Saturday, August 6, 2016

సీతాయాశ్చరితం మహత్! : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
సీతాయాశ్చరితం మహత్!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (15-04-2016)

శ్రీ రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. ఈ మూడింటి లో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. మన పూర్వీకులకు తెలియని నాగరికతలు లేవు. మన పూర్వులు ఏ కారణం వల్ల ఆర్యులయ్యారు? వారు ఎటువంటి గుణాలు కలిగి, ఎటువంటి మహోన్నత స్థితిలో వుండే వారు? వారి నాగరికత విధానం ఎటువంటిది? వారి కులా చార ప్రవర్తనలెలావుండేవి? రాజుకు-ప్రజలకు మధ్య ఐకమత్యం ఎలా వుండేది? భార్యా-భర్తలు, సోదరులు, తల్లి తండ్రులు, పుత్రులు పరస్పరం ఎలా ప్రవర్తించేవారు? సుఖ-దుఃఖాల విషయంలో స్త్రీ-పురుషులు ఏ విధమైన నడవడి గలవారు? వారికి దేవుడంటే ఎలాంటి ఆలోచన వుండేది? దైవాన్ని వారెలా ఆరాధిస్తుండే వారు? ఇలాంటి లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. ఏ విధంగా చదివినా, చదివిన తర్వాత, సమయాన్ని సద్వినియోగం చేశామన్న తృప్తినిచ్చేది రామాయణమే.

శ్రీ సీతారాముల పేరు విన్న ప్రతి ఆర్యుడు మనస్సులోనైనా భక్తితో నమస్కారం చేసుకోవాల్సిందే. ఇలా సీతారాములు సార్వజనీన సంపూజ్యులు కావడానికి కారణమేంటి? సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! ఎవరెవరు-ఏ ఏ పేరుతో పిలిచినా, భగవంతుడనేవాడు ఒక్కడే అని ఆర్యుల నమ్మకం. భిన్న-భిన్న రూపాల్లో దర్శనమీయడం భవత్‍కళా విశేషం. అలాంటి భగవంతుడే, శ్రీరాముడుగా, లోక రక్షణార్థం జన్మించాడన్న నమ్మకమే, లోకులందరు ఒకేవిధంగా శ్రీ సీతారాములను అర్చన చేయడానికి కారణమైంది.

"శ్రీ రామాయణం" అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకే మో వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీరాముడు భగవంతుడన్న అర్థం, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది.

అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు. వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో.

వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. ఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయి. 

వాల్మీకి రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. శ్రీ రామాయణ అంతరార్థాన్ని పెద్దలు ఇలా చెప్పుకుంటారు: భగవంతుడు ఒక్కడే పురుషుడు. తక్కిన దంతా స్త్రీ మయం అన్న నియమం ప్రకారం, సీతే జీవుడు. ఆ జీవుడు భగవంతుడిని ఆశ్రయించి వున్నంతవరకు ఎలాంటి ఆపదా కలగదు. కర్మవశాన దుర్భుద్ధితో, మాయా మయమైన ప్రకృతి పదార్థాల (మాయ జింక) మీద ఆసక్తి కలిగితే, మోక్ష సాధనానికి విరుద్ధమైన అలాంటి బుద్ధి మళ్లీ పుట్టకుండా చేయడానికి భగవద్వియోగం కలుగుతుంది. వెంటనే దేహ ప్రాప్తి (లంక) కలుగుతుంది. అందులోని రావణ-కుంభకర్ణులు అహంకార-మమకారాలు. ఏకాక్షి ప్రభృతులు ఇంద్రియాలు. అనుభవంతో బుద్ధిమంతులు కావల్సినవారు, వాటికి చిక్కి అవస్థ పడుతున్నప్పుడు, జీవుడికి వివేకం కలిగి-పరితపించడం ప్రారంభించి, తన మీద భగవంతుడికి దయ కలుగుతోందా-తన దగ్గరకు చేర్చుకుంటాడా, అని విలపిస్తారు (సీతా విలాపం). తనను ఆశ్రయించిన జీవుడు ఇలా అజ్ఞానం వల్ల కష్ట దశలో పడిపోయెగదా అని అత్యంత దయాళుడైన భగవంతుడు బిడ్డకొరకు తండ్రి దుఃఖించినట్లు, జీవుడికంటే ఎక్కువగా పరితపిస్తాడు (రామ విలాపం). జీవుడికి ధైర్యం కలగడానికి, భగవంతుడికి తనపై అనురాగం వుందని చెప్పి భయపడ వద్దని తెలియచేయడానికి ఆచార్యుడిని (హనుమంతుడు) పంపుతాడు. ఆచార్యుడు అక్కడకు (లంకకు) పోయి అతడి చేష్టలన్నీ తెలుసుకొని, ధైర్యం చెప్పి, మరల భగవంతుడితో జీవుడు అనన్య భక్తుడనీ-ఆయనే దిక్కని నమ్మినాడనీ (నియత-యక్షత), కాబట్టి భగవంతుడే కాపాడాలనీ వేడుకుంటాడు. భగవంతుడు ప్రతిబంధకాలను అణచివేసి, చిత్తశుద్ధి పరీక్షించి (సీత అగ్ని ప్రవేశం) మరల తన దగ్గర చేర్చుకుంటాడు. దానర్థం: అనన్యాసక్తుడై, దృఢ నిశ్చయంతో, జీవుడు భగవంతుడిని సేవిస్తుంటే, అతడికి కావల్సిందంతా భగవంతుడే నెరవేరుస్తాడు. సుందర కాండ చదివేటప్పుడు పాఠకులు తమను సీత గాను, శ్రీరాముడిని భగవంతుడి గాను భావిస్తే ఈ అర్థం స్పష్టంగా తెలుసుకోవచ్చు.

