Thursday, February 18, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-53 : కామధేనువును తనకిమ్మని వశిష్ఠుడిని అడిగిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-53
కామధేనువును తనకిమ్మని
వశిష్ఠుడిని అడిగిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

"వశిష్ఠుడు చెప్పిన విధంగానే, కామధేనువు, తగు రీతిలో అనేకమైన పిండివంటలు-తేనె-సారాయి-కమ్మని రుచికరమైన కూరలు-పప్పులు-అప్పాలు-పాలు-పళ్లు-వేడి, వేడి అన్నం-తియ్యటి చక్కెర పానకం, మొదలైన రకరకాల భక్ష్యభోజ్యాలను-ఎవరేదికోరితే దాన్నిసృష్టించింది. అది చూసిన వశిష్ఠుడు అందమైన పీటలు వేసి,బంగారు చెంబుల్లో నీళ్లిచ్చి, వెండిపళ్లాలలో వడ్డించే ఏర్పాట్లుచేసాడు. అంతఃపుర స్త్రీలతోను, మంత్రులతోను,బ్రాహ్మణాదులతోను,సైన్యంతోను కలిసి రాజు సంతృప్తిగా-కడుపునిండా భోజనంచేసాడు. అందరి భోజనం ముగిసిన తర్వాత, తామందరం సంతుష్టి చెందామని, ఆయన శక్తికి-పూజకు చాలా మెచ్చామని ఋశీష్వరుడితో అన్నారు.

వశిష్ఠుడిచ్చిన చనువుతో, ఆయనకొక మాటచెప్పదల్చానని అంటూ, విశ్వామిత్రుడు, తనకు కామధేనువు శబలనివ్వమని, దానికి బదులుగా నూరువేల మంచి ఆవులను ఇస్తానని అంటాడు. శ్రేష్ఠమైన పదార్థాలన్నీ రాజుల దగ్గర వుండాలని, అలానే ఆవులలో శ్రేష్ఠమైన శబల కూడా రత్నహారుడైన తనవద్దనే వుండాలని, అలాంటి అమూల్యమైన వస్తువు ఆయనకెందుకని వశిష్ఠుడితో అంటాడు. నూరువేలేకాదు, నూరుకోట్ల ఆవులనిచ్చినా-బంగారం కుప్పలు కుప్పలుగా ఇచ్చినా శబలను ఎడబాయనంటాడు వశిష్ఠుడు. ఆత్మజ్ఞానం కలవారిని కీర్తి ఎలా ఎడబాసి వుండదో, తనను విడిచి శబల కూడా వుండలేదన్నాడు. ఆ ఆవుపాలతోనే దేవతలకు కావాల్సిన హవ్యం, పితృదేవతలకు కావాల్సిన కవ్యం-బలి-అగ్ని కార్యాలు, హోమానికి కావాల్సిన పదార్థాలు-దేహయాత్ర, సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నాననీ, దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చనీ, తనకది అవ్యానందానికి కారణమైందని, అలాంటి దాన్ని తను విడిచి ఎలా వుండటాలన్నీ విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు వశిష్థుడు. కామధేనువును తానివ్వకపోవడానికి మరెన్నో కారణాలను కూడా చెప్పాడు”.



బంగారు సొమ్ములతో అలంకరించబడిన పద్నాలుగువేల ఏనుగులను, నాలుగు తెల్లని గుర్రాలను కట్టిన మేలిమి బంగారపు రథాలను, అమిత వేగంతో పోగల పదకొండువేల విదేశీ గుర్రాలను, నానా వర్ణాల కోటి ఆవులను ఇస్తానని శబలను తనకివ్వమని వశిష్ఠుడిని కోరాడు విశ్వామిత్రుడు మరోసారి. అంతేకాకుండా, వశిష్ఠుడు కోరినన్ని ఆభరణాలను, మణులను, బంగారు నాణాలను, నానా దేశాలలో లభించే మంచి మంచి వస్తువులను, గ్రామాలను, మడులను, మాణ్యాలను, స్త్రీలను, ఏది కోరితే దాన్ని ఆయన తృప్తిమేరకిస్తానని కూడా అంటాడు. విశ్వామిత్రుడేం చెప్పినా, ఏమిస్తానన్నా శబలనివ్వనంటాడు వశిష్ఠుడు. ముక్కుపట్టుకుని జపం చేసుకునే వశిష్ఠుడికి ఈ జంజాట మెందుకని, భూమిని పాలించేవాడికి సర్వ వస్తువులు కావాలని, అందుకే శబల తనదగ్గరే వుండదగిందని రాజు అనడంతో, భూమిని పాలించేవారికి బ్రాహ్మణుల-తపస్వుల సొత్తు కోరవచ్చునానని ప్రశ్నించాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడిస్తానని అంటున్నవన్నీ కామధేనువు తనకివ్వగలదని, తను దానినివ్వనని స్పష్టం చేశాడు".

No comments:

Post a Comment