Monday, September 24, 2018

మానిఫెస్టోలతో తస్మాత్ జాగ్రత్త : వనం జ్వాలా నరసింహారావు


మానిఫెస్టోలతో తస్మాత్ జాగ్రత్త
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (25-09-2018)

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ రద్దు నిర్ణయం దరిమిలా, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంతవరకూ అందుబాటులో వున్న సమాచారం మేరకు, ఈ ఏడాది నవంబర్ చివర్లోనో, లేదా డిసెంబర్ మొదటి వారంలోనో ఎన్నికలు జరగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సమాయుత్తమవుతూనే తమ-తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక రచనలో నిమగ్నమవుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి, ఆ పార్టీ విధి-విధానాలకు అనుగుణంగా దాని లక్ష్యాలను, ఆశయాలను విశదీకరించేదే ఎన్నికల ప్రణాళిక-మానిఫెస్టో. ఇది ఒకరకంగా ఒక వ్రాతపూర్వకమైన వేదిక, ఒక పకడ్బందీ డిజైన్, ఒక విధానం, ఒక మార్గదర్శని, ఒక సిద్దాంతం. ఎన్నికల అనంతరం ప్రజలు గెలిపించిన పార్టీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వ పరంగా ఆ పార్టీ ఏమేం చేయబోతున్నదో చెప్పే ఒక సైద్ధాంతిక ప్రకటన మానిఫెస్టో. పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ పూర్వాపరాలు ఎన్నికల ప్రణాళిక ద్వారానే తెలుసుకునే అవకాశం వుంది ఓటర్లకు. పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలలో ఏది ప్రజలకు మంచి చేయగలదో విశదీకరించే ఎన్నికల ప్రణాళిక అంశాల ఆధారంగానే ఓటర్ ఎవరికి ఓటు వెయ్యాలనే విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతాడు. ఏదేమైనా ఎన్నికల ప్రణాళిక రాజకీయ వాగ్దానాల సమగ్ర పట్టిక.

ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట లక్ష్యాలతో కూడి, అమలు చేయడానికి సాధ్యపడే వాగ్దానాలతో, వాస్తవాలకు చేరువగా, ఒక సహేతుకమైన కాలపరిమితిలో నెరవేర్చగల అంశాల పట్టికే మానిఫెస్టో. నెరవేర్చడానికి, అమలుచేయడానికి అనువుగా లేకుండా, ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి, ఓటర్లను మభ్యపెట్టడానికి ఉద్దేశించిన మానిఫెస్టోలకు ప్రజాక్షేత్రంలో ఆస్కారం వుండకూడదు. అలాంటివి ప్రజల ముందుకు రానీయకూడదు. ఎన్ని రాజకీయ పార్టీలు, మానిఫెస్టోల కూర్పుల విషయంలో, న్యాయబద్ధంగా, సహేతుకంగా, ప్రజలపట్ల నిబద్ధతతో వుంటాయనేది జవాబు దొరకని ప్రశ్న.

