Friday, February 5, 2016

ఈ నగరం ఇక ప్రజల భాగ్యం : వనం జ్వాలా నరసింహారావు

ఈ నగరం ఇక ప్రజల భాగ్యం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (06-02-2016)

పదమూడు సంవత్సరాల అవిశ్రాంత ఉద్యమ పోరాట ఫలితంగా ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రం. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన ఉద్యమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. భాగ్య నగరం విశ్వ నగరంగా, సార్వజనీన నగరంగా చేయగలిగేది కూడా ఆయనే. అందుకే, భాగ్యనగరం ఓటర్లు ఆయనిచ్చిన పిలుపుకు ఆత్మీయంగా స్పందించి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో, ఆయన నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి మూడింట రెండొంతుల సంఖ్యతో, కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఇలాంటి సుస్పష్టమైన ఓటర్ల తీర్పు, హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల చరిత్రలో, ఎప్పుడూ రాలేదు.

            హైదరాబాద్‌ నగరానికి నాలుగు శతాబ్దాలకు పైగా సుదీర్ఘ చారిత్రక నేపథ్యం వుంది. రాష్ట్ర జనాభాలో 35ు పైగా ప్రజలు ఇక్కడే నివసిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, అలనాటి పాలకుల పాలనలో అభివృద్ధికి పెద్దగా నోచుకోని హైదరాబాద్‌-సికిందరాబాద్‌ జంట నగరాలను ఒక విధంగా అభివృద్ధి పరంగా కొత్తగానే చూడాల్సి వుంటుంది. మునిసిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపుతో ఒక చారిత్రక ఆరంభానికి నాంది పలికారు ఓటర్లు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు అమలు చేస్తూనే, హైదరాబాద్‌కు సంబంధించినంతవరకు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ, ప్రతి విషయంలో అత్యంత జాగరూకతతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా, భాగ్య నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి, తనదైన శైలిలో వినూత్న పథకాల రూప కల్పన, త్వరితగతిన అమలు చేస్తున్నారు. గత ఇరవై నెలల పాలనలో, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో, అమలులో ముఖ్యమంత్రి తన అపారమైన అనుభవాన్ని, ఉద్యమ నేపథ్యపు నాయకత్వ పటిమను, రాజనీతిజ్ఞతను రంగరించి-జోడించి ముందుకు సాగుతున్నారు.

            ఈ ఇరవై నెలల పాలనలో విశ్వ నగరానికి, సార్వజనీన హైదరాబాద్‌కు బలమైన పునాదులు పడ్డాయి. ఎన్నికల ప్రచారంలో, ఈ విషయాలను ఓటర్లకు తెలియచేయడానికి, వారి విశ్వాసం పొందడానికి, ఐటీ-పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీ రామారావు, ఆయనకు తోడుగా నగరానికి చెందిన ఇతర మంత్రుల, నగర వ్యాప్త రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారం, గణనీయంగా దోహద పడ్డాయి. వీటన్నింటి కన్న మిన్నగా ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ఓటర్లకిచ్చిన పిలుపు, బహిరంగ సభలో అందరినీ ఆకట్టుకున్న ఆయన ఉపన్యాసం, తెలంగాణ రాష్ట్ర సమితికి విజయాన్ని చేకూర్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు, రాష్ర్టాన్ని- గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను ఒకరి తరువాత మరొకరు పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్‌, ఒకటి-రెండు సార్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానంలో వున్న ఎంఐఎం, దేశంలో అధికారంలో వున్న బీజేపీ పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొన్నా సత్తా చూపలేక పోయాయి.

            ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందో, ఎవరి వల్ల నగరాభివృద్ధి సాధ్యమౌతుందో ప్రజలు బేరీజు వేసుకున్నారు. తెరాస పార్టీని గెలిపించడానికి ఓటర్లను అంతగా ఆకట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం (అమలు చేసిన) పథకాలే. అవి లెక్కకు చాలానే వున్నాయి. కానీ వాటిలో తప్పకుండా ప్రజల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన పథకాలు ఎవర్ని అడిగినా టకీమని చెప్పేవి పది-పదిహేనైనా వుంటాయి. విద్యుత్‌ రంగాన్ని తీసుకుంటే, ఎన్నడైనా గత అరవై ఏళ్ల కాలంలో కోతల్లేకుండా విద్యుత్‌ సరఫరా జంట నగర వాసులకు, ఆ మాటకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు లభించిందా? స్టెబిలైజర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకుండా ఎవరి ఇల్లు అయినా వుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, జంట నగరాలకు రెప్పపాటు కరెంటు పోకుండా సరఫరా జరుగుతున్నది. పరిశ్రమలకూ 24 గంటలు పవర్‌ సప్లయి జరుగుతుంది. ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. తెరాసకు ఓటేయడానికి ఈ ఒక్క అంశం చాలదా?


            చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించిందీ ప్రభుత్వం. గవర్నర్‌, ముఖ్యమంత్రితో సహా సిఎస్‌, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులు జంట నగరాలను 400 భాగాలుగా విడదీసి.. గల్లీ గల్లీలో వారం పాటు కలియ తిరిగారు. తిరగడమే కాకుండా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా కోట్లాది రూపాయల విలువ చేసే పనులు చేపట్టింది. పార్టీలు, రాజకీయాలకతీతంగా జంట నగరాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కమిటీలు ఏర్పాటు చేసి ఢిల్లీ, నాగపూర్‌కు పంపి, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయించిందీ ప్రభుత్వం. చెత్త రహిత నగరంగా చేయడానికి ఆటోట్రాలీలు, డస్ట్‌ బిన్స్‌ పంపిణీ జరిగింది. ఈ అంశం చాలదా జంట నగర ప్రజల ఓట్లను పొందడానికి?

            ఐడీ హెచ్‌ కాలనీలో నిర్మించిన నిలువ నీడలేని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకడానికి ఉద్దేశించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం ఒక్కటి చాలు ఓటర్ల విశ్వాసం పొందడానికి. తెరాసను గెలిపిస్తే ఐడీ హెచ్‌ కాలనీ లాంటివి నగరమంతా రూపు దిద్దుకుంటాయని, లక్షలాది మందికి లాభం కలుగుతుందని గట్టిగా నమ్మారు ఓటర్లు. ఓటర్ల నమ్మకమే తెరాస బలమైంది. అలానే ఆసరా పింఛన్లు, భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యం, మహిళల రక్షణకు ఏర్పాట్లు... తెరాస ఓట్లు పొందడానికి ఇవన్నీ చాలవా? తెరాసకు ఓటెందుకు వేశారో చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.... మచ్చుకు మరి కొన్ని.... పేదింటి ఆడ పిల్ల పెళ్లి భారాన్ని ప్రభుత్వమే మోసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు, ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి హక్కులు కల్పించడం...ఇవి చాలవా ఓటు వేయాలనుకోవడానికి? హాస్టల్‌ విద్యార్థులకు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం, సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి బీద కుటుంబంలోని ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం వల్ల లాభపడిన వారందరూ తెరాసకే ఓటేస్తారుగా?

            కుల మతాలకు అతీతంగా, హిందువుల బోనాలు-బతుకమ్మ పండుగలకు; ముస్లింల రంజాన్‌కు; క్రైస్తవుల క్రిస్టమస్‌కు సమాన స్థాయిలో ఎటువంటి బేధం చూపకుండా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన అంశం చాలు వారి ఓట్లు తెరాసకు పడడానికి. ప్రాంతీయ తేడాలు పక్కన పెట్టి అభివృద్ధిలో అందరికీ అవకాశం కల్పిస్తామన్న ఒక్క మాట చాలు ఓటర్లు తెరాసను ఎంచుకోవడానికి. జంట నగరాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులకు రూపకల్పన చేసిన ప్రతి అంశాన్ని అమలు పరుస్తుందీ ప్రభుత్వం అని ధృఢంగా నమ్మారు ఓటర్లు. ఇవన్నీ కూడా తెరాస గెలుపుకు దోహదపడ్డాయి? అదే జరిగింది. తెరాస గెలిచింది.

