Friday, January 15, 2016

పేద బ్రాహ్మణులకు పెన్నిధి : వనం జ్వాలా నరసింహారావు

పేద బ్రాహ్మణులకు పెన్నిధి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (14-01-2016)

కుల మతాలతో సంబంధం లేకుండా, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, అందునా ఆర్థికంగా వెనుకబడిన వారి సంక్షేమాన్ని కాంక్షించే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ఏర్పడి ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు షెడ్యూల్డ్ కులాల వారికి, తెగల వారికి, ముఖ్యంగా బంజారాలకు, క్రైస్తవులకు, వెనుకబడిన కులాల వారికి, ముస్లింలకు లబ్ది చేకూరే అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళితులకు మూడెకరాల భూపంపిణీ, పేద వారికి రెండు పడక గదుల ఇళ్లు, వ్యవసాయానికి ఇన్ పుట్ సబ్సిడీ, కార్మికులకు భీమా సౌకర్యం, ఆరోగ్య కార్డులు, పాత్రికేయుల సంక్షేమానికి నిధులు,... ఇలా సంక్షేమానికి వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. అదే క్రమంలో, అన్ని కులాలలోని నిరు పేదల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించిన విధంగానే, ఆర్థికంగా వెనుకబాటు తనంలో వున్న బ్రాహ్మణ పేదల కోసం కూడా ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలను కోవడం వారి పట్ల ఆయనకున్న అభిమానానికి, గౌరవానికి, వారు బాగు పడాలన్న తపనకు నిదర్శనం.


ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి-గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా ఒకానొక రోజుల్లో పిలువబడి, దరిమిలా, కాలానుగుణంగా వచ్చిన మార్పులతో, సమసమాజ భావజాలంలో, అందరితో పాటు తాము సమానులమే అనే భావనతోబ్రతుకు వెళ్లబుచ్చుతున్న బ్రాహ్మణులకు, మిగిలింది హోదా మాత్రమే. ఆర్థికంగా మాత్రం మెజారిటీ వాళ్లు వెనుకబడిన వారి కింద లెక్కే. ప్రత్యేక హోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా కొనసాగినప్పటికీ, వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి, ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడడం. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి ఉండడం వారి ప్రధాన వృత్తి. ఒకానొక రోజుల్లో, రాజకీయంగా అధికారం క్షత్రియుల చేతుల్లో వున్నప్పటికీ, అమాత్యులుగా రాజులకు సలహాలనిచ్చే బాధ్యతను-హక్కును వారే కలిగి వుండడం అలనాటి ఆచారం, సాంప్రదాయం, ఆనవాయితీ.

చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. అలనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!

కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోను, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.

ఇంతెందుకు...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలతో పాటు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం కూడా... రాష్ట్రంలో దాదాపు 1.22 లక్షల బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అందులో దాదాపు 85 వేల కుటుంబాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నివాసం ఉంటున్నాయి. మొత్తం బ్రాహ్మణ కుటుంబాల్లో సంపన్న కుటుంబాలు కేవలం ఒక శాతానికి లోపే! .. మిగతా 99 శాతం పేద కుటుంబాలేనని అంచనా. వారంతా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు లబ్ధి కల్పించాలని ఆశిస్తున్నారు. అందుబాటులో లభిస్తున్న లెక్కల ప్రకారం పెద్ద వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగం, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ దారులు, కారు, భారీ వాహనాలు, 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి, 3.75 ఎకరాలకంటే ఎక్కువ తరి భూమి ఉన్న కుటుంబాలు సంపన్న కేటగిరీలోకి వస్తాయి. ఈ లెక్కన సర్వే గణాంకాల ప్రకారం బ్రాహ్మణుల్లో 99 శాతం పేద కుటుంబాలుగా అంచనా వేశారు.


సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసం కాదు కదా! ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం! బహుశా వారి అభ్యర్థనను సానుభూతితో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి తెలంగాణలో వారికి ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించి, అమలు చేయడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలను కోవడం గొప్ప మనసుతో చేస్తున్న ఓ గొప్ప ఆలోచన అనాలి. End

No comments:

Post a Comment