Monday, September 17, 2018

అతిగా మాట్లాడిన అమిత్ షా : వనం జ్వాలా నరసింహారావు


అతిగా మాట్లాడిన అమిత్ షా
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (18-09-2018)

          భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ మహానగరానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా, అదేంటో కాని పాపం, పూనకం పట్టిన వ్యక్తిలాగా మాట్లాడుతుంటాడు. గతంలో ఒకసారి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చేసిన అర్థం-పర్థం లేని వ్యాఖ్యలకు, అవాకులు-చవాకులకు,  తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి,  ఘాటుగా-సూటిగా స్పందించి తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన తరువాత, ఇన్నాళ్లూ ఉలుకూ-పలుకూ లేకుండా, కిక్కురుమనకుండా, మళ్లీ తటాలున ప్రత్యక్షమై అదే తరహాలో అష్టావధానంలో అప్రస్తుత పృచ్చకుడి మాదిరి ప్రసంగం చేసాడు మహబూబ్ నగర్ బహిరంగ సభలో.

రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేయాల్సిన అవసరం ఏమిటనీ, ముందస్తు ఎన్నికలు ఎందుకనీ, ప్రజలపై కోట్ల రూపాయల భారం పడుతుందనీ, కుటుంబ పాలననీ, కేసీఆర్ రాజకీయ స్వార్థమనీ, కేంద్రం ఇప్పటిదాకా 2.3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందనీ (ఒక వేళ ఇచ్చింది నిజమైనా ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం నుండి రావాల్సిన నిధులే అవి కానీ దానధర్మం ఇచ్చింది కాదనేది తెలసిన విషయమే!!).....ఇలా ఏవేవో మాట్లాడారు బాజాపా అధ్యక్షుడు అమిత్ షా. గతంలో కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిందని షా చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా గణాంకాలతో సహా తిప్పికొట్టిన సంగతి మర్చిపోయారేమో ఆయన పాపం. ఎన్నికల మానిఫెస్టో హామీలను కూడా నెరవేర్చలేదని మరో అబద్ధం చెప్పాడు. భారతదేశంలో అతి ఎక్కువ కాలం కేంద్రంలో పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ కాని, బాజాపా పార్టీ కాని, ఏనాడూ అవి చేసిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేసిన పాపాన పోలేదనేది నూటికి నూరుశాతం వాస్తవం. మొట్టమొదటి సారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ  ప్రభుత్వం మాత్రం, ఎన్నికల హామీలు కేవలం నూటికి నూరు శాతం నెరవేర్చడమే కాకుండా, ఎన్నికల్లో హామీ ఇవ్వని 72 పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేసింది. అంటే 172% మానిఫెస్టో హామీల అమలు అన్న మాట, తెలుసా అమిత్ షా జీ?

         శాసనసభ రద్దుకు సిఫార్సు, ముందస్తు ఎన్నికకు పోవాలన్న నిర్ణయం విషయంలో అమిత్ షా వ్యాఖ్యలు సరైనవి కానేకాదు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా ఆయన తెలుసుకునేలా చెప్పాల్సింది కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోవడమనేది నూటికి నూరు పాళ్లు రాజ్యంగ బద్ధం, న్యాయ బద్ధం, సహేతుకమనే సంగతి. ఇదేదో, భారత దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా, కేసీఆర్ ఒక్కడే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, శాసన సభ రద్దుకు సిఫార్సు చేసి, ముందస్తు ఎన్నికలు పెట్టమని కోరి, ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నట్లు షా మాట్లాడడం విడ్డూరం. ఇన్నాళ్ళు రాజకీయాల్లో వున్న వ్యక్తి, అపార రాజకీయ అనుభవం వున్న వ్యక్తి, దేశంలో ఎప్పుడేం జరుగుతున్నదో తెలియనంత, తెల్సుకోలేనంత అమాయకుడు అమిత్ షా ఎలా అయ్యాడో అర్థం కావడం లేదు.

