Wednesday, February 3, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-41 : యజ్ఞాశ్వాన్ని వెతికేందుకు పోయిన అంశుమంతుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-41
యజ్ఞాశ్వాన్ని వెతికేందుకు పోయిన అంశుమంతుడు
వనం జ్వాలా నరసింహారావు

"కొడుకులు పోయి చాలారోజులైందని, ఇంతకాలమైనా రాలేదని, వారి జాడ తెలవడంలేదని, యజ్ఞం పూర్తికాలేదని చింతించిన సగరుడు తన ముద్దుల మనుమడైన అంశుమంతుడిని పంపి అతడి పిన తండ్రులేమైనారో తెలుసుకుందామనుకున్నాడు. అంశుమంతుడు చిన్నవాడైనా విద్యావంతుడని-విలువిద్యలో చక్కగా చేయి తిరిగినవాడని, శూరుల్లో గొప్పవాడని, ధైర్యంలో ఉత్తమ పురుషులకుండాల్సిన సుగుణాలన్నీ వున్నాయని అంటూ అతడిని వెళ్లి పిన తండ్రుల జాడ, గుర్రం జాడ కనుక్కొని, యజ్ఞాన్ని నిర్వహించేటట్లు చేయమని కోరతాడు సగరుడు. భూమండలంలో బలవంతులను ఎదిరించి-వధించడానికి విల్లు బాణాలను తీసుకుని పొమ్మని, మొక్కదగిన వారికి మొక్కమని, అతడి కార్యాన్ని విఘ్నం చేయదల్చినవారిని చంపమని, ఎలాగైనా కార్యసాధకుడై ఆలస్యం చేయకుండా తిరిగి రమ్మని అంటాడు సగరుడు. సరేనన్న అంశుమంతుడు, వెంటనే ఆయుధాలు ధరించి, పినతండ్రులు వెళ్లిన మార్గంలో పయనించి-భూమిలో ప్రవేశించి, అక్కడ మేరుపర్వతంతో సమానమైన పెద్ద దిగ్గజాన్ని చూసి-ప్రదక్షిణ చేసి పినతండ్రుల జాడ చెప్పమంటాడు. సూర్యవంశంలో జన్మించిన అంశుమంతుడు, శీఘ్ర కాలంలోనే గుర్రాన్ని పొందుతాడని-కార్యాన్ని సాధించుకుని సుఖంగా ఇంటికి చేరతాడని ఆ ఏనుగు అంటుంది. ఆ స్థలాన్ని విడిచి వరుసగా దిగ్గజాలన్నిటినీ చూసుకుంటూ, పిన తండ్రుల జాడ-గుర్రం జాడ చెప్పమని ప్రార్థించాడు. యజ్ఞాశ్వాన్ని తీసుకుని త్వరలోనే అయోధ్యకు వెళ్తావన్న దిగ్గజాల మాట ప్రకారం, అవి పొమ్మన్న దారిలో పోతూ, పిన తండ్రుల బూడిద రాసులను చూసి-దుఃఖాన్ని ఆపుకోలేక, వాళ్లు మరణించినందుకు భోరున విలపిస్తాడు. కళ్లనుండి నీళ్లు ప్రవాహంలాగా వస్తుంటే, అక్కడే మేత మేస్తున్న గుర్రాన్ని గమనించి, ముందుగా మరణించిన వారికి తర్పణాలు వదలాలని, ఆ సమీపంలో ఎక్కడన్నా నీళ్లున్నాయేమోనని వెతుకుతాడు".


"ఎంత వెతికినా ఎక్కడా నీళ్లు కనపడక పోవడంతో, ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు, అంశుమంతుడు పినతండ్రులకు మేనమామైన గరుత్మంతుడిని చూస్తాడు. అతడుకూడా రాజకుమారుడిని చూసి, సగరుడి పుత్రుల మరణం లోకసమ్మతమైందేనని, దానికి అతడు చింతించాల్సిన పనిలేదని అంటాడు. పరిమాణమింతని చెప్పనలవికాని విష్ణుమూర్తి, కపిలుడి ఆకారంలో వచ్చి, వాళ్లు చేసిన దుండగానికి కోపించి-చంపి బూడిద చేశాడని, క్షత్రియుడైన అంశుమంతుడు పరాక్రమవంతుల మరణానికి విలపించకూడదని నచ్చచెపుతాడు.

గంగను తెమ్మని అంశుమంతుడికి బోధించిన గరుత్మంతుడు


బ్రాహ్మణ కోపంతో చచ్చిపోయినవారికి, తగిన రీతిలో ఉదక దానం చేస్తేనే ఊర్థ్వగతులుంటాయని, అందువల్ల యోగ్యమైన పుణ్య తీర్థాలలోని నీళ్లతోనే ఉదక దానం చేయాలని, మామూలు తటాకాలలోని నీళ్లతో కాదని అంటాడు గరుత్మంతుడు. హిమవంతుడి పెద్ద కూతురైన గంగాదేవిని తెచ్చి, ఆ నీళ్లతో ఉదక దానం చేస్తేనే వారికి ఊర్థ్వ లోకాలు కలుగుతాయని, పవిత్రమైన ఆచారాలను పాటించే అంశుమంతుడు, వాళ్ల భస్మ రాసులమీద లోకపావనైన గంగను పారిస్తే, వారంతా నరకానికి పోకుండా గౌరవంగా స్వర్గానికి పోయి చెప్ప సాధ్యపడని సౌఖ్య పరంపరలను అనుభవిస్తారని అంటాడు. సమీపంలో వున్న గుర్రాన్ని తీసుకెళ్లి తాత చేస్తున్న యాగాన్ని పూర్తిచేయమని కూడా సలహా ఇస్తాడు. గరుత్మంతుడి మాట ప్రకారం అంశుమంతుడు గుర్రంతో తాత వున్న చోటుకు పోయి, ఆయనకు సంగతంతా చెప్పాడు. సగరుడు పుత్రశోకంలో వున్నప్పటికీ, మొదలుపెట్టిన అశ్వమేధ యజ్ఞాన్ని సాంతంగా నెరవేర్చి, అయోధ్యకు పోయి, ఆకాశగంగను భూమి పైకి ఎలాతేవాలో తెలియక, ఆ ఆలోచనతోనే ముప్పై ఏళ్లు భూమిని పరిపాలించి స్వర్గానికి పోయాడు". 

No comments:

Post a Comment