Sunday, August 7, 2016

ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మనుధర్మశాస్త్రం : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మనుధర్మశాస్త్రం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (29-05-2016)

బ్రాహ్మణులను, మనుస్మృతిని, మను ధర్మ శాస్త్రాన్ని, బ్రాహ్మణిజాన్ని, హిందూ మతాన్ని అహర్నిశలూ కించపరుస్తూ మాట్లాడడం పరిపాటై పోయిందిటీవల కొందరికి. ఒక పెద్ద మనిషి బ్రాహ్మణులను సోమరిపోతులుగా వ్యాఖ్యానించి, ఆ తరువాత, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హెచ్చరించడంతో వెనక్కు తగ్గి తాను బ్రాహ్మణిజానికి మాత్రమే వ్యతిరేకిని తప్ప, బ్రాహ్మణులకు కాదని మరో వక్ర భాష్యం చెప్పాడు. బ్రాహ్మణులకు సంబంధం లేని బ్రాహ్మణిజం ఎక్కడినుంచి వచ్చిందో ఆ పెద్ద మనిషికే తెలియాలి. మరో విధంగా చెప్పాలంటే సనాతన ధర్మానికి, వేల-లక్షల సంవత్సరాలనాటి హైందవ ధర్మానికి, మనుధర్మానికి వ్యతిరేకం అని చెప్పకనే చెప్తున్నాడా పెద్దమనిషి. ఇలాంటి వారికి, వాళ్లు అను నిత్యం విమర్శించే బ్రాహ్మణిజానికి, సనాత ధర్మానికి, మానవ ధర్మానికి సంబంధించిన మనుస్మృతి గురించి తెలియచేసే ప్రయత్నమే ఈ వ్యాసం. ఇది చదిన తరువాతైనా కొంతలో కొంతైనా వారి మూర్ఖత్వం పోతుందేమోనన్న ఆశ.

"అగ్రకుల పెత్తందారీతనం" అంటూ చర్చావేదికలు నిర్వహించి, బ్రాహ్మణిజంపై యుద్ధం అంటూ ప్రకటనలు చేస్తున్నారు వీళ్ళు. ఏ "ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం" అనే పదాన్ని వీళ్ళు వాడుతున్నారో దాన్నే మౌలికంగా మనుస్మృతి చెప్పిన ప్రతి మాటలోనూ పేర్కొనడం జరిగింది. ఒక వైపు హిందూ మతాన్ని కించపరిచే మాటలు అంటూనే, మరో వైపు వీరి మతాలు "బౌద్దం, ముస్లిం, క్రైస్తవం" అని అంటున్నారు. ఈమూడు మతాలు ఏ విధంగానైతే వీరి దృష్టిలో ఆధ్యాత్మిక సౌరభాలో, అలానే, ఆ మాటకొస్తే అంతకంటే పిసరంత ఎక్కువగానే, హిందూ మతం కూడా అనాదిగా పరిమళిస్తున్న ఆధ్యాత్మిక సౌరభం, అనే విషయం వీరు మరిచిపోకూడదు. "కులరహిత సమాజం" అని ఒక పక్క అంటూనే, బ్రాహ్మణులని, దళితులని వేర్వేరు పదాలుపయోగిస్తున్నారు. ఏ బ్రాహ్మణులనైతే బ్రాహ్మిణిజం పేరుతో నిందిస్తున్నారో, ఆ బ్రాహ్మణులకు చెందిన వారే వివిధ సందర్భాలలో విప్లవోద్యమాలను ముందుండి నడిపించారనేది జగద్వితం. వారెవరో వీరికి తెలియదా? దేశంలో, సమాజంలో, ఏ సంస్కరణలు వచ్చినా, వాటిలో చాలా వాటిలో బ్రాహ్మణుల పాత్ర అంతో-ఇంతో లేకుండా పోలేదు.