భారత దేశ చరిత్రలో (చట్ట సభలను) లోక్ సభను కానీ, రాష్ట్ర శాసన సభలను కానీ రద్దు చేయమని కోరడం, ముందస్తు ఎన్నికలకు పోవడం, అలా కోరుతూ కేంద్రంలో రాష్ట్రపతికీ, రాష్ట్రంలో గవర్నర కూ సిఫార్సు చేయడం, ఏదో ఒకటీ-అరా రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కాదు. నేటి బీజేపీ ప్రధాని మోడీ నుండి, నాటి బీజేపీ ప్రధాని వాజపాయీలతో సహా దాదాపు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఈ చర్యకు పాల్పడ్డ వాళ్లే. ఇందిరా గాంధీ, బీజేపీ భాగస్వామిగా వున్న అలనాటి మొరార్జీ సారధ్యంలోని జనతా ఈ పాపానికి (ఒకవేళ పాపమే అయితే) ఒడిగట్టినవే కదా? “నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా”!!!

భారతదేశంలో చట్టసభల పూర్తి కాలం ఐదేళ్లు అనేది రాజ్యాంగపరంగా వుంది. అది అందరికీ తెలుసు. అదే రాజ్యాంగంలో, ఆర్టికల్ 85, 174 ప్రకారం, కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ వారి-వారి పరిధిలోని మంత్రిమండలి సలహా మేరకు, విధిగా, ముందస్తుగా చట్టసభలను రద్దు చేసే అధికారం వుందనే చిన్న సంగతి అమిత్ షాకు తెలియదా? అలా చేయడం నేరమా? అలాంటప్పుడు శాసనసభ రద్దుకు సిఫార్సు చేసి 9 నెలలు ముందుగా ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్తున్నారని అమిత్ షా ప్రశ్నించడంలోని ఔచిత్యం ఏమిటి? తన ప్రశ్నకు కేసీఆర్ జవాబు చెప్పాలని అమిత్ షా అడగడం కన్నా కేసీఆర్ చేసిన దాంట్లో తప్పేంటో జవాబు చెప్పడం అమిత్ షా కనీస ధర్మం. ఇటీవల కాలం వరకూ, ఒకానొక సందర్భంలో, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముందస్తుగా ఎన్నికలకు పోదామని ఆలోచిస్తున్నాడని భాజపా వర్గాల సమాచారంగా పత్రికల్లో వార్తలు రాలేదా? చట్ట సభల్లో మెజారిటీ-అదీ సంపూర్ణ మెజారిటీ వున్న సభా నాయకుడు, అవి రాజకీయ కారణాలే కావచ్చు, పాలనాపరమైన అవసరాలే కావచ్చు, మరేదైనా కావచ్చు, ముందస్తుగా ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకోవడం పూర్తిగా ఆయన ఇష్టా-ఇష్టాలపై ఆధార పడి వుంటుంది. రాజ్యాంగం దీనికి వెసలుబాటు కల్పించింది. దీంట్లో అభ్యంతరం చెప్పాల్సింది ఏముంది?

ఒక్కసారి గత చరిత్ర తిరగేసుకుంటే కొన్ని చారిత్రిక సత్యాలు వెలుగులోకి వస్తాయి. ఈ విషయాలు అమిత్ షాకు తెలియదని కాదు....కానీ, మళ్లీ ఒక్కసారి గుర్తు చేద్దామనే. 1957, 1962, 1967, 1989 సంవత్సరాలలో ఏర్పాటైన లోక్ సభలు పూర్తికాలం పనిచేశాయి. మొట్టమొదటి సారిగా 1970 సంవత్సరంలో ఒక సారి, ఎమర్జెన్సీ అనంతరం 1977 సంవత్సరంలో రెండో సారి, నాటి ప్రధాని ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు, ముందస్తుగా లోక్ సభలు రద్దయ్యాయి. నాల్గవ లోక్ సభ 1967 లో ఏర్పాటయింది. బహుశా జమిలి ఎన్నికలు పూర్తి స్థాయిలో జరిగింది చివరిసారిగా అప్పుడే. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం జరిగిన మొదటి ఎన్నికలు కూడా అవే. ఎన్నికలు జరిగేనాటికి, అప్పటికి సుమారు ఒక ఏడాదిగా ఇందిరాగాంధీ ప్రధానిగా వుంది. తమ చేతిలో ఇందిరాగాంధీని కీలుబొమ్మగా వుంటుందని కాంగ్రెస్ సిండికేట్ భావిస్తున్న రోజులవి. అంతకు ముందువరకూ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో తిరుగులేని పార్టీగా వున్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.

