Friday, January 22, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-29 : శ్రీరాముడికి సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-29
శ్రీరాముడికి సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని 
చెప్పిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

"శ్రీరామచంద్రా ! పూర్వం అనేక యుగాలు-సంవత్సరాలు, నిష్ఠకు ఎటువంటి లోపం కలగకుండా, తపస్సు-మహాయోగం సిద్దిపొందేందుకు తపస్సు చేసిన విష్ణుమూర్తైన వామనుడు నివసించిన ప్రదేశం ఇదే. ఇక్కడ విష్ణుమూర్తి తపస్సు చేశాడంటే, దానర్థం, లోకప్రవర్తనార్థం ఆయనలా చేశాడని అనుకోవాలి. విష్ణుమూర్తి అంతటి వాడు తపస్సు చేస్తే ఎంత ఫలమున్నదోనని, లోకులందరూ అనుకుని, వాళ్లూ తన లాగే ప్రవర్తించాలన్న వుద్దేశంతో, బదరీ నారాయణంలోలాగా ఆయనిక్కడ తపస్సు చేశాడు. ఎక్కడో హిమవత్పర్వతాలలో తపస్సు చేస్తే, లోకంలో వున్నవారికెలా తెలియాలని ఇక్కడ చేశాడు. ఆయన విష్ణు స్వరూపంలోను-వామన స్వరూపంలోను తపస్సు చేశాడని చెప్పేటందుకే, విష్ణువు పేరును-వామనుడి పేరును చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి దివ్య క్షేత్రం నివాస యోగ్యమైందని చెప్పేందుకు, విష్ణుమూర్తి చరిత్రే చెప్పడం జరిగింది. ఎంత గొప్ప తపస్సైనా, నిర్విఘ్నంగా సాగి, ఫలవంతంగా ముగుస్తుందిక్కడ. ఇక్కడ చేసిన తపస్సు వ్యర్థంకాదు. కశ్యపుడు అలానే చేసి సిద్ధి పొందాడిక్కడ. అందుకే దీనికి ’సిద్ధాశ్రమం’ అని పేరొచ్చి, జగత్ ప్రసిద్ధమైంది".

"యాచకుల కోరికలు కాదనకుండా తీర్చేవాడు - బలవంతుడు, విరోచనుడి కుమారుడు అయిన బలిచక్రవర్తి, వాయువులను - సిద్ధులను - ఇంద్రుడిని జయించి, రాక్షసులు - దేవతలు తనను సేవిస్తుంటే, ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ, లోకంలో కీర్తిమంతుడై మూడు లోకాలను పాలించాడు. ఆ బలిచక్రవర్తి వున్న స్థలమే మహాబలిపురం. ఆ సమయంలో అగ్ని ముందుండగా, దేవతలు ఈ ప్రదేశానికొచ్చి, విష్ణుమూర్తిని చూసి, దీనంగా, బలిచక్రవర్తి పెద్ద యాగం చేస్తున్నాడని - అది ముగిసేలోపల ఆయన అతడిని చూడడానికి పోయి, ఆయన స్వకార్యమైన దేవతా కార్యాన్ని చక్కపెట్టాలని ప్రార్థించారు. యజ్ఞ దీక్షలో వున్న సమయంలో, ’దేహి’ అని యాచకులు అడిగితే ’నాస్తి’ అనకుండా అడిగిందివ్వాల్సిందే. అందుకే యాచకులు నాలుగు దిక్కులనుండి, గుంపులు-గుంపులు గా వచ్చి, వారిష్టప్రకారం అడుగుతుంటే, లేదనకుండా - ఎంతటి కష్టమైనదైనా - మితిమీరినదైనా, ఇస్తున్నాడు బలిచక్రవర్తని అంటారు దేవతలు. ’నారాయణా-పుండరీకాక్ష’ అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ, అచింత్యమై - అద్భుతమై, అఘటన ఘటనా సమర్థమైన ఆయన శక్తిని ఆశ్రయించి, లోకానికి తన శరీరాన్ని కనిపించనీయకుండా, దేవతలకు మేలు కూర్చేందుకు పొట్టివాడివలె వామనావతారం ఎత్తి, తమకు మేలు చేయమని ప్రార్థిస్తారు దేవతలందరు".