"నాకెవ్వరూ ఏమీ చెప్పనవసరం లేదు, నేనే అన్ని విషయాలూ తెలుసుకుంటాను" అని ఎవరైనా అనుకుంటే అతడు మూర్ఖశిఖామని అని పుల్లెల శ్రీరామచంద్రుడు "ఆముఖం మామిడి తోరణం" అనే శీర్షికన, “మనుధర్మ శాస్త్రం పుస్తకానికి పీఠికలో రాశారు. ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం, స్వర్గం, నరకం, జీవుడు, దేవుడు, బంధం, మోక్షం లాంటి ఎన్నో అలౌకిక విషయాలను తెలుసుకోవాలంటే మూర్ఖం వీడి, వేదంపై దృష్టి సారించాలి. ఇది హిందువుల...ఆ మాటకొస్తే భారతీయుల విశ్వాసం. ఇటీవలే, జనవరి నెలలో 93 వ జన్మదినం జరుపుకున్న కొమరగిరి యోగానంద లక్ష్మీ నరసింహారావు ఆంగ్ల-తెలుగు భాషలలో అనేక గ్రంథాలను రాశారు. వృత్తి రీత్యా ఆంగ్లోపన్యాసకులైనప్పటికీ తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం వున్న మహానుభావుడు. ఆయన రాసిన పుస్తకాలలో ప్రత్యేకంగా పేర్కొనాల్సింది మనుధర్మ శాస్త్రం.

మనుధర్మ శాస్త్రం అన్ని శాస్త్రాల కంటే గొప్పదే కాకుండా వేద ప్రమాణంతో ప్రసిద్ధి గాంచిన గొప్ప గ్రంథం. "ముఖద్వారం" శీర్షికన రచయిత రాసిన ఉపోద్ఘాతంలో అనేక విషయాలను సోదాహరణంగా తెలియచేయడం జరిగింది. వాస్తవానికి అన్ని ధర్మాలకు మూలం వేదం...అన్ని ఆచారాలకు అదే ప్రమాణం. అలాటి వేద నిబద్ధమైన ధర్మాన్నే మనుధర్మ శాస్త్రంలో విశదీకరించడం జరిగింది. హిందూ సమాజానికి అదొక ప్రామాణిక గ్రంథం. మనుస్మృతిని ఆధారంగా చేసుకుని ఇండియా ప్రధమ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఒక న్యాయ సూత్ర సంకలనాన్ని తయారు చేయించాడు. ఆయన కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన విలియం జోన్స్ మనుస్మృతిని ఎంతో పొగిడి, ఆంగ్లంలో అచ్చు వేయించినందుకు, బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను "సర్" బిరుదుతో సత్కరించింది. హిందువుల-భారతీయుల అతి పురాతనమైన సంస్కృతి పట్ల, పవిత్ర మత ధర్మాల పట్ల గౌరవంతో, వారు అనుసరించిన న్యాయ-ధర్మ శాస్త్ర రహస్యాలను బ్రిటీష్ ప్రభుత్వాధికారులు తెల్సుకోవాలని, ఆ ప్రాచీన చరిత్రను-సంస్కృతిని అధ్యయనం చెయ్యాలని మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. హైందవ సంస్కృతిని, ఔన్నత్యాన్ని పరదేశీయులు గుర్తించినప్పటికీ, మన దేశంలో వున్న కొందరు వాటిని తూలనాడడం దురదృష్టకరం.


"మనుధర్మ శాస్త్రం మూలవాజ్ఞ్మయం" అంటారు రచయిత. ప్రతి మహానదికి, జీవనదికి ఒక జన్మస్థానం వున్నట్లే, పరవళ్లు తొక్కుతూ ఎన్నో ఉపనదులను తనలో చేర్చుకున్నట్లే, అలా పారుతూ భూమిని పావనం చేసినట్లే, ఆ క్రమంలో సముద్ర గర్భంలో చేరినట్లే......మనుధర్మ శాస్త్రం కూడా అనేక పురాతన ధర్మ సూత్రాలను మేళవించి, ఒక ఉత్తమోత్తమ ధర్మశాస్త్రంగా రూపొంది, భారతీయ సమాజాన్ని, ఆ మాటకొస్తే యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ధర్మబద్ధమైన, నియమబద్ధమైన, ఆదర్శవంతమైన, ప్రపంచంలోనే ఉత్తమోత్తమైన సమాజంగా హైందవ జాతిని తీర్చిదిద్దింది మనుధర్మ శాస్త్రం. వేదమూలమైన మనుధర్మ శాస్త్రాన్ని…."మానవ ధర్మ శాస్త్రాన్ని" ఒక మానవాతీతమైన కార్యక్రమంగా రూపుదిద్దడానికి ఎంతమంది శ్రమించారో చెప్పడం సాధ్యం కాదు. ధర్మమే మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని మనం కాపాడుకున్నంత కాలం అది మనలను రక్షిస్తూనే వుంటుంది. అలా కాకుండా, కుహనా వాదుల లాగా ధర్మాన్ని చెరిచే ప్రయత్నం చేస్తే అది మనలను చెరుస్తుంది. "బ్రాహ్మణిజం" పేరుతో, దానిపై అర్థం లేని వ్యతిరేకతతో, హిందూమతానికి వ్యతిరేకతతో, ధర్మాన్ని నశింప చేయడానికి పూనుకోవడం వినాశనకరం.