            అలానే కాంగ్రెస్‌, టీడీపీ, మజ్లీస్‌, బీజేపీ పార్టీలకు ఓటెందుకు వేయకూడదు అనే విషయంలో కూడా ఓటరుకు స్పష్టత వుందనాలి. వారి పుణ్యమా అని కంచన్‌ బాగ్‌, కుందన్‌ బాగ్‌, బషీర్‌ బాగ్‌ లాంటి ఉద్యానవనాల నగరం కనుమరుగైపోయింది. చెరువులు నాశనమయ్యాయి. నాలాలు కబ్జాకు గురయ్యాయి. ట్రాఫిక్‌ అవస్థలు చెప్పనక్కరలేదు లేదు. ఏ కాస్త వాన కురిసినా నగరం మొత్తం జలమయం. ఈ అంశం చాలదా ఓటర్లు వారికి ఓటెయ్యక పోవడానికి? జంట నగర వాసులకు ఇన్నేళ్లయినా తాగు నీటి కొరకు శాశ్వత పరిష్కార మార్గాలేమైనా ఆ పార్టీలు తమ హయాంలో అలోచన చేశాయా? ఎక్కడి గొంగళి అక్కడే కదా? ఈ అంశం చాలదా వాళ్ల ఓట్లు ఆ పార్టీలకు వేయకుండా వుండడానికి? అదే జరిగిందిప్పుడు. ప్రజల అవసరాలకు సరిపోను కూరగాయల మార్కేట్లేమన్నా ఏర్పాటు చేశారా? పబ్లిక్‌ టాయిలెట్ల సౌకర్యం అవసరాలకనుగుణంగా వుందా? దహన వాటికల్లేవు, డంపింగ్‌ యార్డులు లేవు, బస్‌ స్టాండ్లు లేవు.... వారి హయాంలో తాము పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుని బహుశా ఓటేసి వుండరేమో! పోనీ కేంద్రంలో అధికారంలో వున్న టీడీపీ జత పార్టీ నగరానికి ఏమైనా నిధులు మంజూరు చేసిందా అంటే అదీ లేదు! అందుకే ఆ పార్టీలను నమ్మలేదు ఓటర్లు.


            కాంగ్రెస్‌, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు, కొంత మేరకు మజ్లీస్‌ కు గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు కేవలం ఓటమి మాత్రమే కాకుండా, ఆ పార్టీల ప్రతిష్ట పూర్తిగా పడిపోవడానికి కూడా దారితీస్తుంది. ఆ పార్టీల భవిష్యత్‌ తెలంగాణకు సంబంధించి నంతవరకు బహుశా కొంత ప్రశ్నార్థకమే! ఇదిలా వుంటే, గతంలో ఎన్నడూ జరగని రీతిలో, ఈ సారి ఎన్నికలు చివరి నిమిషంలోని ఒక్క దురదృష్ట సంఘటన మినహా, ప్రశాంతంగా నిర్వహించడం అంటే ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్నీ, కార్పొరేషన్‌ అధికారులనీ, పోలీసు సిబ్బందినీ అభినందించాల్సిన విషయం. ఆ ఒక్క సంఘటనను సాకుగా తీసుకుని గవర్నర్‌ ను కలిసిన పలు పార్టీల నాయకులు సెక్షన్‌ ఎనిమిది అమలు విషయాన్ని ప్రస్తావించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం-అర్థరహితం. ఓటమిని హుందాగా అంగీకరించి, గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి-మెలిసి తమ వంతు సహకారం అందించడం కనీస రాజకీయ ధర్మం. End

3 comments:

  1. అన్ని వర్గాల హైదారాబాద్ ప్రజల మన్ననలను పొందిన కేసీయార్ అభినందనీయులు

    ReplyDelete
  2. You haven't said anything about the attacks by MIM goondas MLAs also. Instead you have written a hammer (suthi) article. Old city has become mini pakistan.

    ReplyDelete