Wednesday, January 27, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-34 : ఎంత గొప్ప మహాత్ముల కర్తవ్యమైనా భగవత్ సేవ యథాశక్తిగా చేయడమే : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-34
ఎంత గొప్ప మహాత్ముల కర్తవ్యమైనా
భగవత్ సేవ యథాశక్తిగా చేయడమే
వనం జ్వాలా నరసింహారావు

తన కుమార్తెలను వివాహం చేసుకుని బ్రహ్మ దత్తుడు వెంట తీసుకునిపోయింతర్వాత, సంతానంలేని కుశనాభుడు, కొడుకుకొరకు యజ్ఞం చేశాడు. అప్పుడు, బ్రహ్మ మానస పుత్రుడైన కుశుడు, తన కొడుకైన కుశనాభుడితో, ఆయనంతడివాడు-పుణ్యాత్ముడు అయిన "గాధి" అనే కొడుకు అతడికి కలుగుతాడని, ఆ కొడుకువల్ల భూమ్మీద కుశనాభుడికి శాశ్వత కీర్తి కలుగుతుందనీ చెప్తాడు. ఆయన చెప్పినట్లే, కుశనాభుడికి సజ్జన స్తుతి పాత్రుడు-ధర్మనిష్ఠుడైన గాధి జన్మించాడు. ఆ గాధి అనే వాడే తన తండ్రి అనీ, కుశుడి వంశంలో పుట్టినందున కస్తూరి పాత్రలాగా, తనకు "కౌశికుడు" అన్న పేరొచ్చిందని విశ్వామిత్రుడు "కల్యాణ గుణాలే భూషణాలైన" రామచంద్రమూర్తితో అంటాడు.

(వంశానికంతా కీర్తి కారకుడైన ఒక్క మహాత్ముడున్నా, ఆ వంశానికంతా కీర్తివస్తుందనీ-అపకీర్తికూడా అలానే వ్యాపిస్తుందనీ-ప్రతివారూ తమవలన తమ వంశానికి సత్ కీర్తి వచ్చేటట్లు వ్యవహరించిలానీ విశ్వామిత్రుడిక్కడ సూచిస్తున్నాడు).


"రామచంద్రా ! నాకు నా తండ్రివలన మాత్రమే కాకుండా, అక్క వలన కూడా చాలా కీర్తి వచ్చింది. ఆమె తన పాతివ్రత్య మహిమతో-దేహంతోనే స్వర్గానికి పోయి, అక్కడ సుఖాలు తానొక్కతే అనుభవించడం ఇష్టంలేక, అలాంటి సుఖం అందరికీ కలిగించాలన్న ఉద్దేశంతో, గొప్ప దేవతా నదిగా మారి, దేవతల నివాస భూమైన హిమవత్పర్వత శిఖరం పైకి ఆకాశమార్గాన పోయి, ఆకాశంనుండే కిందికి దిగింది. ఆమెపై నాకున్న ప్రేమవల్ల, నేనుకూడా, ఆ నదీ ప్రాంతంలోనే సుఖంగా వుంటున్నాను. ఆకాశ గంగ పామరులను పావనం చేయడానికి బ్రహ్మ పంపగా కిందకొస్తే, ఈమె తనంతట తానే లోకాలను-లోకులను పావనం చేయడానికి స్వర్గ సుఖాలను విడిచిపెట్టి భూమ్మీదకొచ్చిందన్న కీర్తి సంపాదించింది. ఆమె సోదరుడనైనందున నాకూ కీర్తి వచ్చింది. ఈ నదినే ఇప్పుడు ’కూసి’ అంటారు. అక్కడుండేవాడివి ఇక్కడికెందుకొచ్చావని నువ్వడగవచ్చు రామచంద్రా ! యాగం చేస్తే మంచిదన్న ఆలోచనతో-అదీ శ్రీమంతమైన సిద్ధాశ్రమంలో చేస్తే సిద్ధిపొందవచ్చన్న తలంపుతో, ఇక్కడికొచ్చాను. వచ్చిన పని నీ అనుగ్రహంవల్ల-శక్తివల్ల సఫలమైంది. కాబట్టి మునుపటి లాగే అక్కడికే పోయి అక్కడే వుంటాను. నా విషయం నేనే చెప్పుకోకూడదు-అయినా నీవు అడిగినప్పుడు చెప్పకుండా వుండ కూడదు కనుక, పెద్దల యశస్సును దాచకుండా, నా వంశ విధాన్ని-నేను జన్మించిన రీతిని, పవిత్రగుణాలుకలిగి నీకు చెప్పాను" అని విశ్వామిత్రుడు రాముడితో తెలియచేశాడు. కథలు చెప్పడం వలన రాత్రివేళైందనీ, అర్థ రాత్రికావచ్చిందనీ, క్షేమంగా-చక్కగా నిద్రించమని, నిద్ర పోకపోతే ఉదయం ప్రయాణం చేయడానికి బడలికగా వుంటుందనీ అంటాడు.

రాత్రి వర్ణన

"రామచంద్రా ! చెట్లమీదున్న అకుల్లో ఒక్కటైనా కదలడం లేదు. నిద్ర పోదామనుకున్న మృగాలు-పక్షులు నిద్రలోకి జారాయి. గాఢమైన చీకట్లు సందు లేకుండా ముంచేశాయి. సంధ్యా కాలం దాటిపోయింది. ఆకాశంలో నక్షత్రాలు కళ్లలాగా ప్రకాశిస్తున్నాయి. చల్లటి తన కిరణాలతో దట్టమైన చీకట్లను తొలగించాలని, లోకాలన్నీ సంతోషపడుతుంటే, చంద్రుడుదయించాడు. చీకటికి భయపడని గుడ్లగూబల గుంపులు-మాసం తినే క్రూర మృగాలు-యక్షుల సమూహాలు-రాక్షసుల గుంపులు ధైర్యంతో అన్ని ప్రదేశాల్లో తిరుగుతున్నాయి" అని విశ్వామిత్రుడంటూ కాసేపు మౌనం దాలుస్తాడు.


ఇదంతా వింటున్న మునీశ్వరులు: "మేలు-మేలు. మీ పవిత్ర వంశం లోకంలో ప్రసిద్ధికెక్కింది. మీ వంశంలో పుట్టినవారు బ్రహ్మతో సమానమైనవారు-మనుష్యుల్లో శ్రేష్టులు-మహిమల్లో దేవతలతో సమానులు. విశ్వామిత్రా ! నువ్వు దేవతలలో బ్రహ్మలాగా శ్రేష్ఠుడవు. నీ మహిమకు అడ్డం లేదు. అందుకే కీర్తితో ప్రకాశిస్తున్నావు. సహజంగా సారవంతమైన మీ వంశాన్ని, నదుల్లో శ్రేష్ఠమైన మీ అక్క మరింత కీర్తిమంతంగా చేసింది" అని అంటుండగా, తాను నిద్రించకపోతే, రామ లక్ష్మణులు నిద్రించరని-ముచ్చట్లు పెట్టుకుంటారని భావించిన విశ్వామిత్రుడు, అస్తమించిన సూర్యుడిలా నిద్రపోయాడు. శ్రీరామచంద్రుడు స్తోత్ర పాత్రమైన మంచి గుణాలున్న విశ్వామిత్రుడిని పొగుడుకుంటూ, తమ్ముడితో కలిసి పచ్చికపై పడుకున్నాడు. 

No comments:

Post a Comment