మనుస్మృతిలో అనవసరమైన విషయాలు కాని, అక్కరకు రాని విషయాలు కాని అసలే లేవు. సదాచారం అంటే ఏమిటి? సమాజ శ్రేయస్సంటే ఏమిటి? ఉత్తమోత్తమైన ధర్మమంటే ఏమిటి? ఎవరెవరు ఏవిధంగా తమ విద్యుక్త ధర్మాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి? క్షమాగుణం అంటే ఏమిటి? మనో నిగ్రహం ఎలాంటిది? శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం ఎలాంటిది? కాలానుగుణంగా స్త్రీ పురుష ధర్మాలు ఎలా మారుతాయి? వైవాహిక ధర్మం అంటే ఏమిటి? దాంపత్య ధర్మం ఎలా వుండాలి? తల్లితండ్రులను, పెద్దవారిని ఎలా గౌరవించాలి? ఇలాంటివన్నీ వున్నాయి. ఇందులో విమర్శకులకు ఏ విధంగా తప్పు కనిపిస్తుందో తెలియదు.

స్త్రీలను మనుస్మృతిలో కించపరిచే విధంగా రాశాడు అని ఆరోపణ చేసేవారున్నారు. అది నిజం కాదు. ఆయన దృష్టిలో స్త్రీలకు రక్షణ కలిగించాలని మాత్రమే చెప్పడం జరిగింది. "నిర్భయ" లాంటి చట్టాలు చెప్తున్నది కూడా అదేగా! మన రాష్ట్రంలోని "షి టీమ్స్" ఉద్దేశం కూడా స్త్రీలకు ప్రత్యేక రక్షణ కలిగించడమే కదా! మనువు స్త్రీలను ఎప్పుడూ అగౌరవ పరచ లేదు. సమాజం వారిని ఎప్పుడూ, మాతృ భావంతో, సోదరీ భావంతో ఆదరించి సత్కరించాలని అన్నాడు. ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలుంటారని "యత్ర నార్యస్తు పూజ్యంతే....ఫలాః క్రియాః" అనే శ్లోకంలో సూచించాడు. మనువు నిర్మించి సంఘటితం చేసిన సమాజంలో స్త్రీకి ఉదాత్తమైన, స్వేఛ్చాయుతమైన స్థానం కలిపించడం జరిగింది.

          పీఠికలో పుల్లెల శ్రీరామచంద్రుడు చాలా విషయాలను సందర్భోచితంగా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, మనుస్మృతిని పోలుస్తూ, ఎన్ని న్యాయ శాస్త్ర పరమైన గ్రంథాలు వెలువడుతున్నప్పటికీ, వాటి ప్రామాణ్యానికి మూల కారణం భారత సంవిధానానికున్న అకుంఠిత ప్రామాణ్యం అన్నారు. దీనికి విరుద్ధంగా వున్న దానిని న్యాయస్థానాలు అప్రమాణం అని కొట్టి పారేస్తారు. మనుస్మృతి లాంటి స్మృతుల వేదమూలకత్వం కూడా అలాంటిదే. ఇలానే ఇంకా చాలా విషయాలను ఆయన ప్రామాణికంగా ఉటంకించారు. అతి ప్రాచీన కాలం నుండి, భారత దేశం అంతటా పరమ ప్రమాణంగా అంగీకరించబడిన స్మృతి మనుస్మృతి. 2684 శ్లోకాల ఈ స్మృతిలో భారత దేశానికీ, ఇరుగుపొరుగున వున్న దేశాలకీ సంబంధించిన ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక విషయాలెన్నో వివరించబడ్డాయి. ఆధునిక కాలంలో మూర్ఖ శిఖామణులు కొందరు ఈ స్మృతిలో ఏముందో పూర్తిగా చదివి అర్థం చేసుకునే ఓపిక, తీరిక లేకపోవడం వల్ల, విపరీతార్థాలను లాగుతున్నారు. వర్తమాన కాలానికి అనుగుణంగా లేవని ఏవో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ, తమకి తోచిన భాష్యం చెపుతున్నారు, ఇది అత్యంత దురదృష్టమైన విషయం. వారి ఆలోచనా ధోరణి మారడానికి మనుస్మృతి మళ్లీ మళ్లీ చదవాలి...చదివి అర్థం చేసుకోగలగాలి.

