Tuesday, February 2, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-40 : బ్రహ్మ కల్ప వివరణ-కపిలుడి కోపాగ్నికి భస్మమైన సగర కుమారులు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-40
బ్రహ్మ కల్ప వివరణ-కపిలుడి కోపాగ్నికి
భస్మమైన సగర కుమారులు
వనం జ్వాలా నరసింహారావు

"అలా విపరీతమైన భయంతో వణికిపోతున్న దేవతా సమూహాలను చూసిన బ్రహ్మ, వారితో, నవ ద్వీపాలతో కూడిన భూమండలమంతా వాసుదేవుడిదని, ఆ మహాత్ముడే కపిలుడు గా ఎల్లప్పుడు భూమిని భరిస్తుంటాడని, సగర కుమారులను ఆయనే సమయం చూసి తన కోపాగ్నిలో భస్మం చేస్తాడని, వాళ్లను చింతించ వద్దని అంటాడు. ప్రతి కల్పంలో భూమి ఈ విధంగానే తవ్వబడుతుందని, దీనికొరకు దేవతలు చింతించాల్సిన పనిలేదని, అల్పాయుష్కులైన సగర కుమారులు త్వరలోనే నాశనమవుతారని బ్రహ్మ అనడంతో, దేవతలంతా సంతోషంతో వారి స్థానాలకు వెళ్లిపోయారు.


ఇదిలా వుండగా, సగర కుమారులు తమ ప్రయత్నంలో భాగంగా, భూమినంతా తవ్వి, గుర్రం జాడ కనుక్కోలేక, తండ్రి దగ్గరకు పోయి-రాక్షసులు, కిన్నరులు భంగపడే విధంగా, మిట్ట పల్లాలు-సందులు, గొందులు అన్న తేడా లేకుండా, భూమంతా తవ్వినా గుర్రం జాడ కనుక్కోలేక పోయామని తెలియచేస్తారు. వారి మాటలకు కోపగించిన సగరుడు, గుర్రం జాడ కనుక్కోకుండా వ్యర్థంగా తిరిగొచ్చిన వారందరినీ వెళ్లి, భూమినింకా తవ్వి అశ్వాన్ని వెతికి తెమ్మంటాడు. కార్యార్థం వెళ్లినవారు, కార్యం సాధించకుండా రాకూడదని, మరల పోయి కార్యం సాధిస్తే రమ్మని-లేకపోతే రావద్దని, వుత్త చేతులతో వస్తే యజ్ఞం ఎట్లా ముగుస్తుందని అడుగుతాడు. మళ్లా వెళ్లిన వారందరు రసాతలమంతా తవ్వి, ఒకచోట కొండ లాగున్న విరూపాక్షమనే ఏనుగును చూస్తారు. ఆ ఏనుగు, భూమిని మోసేటప్పుడు-పర్వదినాలలో బరువు మోయడం వల్ల కలిగిన బాధను తొలగించుకునేందుకు, తన శిరస్సును ఆడిస్తుంటుంది. అప్పుడు భూమి కూడా వణుకుతుంది. దానికి సగర కుమారులు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, తూర్పు దిక్కును భేదించి, దక్షిణాన్ని కూడా తవ్వి, అక్కడ మహాపద్మం అనే మరో ఏనుగును చూసారు. దానికీ నమస్కరించి, పడమరగా పోయి, అక్కడ కొండలా వున్న మరో దిగ్గజం-సౌమనసం, అనే దాన్ని చూసి, మొక్కి అక్కడనుండి ఉత్తరంగా పోతారు. అక్కడున్న మంచులాంటి తెల్లటి కాంతితో మనోహరంగా మెరుస్తున్న భద్రం అనే తెల్ల ఏనుగును చూసి, కుశల ప్రశ్నలను అడిగి, ఈశాన్య దిక్కుగా పోయి కోపంతో మండిపడుతూ భూమిని తవ్వారు. అలా వాళ్లు తవ్వుతున్నప్పుడు, ఒక ప్రదేశంలో, పూర్ణ తపస్వరూపుడిని-దేవతలకందరికీ దేవుడిని-యోగమే స్వభావంగా కలవాడిని-నిత్యుడైన వాసుదేవుడిని, ఆయన సమీపంలో వున్న గుర్రాన్ని చూసి, తమ కష్టం గట్టెక్కిందని తలిచారు. వాసుదేవుడెవరో తెలుసుకోకుండా,దొంగ అని సంబోధిస్తూ,యజ్ఞాన్ని విఘ్నంచేసినవాడని-యజ్ఞాశ్వాన్ని దొంగిలించినవాడని -ముని వేషంలో వున్న మాయావని దూషిస్తూ, అతన్నిప్పుడెవరూ రక్షించ లేరని నిందిస్తారు. అలా భయంలేకుండా మాట్లాడుతున్న ఆ అవివేక శూన్యులైన మూఢులపై కోపించి, మండుతూ, హుమ్మనగానే, ఆయన క్రోధాగ్నిలో కాలిపోయిన వారందరూ ఒక్కసారిగా బూడిదయ్యారు".


(జంబువు, ప్లక్షం, శాల్మలి, కుశం, క్రౌంచం, శాకం, పుష్కరం అనే సప్త ద్వీపాలే వున్నాయని కొందరు, కాదు తునకలై అవి నవద్వీపాలయ్యాయని మరికొందరు, మరిన్ని తునకలై పద్దెనిమిదయ్యాయని ఇంకొందరంటారు. బ్రహ్మ దినానికి-ఒక్క రోజుకు కల్పం అని పేరు. ఆ దినం అయిపోయింతర్వాత ప్రళయం వస్తుంది. బ్రహ్మ ప్రతి కల్పంలో మళ్లీ-మళ్లీ సూర్యచంద్రాదులను సృష్టిస్తుంటాడు. ఒక కల్పంలో జరినట్లే ఇంచుమించు కొంచెం తేడాతో ప్రతి కల్పంలో జరుగుతుంది. ప్రకృతి స్థితి గతులన్నీ ఒకే విధంగా వున్నా, జీవులు మాత్రం మారుతుంటారు. గతించిన కల్పంలోని సూర్యచంద్రాదుల వలెనే ఆకారాలు కలిగి, అవే పనులను చేస్తుంటారు. ఆ కల్పంలోని సూర్యుడి జీవాత్మ తర్వాత కల్పంలోని సూర్యుడి జీవాత్మ ఒకటి కాదు. ఆ జీవాత్మకు ఉన్నతమైన స్థానం దొరికి, ఆ స్థానంలోకి అర్హులైన మరొకరు వస్తారు. ఉద్యోగికి ప్రమోషన్ వచ్చినట్లే ఇది కూడా). 

No comments:

Post a Comment