Friday, February 5, 2016

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-VIII : వనం జ్వాలా నరసింహారావు

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-VIII
వనం జ్వాలా నరసింహారావు

ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి ఎనిమిదవ విడత పది పద్యాలు). 

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-71

సీII ప్రహ్లాదుండేపాటి పైడి కానుకలిచ్చె?
మదగజం బెన్నిచ్చె మౌక్తికములు?
నారదుండెన్నిచ్చె నగలు రత్నంబు? ల
హల్య నీ కే యగ్రహారమిచ్చె?
నుడుత నీకేపాటి యూడిగంబు చేసె?
ఘన విభీషణుడేమి కట్నమిచ్చె?
పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు?
ద్రౌపది నీ కెంత ద్రవ్యమిచ్చె?
తేII నీకు వీరందరయినట్లు నేను గాన
యెందుకని నన్ను రక్షింప విందువదన!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-72

సీII వాంఛతో బలిచక్రవర్తి దగ్గరజేరి
బిక్షమెత్తితివేల బిడియపడక?
యడవిలో శబరి తియ్యని ఫలాలందియ్య
జేతులొగ్గితి వేల సిగ్గుపడక!
వేడ్కతో వేవేగ విదురునింటికి నేగి
విందుగొంటివదేమి వెలితిపడక?
నటుకు లల్పము కుచేలుడు గడించుక చేర
బొక్కసాగితివేల లెక్కగొనక?
తేII భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను,
వారికాశించితివి తిండివాడవగుచు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-73

సీII స్థంభమందుదయించి దానవేంద్రుని ద్రుంచి
కరుణతో బ్రహ్లాదుం గాచినావు;
మకరిచే జిక్కి సామజము దుఃఖింపంగ
గృపయుంచి వేగ రక్షించినావు;
శరణంచు నవ్విభీషణుడు నీ చాటున
వచ్చినప్పుడె లంకనిచ్చినావు;
ఆ కుచేలుడు చేరె డటుకు లర్పించిన
బహుసంపదలనిచ్చి పంపినావు;
తేII వారివలె నన్ను బోషింప వశముగాదె
ఇంతవలపక్షమేల? శ్రీకాంత! నీకు!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస 
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-74

సీII వ్యాసుడే కులమందు వాసిగా జన్మించె?
విదురు డేకులమందు వృద్ధిబొందె?
కర్ణు డేకులమందు ఘనముగా వర్ధిల్లె?
నా వసిష్ఠు డెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబున బుట్టె?
గుహుడను పుణ్యు డేకులమువాడు?
శ్రీ శుకుడెచ్చట జెలగి జన్మించెను?
శబరి యేకులమందు జన్మమొందె?
తేII నే కులంబున వీరంద రొచ్చినారు?
నీ కృపాపాత్రులకు జాతి నీతులేల?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూరశేషప్ప కవి రచించిన నరసింహ శతకం-75

సీII వసుధా స్థలంబున వర్ణహీనుడుగాని,
బహుళ దురాచారపరుడు గాని,
తడసి కాసియ్యని ధర్మశూన్యుడు గాని,
చదువనేరని మాఢజనుడు గాని,
సకల మానవులు మెచ్చని కృతఘ్నుడుగాని,
చూడసొంపును లేని శుంఠగాని,
యప్రతిష్టలకు లోనైన దీనుడుగాని,
మొదటి కేమెరుంగని మోటుగాని
తేII ప్రతిదినము నీదు భజనచే బరగునట్టి
వాని కేవంకలేదయ్య, వచ్చు ముక్తి;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-76

సీII ఇభకుంభములమీది కెగిరెడి సింగంబు
ముట్టునే కురుచైన మూషికమును?
నవచూతపత్రముల్ నమలెడి కోయిల
కొరకునే జిల్లేడు కొనలు నోట?
నరవింద మకరంద మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు పూలకడకు?
లలితమైన రసాల ఫలము కోరెడి చిల్క
మెసవునే భ్రమను నుమ్మెత్తకాయ?
తేII నిలను నీ కీర్తనలు పాడ నేర్చి నతడు
పరుల కీర్తన బాడునే యరసి చూడ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-77

సీII సర్వేశ! నీపాద సరసిజద్వయ మందు
జిత్తముంచగలేను జెదరకుండ,
నీవైన దయయుంచి నిలచియుండెడునట్లు
చేసి నన్నిపుడేలు, సేవకుండను,
వనజలోచన! నేను వట్టి మూర్ఖుడ జుమ్మి,
నీ స్వరూపముజూడ నేర్పు వేగ,
తన కుమారుల కుగ్గు తల్లి పోసినయట్లు
భక్తిమార్గంబను పాలుపోసి,
తేII ప్రేమతో నన్ను బోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీదాస గణములోన,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-78

సీII జీమూతవర్ణ! నీ మోముతో సరిరాక
కమలారి యతికళంకమును బడసె,
సొగసైన నీ నేత్ర యుగముతో సరిరాక,
నళిన బృందము నీళ్ల నడుమజేరె,
గరిరాజవరద! నీ గళముతో సరిరాక
పెద్ద శంఖము బొబ్బపెట్ట దొడగె,
శ్రీపతి! నీ దివ్య రూపుతో సరిరాక
పుష్పబాణుడు నీకు బుత్రుడయ్యె,
తేII నిందిరాదేవి నిన్ను మోహించి విడక
నీకు బట్టంపు సతియయ్యె నిశ్చయముగ,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-79

సీII హరిదాసులను నిందలాడకుండినజాలు
సకల గ్రంధమ్ములు చదివినట్లు;
బిక్షమియ్యంగ దప్పింపకుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు;
మించి సజ్జనుల వంచించకుండిన జాలు
నింపుగా బహుమాన మిచ్చినట్లు;
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్లు గట్టినట్లు;
తేII ఒకరి వర్షాశనము ముంచకున్నజాలు
బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-80

సీII ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న
దేహ మెప్పటికి దా స్థిరత నొంద;
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు
నొక్కతీరుననుండ వుర్విలోన;
బాల్యయౌవన సుదుర్బల వార్ధకములను
మూటిలో మునిగెడి మురికి కొంప;
భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్న
గాలమృత్యువుచేత గోలుపోవు;
తేII నమ్మరాదయ్య! యిది మాయ నాటకంబు;
జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

1 comment:

  1. హరిదాసులను నిందలాడకుండినజాలు
    సకల గ్రంధమ్ములు చదివినట్లు;

    మంచి పని చేస్తున్నారు.

    ReplyDelete