Wednesday, January 27, 2016

ఓటింగ్ విధానాన్ని మెరుగుపరచలేమా? : వనం జ్వాలా నరసింహారావు

ఓటింగ్ విధానాన్ని మెరుగుపరచలేమా?
ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-01-2016)
వనం జ్వాలా నరసింహారావు

            జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ దరిమిలా నామినేషన్ల ఘట్టం-ఉప సంహరణ ఘట్టం పూర్తయింది. పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. గ్రేటర్ పరిధిలో సుమారు 80 లక్షల మంది ఓటర్లుండవచ్చని, వీరికొరకు 7800 పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు సుమారు 3500 వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు కూడా. వీటన్నింటికీ అయ్యే వ్యయం కూడా కోట్లల్లోనే వుండవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థుల అధికారిక-అనధికారిక వ్యయంకూడా కోట్లలోనే వుండే అవకాశాలు కాదనలేం. నల్ల ధనం ఎంత ఖర్చు కానున్నదనేది ఎవరికీ అంతు చిక్కని విషయందీనిని కట్టడి చేయడానికి ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా, గత అనుభవాల నేపధ్యంలో పూర్తిగా నివారించడం కష్టమే. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు అంతో-ఇంతో పాత్ర వుంది. ఎవరినీ తప్పు పట్టడానికి వీల్లేని పరిస్థితి. దీనికంతటికీ ప్రధాన కారణం "సుధీర్ఘ ఎన్నికల ప్రక్రియ". ఈ  సుధీర్ఘ ప్రక్రియ లేకుండా ఎన్నికలు జరిపించే ప్రయత్నాలు అప్పుడప్పుడు జరిగినా అవి ఫలించలేదు. ఇప్పుడు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో కూడా సుదీర్ఘ ప్రక్రియను కుదించే సంస్కరణ దిశగా ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది కాని, న్యాయస్థానాలు అంగీకరించకపోవడంతో యధా ప్రకారం పాత పద్ధతినే అవలంబించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యం బలపడాలంటే, ఎన్నికలలో అవినీతి తొలగిపోవాలంటే, నల్ల ధనం ఖర్చు తగ్గాలంటే, ఎప్పుడో ఒకప్పుడు ఈ పద్ధతి మారక తప్పదు. సుదీర్ఘ ప్రక్రియను కుదించక తప్పదు.    

            సాధారణ ఎన్నికలకైనా, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకైనా, స్థానిక సంస్థల ఎన్నికలకైనా, సంబంధిత ఎన్నికల అధికారి ఎన్నికల తేదీలు ప్రకటించడంతో మొత్తం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓటర్ల జాబితా ప్రకటించడం ఎన్నికల ప్రక్రియలో మరో ప్రధాన ఘట్టం. తేదీల ప్రకటనతోనే "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్" అమల్లోకి వస్తుంది. ఈ బూచిని సాకుగా చూపించి, ప్రభుత్వం ప్రకటించి, అమలు చేయాలనుకున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగించడం మొదలవుతుంది. ఫలానా పార్టీ కోడ్ ఉల్లంఘించిందని ప్రత్యర్థులు పిర్యాదు చేయడం నిత్య కృత్యమై పోతుంది. ఇలా చేయడం ఎంతవరకు భావ్యమో అనే విషయాన్ని నిశితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా ఏదో ఒక రకమైన మోడల్ కోడ్ అమల్లోకి తెస్తున్నారు ఇటీవల. ఆ మాటకొస్తే, దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నిక జరుగుతే మోడల్ కోడ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా అమలు చేయాల్సి వస్తుందేమో! రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం, నామినేషన్ల ఘట్టం, బీ ఫారాలు రిటర్నింగ్ అధికారులకు అందచేయడం, స్క్రూటినీ, ఉపసంహరణ, ప్రచార పర్వం, ఓటింగ్, ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల పేర్ల ప్రకటన....ఇవన్నీ ఎన్నికల సుదీర్ఘ ప్రక్రియలో భాగమే. ఇంత సుదీర్ఘ ప్రక్రియ వల్లనే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. సీలింగ్ అనేది నామ మాత్రంగా మిగిలిపోయింది. ఈ పరిస్థితి మారాలి. ఓటింగ్ విధానంలో కూడా ప్రస్తుతం అనుసరిస్తున్న పోలింగ్ బూత్‌లకు వెళ్లి, క్యూలో నిలబడి, గంటల తరబడి వేచి చూసి, ఓట్ వేసే పద్ధతి మారాలి. ప్రచారానికి ఎక్కువ సమయం ఇచ్చి, ఓటింగ్ కు కొన్ని గంటల సమయం-అదీ కూడా ఫలానా బూత్ కే పోయి ఓట్ వేయాలన్న నిబంధనలో మార్పు రావాలి. దీని వల్ల వ్యయం తగ్గడమే కాకుండా, ఓటింగ్ పూర్తైన వెంటనే ఫలితం ప్రకటించే అవకాశం వుంటుంది. రీ పోలింగ్ కు అవకాశమే రాదు. ప్రచారానికి తక్కువ సమయం, ఓటింగ్ కు ఎక్కువ సమయం ఇచ్చే రోజులు రావాలి.  అప్పుడే అందరూ ఓటు వేసే వీలుకూడా కలుగుతుంది. పోలింగ్ వంద శాతం వర కొచ్చినా ఆశ్చర్య పడక్కర లేదు.

ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమన్న పేరుంది భారతదేశానికిసామ్రాజ్యవాద, వలస వాద దేశాల పాలన నుండి గడచిన ఆరేడు దశాబ్దాల కాలంలో విముక్తి పొంది స్వాతంత్య్రం పొందిన దేశాలెన్ని ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ద్వారా ఐదేళ్లకోసారి అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతున్న దేశం బహుశా భారతదేశ మొక్కటేనేమోఅలానే స్థానిక సంస్థలకు కూడా ఐదేళ్లకో సారి, సాధ్యమైనంత మేరకు ఎన్నికలు జరుగుతుంటాయి అనేక రాష్ట్రాలలో. అయినప్పటికీ, మన ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల ప్రక్రియమీద, ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అక్రమాల మీద అన్నీ సందేహాలే, అన్నీ అనుమానాలేవివిధ కారణాల వల్ల, మనదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కానీ, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కానీ ప్రత్యమ్నాయాలంత తేలిగ్గా లభించవనేది వాస్తవం


కేంద్రంలో, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం దొరకడానికి మనదేశంలో ముప్ఫైఏళ్ళు పట్టిందిఆ తరువాత మళ్ళీ కాంగెస్సో, దాని సారధ్యంలోని కూటమో ప్రత్యామ్నాయమైంది కాని మరోటి కాలేకపోయింది. ప్రస్తుతం కేంద్రంలో వున్న ప్రభుత్వం కూడా దాని కాల పరిమితి తీరిన తరువాత అధికారంలోకి వస్తుందా? రాదా? అనేది చెప్పడం కష్టం! ఆ లెక్కన మళ్లీ కాంగ్రెస్ కూటమే వస్తుందా? చెప్పలేం. బహుశా ఇది మరికొంత కాలం కొనసాగవచ్చు. అదే పరిస్థితి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీని గద్దె దింపిన తెలుగు దేశం మళ్లీ కాంగ్రెస్ చేతుల్లో అధికారాన్ని పెట్టింది. ఇక తెలంగాణ విషయానికొస్తే అటు తెలుగు దేశానికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఏకైక ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించడమే కాకుండా, అది చేపట్టి అమలు పరుస్తున్న అనేక సంక్షేమ-అభివృద్ధి పథకాల ద్వారా తన ప్రభుత్వాన్ని అంచలంచలుగా బలపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం, టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తరువాత జరిగిన అన్ని ఉపఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది. ఓటరుకు ప్రత్యామ్నాయాల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ వుంటే ఇలాంటివి సాధ్యపడతాయి. అందుకే, సగటు ఓటరు, ఓటు వేసే విషయంలో, అవినీతికి, అక్రమాలకు తావులేకుండా, ఎవరి ఓటును వారే వేసుకునే అసలు సిసలైన మార్గాల అన్వేషణ జరగాలని సంస్కరణాభిషుల అభిప్రాయంవాస్తవానికి ఎన్నికల ప్రక్రియను కుదించే ప్రయత్నం సంస్కరణ దిశగా ఒక అడుగు అనాలి.