గత లోక్ సభ కంటే సుమారు 80 స్థానాలు తగ్గాయి ఆ పార్టీకి. ఆరు రాష్ట్రాల్లో అధికారం కూడా కోల్పోయింది. పార్టీలో ఇందిరాగాంధీకి, ఆమె వ్యతిరేకులకు మధ్య ఆధిపత్య పోరు ఆరంభమై, 1969 సంవత్సరంలో, పార్టీ నిలువునా చీలింది. అసలే తక్కువ స్థానాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ, మరో 30 మంది సభ్యులను వ్యతిరేక వర్గంలోకి కోల్పోవాల్సి వచ్చింది. ఒక విధంగా ప్రభుత్వం పార్టీ పరంగా మైనారిటీలోకి పడిపోయి, ప్రాంతీయ పార్టీల మద్దతుమీద ఆధారపడవల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో సభలో మెజారిటీ చూపించి, రద్దుకు సిఫార్సు చేసింది ఇందిరాగాంధీ. 1971 లో జరిగిన ఎన్నికల్లో, మూడొంతుల మెజారిటీతో, అఖండ విజయం సాధించింది. కాకపొతే, ఆ టర్మ్ లోనే ఎమెర్జెన్సీ విధించడం, సభా కాలాన్ని పొడిగించడం, తిరిగి సభను రద్దు చేసి 1977 సంవత్సరంలో ఎన్నికలకు పోవడం చరిత్ర ఎరిగిన సత్యం.

         ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. చట్ట సభల రద్దుకు రాజ్యాంగం అనేక రకాల వెసలుబాటు కలిగించింది. తెలంగాణ సీఎం ఆ వెసలుబాటును ప్రగతి రథ చక్రాలు ఆగకుండా పాలన సాగడానికి ఉపయోగించుకుంటుంటే, కాంగ్రెస్, బాజాపా (జనతాలో భాగస్వామిగా) పార్టీలు రాజకీయ అవసరాలకు గతంలో వాడుకున్నాయన్న సంగతి జగద్విదితం. ఇందిరాగాంధీని, ఎమర్జెన్సీ నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో, జనతా పార్టీ ఓటమికి గురిచేసింది. 1977 లో అధికారంలోకి వచ్చిన (జనసంఘ్ పేరుతో వున్న బాజాపా భాగాస్వామ్యంలోని) జనతా పార్టీ, ఒక్క కలం పోటుతో, తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వాల నాయకత్వంలోని శాసన సభలను రద్దు చేయించింది. అది ముమ్మూర్తులా రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం. అలాంటిది కాదు కదా ఇప్పుడు ఇక్కడ తెలంగాణాలో జరిగింది? జనతా పార్టీ చేసిన నిర్వాకమే ఇందిరాగాంధీ రెండవ విడత అధికారంలోకి రాగానే చేసింది.


         జనతా పార్టీ విచ్చిన్నమై పోవడంతో, బాజాపా ఆవిర్భవించిన కొత్త రోజుల్లో, 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోమారు అఖండ విజయం సాధించింది. కాకపోతే జనతా ప్రభంజనంలో మూడేళ్ళ క్రితం అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వాలతో ఆమె తనకు చిక్కు వచ్చిందని భావించింది. ఆమె అనుకున్న పనులు చేయాలంటే రాజ్యసభలో కూడా మెజారిటీ కావాలనుకుంది. తన నమ్మకస్తులను కాంగ్రెసేతర ప్రభుత్వాల పార్టీలనుండి వలసలకు ప్రయత్నం చేసింది. ఆ రాష్ట్రాలలో తన ప్రభుత్వాలు రావాలని పాచిక పన్నింది. బీహార్, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, తమిళ నాడు, మహారాష్ట్ర, రాష్ట్రాలలో, గతంలో జనతా పార్టీ చేసిన విధంగానే, ఆ బాటలోనే, ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాసన సభలను రద్దు చేయించి, ఎన్నికలు జరిపించి, విజయం సాధించింది. Bottom of Form