వాల్మీకి రామాయణంలో, సాధారణంగా, సర్గ మొదట్లో- చివర్లో, మొదలు చెప్పిన కథనే సంగ్రహంగా తిరిగి చెప్పడం జరిగింది. ఇది కాకుండా, యజ్ఞాలు-శకునాల లాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు, వర్ణించిన విషయాన్నే మరల వర్ణించాల్సి వస్తే, పూర్వోక్త శ్లోకాలనే మళ్లీ చెప్పడం జరిగింది. ఇలాంటిది ఆ కవి కవితా విశేషమే గాని మరొకటి కాదు. శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేదవ్యాసుడంతటి వాడు వాల్మీకి శ్లోకాలను అనువదించగా లేంది, వేరేవారి సంగతి చెప్పాలా ! ఎవరికైనా సత్కవి కావాలని కోరికుంటే, వారు వాల్మీకి రామాయణాన్ని అనేక పర్యాయాలు, శ్రద్ధగా-భక్తితో పఠించాల్సిందే.


 శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి.

సత్ ప్రభు లక్షణం తెలుసుకోవాలంటే, రామ-దశరథుల రాజ్య పాలనా విధానంలో దొరుకుతుంది. ఆర్య ప్రభువులు ఏ పని చేసినా ప్రజల అనుమతి లేకుండా చేయలేదు. తాము ప్రభుత్వం నడిపేది ప్రజలకొరకేనని, వారిని సుఖ పెట్టడానికేనని వారు భావించేవారు. ప్రత్యక్షంగానైనా-పరోక్షంగానైనా ప్రజలకు హాని కలిగించే పనేదీ చేయరు. శ్రీరాముడి పట్టాభిషేకం గురించి దశరథుడు చేసిన (అయోధ్య కాండ) ఉపన్యాసం ఇందుకో ఉదాహరణ. ప్రజల దగ్గర పన్నులు తీసుకుంటూ, వారి కష్టాలు తొలగించకపోతే నరకంలోకి పోతామని వారి నమ్మకం (అరణ్య కాండ).

ప్రభువైన వాడు ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, వేగులవారి ద్వారా, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవాలి. ప్రజలు ఇష్టపడని గుణాలు తనలో వుంటే, ఎంత నష్టమైనా-కష్టమైనా అవి మానుకోవాలి. ఆ విషయంలో రాజు అంతఃకరణం చెప్పింది ముఖ్యం కాదు. ఇతరులను సంతోష పెట్టడానికి తనెందుకు దుఃఖపడాలని అనకూడదు. ఈ విషయంలో రాముడే ప్రమాణం.