హిందువును అని చెప్పుకునే వ్యక్తి కాని, హిందూ మతాన్ని అదే పనిగా అర్థం-పర్థం లేకుండా విమర్శించే కుహనావాదులు కాని, మనుస్మృతి లాంటి పుస్తకాలను చదివితే, అదంటే ఏమిటో, అందులో ఎలాంటి మహోన్నత ఆదర్శాలున్నాయో అవగతమౌతుంది. "ఈ మతంలో ఏముంది? వర్ణ భేదాలు, కుల భేదాలు, అస్పృశ్యత లాంటి దురాచారాలు మాత్రమే కదా?" అని అసలు-సిసలు భావాన్ని అర్థం చేసుకోకుండా విమర్శిస్తుంటారు. అన్ని కాలాలకు ఒకే ధర్మశాస్త్రం వుండాలని అనడం లేదు......సామాజిక పరిస్థితులను బట్టి కొన్ని అంశాలలో మార్పులు చేయవచ్చు. మన రాజ్యాంగానికి కూడా సవరణలు చేయడం లేదా? అంత మాత్రాన రాజ్యాంగం మౌలిక సూత్రాలను మార్చం కదా? అలానే ధర్మశాస్త్రాలు...మనుస్మృతి...బ్రాహ్మణిజం...వేదాలు...ఉపనిషత్తులు...మరెన్నో అలనాటి ప్రామాణికాలు. మనకు ఇష్టం కాని విషయాలున్నాయని, స్మృతులను, హిందూ మతాన్ని, సంస్కృతిని, బ్రాహ్మణిజాన్ని తప్పు బట్టడం ఎలుకల మీద కోపం వచ్చి ఇంటిని తగులబెట్టడం లాంటిదే. వీటిలోని అత్యంత ఉన్నతమైన ఆదర్శాలను పాటించడం శ్రేయస్కరం. హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం.


కెవైఎల్ గారి మాటల్లో చెప్పాలంటే; "భారతీయ సంస్కృతి, హైందవ సంస్కృతి, ప్రపంచంలో ఉత్తమోత్తమమైన సంస్కృతి. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. సర్వాకలికమై, శాశ్వతమై, స్థిరమై, యుగ-యుగాలుగా వర్ధిల్లుతున్నది. ఎన్ని సాంఘిక విప్లవాలొచ్చినా ఇంకా నిశ్చలంగా, సజీవంగా వుంది. దీనికి కారణం...దాని మూలాలు వేదాలలో వుండడమే". End

1 comment:

  1. One Shubham Shinde on another thread critically commented on Manusmriti as under. WHAT IS YOUR REPLY, ACTUALLY YOU HAVE NOT TOUCHED THESE MATTERS AT ALL:
    "Yes, Manusmrit did promote cast oppression and casteism, and yes, on hereditary basis. The shudras are always demeaned in various ways, and Manusmriti also records the creation of various castes from the four basic castes.

    I – 91. One occupation only the lord prescribed to the shudra to serve meekly even these other three castes.
    I – 93. As the Brahmana sprang from (Prajapati’s i.e. God’s ) mouth, as he was first-born, and as he possesses the veda, he is by right the lord of this whole creation.
    1/28: But to whatever course of action Lord at first appointed each (kind of
    beings), that alone it has spontaneously
    adopted in each succeeding creation.
    1/29: Whatever he assigned to each at the (first) creation, noxiousness or
    harmlessness, gentleness or ferocity, virtue
    or sin, truth or falsehood, that clung (afterwards) spontaneously to it.
    II – 31. Let (the first part of ) a brahmin’s (denote) something auspicious, a kshatriya’s name be connected with power and a vaishya’s with wealth, but a Shudra’s (express something) contemptible.
    ETC."

    ReplyDelete