Monday, August 8, 2016

నిర్వాసితులపై రాద్ధాంతం వద్దు! : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)

నిర్వాసితులపై రాద్ధాంతం వద్దు!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (18-06-2016)

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల-రిజర్వాయర్ల వల్ల ముంపుకు గురయ్యే గ్రామాల-భూముల నిర్వాసితులకు, తగు మోతాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంలేదని కొంత మంది స్వయం ప్రకటిత మేధావి వర్గం అనవసరంగా, అకారణంగా రాద్ధాంతం చేయడం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా 50 టిఎంసిల నీరందించిరంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలలోని సుమారు ఐదు లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింది నిర్వాసితుల విషయంలో వీరి విమర్శలు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేవలం అయిదారు గ్రామాలు మాత్రమే ముంపుకు గురయ్యే విధంగా ఈ రిజర్వాయర్ డిజైన్ చేయడం అందరికీ తెల్సిన విషయమేఇక ఈ గ్రామాలలోని ప్రస్తుత భూమి విలువ ఎకరానికి రు. 60 వేలు మాత్రమే ఐనప్పటికీ, ప్రభుత్వం అదే భూమికి కొనుగోలు పద్ధతి ద్వారా అందించే నష్ఠ పరిహారం విలువ ఎకరానికి రు. 5.08 లక్షలు. ఇంతే కాకుండా, ప్రతి నిర్వాసిత కుటుంభానికి రెండు పడక గదుల ఇంటిని కూడా ప్రభుత్వం సమకూరుస్తున్నది. వీటికి అదనంగా నిర్వాసితులు కోల్పోబోయే ఇతర ఆస్తుల విలువకు కూడా తగుమేరకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇవన్నీ కూడా ఒకే పర్యాయం అన్నీ కలిపి ఒకే చెక్కు రూపేణా నిర్వాసితులకు అంద చేస్తామని కూడా ప్రభుత్వం అంటున్నది. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం, భూమిని సేకరించే విధానంలో నష్ట పరిహారాన్ని వాయిదాల పద్దతిలో అందించే బదులు ఒక్కసారిగా ఈ పరిహారం చెల్లింపు పూర్తిచేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. భారత ప్రభుత్వ భూ సమీకరణ చట్టం కింద చూసినట్లయితే నష్ట పరిహారం కింద చెల్లించాల్సిన భూమి విలువ ఎకరానికి రెండు లక్షల మేరకు మించదు. నిజానికి భారత ప్రభుత్వం తీసుకవచ్చిన చట్టం కింద ఇచ్చే నష్ట పరిహారాన్ని ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ఆయా ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర విధానాలను అనుసరించి, లాభదాయకమైన పద్ధతిలో ఆ పరిహారం మొత్తాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో నిర్వాసితులకు ఎకరానికి రు. 5.08 లక్షలు, అదనంగా ఇతర పరిహారాలు చెల్లిస్తున్న నేపథ్యంలో ఆక్షేపణలు దేనికి?

 నాగార్జున్ సాగర్ నిర్మించిన రోజుల్లో సుమారు 264 గ్రామాలు ముంపుకు లోనైన విషయం జగద్విదితం. భూ సేకరణ విషయంలో, నిర్వాసితులకు పరిహారం అందించటంలో అప్పట్లో ఎన్నేళ్లు పట్టిందో కూడా మనందరికీ తెలిసిందే. ఈ అనుభవం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు బదులుగా నిర్వాసితుల పరిపూర్ణ అవగాహనతో, సమ్మతితో వారికి సంపూర్ణ పరిహారం అందించే విధంగా భూ కొనుగోలు విధానం రూపొందించటం జరిగింది. ముంపుకు గురయ్యే గ్రామాల సంఖ్యను గణనీయంగా తగ్గించే విధంగా డిజైన్లు జరిగాయి. ఉదాహరణకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయమే తీసుకుందాం. మొదలనుకున్నట్లు జూరాల నుండి నీటిని తీసుకువచ్చే డిజైన్ కొనసాగించినట్లయితే 64 గ్రామాలు ముంపుకు గురయ్యేవి. వీటి కింద 59 వేల ఎకరాలు మునిగిపోయేవి. దీనిక బదులుగా ఒకటి, రెండు చిన్న తండాలు మాత్రమే ముంపుకు గురయ్యేలా పరిమితం చేసి 16 వేల ఎకరాల ముంపుకు కుదించి కొత్త డిజైన్ల రూపకల్పన ద్వారా శ్రీశైలం నుంచి తీసుకునేట్లు రూపొందించటం ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ఐనప్పటికీ, మొత్తం విషయాన్ని అనవసరంగా రాజకీయం చేయటం, మేధావులు అమాయకులని తప్పుదోవ పట్టించటం, ప్రతిపాదిత ప్రాజెక్టు పనులకు అవరోధం కల్గించటం సరంది కాదు.  