ఓటరును ఎవరెంతగా మభ్య పెట్టినా, ఎన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఎంత డబ్బు కుమ్మరించినా, కులం అనో, మతం అనో ఎన్ని అపోహలు కలిగించినా, ఎన్ని బలీయమైన శక్తులు ఏ కొందరో అధికారంలో ఉండాలనో, లేకుండా పోవాలనో కోరుకున్నా, అదే ఓటరు, అవసరమని భావించినప్పుడు దిగ్గజాలను ఓడించిన సందర్భాలూ, ఏ అండదండా లేనివారిని గెలిపించిన సందర్భాలూ, మన దేశంలో కోకొల్లలునిజంగా ఓటరుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం గనుక పూర్తి మద్దతు ఇచ్చే పరిస్థితులే ఉంటే, అధిక శాతం మంది నిర్భయంగా ఓటింగులో పాల్గొంటారనడంలో సందేహం లేదు. భారతదేశంలో ఎన్నికల రాజకీయాలకొక ప్రత్యేకత ఉందినియంత్రణలకు, నియమావళులకు అతీతంగా, పాలకు-ప్రతిపక్షాల అదుపాజ్ఞల్లో-కనుసన్నలలో-అంచనాలకు అందనంత వేగంగా, దూరంగా మనుగడ సాగిస్తుంటాయి. ఎన్నికల రాజకీయాలకు, సాధారణ రాజకీయాలకు పొంతనే ఉండదుఎత్తులు, జిత్తులు, జిమ్మిక్కులు, నిజాలలా అనిపించే అబద్ధాలు, స్నేహితుల్లా కనిపించే శత్రువులు, నమ్మించి మోసం చేసే నాయకులు-అనుచరులు, ఆఖరి క్షణంలో అనూహ్యమైన మార్పులు-చేర్పులు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఎన్నికల రాజకీయాల్లో గతంలో చోటు చేసుకున్నాయి. భవిష్యత్‍లో చోటుచేసుకోనున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరగడానికి, జరగకుండా నిరోధించడానికి, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో బాధ్యత వహించాల్సింది రాజకీయ పార్టీలు, ఎన్నికల కమీషన్. ఎన్నికల్లో అక్రమాలు రాజకీయ పార్టీల టికెట్ల పంపిణీ నుండి ఆరంభమవుతుందిఎన్నికల కమిషన్ ఎన్నికలకే పరిమితమవడంతో రాజకీయ పార్టీల అవినీతికి వారి నిర్లిప్తత ఆజ్యం పోసినట్లవుతున్నదిఎన్నికల కమిషన్ పనిచేయడమనేది ఒక నిరంతర ప్రక్రియ కావాలి

ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత, ఓ వారం రోజుల లోపుగా ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించడం జరిగి పోవాలిఆ తర్వాత మూడు-నాలుగు రోజుల వ్యవధిలో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ప్రకటించి, నామినేషన్‌తో పాటే బీ-ఫారం సమర్పించే నిబంధనను విధించాలిమరో నాలుగు-ఐదు రోజుల వ్యవధిలో రోజుల తరబడి ప్రచారం లేకుండా ఎన్నికలు జరిపించాలిడబ్బిచ్చి పార్టీ టికెట్ కొనుగోలుచేసే వ్యవధి కూడా ఉండకూడదుఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు వెదజల్లే అవకాశం కానీ, అవసరం కానీ ఎవరికీ లేకుండా చేయాలిడబ్బు ఖర్చు చేయనప్పుడు ఆ పెట్టుబడిని రాబట్టుకొనే ప్రయత్నం తగ్గే అవకాశముందిఓటు హక్కును వినియోగించడం ఓ రెండు-మూడు రోజుల పాటు జరిగినా ఇబ్బంది లేదు

"శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డును డిజైన్ చేసి, ప్రతి ఒక్క ఓటరు, కేవలం అతనో, ఆమో ఉపయోగించుకొనగల్గేలా ప్రోగ్రాం చేయాలి. ఎన్నికల బూత్‌ల లాగానే జనరల్ ఎన్నికలకు దేశ వ్యాప్తంగా, ఇతర ఎన్నికలకు సంబంధిత ప్రాంతమంతా, ఎన్నికల మిషన్లను బహిరంగంగా ఏర్పాటు చేయాలిభద్రతా చర్యలు ఏర్పాటు చేయాలిఏ ఓటరైనా, ఎక్కడైనా ఆ రెండు-మూడు రోజుల్లో ఇరవై నాలుగు గంటలపాటు ఎప్పుడైనా ఓటు వేసుకునే ఏర్పాటు ఉండాలిఓటరు ఓటును తన నియోజకవర్గ-లేదా వార్డులో పోటీ చేసే అభ్యర్థులలో ఎవరో ఒకరికి వేసే వీలుకలుగేలా కార్డును ప్రోగ్రాం చేయవచ్చుఓటరుకు తప్ప ఇతరులకు ఆ కార్డును ఉపయోగించుకునే వీలుపడరాదుఒకసారి ఉపయోగించిన తర్వాత మరో మూడు-నాలుగు నెలల వరకు ఓటింగ్‌కు ఆ కార్డు పనికిరాని విధంగా ప్రోగ్రాం చేయాలిఒకప్పుడు ఒక్కో అభ్యర్థికి ఒక్కో డబ్బా కేటాయించేవారు. ఆ తరువాత కామన్ డబ్బాలొచ్చాయి. దరిమిలా ఏవీఎంలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను అర్ధం చేసుకోగలిగిన ఓటరుకు, "శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డును ఉపయోగించి ఓట్ చేయడం  పెద్ద కష్టం కాదుఓటరు దేశంలో ఎక్కడ కార్డును వాడినా అతని నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాయే ఓటింగ్ మిషన్‌పై కనిపించే వీలు కలిగేలా ప్రోగ్రాం తయారుచేయాలి. ఇదే జీహెచ్‌ఎంసీ లాంటి ఎన్నికలలోనైతే, గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా-ఎప్పుడైనా ఎన్నికల మిషన్లలో ఓటు వేసే అవకాశం కలిగించవచ్చు.

క్యూలో నిలబడే అవసరం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా ఆదాయపు పన్ను రిటర్నను సమర్పించే సదుపాయం ఉండగా లేనిది, ప్రపంచ వ్యాప్తంగా ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వీలుండగాలేనిది, ఒకే మిషన్ నుంచి ఏ బ్యాంక్ కార్డునైనా ఉపయోగించుకునే అవకాశం ఉండగా లేనిది, ఇలాంటి పద్ధతినే ఓటింగుకు కూడా ప్రవేశ పెట్టే ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశంలో ఈ సౌకర్యం లేనంత మాత్రాన మన దేశంలోనూ-మన రాష్ట్రంలోనూ ఉండకూడదన్న నిబంధనేమీ లేదు కదాఆన్‌లైన్ ఓటింగుకు శ్రీకారంచుట్టి ప్రపంచాన్నే అబ్బుర పరచలేవా ఈనాటి కేంద్ర-రాష్ట్రాల ప్రభుత్వాలు? ఈ రకమైన కార్డును సార్వత్రిక ఎన్నికలకే కాకుండా శాసనమండలి ఎన్నికలలాంటి వాటికీ ఉపయోగించవచ్చుస్థానిక సంస్థల ఎన్నికలకూ వాడవచ్చుఅన్నింటికీ ఒకటే కార్డు చాలుఎన్నికల బూత్‌లోకి ఓటరు తప్ప ఎవరూ ప్రవేశించే వీలులేని విధంగా సాంకేతికంగా దీన్ని ప్రోగ్రామింగ్ చేయడమంత కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారుఓటర్లను దాచి పెట్టడం, క్యాంపులు నడపడంలాంటి వాటిని అరికట్టవచ్చు ఈ కార్డు ప్రవేశ పెడితే.

"శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డు”  పౌరుడు ఒక్క ఓటింగుకే కాకుండా, విదేశాల్లో లాగా, బహుళ ప్రయోజనాలకు వాడుకునే విధంగా ఉండాలితలచుకుంటే ఇదేమంత కష్టసాధ్యమైన పనేమీకాదుచేయాలన్న తలంపు, పట్టుదలే ఉంటే, పోటీచేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా భరిస్తామని చెప్తున్న ఎన్నికల కమిషన్ బహుశా ఒక్క ఎన్నికల కయ్యే ఖర్చును ఈ కార్డు ప్రవేశపెట్టడానికి వినియోగిస్తే చాలు….చరిత్రలో భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఓ సరికొత్త రూపునిచ్చినట్లవుతుందికంప్యూటర్ యుగంలో ఇవి రూపొందించడానికి పెద్ద తెలివితేటలు కూడా అక్కరలేదుఅందులో ప్రవేశమున్న ఎవరైనా చేయగలరు ఈ పనిని. భవిష్యత్‍లో నైనా దీనిని గురించి ఆలోచన చేయడం మంచిదేమో!. End


No comments:

Post a Comment