Thursday, January 21, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-28 : శ్రీరాముడికి ఉపసంహార అస్త్రాలను ఇచ్చిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-28
శ్రీరాముడికి ఉపసంహార అస్త్రాలను 
ఇచ్చిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

దయావంతుడైన విశ్వామిత్రుడు దేవతా సమూహాలకైనా లభ్యం కాని అస్త్రాలను తనకిస్తే తీసుకున్నానీ, అయితే, శత్రువులు తనపై ఏదైనా అస్త్రాన్ని ప్రయోగిస్తే, తాను దాన్ని ఎదుర్కోవడానికి ఏ అస్త్రాన్ని ఉపయోగించాల్నో - అదేవిధంగా, తాను ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఉపసంహరించాలంటే ఏం చేయాల్నో, వివరంగా చెప్పమని మునీంద్రుడిని అడుగుతాడు. శ్రీరాముడు అడిగిన విషయాలన్నిటికీ వివరణ ఇచ్చాడు విశ్వామిత్రుడు. "సత్యవంతం - సత్యకీర్తి - ప్రతిహారం - రభసం - పరాజ్ముఖం - అవాజ్ముఖం - లక్షాక్ష విషమాలు - దశాక్షం - దృఢనాభం - సునాభం - సుదీప్తం - దశశీర్షం - శతోదరం - శతవక్త్ర శరం - కృశనం - జ్యోతిషం - పద్మనాభం - మహానాభం - దుందునాభం - నైరాశ్యం - శుచి - బాహువు - విరుచి - రుచిరం - ధనం - మహాబాహువు - నిష్కులి - దైత్య శమనం - హరిద్రం - యోగంధరం - మకరం - ధాన్యం - పితృవు - సౌమనసం - కరవీర శరం - విభూత శరం - కామరుచి - ఆవరణం - మోహం - కామరూపం - సర్వనాభం - జృంభకం - సంతానం - వరణం - అనంతం - విభావంతం": వీరందరు భృశాశ్వుడి కొడుకులని, కోరిన రూపాలు కలవారని. జపించేవారి పాలిటి చింతామణులని, చెప్పిన విశ్వామిత్రుడు అవన్నీ శ్రీరాముడికిచ్చాడు. ఆ మంత్రాలను కూడా ఉపదేశించాడు. (ఈ అస్త్రాలన్ని అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తికి తెలియవని కాదు. కాకపోతే, మంత్రాలను నేర్చుకోవాలంటే, సద్గురూపదేశం అవశ్యమని లోకానికి తెలియచెప్పేందుకు, వాటిని విశ్వామిత్రుడి ద్వారా పొందాడు).


ఆ అస్త్రాలలో కొన్ని కఠిన శరీరాలు కలవి - కొన్ని విస్తారమైన తేజస్సు కలవి - కొన్ని సుఖమిస్తాయి - కొన్ని మండుతున్న అగ్నితో సమానమైనవి - కొన్ని పొగలాగా వుంటాయి - కొన్ని సూర్య చంద్రుల తేజంతో వుంటాయి. అవన్నీ రామచంద్రమూర్తిని సమీపించి, చేతులు జోడించి, " పుండరీకాక్షా ! రామచంద్రా ! మేము నీ కింకరులం. కొత్తవరం కాదు. నీ వెట్లా ఆజ్ఞాపిస్తే అట్లానే నడచుకుంటాం" అనడంతో, తాను స్మరించినప్పుడు వచ్చి తన కార్యం చక్కపర్చి పొమ్మని కోరుతాడు రాముడు. వెన్వెంటనే అస్త్ర మంత్ర మూర్తులు చేతులు జోడించి, శ్రీరామచంద్రమూర్తి తమను అనుగ్రహించి స్వీకరించాడన్న సంతోషంతో ఆయనకు ప్రదక్షిణ చేసి మాయమయ్యాయి. తదుపరి, విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారం సంహారాస్త్రాలన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరూ ఆ విద్యలనన్నీ నేర్చినవారైనారు.


రత్నాల లాగా శ్రేష్ఠమైన సద్గుణాలుగల ఆ బాలురు విశ్వామిత్రుడి వెంట పోయే సమయంలో సమీపంలోని కొండ పక్క అందమైన చెట్ల గుంపు కనిపించింది. మబ్బు కమ్మినట్లు దట్టంగా - నల్లగా - చీకట్లు కలిగించే విధంగా, రసవంతమైన వృక్షాలు, తియ్య మామిడులు, చీకటి మాకులు, జాజులు, చందన వృక్షాలు, మాది ఫలాలు, గజ నిమ్మలు, మొల్లలు, దిరిసెనలు, పూల గురివింద తీగలు, వాటి సమూహాలు, ఆశ్చర్యం కలిగించే నానా వర్ణాల చిలుకలు, నెమళ్లు, తుమ్మెదలు-వాటి పిల్లల ఝంకారాలు, కళ్లకు ఆనందం కలిగిస్తూ - మనస్సును ఆకర్షిస్తూ వుందా స్థలం. ఆడే గోరువంకలు, ఆడే చిలుకలు, ఆడే నెమిళ్లు - వాటి పాటలు దట్టమైన ఆకాశాన్ని రాసుకుంటున్నాయని, ఆ వనం లో వుండే ఋషి ఎవరనీ అడుగుతాడు శ్రీరాముడు విశ్వామిత్రుడిని. "మునీంద్రా ! భయంకరమైన అడవిని దాటామని ఈ మనోహరమైన సుఖ ప్రదేశాన్ని చూస్తుంటే అనిపిస్తున్నది. నిన్న వినిపించిన భయంకర ధ్వనులు - కనిపించిన క్రూర మృగాలు పోయి, మనోహరమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనుష్యుల భయం లేకుండా ఇష్టమొచ్చినట్లు జింకలు తిరుగుతున్నాయి. దీనికి కారణమేంటి మునీంద్రా? నీ యజ్ఞం విఘ్నం చేయాలనుకుంటున్న బ్రాహ్మణ హంతకులెవరు? మీరు యజ్ఞం చేయాలనుకుంటున్న వనం ఎక్కడున్నది? నేనెట్లా యజ్ఞ రక్షణ చేయాలి?" అని అడిగిన రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు వారప్పుడున్న సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని వివరిస్తాడు.

No comments:

Post a Comment