Saturday, February 27, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-62 : విశ్వామిత్రుడి శరణుజొచ్చిన శునస్సేపుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-62
విశ్వామిత్రుడి శరణుజొచ్చిన శునస్సేపుడు
వనం జ్వాలా నరసింహారావు

            "ఎండవేడికి తాళలేక మార్గమధ్యంలో ప్రయాణం ఆపు చేసి, రాజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, శునస్సేపుడు పరుగెత్తుకుంటూ, సమీపంలో ఋషీశ్వరుల మధ్యనున్న మేనమామ విశ్వామిత్రుడి దగ్గరకు పోయాడు. అలసటతోనూ, ఎండవేడివల్లనూ, పరుగెత్తుకుంటూ రావడం వల్లా, తటాలున వస్తూనే మామ విశ్వామిత్రుడి ఒళ్లో వాలాడు. తనగతి ఏమని చెప్పాలని, తనను మన్నించి అతడే కాపాడాలని, తల్లితండ్రులున్నా వారు తనను రక్షించలేరని, వారున్నా లేనట్లేనని, ఏదో విధంగా ఆలోచించి రాజు కోరిక నెరవేరేటట్లు-తను తపస్సు చేసి స్వర్గానికి పోయేటట్లు చేయమని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు శునస్సేపుడు. తను అర్థాయువుతో చనిపోకుండా, దీర్ఘాయువుగా జీవించేటట్లు చేయమంటాడు. తను బతకదల్చుకుంది కామంకోసం కాని, భోగంకోసం గాని కాదని, స్వర్గానికి పోవడానికి కావల్సినంత తపస్సుచేయడానికేనని అంటూ, తను ఆపదపాలుకాకుండా, ఆయన బిడ్డలను కాపాడినట్లే తనను కూడా రక్షించమని కోరాడు.

అల్లుడి మాటలు విన్న విశ్వామిత్రుడు తన కొడుకులతో, అతడు బాలుడనీ-రక్షించమని అర్థిస్తున్నాడని-భయపడి తన శరణుజొచ్చాడని అంటూ, వాళ్లల్లో ఎవరైనా ఒకడు అతడి బదులుగా రాజువెంట పోయి, అతడికి ప్రాణబిక్ష పెట్టమని అంటాడు. తన మాట గౌరవించాలని కూడా అంటాడు. వారిలో ఎవరన్నా అతడి బదులుగా వెళ్తే రాజు యజ్ఞం నెరవేరుతుందని, దేవతలు సంతోషిస్తారని, అతడి ప్రాణం నిలుస్తుందని, తన మాటా దక్కుతుందని, కాబట్టి తను చెప్పినట్లు చేయమని కోరతాడు. విశ్వామిత్రుడి కొడుకులందరూ ముక్తకంఠంతో ఆయన కోరికను తిరస్కరించారు. తన బిడ్డలను బలిపెట్టి ఇతరుల బిడ్డను కాపాడడమంటే, స్వార్జిత మధురా హారం మాని, నిషిద్ధమైన కుక్క మాంసం తినడమేనని అహంకారంగా జవాబిచ్చారు వారు తండ్రికి".


"కొడుకులందరు ఒక్క మాటగా, తన కోరికను మన్నించక పోవడంతో, విశ్వామిత్రుడికి కోపమొచ్చింది. తను అవునన్నది వారెలా కాదంటారని, కొంచెమైనా వారికి భయం లేకుండా పోయిందనీ, తండ్రి మాట జవదాటడం ధర్మ విరుద్ధమనీ, తన మాట అతిక్రమించి వారింక బతకలేరని అంటూ, వశిష్ఠుడి కొడుకులలాగానే వాళ్లు కూడా కుక్క మాంసం తింటూ-నీచమైన మనస్సుతో, వెయ్యేళ్లు అల్లాడమని శపించాడు. అలా పట్టరాని కోపంతో కొడుకులను శపించి, విశ్వామిత్రుడు మంత్రించిన విబూదిని శునస్సేనుడికి పెట్టి అతడిని భయపడొద్దని చెప్పాడు. యజ్ఞంలో అతడిని విష్ణు సంబంధమైన యూపానికి కట్టినప్పుడు, అగ్నిని చూస్తూ-ఆలస్యం చేయకుండా, ’ఇమ మ్మే వరుణ’ అనే రెండు మంత్రాలను జపించమంటాడు. (ఒక మంత్రం ఇంద్రస్తుతి-ఇంకొకటి ఉపేంద్రస్తుతి).


మంత్రాలను ఉపదేశించి, తని చెప్పిన ప్రకారం అవి చదివితే, రాజు యజ్ఞం సఫలమవుతుందనీ, ఆయన జీవితాశయం నెరవేరుతుందని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రాలను గ్రహించి, శెలవు తీసుకుని వెళ్లాడు శునస్సేపుడు. అంబరీషుడి దగ్గరకు పోయి, అతడిని యజ్ఞ దీక్ష వహించమని కోరాడు. పురోహితుడు చెప్పినట్లే దీక్ష వహించాడు అంబరీషుడు. బ్రాహ్మణులు శునస్సేపుడి మెడలో పూదండలు వేసి, ఎర్రటి వస్త్రాలను కట్టి, దర్భలతో అల్లిన తాళ్లతో అతడిని యూపస్తంబానికి కట్టారు. అతడేమాత్రం భయపడకుండా తనలోలోన మంత్రాలను స్మరించాడు. తనను ఆశ్రయించిన వారిని రక్షించే విష్ణువు, రాజుకు యజ్ఞ ఫలం-బాలుడికి దీర్ఘాయువు ఇమ్మని ఇంద్రుడికి చెప్పగా ఆయన ఆజ్ఞానుసారం ఇంద్రుడు మెచ్చి, శునస్సేనుడికి దీర్ఘాయువునిచ్చి, రాజుకు యజ్ఞ ఫలాన్నిచ్చాడు. అగ్నితేజుడైన విశ్వామిత్రుడు వెయ్యేళ్లు, ప్రపంచమంతా పొగిడే విధంగా, గాఢమైన తపస్సు చేశాడు".

No comments:

Post a Comment