తెలంగా రాష్ట్ర సమితి లాంటి ఏవో కొన్ని రాజకీయ పార్టీలు మినహాయిస్తే, చాలా మటుకు, దురదృష్ట వశాత్తు, నెరవేర్చవీలుకాని, అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చని అంశాలనే ఎన్నికల వాగ్దానాలుగా మానిఫెస్టోలో చేరుస్తున్నాయి మెజారిటీ రాజకీయ పార్టీలు. టీఆరెస్ మాత్రం, ఉదాహరణకు, 2014 ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను వందకు వందశాతం నెరవేర్చడమే కాకుండా చేయని వాటినెన్నో పథకాలుగా మలచి, ప్రకటించి,  అమలు చేయడం జరిగింది. ఎన్నికల తదనంతరం తమ పార్టీ చేసిన మానిఫెస్టోలోని ఎన్నికల వాగ్దానాలాను, హామీలను పరిపూర్ణంగా విస్మరిస్తున్న ఈ రోజుల్లో, కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి దానికి భిన్నంగా వాగ్దానాల అమలే ధ్యేయంగా పథకాల రూపకల్పన-అమలు చేయడం జరిగింది. కేసీఆర్ అనునిత్యం మానిఫెస్టో కాపీని ఒక పవిత్రమైన పుస్తకం  లాగా తనవద్ద వుంచుకుని మరీ పథకాల రూపకల్పన చేశారు. తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం చేసి, దాన్ని సాధించి, ఎన్నికల బరిలో దిగి, మానిఫెస్టోను ప్రజల అవసరాలకు అనుగుణంగా తయారుచేసి, ప్రజల తీర్పు పొంది, ప్రభుత్వం ఏర్పాటుచేసి, ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారు. ఈ సారికూడా మళ్లీ అదే జరగబోతుందనడంలో అతిశయోక్తి లేదేమో!!! 

ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అదిచేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిందా? లేదా? అనే విషయంలో పట్టించుకునే నాధుడెవరూ లేరు. రాజ్యంగ పరంగా గణనీయమైన విశేష అధికారాలున్న, పటిష్టమైన రాజ్యంగ వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘం కూడా, ఇటీవలి కాలం వరకూ, అదికూడా అంతంత మాత్రంగానే, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఎన్నికల ప్రణాళికలో అసంబద్ధమైన వాగ్దానాలు చేయొద్దని చెప్పడంలో రాజకీయ పార్టీలను ఒప్పించలేక, నియంత్రించలేక పోతున్నది ఎన్నికల సంఘం. అలా చేస్తే ఓటరును తప్పుదోవ పట్టించినట్లవుతుందని, పట్టించతగదని కూడా ఈసీ చెప్పలేకపోతున్నది. ఇది మారాలి.

జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రతినిథులతో ఆగస్ట్ 2013 లో ఎన్నికల సంఘం చర్చలు, సంప్రదింపులు జరిపిన దరిమిలా, ఎన్నికల మానిఫెస్టోలకు సంబంధించి కొన్ని సూచనలు, ఆదేశాలు, మార్గదర్శకాలు విడుదలచేసింది ఈసీ. పారదర్శకత దృష్ట్యా, పార్టీ స్థాయికి తగ్గ విధంగా, చేసిన వాగ్దానాలలో విశ్వసనీయత వుండాల్సిన అవసరం నేపధ్యంలో, మానిపెస్టోలో చేసే వాగ్దానాలు అమలు చేయడానికి పడే ఆర్ధిక భారం పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది. చేసిన వాగ్దానాలు అమలు తీరుతెన్నులను కూడా ఎన్నికల ప్రణాళికలో వివరించాల్సిన అవసరం గురించి ఈసీ పేర్కొన్నది. ఓటర్ల మద్దతు నెరవేర్చగల వాగ్దానాల ఆధారంగా మాత్రమే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓట్లు కోరాలని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యంగా విరుద్ధమైన, రాజ్యంగ స్ఫూర్తికి, ఆశయాలకు వ్యతిరేకంగా ఎలాంటి అంశం కూడా మానిఫెస్టోలో పేర్కొనకూడదని ఈసీ నిబంధన పెట్టింది. అంతవరకూ బాగానే వుంది కానీ, దాని ఆదేశాలు అమలు చేయించడం ఎలా అనేది ఆలోచన చేసినట్లు లేదు.