"అదే సమయంలో, అగ్ని తేజంతో సమానమైన తేజంగల కశ్యపుడనే ముని శ్రేష్ఠుడు కొడుకును కనాలన్న కోరికతో తపస్సు చేస్తుంటాడు. కశ్యపుడు తన భార్యైన అదితి తో కలిసి, ఓపికగా అనేక దివ్య సంవత్సరాలు, మిక్కిలి నిష్ఠతో, సత్త్వగుణం కలిగి శ్రీమన్నారాయణుడి కొరకు తపస్సు చేయడంతో, ఆయన సంతోషించి ప్రత్యక్షమవుతాడు. తనకు ప్రత్యక్షమైన భగవంతుడిని చూసి కశ్యపుడు: ఆయన తపస్సువల్ల ఆరాధ్యుడని - తపఃఫలం ఇచ్చేవాడని - జ్ఞాన స్వరూపుడని -జ్ఞాన గుణకుడని - భక్త కామిదాతని - గొప్ప తపస్సే స్వభావంగా కలవాడని, అలాంటి వాడిని తను ఆరాధనాబలంతో ప్రత్యక్షంగా చూడగలిగానని స్త్రోత్రం చేశాడు. సమస్త ప్రపంచం శ్రీమన్నారాయణుడి శరీరంలో కనిపించడమే కాకుండా, సాక్షాత్తూ ఆయన శరీరం కూడా తనకు కనిపిస్తున్నదని - కల్యాణ గుణాకరమైన ఆకారం కలిగి, ఇంతటి వాడని చెప్పడం ఎవరికీ సాధ్యపడనంత గొప్పవాడివైన ఆయన చరణాలే తనకు శరణ్యమని, విష్ణుమూర్తితో అనడంతో, ఆయనకే వరం కావాల్నో చెప్పమంటాడు.


వరమిచ్చేందుకు అనుగ్రహించిన విష్ణువు తో, తన కొడుకుగా - ఇంద్రుడి భ్రాతగా జన్మించి, దుఃఖాలపాలైన దేవతలను రక్షించ మంటాడు కశ్యపుడు. అసుర విరోధైన విష్ణువును అయన స్వభావ విరుద్ధమైన కార్యాలు చేయమని తాను కోరనని కూడా అంటాడు. అలాగే తన తపస్సు సిద్ధిపొందిన ఈ ప్రదేశం ’సిద్ధాశ్రమం’ గా ప్రసిద్ధికెక్కాలని కూడా కోరుతాడు కశ్యపుడు. ఆయన కోరినట్లే చేస్తానన్న విష్ణుమూర్తి, దయతో, అదితి గర్భంలో వామనుడిగా పుట్టి, బలి చక్రవర్తిని చూసేందుకు అతడి యజ్ఞశాలకు పోయి, త్రిలోక రక్షకుడైనందున దేవతలకు కీడుచేయతలపెట్టిన బలి చక్రవర్తి దురహంకారాన్ని నాశనం చేసే కార్యక్రమం చేపట్తాడు. తన కాలి కొలత ప్రకారం, దానవ రాజును ఒకటి-రెండడుగుల భూమిని యాచించి, ఆయన వద్దనుండి దాన్ని పొంది, లోకమంతా వ్యాపించి తన శక్తితో బలిని బంధించాడు. ఇలా వామనుడు బలిని వంచించి, త్రివిక్రముడై, ప్రపంచమంతా ఆక్రమించి - ఇంద్రుడికిచ్చాడు దాన్నంతా. వామనుడు చేసిన ఆ మేలుకు మునీశ్వరులు సంతోషించగా, దేవతలు మునుపటి లాగా తేజోవంతులయ్యారు".

"ఇక్కడ తపస్సు చేసేవారికి శ్రమ కలుగదు. సంసార శ్రమ తొలిగిపోతుంది. అందుకే ఈ ఆశ్రమంలోకి వామనుడు మళ్లీ వచ్చాడు. రామచంద్రా ! నేను విష్ణుపాద భక్తుడను అయినందువల్ల ఇక్కడికొచ్చాను. చెడునడవడిగల రాక్షసులు యజ్ఞం విఘ్నం చేసేందుకు ఇక్కడకొస్తారు. నువ్వు వారిని చంపాలి. మనమిక మిక్కిలి మనోహరమైన - శుభప్రదమై మిగుల శ్రేష్ఠమైన - పాపరహితమైన నా ఆశ్రమాన్ని చూసేందుకు పోతున్నాం. నా ఆశ్రమం నాకెలాంటిదో, నీకు అలానే" అంటూ విశ్వామిత్రుడు కడు స్త్రోత్ర పాత్రులైన రామ లక్ష్మణులను తన వెంట తన ఆశ్రమానికి తీసుకుని పోయాడు. ఆశ్రమంలో వున్న చెట్ల నీడల వల్లా, మంచి పరిమళాలతో కూడిన గాలి వీచడం వల్లా, నడిచి వచ్చిన బడలిక పోతుంటే, విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో ఆశ్రమంలోకి ప్రవేశించాడు.

