Monday, February 1, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-39 : అశ్వమేధం చేస్తున్న సగరుడి యజ్ఞాశ్వాన్ని అపహరించిన ఇంద్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-39
అశ్వమేధం చేస్తున్న సగరుడి
యజ్ఞాశ్వాన్ని అపహరించిన ఇంద్రుడు
వనం జ్వాలా నరసింహారావు

విశ్వామిత్రుడు సగర చక్రవర్తి వృత్తాంతాన్ని చెప్పడం కొనసాగిస్తాడు." హిమవత్పర్వతం-వింధ్య పర్వతం రెండూఎత్తైనకొండలైనందున,వాటిమధ్యమరేవీఅడ్డంలేనందున,ఒకదాన్నొకటి ఎల్లప్పుడూ చూసుకుంటుండేవి. ఆ రెండు కొండల మధ్యనున్న ప్రదేశంలో యజ్ఞం చేస్తే ప్రశస్తమని తలచిన సగరుడు, యజ్ఞానికి కావాల్సిన సామాగ్రినంతా సమకూర్చుకున్నాడు. హిమవంతానికి, వింధ్య పర్వతానికి మధ్యనున్న ప్రదేశాన్ని ఆర్యావర్తమంటారు.అదొక పుణ్యప్రదేశం. అశ్వమేధ యాగం చేస్తున్న సగరుడు అశ్వం వెంట అంశుమంతుడిని పంపాడు. విలువిద్యలలో ప్రవీణుడై-జగత్ ప్రసిద్ధుడైన అంశుమంతుడిపై నమ్మకంతో అశ్వం వెంట పంపించడానికి సరైన కారణం లేకపోలేదు.

యజ్ఞం మధ్యలో ఇంద్రుడు రాక్షస వేషంలో వచ్చి,యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. యజ్ఞ కర్తైన సగరుడిని లక్ష్యంచేయకుండా, ఆయన చేస్తున్న యాగాన్ని విఘ్నం చేసేందుకు, దుష్టులెవరో గుర్రాన్ని అపహరించారని-దీనివలన అందరికీ కీడుకలగొచ్చని-ఇది పాప కార్యమని చెప్పిన ఋత్విజులు సగరుడితో ఆ గుర్రాన్ని మరల తెప్పించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేయమని సలహా ఇస్తారు. వెంటనే సగరుడు, మూడులోకాలనైనా జయించగల తన అరవైవేలమంది కొడుకులతో, ఋత్విజులు తనతో మంత్రపూతంగా యజ్ఞం చేయిస్తుంటే, దొంగతనంగా రాక్షసులొచ్చి గుర్రాన్ని హరించుకుని పోయారని, తక్షణం వారంతా వెళ్లి సముద్రం వరకూ గల భూమండలాన్నంతా వెతికి ఆ గుర్రాన్ని తెమ్మనీ అంటాడు. ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరు ఆమడ మేర దూరం భూమిలో వెతకాలని, దొంగ-గుర్రం దొరికే వరకు వారెవరూ మరలిరావద్దని, తిరిగొచ్చేవరకు తాను, ఋత్విజులు, మనుమడైన అంశుమంతుడు వారికొరకు వేచిచూస్తుంటామని రాజాజ్ఞగా ఆదేశిస్తాడు. సంతోషంతో వారంతా గుర్రాన్ని వెతకడానికి పోయారు".


"వారంతా అలా పోయి, ఒక్కొక్కరు ఆమడ మేర భూమిని, వజ్రాయుధంలాంటి శిఖరాలవలె నున్న గోళ్లతోను, భయంకరమైన శూలాలతోను, నాగళ్లతోను పగలగొట్టడంతో, భరించరాని ధ్వని పుట్టింది. చచ్చిపోతున్న పాముల, మరణించు క్రూర జంతువుల ఏడుపు ధ్వనులూ-పరుగెత్తలేక నిలిచిపోయి దెబ్బలు తింటున్న రాక్షసుల మూలుగులూ నాలుగు దిక్కులు వ్యాపించాయి. అరవైవేలమంది, అరవైవేల ఆమడల మేర భూమిని పాతాళం వరకూ తవ్వడంతో, భూమంతా చిందరవందరగా తయారైంది".

సగర కుమారులను నివారించమని 
బ్రహ్మకు విన్నవించుకున్న దేవతలు


"కొండలతో నిండి వున్న జంబూ ద్వీపమంతా సగర కుమారులు గుర్రం కోసం వెతుకుతున్నారని-సగర కుమారులవల్ల భూమంతా నాశనమవుతున్నదని-గుర్రం కొరకు కర్రలతో కొట్తూ, పౌరుషంతో పాతాళమంతా కలియపెట్తూ, దొరికినవాడినల్లా పట్టుకుని వాడే గుర్రం దొంగ అని సమస్త భూతాలను హింసిస్తున్నారని, వారి నుండి తమను కాపాడాలని గంధర్వులు బ్రహ్మను వేడుకుంటారు"

No comments:

Post a Comment