Thursday, September 27, 2018

విశ్వసనీయతే తెరాసకు శ్రీరామరక్ష : వనం జ్వాలా నరసింహారావు


విశ్వసనీయతే తెరాసకు శ్రీరామరక్ష
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-09-2018)

స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తొలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించినా అనుకున్నది సాధించలేక పోయారు. దానికి కారణాలు అనేకం వుండి వుండవచ్చు. ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది అలానాటి కాంగ్రెస్ పార్టీ, దాని సారథి ఇందిరాగాంధీ. ఉద్యమానికి కొంత విరామం దొరికిన తదుపరి, 1971 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో, ఉద్యమం నడిపిన చెన్నారెడ్డి సారధ్యంలోని తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని 11 లోక్ సభ స్థానాలకు గాను 10 గెల్చుకుంది. అయినా నాటి కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాల పర్యవసానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. అలనాడు తెలంగాణ ఏర్పాటుకాకపోవడానికి ఏకైక కారణం కాంగ్రెస్ పార్టీనే. అదే జరక్కపోతే, ఎన్నడో...ఏనాడో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేది.

తొలిదశ ఉద్యమం ముగిసిన మూడు దశాబ్దాలకు మలిదశ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక బలీయమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసి, మహత్తరమైన శాంతియుత ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి, దానికి నాయకత్వం వహించి, 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఉద్యమాన్ని ఒక కీలక మలుపు తిప్పి, ప్రాణత్యాగానికి సిద్ధమయ్యి, చివరకు విజయతీరాలకు చేర్చి, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తొలిదశ ఉద్యమ సందర్భంగా రాష్ట్రం ఏర్పాటు చేయలేదో...చేయడానికి నిరాకరించిందో, అదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మరీ తెలంగాణాను సాధించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తప్పని పరిస్థితుల్లో, విధిలేక సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందే కాని, మనసా-వాచా-కర్మణా కాదనేది జగమెరిగిన సత్యం. ప్రజాబలం ముందర తలవంచక తప్పలేదు.

తెలంగాణ ఉద్యమంలో తెరాస పాత్ర లేదనేవారికి, తెలంగాణ ఏర్పాటు కేవలం కాంగ్రెస్ పార్టీ చలవ వల్లే అనే వారికి, 13 ఏళ్ల కేసీఆర్ నాయకత్వంలోని సుదీర్ఘ పోరాటం కనబడక పోవడం, దాని ప్రభావం అర్థం చేసుకోక పోవడం, వారి విజ్ఞతకే వదలాలి. తమ ఉద్యమనాయకుడి పట్ల సహజంగానే అచంచల విశ్వాసం చూపించి, ఏ విధంగానైతే ఉద్యమాన్ని విజయవంతంగా నడిపారో, అదే రీతిలో, రాష్ట్ర భవిష్యత్ మహోన్నతంగా తీర్చిదిద్దాలని, 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఘన విజయం చేకూర్చారు రాష్ట్ర ఓటర్లు. ఆ తరువాత, తెలంగాణ పేరుమీద ఇతర పార్టీల అభ్యర్ధులుగా పోటీ చేసి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, ఎప్పుడైతే  తమ పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదని అర్థం చేసుకున్నారో, రాజకీయ పునరేకీకరణలో భాగంగా, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి, తెరాసలో చేరడం జరిగింది. దరిమిలా రాజకీయ సుస్థిరతకు మార్గం సుగమమైంది.  
  
 ప్రజలు అప్పచెప్పిన గురుతర బాధ్యతను కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుండే భుజస్కందాలమీద వేసుకుంది. అశేష ప్రజావాహిని ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పథకాల రూపకల్పన, అమలు సాగింది. ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాల అమలు దిశగా వడి-వడిగా అడుగులు వేసింది. మానిఫెస్టోలొ చెప్పని పలు పతకాలను అమలు చేసింది. ఉమ్మడి రాష్ట్ర సమైక్య పాలనలో ఛిన్నా-భిన్నమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతినీ, యాసనూ, భాషనూ, వ్యవస్థనూ పునరుద్దరించుకుంటూ, పునర్నిర్మించుకుంటూ, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించడానికి ప్రభుత్వం నడుం బిగించింది.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న అణచివేత, దోపిడీ, నిర్లక్ష్యం వల్ల చోటుచేసుకున్న అవరోధాలను, ఒక పథకం ప్రకారం ఈ ప్రాంతాన్ని-ప్రాంత ప్రజలను నిర్వీర్యం చేయడానికి పన్నిన కుట్రలను, వాటి ప్రభావంతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా ఎదురైన అనేక సవాళ్లను, ధైర్యంగా ప్రణాళికాబద్దంగా అధిగమించింది తెరాస ప్రభుత్వం. ప్రతీప శక్తుల విఫల ప్రయత్నాలను అడ్డుకుంటూ, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ, కుట్రలను చేధించుకుంటూ తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబడింది. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రారంభమయిన ప్రస్థానానికి మొదటి నాలుగున్నరేళ్లలో బలమైన అడుగులు పడ్డాయి. మున్ముందు ఈ పథకాల అమలులో ప్రామాణీకరణ, ఏకీకరణ, స్థిరీకరణ జరుగుతే చాలు...ఇక భవిష్యత్ అంతా బంగారుతెలంగాణ మయమే!!! ఈ దశలో అక్కడక్కడా తొంగిచూస్తున్న రాజకీయ దౌర్బల్యతను, దుర్బలత్వాన్ని దీటుగా ఎదుర్కోవడానికీ, ప్రగతి రథ చక్రాలు ఆగిపోకుండా వుండడానికీ, శాసనసభ రద్దుకు, ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు కేసీఆర్, ఆయన మంత్రివర్గం.


ఒకవైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పరమావధిగా కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా పథకాల రూపకల్పన, అమలు కొనసాగిస్తున్నది. సమైక్య పాలనలో వారసత్వంగా సంక్రమించిన ఒక్కో సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతం అవుతున్నది. ప్రజోపయోగమైన పథకాల పుణ్యమా అని ప్రజలంతా ఇప్పుడు తమ భవిష్యత్తుపై ఎంతో భరోసాతో, ధీమాతో ఉన్నారు. ప్రభుత్వం, దాని సారథి కేసీఆర్ నాయకత్వంలో, మానిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఇచ్చిన వాగ్దానాల-హామీల ప్రాతిపదికగానే, సమగ్ర దృక్పథంతో అభివృద్ధికి ప్రణాళికలు రచించి, ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. చేసిన ఒక్కొక్క హామీని అమలు చేయడానికి ఒక్కో విభిన్నమైన ప్రణాలికా బద్ధ పతాకాన్ని రూపొందించింది.

మానిఫెస్టోలో ప్రకటించకున్నా సరే, ప్రజలకు అవసరమని భావించి, ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను ప్రవేశ పెట్టింది. వ్యవసాయ పెట్టుబడి అందించే రైతు బంధు, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకునే రైతభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ, ఆడపిల్ల పెండ్లికి సాయం అందించే కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, గర్భిణులకు ఆర్థిక సాయం అందించే కేసీఆర్ కిట్స్, ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు లాంటి మానిఫెస్టోలో ప్రకటించని 72 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం దేశంలో మరెక్కడా అమలు కాని ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ, నేడు దేశానికే మార్గదర్శిగా వుంది. రైతులకు ఎకరానికి 8వేల వ్యవసాయ పెట్టుబడి, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, హరితహారం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, టిఎస్ ఐపాస్, భారీ పరిపాలనా సంస్కరణలు, కేసీఆర్ కిట్స్, కంటివెలుగు, కుల వృత్తులకు చేయూత, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడింది. సకల రంగాలలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందింది.

ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని అనేకానేక కార్యక్రమాలు నేడు తెలంగాణలో జరుగుతున్నాయి. 40 వేలకోట్ల రూపాయలతో పలు సంక్షేమ పతకాలను అమలుచేస్తున్న ఈ రాష్ట్రానికి సంక్షేమ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దేశంలో నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా  నిలిచింది.  పుట్టినప్పటి నుండి గిట్టేవరకూ ప్రతీ సందర్భంలోనూ అందరినీ ఆదుకునే అనేక పథకాలను ప్రభుత్వం మానవతా దృక్ఫదంతో, నిబద్ధతతో అమలు చేస్తున్నది. క్లుప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను గుర్తుచేసుకుంటే, వాటిద్వారా లబ్దిపొందుతున్న వారు గుర్తుకురాక మానరు.

సంక్షేమ పథకాలు అందుకోవడానికి ఆదాయ పరిమితి పెంపు; వృద్దులకు, వితంతువులకు, గీతకార్మికులకు, నేత, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు, పేద వృద్ధ కళాకారులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు ఆసరా పించన్లు; కుటుంబంలోని ప్రతీ వ్యక్తికీ ఆరు కిలోలబియ్యం; విద్యార్థులకు సన్నబియ్యం; ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి , షాదిముబారక్ పధకం; ఓవర్సీస్ స్కాలర్ షిప్స్; జర్నలిస్టులు, హోంగార్డులు, డ్రైవర్లకు ప్రమాద బీమా; స్వయం ఉపాధి పధకాల కోసం  ఆర్థిక సాయం; ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి పద్దు; ఎస్సీలకు మూడెకరాల భూమి; ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు; మైనారిటీ సంక్షేమం కోసం భారీగా బడ్జెట్ కేటాయింపులు; కుల వృత్తులకు చేయూత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం; చేనేత కార్మికుల సంక్షేమం; బ్రాహ్మణుల, పాత్రికేయుల, లాయార్ల సంక్షేమం; రైతులకు రుణమాఫీ; రైతుబంధు, ఎకరానికి 8వేలు; అయుదు లక్షల రూపాయల రైతు బీమా; 24 గంటల ఉచిత విద్యుత్; భూ రికార్డుల ప్రక్షాళన; సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా, కల్తీ నిరోధం; మిషన్ భగీరథ; మిషన్ కాకతీయ; సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం; నిరుపేదలకు గృహనిర్మాణం పథకం; రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు; బస్తీ దవాఖానాల ఏర్పాటు; కంటి వెలుగు; కెసిఆర్ కిట్స్; ఉద్యోగుల సంక్షేమం; పారిశ్రామికాభివృద్ది....ఇలా చెప్పుకుంటూ పొతే వందాలాది పథకాలను విజయవంతంగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం.

అందుకే ఎన్నికల్లో పథకాల అమలు విశ్వసనీయతే తెరాసకు శ్రీరామరక్ష. విజయం తెరాసదే.

1 comment:

  1. మంచి చెడు రెంటిగురించి చెప్పకుండా ఈ చెక్క భజన ఏంది బయ్యా. ఉద్యమాన్ని గౌరవించి సోనియా గాంధి తెలంగాణా ఎర్పాటుకు రాజకీయంగా ఎంతో నష్టం జరిగినా సహాయం చేసారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిని కనీస గౌరవం లేకుండా బఫూన్ అనడం ఎంత దారుణం. ఎన్ని మంచి పనులు చేసినా నీచంగా అహంకారంతో మట్లాడటాన్ని ఒక్కసారైనా ఖండించావా బయ్యా నువ్వు. ఇదేనా నలభై యేళ్ళ జర్నలిజం

    ReplyDelete