Thursday, February 11, 2016

ఆంధ్ర వాల్మీకి-వాసుదాస స్వామి : వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి-వాసుదాస స్వామి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-02-2016)

సరిగ్గా నూట ఏబై రెండేళ్ల క్రితం, జనవరి నెల 1863 లో ఒక మహానుభావుడు అభినవ పోతన అవతారంగా కడప జిల్లా ఒంటిమిట్టలో జన్మించారు. తిథుల ప్రకారం మాఘ శుద్ధ చవితి అయిందారోజు. అంటే ఈ రోజు...ఫిబ్రవరి 12. ఆంధ్ర వాల్మీకిగా, వాసు దాసుగా ప్రసిద్ధికెక్కిన ఆయనను స్మరించు కోవడం తెలుగు వారందరి కనీస ధర్మం. ఆయన జన్మదినం సందర్భంగా...

            వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. కానీ, కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్ట మొదలు ఆంధ్రీకరించి, పదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల ఆంధ్రులకు అత్యుత్సాహాన్ని కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యం" అంటే, ఆంధ్ర దేశమే సుమా, అనిపించిన నిరుపమ రామ భక్తులు వాసుదాస స్వామివారు.

            వాసు దాసుగారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యధా మూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి, రచించించారీ గ్రంథాన్ని వాసు దాసుగారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేసారు . ఆయన రచించిన నిర్వచన రామాయణం, ఆయన జీవిత కాలంలోనే, నాలుగైదు సార్లు ముద్రించబడింది. తర్వాత, శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసు దాసుగారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం."మందరం"అంటే, క్షీర సాగరాన్ని మథించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది సాధారణంగా ఎవరికైనా. కాని, వాసు దాసుగారి శ్రీపాద సంబంధులకు మాత్రం, "మందరం" అంటే, మొదట గుర్తుకొచ్చేది, ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరమే. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, "క్షీరవారాసి" గా సంభావించి, దానిని మధించిన తమ "మేథ" అందించిన మకరందాలను-మధురిమలను, ముచ్చటగా "మందరం" అని పేర్కొన్నారు. సహృదయ నైవేద్యంగా-అనుభవైక వేద్యంగా వచ్చిన రచనలకు అసాధ్యంగా-నిగమ గోచరంగా భావించబడిన రామాయణానికి "మందరం" అని నామకరణం చేయడంలో తను కొంత వరకే న్యాయం చేయగలిగానని అంటారాయన. ఇందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాల వారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసు దాసుగారు.

            తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసు దాసుగారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాసు దాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతి కాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ధర్మశాస్త్రం లాగా, రాజనీతి శాస్త్రం లాగా, భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు, పరిశోధనా దృక్ఫధంతో చదివితే. ప్రతి కాండ చివర వాసు దాసుగారు రాసిన ఆఖరు పద్యంలో, ఆ కాండలో వున్న మొత్తం పద్యాలెన్నో తెలియచేసే పంక్తులుంటాయి.

            ఆంధ్ర వాల్మీకి రామాయణం రాయడానికి ప్రేరణ-స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసు దాసుగారు.      తనకంటే ముందు కాలం నాటి పూర్వ కవులెవరు, రామాయణాన్ని (పూర్వ కాండలు, ఉత్తర కాండ కలిపి) సంపూర్ణంగా తెనిగించలేదని గ్రహించిన వాసు దాసుగారు, అన్ని కాండలను తెనిగించి, విశేషించి తెలుగు పాఠక లోకానికి ఆవిష్కరించాలని సంకల్పించుకున్నారు.           భగవత్ చరిత్రలెన్నో వుండగా రామాయణ రచనకే ఎందుకు పూనుకున్నావని అడిగినవారికి తనదైన శైలిలో జవాబిచ్చారు వాసు దాసుగారు. జనన-మరణ రూపకమైన సంసార బంధం నుండి విముక్తి చేసేది రామ కథేనని, భగవత్ సాయుజ్యం పొందేందుకు రామాయణ రచన చేసానని అంటారాయన. పూర్వం కొందరు రాసారుకదా, మరల ఎందుకు రాస్తున్నావంటే, "ఎవరి పుణ్యం వారిదే. ఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు" అని జవాబిస్తూ, శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామాయణాన్ని రచించి వాగ్రూపకైంకర్యం చేయదల్చానంటారు వాసు దాసుగారు.

            వావిలికొలను సుబ్బారావుగారు, కడప జిల్లా-జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారు. ఎఫ్.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదాకెదిగారు. ఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు మొదట్లో. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేశారు. వాసు దాసుగారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారు. కళాశాలలో చేరక ముందే, పినతండ్రి మీద తనకున్న కృతజ్ఞతకు గుర్తుగా, "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చి శాశ్వత స్వర్గ సుఖాన్ని కలిగించారాయనకు. ఆయన రచించిన ఆ ప్రబంధం, నాటి కవి పండితులను ఆశ్చర్య పరిచింది. ఆయన ప్రతిభకది తొలి హారం.

            ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యా వియోగం కలగడంతో, వాసు దాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేశారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసు దాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.

            వావిలికొలను సుబ్బారావుగా పండిత పదవీ విరమణ చేసిన అనంతరం, తన జీవితమంతా, భక్తి మార్గంలోనే గడిపారు. వాసు దాసుగారు "కౌసల్యా పరిణయం" అనే ప్రబంధం, "సుభద్రా విజయం" అనే నాటకంతో పాటు, "హిత చర్యలు", "ఆధునిక వచనరచనా విమర్శనం", "పోతన నికేతన చర్చ", "పోతరాజు విజయం", "రామాశ్వమేథం", ఆంధ్రవిజయం" కూడా రాసారు."ఆర్యకథానిధులు" అన్న పేరుతో ఆయన రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగువారందరికి అత్యంత ఆదరణీయమైనాయి."సులభ వ్యాకరణం" తెలుగు వ్యాకరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయన రచించిన "కృష్ణావతార తత్వం" ప్రశస్త కృతి పాండిత్యంతో, ఆధ్యాత్మిక భావనతో, పాఠకులలో ఆంధ్ర భాషాభిమానాన్ని ఉద్దీపించ చేసి-తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు, మహామనీషి వావిలికొలను సుబ్బారావు గారు. వాస్తవానికి సరైన పోషకుడో-ప్రాయోజకుడో వుండి వుంటే, వాసు దాసుగారి ఆంధ్రవాల్మీకిరామాయణం, ఎప్పుడో-ఏనాడో నొబెల్ సాహిత్య బహుమతికో, జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని వుండేది. ఏ మాత్రం మన తెలుగువారు ప్రయత్నం చేసినా, ఆ మహానుభావుడికి భారతరత్న-జ్ఞానపీఠ అవార్డులతో పాటు నొబెల్ బహుమానం వచ్చేది. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే మంచిదేమో.


            వాసు దాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. రామాయణ క్షీర సాగరాన్ని "మందరం" మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. అయితే, దానిని ఆస్వాదించే తీరికా-ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. నేటి తరం పఠితులూ, పండితులూ "సూక్ష్మంలో మోక్షం" కావాలంటున్నారు. కాలం గడిచిపోతున్నది. వాసు దాసుగారు మారిపోతున్న తరాలకు గుర్తు రావడం కూడా కష్ఠమైపోతున్నది. వారి "ఆర్యకథానిథుల" తోనూ, "హితచర్యల" పరంపరలతోనూ, పరవశించిపోయిన ఆ నాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి. End

No comments:

Post a Comment