రాజకీయ పార్టీల ప్రతినిథులతో ఈసీ సమావేశం కావడానికి నేపధ్యం, అంతకు కొద్ది రోజుల క్రితం, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో, ఎన్నికల సంఘాన్ని ఆదేశించడమే. ఎన్నికల సంఘం మానిఫెస్టోల విషయంలో మార్గదర్శకాలను రూపొందించి, దాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగం చేయాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ప్రజలను-ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల ప్రణాళికలో వివిధ రకాల తాయిలాలను ప్రకటించి, “అది చేస్తాం...ఇది చేస్తాం....కొండమీద కోతిని ఇస్తాం....హిందూ మహాసముద్రం పూడ్చి ఇళ్ళు నిర్మిస్తాం” అని చెప్తే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, స్వేచ్చగా ఎన్నికలు జరగడానికి వీల్లేకుండా వుంటుందని సుప్రీం కోర్టు తీర్పులో అభిప్రాయపడింది.

ఈ నేపధ్యంలో, ఎన్నికల సంఘానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో, మానిఫెస్టో అంశాల విషయంలో మార్గదర్శకాలు రూపొందించి, వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పొందుపరచాల్సిందిగా పేర్కొన్నది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, మానిఫెస్టోలకు సంబంధించి, రాజకీయ పార్టీలను సరైన పద్ధతిలో నియంత్రించే రీతిలో, చట్టసభలు ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇంతైనా దీని విషయంలో పెద్దగా పురోగమనం లేదింతవరకూ.

ఎన్నికల సంఘం ఏ ఒకటి-రెండు సార్లో తప్ప ఎప్పుడూ మానిఫెస్టో అంశాలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీనీ ఆక్షేపించిన దాఖలాలు అంతగాలేవు. ఒకసారి, 2016 సంవత్సరం జరిగిన తమిళ నాడు ఎన్నికల్లో, ఏఐడీఎంకే, డీఎంకే పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. బహుశా అలా చేయడం అదే మొదటిసారి (చివరిసారి కూడా కావచ్చు!). మానిఫెస్టోల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఆ రెండు పార్టీలు గణనీయంగా పాటించలేదని, దానికి కారణాలేమిటని నోటీసులో ఈసీ ప్రశ్నించింది. వాళ్ల మానిఫెస్టోలలో పేర్కొన్న వాగ్దానాల నిబద్ధతను,  హేతుబద్ధతను శంకిస్తూ, అవి అమలు కావాలంటే పడే ఆర్ధిక భారం ఎలా సమకూర్చుకోవచ్చో వివరణ కోరింది. చివరకు కథ అంతం కావడం మినహా పెద్దగా ఒరిగిందేమీ, జరిగిందేమీ లేదప్పుడు.


ఎన్నికల సమయంలో మానిఫెస్టోల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానమే. తమ పార్టీ విధి-విధానాలను, కార్యక్రమాలను, అమలు చేయదలచుకున్న పథకాలను  విస్తారంగా సూచిస్తే ఎవరికీ ఏ అభ్యంతరం వుండకూడదు. అలా కాకుండా ఒక విపరీత దృక్పదంతో-ధోరణితో, ఆచరణ సాధ్యం కాని, అనైతిక వాగ్దానాలు చేసి, తద్వారా ఓటర్లను మభ్యపెట్టి, తప్పుతోవ పట్టించి, అధికారం మీద కన్నేసి, అధికారంలోకి వచ్చిన తరువాత తమ వాగ్దానాలను మర్చిపోయే పార్టీలమీద నియంత్రణ వుండి తీరాలి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏదైనా పార్టీ గతంలో అధికారంలో కనుక వుండి వుంటే, ఆ పార్టీ ఏ మేరకు దాని ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిందో విశ్లేషణ జరగాలి. నెరవేర్చక పోయినట్లయితే ఒక రకమైన జరిమానా లాంటిది విధించే వెసలుబాటు వుండాలి. కనీసం, అధమపక్షం, గతంలో ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చని పార్టీ, దరిమిలా వచ్చే ఎన్నికల్లో పోటీలో వున్నప్పుడు, అది ప్రకటించే ఎన్నికల మానిఫెస్టోను ఎన్నికల సంఘం లాంటిది లోతుగా పరిశీలన చేసి, అంగీకరించిన తరువాతే విడుదలకు ఒప్పుకోవాలి.  