వస్తున్న విశ్వామిత్రుడిని చూసిన సిద్ధాశ్రమంలోని మునులందరు ఎదురుగా వచ్చి, శాస్త్ర ప్రకారం పూజించి - రాజకుమారులకు ఆతిథ్యమిచ్చి - సంతోషింపచేసి - కుశల ప్రశ్నలను అడిగి - రామ లక్ష్మణుల అలసట తీరేందుకు కొంచం సేపు వూరుకుండి - ఆ రోజే యజ్ఞ దీక్ష వహించమని, అతడికి మేలు కలుగుతుందని, యజ్ఞం సఫలమవుతుందని, సిద్ధాశ్రమం అనే పేరు సార్థకమవుతుందని, విశ్వామిత్రుడితో అంటారు. విశ్వామిత్రుడు వారు చెప్పిన మాటలను ప్రీతితో విని, మౌన వ్రతం పూని, ఇంద్రియాలను నిగ్రహించి, దీక్ష వహించాడు. ఉదయమే దశరథ నందనులు నిద్రలేచి, సంధ్యావందనాది కాల కృత్యాలను తీర్చుకుని, విశ్వామిత్రుడి కార్యం నెరవేర్చేందుకు ఆసక్తిగలవారై, ఆయనకు నమస్కరిస్తారు.

(బలి చక్రవర్తి ఇంద్రుడిని-ఇతర దేవతలను తృప్తి పరిచేందుకు యజ్ఞం చేయలేదు. ఆయన విష్ణు భక్తుడు - విష్ణు భక్తుడు విష్ణువును తప్ప ఇతర దేవతలను ఫలం కోరి పూజించడు. కాబట్టి, బలి చేసింది, విష్ణ్వారాధన రూపమైన యజ్ఞం. యజ్ఞమంటే దేవ పూజ-ఇక్కడ ఆయన పూజించిన దేవత విష్ణువు. ఆయా దేవతలను ప్రీతి పరిచేందుకు, వారినుద్దేశించి, ఆయా మంత్రాలతో చేసే హోమాన్ని యాగం అంటారు. బలి యజ్ఞం చేయడం సమ్మతమే. ఇంద్రాయ స్వాహా - వరుణాయ స్వాహా అన్నప్పటికీ, విష్ణు భక్తుడైన వాడు ఆ దేవతల పేర్లు చెప్పినప్పుడు తన ఇష్టదేవతైన నారాయణుడినే ఆ పదంతో పూజిస్తున్నాడని భావించాలి. అయితే, తనమీద అనన్య భక్తిగల బలిని ఎందుకు విష్ణువు అణచదల్చుకున్నాడన్న సందేహం రావచ్చు. తనమీద భక్తి వున్నవాడికంటే, తన భక్తులమీద భక్తి వున్నవాడిని చూసి సంతోషిస్తాడు భగవంతుడు. భక్త విరోధైన మరో భక్తుడిని చూసి సంతోషించడు. వాడిని శిక్షించైనా మంచి మార్గంలోకి తెస్తాడు. అంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే, విష్ణు భక్తులను సంతోషపెట్టాలి. తనను ఆరాధించకపోయినా, తన భక్తులను ఆరాధించేవారిని భగవంతుడు అనుగ్రహించి, వారికి ఇష్ట సిద్ధిని కలిగిస్తాడు. బలి చక్రవర్తి, దేవతలను బాధించినందువల్ల, తన భక్తుడైనా, దండించాల్సి వచింది. భక్తుడైన వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఇతర భక్తులను బాధించకూడదు.


ప్రపంచ సృష్టి విషయంలో పరిణామ వాదం అని, వివర్త వాదం అని రెండు రకాలున్నాయి. మట్టి ముద్దే కుండయినట్లు, సూక్ష్మాలైన చిదచిత్తులలో వుండే భగవంతుడే, స్థూల చిదచిద్విష్టుడై, ప్రపంచాకారంగా పరిణమించాడని - సూక్ష్మానికి, స్థూలానికి అణుత్వ బృహత్త్వ భేదంతప్ప, మరే భేదం లేదని - రెండూ సత్యమని చెప్పేదే "పరిణామ వాదం". ప్రపంచం మిధ్య - బ్రహ్మమే సత్యం, అనడం "వివర్త వాదం". బాలుడు యౌవనవంతుడైనట్లు, సూక్ష్మంగా వున్న వామనుడే ముల్లోకాలను ఆక్రమించి, త్రివిక్రముడైనందువల్ల, ఇరువురికీ భేదం లేదని - రెండూ సత్యమని, తేలడంతో, వామనావతారం పరిణామవాదాన్ని స్థిరపరుస్తున్నది. దీనికే "వామన త్రివిక్రమ న్యాయం" అని పేరుంది. వామనావతారానికి యాచనే ఉద్దేశమని, ఆ కారణం తోనే, యాచన వృత్తిగాగల కశ్యపుడికి పుట్టాడని, ఇదే వామనావతార తత్త్వమని కొందరు చేసే వాదన తుఛ్చాతి తుచ్చమైన ఆలోచన. వామనుడు యాచించింది తన భార్య సొమ్ములకొరకు కాదు - తను బ్రతక లేక కాదు. యాచనా దోషం అందులోలేదు. గుర్వర్థమై - దేవతార్థమై - లోకోపకారార్థమై చేసే యాచన, యాచన కాదు).

No comments:

Post a Comment