీతులెన్నక చాల
దాసోహమని చేరదలచువాడు,
తేII       పరమభక్తుండు ధన్యుండు భానుతేజ!
వాని గనుగొన్న బుణ్యంబు వసుధలోన,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-57

సీII పక్షివాహన! నేను బ్రతికినన్ని దినాలు
కొండెగాండ్రను గూడి కుమతినైతి
నన్నవస్త్రములిచ్చి యాదరింపుము నన్ను
గన్న తండ్రివి నీవె కమలనాభ!
మరణమయ్యెడినాడు మమతతో నీయొద్ద
బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక!
యినజభటావళి యీడిచికొనిపోక
కరుణతో నాయొద్దగావలుంచు,
తేII       కొనకు నీ సన్నిధికి బిల్చుకొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య శేషశయన!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-58

సీII నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన,
యజ్ఞకర్తగు సోమయాజియైన,
ధరణిలోపల బ్రభాతస్నానపరుడైన,
నిత్య సత్కర్మాది నిరతుడైన,
గావి వస్త్రము గట్టు ఘనుడునై,
ఉపవాస నియమతుండు నైనగాని
దండి షోడసమహాదాన పరుడైన
సకలయాత్రలు సల్పు సరసుడైన,
తేII       గర్వమున గష్టపడి నిన్నుం గానకున్న
మోక్షసామ్రాజ్య మొందడు మోహనాంగ!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-59

సీII పంజరంబుం గాకి బట్టియుంచిన లెస్స
పలుకునే వింతైన జిలుకవలెను?
గార్ధబంబును దెచ్చి కళ్ళెమింపుగ వేయ
దిరుగునే గుర్రంబు తీరుగాను?
ఎనుబోతు నొగి మావటీడు శిక్షించిన
నడచునే మదవారణంబువలెను?
పెద్ద పిట్టకు మేతబెట్టి పెంచిన గ్రొవ్వి
సాగునే వేటాడు డేగవలెను?
తేII       కజనులను దెచ్చి నీ సేవకొరకు బెట్ట
వాంఛతో జేతురే భక్తవరులవలెను?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-60

సీII అతిలోభులను భిక్ష మడుగ బోవుట రోత
తన ద్రవ్య మొకరింట దాచ రోత
గుణహీనుడగువాని కొలువు గొల్చుట రోత,
యొరుల పంచల క్రింద నుండ రోత;
భాగ్యవంతుని తోడ బంతమాడుట రోత,
గురిలేని భందుల గూడ రోత,
యాదాయములు లేక యప్పుదీయుట రోత,
జారచోరుల గూడి చనుట రోత,
తేII       యాదిలక్ష్మీశ! నీబంట నైతినయ్య
యింక నెడబాపు జన్మం బదెన్న రోత.
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

1 comment:

  1. పద్యాలు చూస్తూనే ఉన్నానండి

    ReplyDelete