కారణాలు ఏవైనా, 1979 లో జనతాపార్టీ అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో, నాటి ప్రధాని చరణ్ సింగ్ (మెజారిటీ పార్టీ నాయకుడు కాకపోయినా) సిఫార్స్ మేరకు లోక్ సభ రద్దయింది. ఇక 2004 సంవత్సరంలో, నాటి ప్రధాని వాజపాయీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, ముందస్తుగా లోక్ సభను రద్దు చేయాలని సిఫార్సు చేసాడు. అది ఆయన ఇష్టమే కాని తప్పని అమిత్ షా ఇప్పుడు అనగలడా? వాస్తవానికి అలనాటి వాజపాయీ రద్దు, ముందస్తు నిర్ణయం జాతీయ అవసరాల దృష్ట్యా కానే కాదు. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘర్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం నేపధ్యంలో, రాజకీయ అవసరాలను, అవకాశవాదాన్ని పరిగణలోకి తీసుకునే వాజపాయీ ముందస్తు నిర్ణయం తీసుకోలేదా?

గుజరాత్ ఉదాహరణ మర్చిపోయాడా అమిత్ షా? జులై నెల 2002 లో మత ఘర్షణల నేపధ్యంలో రాత్రికి-రాత్రే అలనాటి శాసనసభను రద్దు చేయమని మోడీ కోరలేదా? అప్పట్లో ఎన్నికల సంఘం అభ్యంతర పెట్టినా, కేంద్రంలో అధికారంలో వున్న బాజాపా పార్టీ అండదండలతో రద్దుకు పూనుకోలేదా మోడీ? అది ఆయన అవసరం. తప్పు కాదా మరి?

ప్రజాస్వామ్య వ్యవస్థకు మాతృకగా యావత్ ప్రపంచం భావిస్తున్న ఇంగ్లాండ్ లో ముందస్తు రద్దు అనేది సర్వ సాధారణ విషయం. గత 200 సంవత్సరాలలో అనేక పర్యాయాలు అలా జరిగింది కూడా. ఒక సారి 1910, 1911 సంవత్సరాలలో వెంట-వెంట బ్రిటీష్ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్ రద్దు చేయాల్సి వచ్చింది. ఎడ్వర్డ్ హీత్ 1974 లో సభను రద్దు చేసిన వెంటనే, అదే సంవత్సరం కొద్ది నెలల వ్యవధిలో, హెరాల్డ్ విల్సన్ రద్దుకు సిఫార్స్ చేశాడు.

            భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్ట సభల రద్దుకు రాజ్యంగ పరమైన రక్షణ వుంది. అది ఎవరూ కాదనలేని నగ్న సత్యం. తెలంగాణ విషయంలో, ఒక మెజారిటీ పార్టీ నాయకుడిగా, చట్టసభలో పూర్తి మెజారిటీ వున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ సభ రద్దుకు సిఫార్సు చేయడం, దాన్ని గవర్నర్ ఆమోదించడం, ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు జరగడం, అన్నీ రాజ్యంగ బద్ధంగా జరుగుతున్నవేనండీ అమిత్ షా గారూ!!! ఎందుకు మీకింత ఆగ్రహం?

1 comment:

  1. Why don't you join TRS. Disgusting and hollow argument to support the wasteful totally avoidable early polls. It should never be at the whims and fancies of a person. Leave alone Amit Shah. As a common man I don't see a single valid reason for early polls. I respect kcr for some of the projects he has undertaken. Can never support such unilateral autocratic decisions.

    ReplyDelete