ముందస్తుగా ఎన్నికల ప్రణాలికల పరిశీలన అమల్లో వున్న దేశాలున్నాయి. ఉదాహరణకు, భూటాన్ దేశంలో రాజకీయ పార్టీలు ముందస్తుగా తమ ఎన్నికల ప్రణాలికలను ఎన్నికల సంఘం పరిశీలనకు, ఆమోదానికి పంపాలి. దేశ సమగ్రత, సమైక్యత లాంటి వాటికి భంగం కలిగే అంశాలేమన్నా వుంటే వాటిని వడపోసి, తీసేసిన తరువాతే మానిఫెస్టోకు ఆమోదం తెలుపుతుంది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో అనైతిక గెలుపుకోసం పాటుపడే ఎలాంటి అంశాలున్నా, అమలు సాధ్యపడనివి వున్నా, మతపరమైన వ్యతిరేకాంశాలున్నా వాటిని తొలగించడం జరిగేది.

ఇంగ్లాడు దేశంలో కూడా ఎన్నికల ప్రణాళిక విషయంలో మార్గదర్శకాలున్నాయి. బ్రిటీష్ ఎన్నికల్లో మానిఫెస్టో ప్రకటన కార్యక్రమం పెద్ద ఎత్తున అట్టహాసంగా నిర్వహిస్తాయి రాజకీయ పార్టీలు. అదొక కీలక ఘట్టంగా భావిస్తాయి రాజకీయ పార్టీలు. రాబోయే ప్రభుత్వ ఎజెండా ఎన్నికల ప్రణాళిక రూపంలో ఓటర్ల ముందుకు వస్తుంది. దాన్ని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విధిగా అమలు చేసి తీరాల్సిందే. బ్రిటీష్ రాజకీయ వ్యవస్థలో మానిఫెస్టోలకు ఒక రకమైన పాక్షిక రాజ్యాంగ ప్రతిపత్తి వుంది. బ్రిటీష్ పార్లమెంట్ దిగువ సభ ఐన హౌజ్ ఆఫ్ లార్డ్స్, ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాన్ని వ్యతిరేకించరాదని, రాజ్యంగా బద్ధమైన సాలిస్బరీ కన్వెన్షన్ నిబంధన విధించింది. బ్రిటన్లో ఎన్నికల మానిఫెస్టోకు అంత శక్తి, అధికారం వుంది.

ఏదేమైనా, ఓటర్లు ఎవరూ, ఏ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాలికనూ క్షుణ్ణంగా చదవరు. మీడియాలో క్లుప్తంగా వచ్చిన సారాంశాన్ని మాత్రమే చదువుతారు. వాస్తవ దృక్ఫదంతో వ్యవహరించే తెరాస లాంటి ఒకటీ-అరా పార్టీలు మినహాయిస్తే, మిగతా అన్ని మానిఫెస్టోల సారాంశం దాదాపు ఒకే విధంగా వుంటుంది.

అధికారంలో వున్న ప్రభుత్వం వంద రూపాయలు అంటే, అధికారం కోసం అర్రులు చాచే పార్టీ రెండు వందలనడం, వెయ్యి అంటే రెండువేలనడం, బియ్యం ఆరు కిలోలు ఇస్తుంటే ఏడు అనడం, సిల్లీగా, బాధ్యతా రాహిత్యంగా వాగ్దానం చేయడం లాంటి వాటితో అరచేతిలో వైకుంఠo చూపించే రాజకీయ పార్టీల విషయంలో ఓటర్లు అప్రమత్తంగా వుండకపోతే నష్టపోయేది వారే. తస్మాత్ జాగ్రత్త!!!

1 comment:

  1. Why kcr's early polls should be condemned. https://m.rediff.com/news/column/why-kcrs-early-poll-call-must-be-condemned/20180925.htm

    ReplyDelete