శ్రీరాముడు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒక నాడు వేగులవాడైన భద్రుడిని నగరంలో- పల్లెల్లో వార్తలేంటని, తమను గురించి ప్రజలేమనుకుంటున్నారని అడిగాడు. జవాబుగా వాడు, తనను లోకులందరూ ప్రశంసిస్తున్నారని చెప్తే, అంతటితో తృప్తి పడలేదాయన. ఉన్నదున్నట్లు-విన్నది విన్నట్లు అసలు విషయాలన్నీ చెప్పమంటాడు రాముడు. రాముడి గుణగణాలను చక్కగా అర్థం చేసుకుంటే, రాజుకుండవలసిన సద్గుణాలే కాకుండా, సాధారణంగా ప్రతి పురుషుడికి వుండాల్సిన, సత్యం-దయ-ఇంద్రియ నిగ్రహం-పితృభక్తి-ఏక పత్నీనియమం-సౌభ్రాత్రం-దైవ భక్తి-దేవతారాధనం-నిత్య కర్మానుష్ఠానం విపులంగా  ఆయనలో వున్నాయని తెలుసుకోవచ్చు.

ఉత్తమ స్త్రీల లక్షణాలన్నీ కలగనున్నవారిలా సీత, కౌసల్య, సుమిత్రల గుణాలను బట్టి, నీచ స్త్రీల లక్షణాలున్న వారిగా కైకేయి, శూర్పణఖల గుణాలను బట్టి తెలుసుకోవచ్చు. రావణాసురుడు చెడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తాయి రామాయణంలో. ఇంద్రియాలను జయించ లేకపోవడం, అసత్యాలు పలకడం, వేగుల వారు లేకపోవడం-వున్న వారికి సరైన జీతాలు ఇవ్వక పోవడం, తన పరిసరాలో జరుగుతున్న వృత్తాంతాలను తెలుసుకోలేక పోవడం, విన్న ప్రతి విషయాన్నీ నమ్మడం-నిజా, నిజాలు మంత్రులపైన పడవేయడం, తన మేలుకోరి చెప్పగలవారికి-జ్ఞాన హీనతతో చెప్పేవారికి మధ్య తేడా తెలుసుకోలేక పోవడం, ఎవరినీ నమ్మక పోవడం, మూర్ఖత్వం లాంటి పలు దుర్గుణాలు వున్న రావణుడు సమూలంగా నాశనమయ్యాడు. పైన పేర్కొన్న విషయాలన్నీ, శూర్పణఖ, మారీచుడు, విభీషణుడు చెప్పిన మాటల్లో బయట పడుతుంది. రాముడితో యుద్ధమెందుకు చేయవలసి వచ్చిందో-యుద్ధ కారణమేంటో తన భటులకే తెలియనీయక వంచన చేసి, వారి ప్రాణాలను తీసిన (రావణాసురుడి లాంటి) ప్రభువు ఎలాంటి వాడో రామాయణం చదువుతే అర్థమవుతుంది.

ఇలాగే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల వలన భాతృ ధర్మం, సుగ్రీవుడి చర్యల వలన మిత్ర ధర్మం, హనుమంతుడి చర్యల వలన భృత్యు ధర్మం తెలియ చేయబడ్డాయి రామాయణంలో. రామాయణంలో సకల ధర్మాలున్నాయి. ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకేదాంట్లోను కనిపించవు.

శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. అందువల్లే, వాల్మీకి రామాయణం పారాయణం చేసేవారు, యథావిధిగా చదివి, వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది.

కామ్యార్థమైనా, మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే. శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేదమే అయినప్పుడు, వేదంతో సమానమైందని ఎలా అనవచ్చునంటే, వేదంలోని వర్ణాలనే, అనులోమ-విలోమాలుగా మార్చి, వేద ప్రసిద్ధమైన రామ కథను చెప్పడంవల్ల ఇది వేదమే అయింది. వేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది. అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి.

{ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చోటుచేసుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల అంతర్ జాలంలో లభ్యమైన "వాసు దాసు-వావిలికొలను సుబ్బరావు" గారి 108 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి- బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలకు ముందు మాటగా రచయిత చెప్పిన మాటల ఆధారంగా...}


Jwala99@gmail.com (8008137012) 

No comments:

Post a Comment