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్రం లోని ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్ విషయంలో దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర విధానంలో భాగంగా గోదావరి నదిపై సాధ్యమైనన్ని నూతన బ్యారేజీలను నిర్మించడం, కృష్ణా నదీ జలాలను పరిపూర్ణంగా వినియోగించటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.  దుమ్ముగూడెం నుండి కాళేశ్వరం వరకు, మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు, మిడ్ మానేరు నుండి బసవపూర్ రిజర్వాయర్ వరకు లైడార్ సర్వే చేపట్టడం ద్వారా ముంపుకు గురయ్యే గ్రామాల సంఖ్యను కుదించేందుకు చర్యలు తీసుకోవటం జరిగింది. ఇరిగేషన్ అధికారులకు భూ కొనుగోలు విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిర్వాసిత రైతులకు భూమి విలువ ఆధారంగా చెల్లింపులతో పాటు రాష్ట్రంలోని ఏప్రాంతంలో కావాలన్నా ఇళ్ళు నిర్మించుకునే విధంగా రు. 5.04 లక్షలు నగదు రూపేణా ఏక మొత్తాన చెల్లించేందుకు ఆదేశించారు. రిజర్వాయర్ల నిర్మాణ క్రమంలో అతితక్కువ గ్రామాలు ముంపుకు గురయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 లోక్ సభ సచివాలయం డిసెంబర్ 2013న సభ్యులకు అందచేసిన ఒక సర్క్యులర్ నోట్ లో, దేశాభివృద్ధి క్రమంలో ప్రాజెక్టులు నిర్మించాల్సి వస్తుందని, అందులో భాగంగా, నిర్వాసిత ప్రజలను తరలించడం తప్పని సరని పేర్కొంది. ఇలా చోటుచేసుకున్న పునరావాస క్రమంలో, గడిచిన 50 సంవత్సరాల్లో, భారత దేశంలో, సుమారు ఐదు కోట్ల మందిని తరలించి, పునరావాసం కల్పించటం జరిగిందని ఆ నోట్ లో వుంది. త్వరితగతిన ఆర్థిక ప్రగతి సాధించటానికి భారత దేశంలో పారిశ్రామిక ప్రాజెక్టులు, డ్యామ్ లు, రోడ్లు, గనులు, పవర్ ప్లాంట్లు చేపట్టి పెట్టుబడులు పెట్టడం జరిగింది. దీనికొరకు పెద్దఎత్తున భూ సమీకరణ, నిర్వాసిత ప్రజలను తరలించటం కూడా జరిగింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా నీటి తరలింపుకు, పరిశ్రమల అభివృద్ధకి, గనుల తవ్వకాలకు, విద్యుత్ శక్తి ఉత్పాదనకు దరిదాపుగా 32 లక్షల మంది నిర్వాసితులయ్యారు. గణాంకాల ప్రకారం 1999 సంవత్సరం నుండి 2013 వరకు సుమారు 3.16 లక్షల మంది నిర్వాసితులయ్యారు. వీరిలో 1.24 లక్షల మంది గిరిజన ప్రాంత వాసులున్నారు.  

పునరావాసం కల్పించటం, ప్రజలను తరలించటం అనేది ఈ డ్యాముల నిర్మాణం వల్ల సాధించే అభివృద్ధి క్రమంలో చేపట్టడం జరుగుతుంది. ఈ నివేధిక అందించిన వివరాల్లో గడిచిన 50 సంవత్సరాల్లో భారత దేశంలో రమారమి 3,300 పెద్ద డ్యాములను నిర్మించటం, పెద్ద మొత్తాన తరలింపు చేపట్టడం జరిగింది. తరలించిన ప్రజల్లో 40 నుండి 50 శాతం వరకు గిరిజన ప్రాంతాల వారేకావటం విశేషం. సర్దార్ సరోవర్ డ్యాం కారణంగా నాలుగు లక్షల మంది దాకా నిర్వాసితులు అయ్యారు. నర్మదా వ్యాలి ప్రాజెక్టు అభివృద్ధి కింద ఇంతకు మించిన సంఖ్యలో ప్రజలను తరలించటం జరిగింది. 1979లో ఉత్తరాఖండ్ లోని తెహరీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్షమందికి పైగా నిర్వాసితులు అయ్యారు.

ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మినహాయించి సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణాల కింద నిర్వాసితులకు సహాయ పునారావాసం ఒక క్రమపద్ధతిలో చేపట్టబడలేదు. నాగార్జున సాగర్, హీరాకుండ్, తుంగబద్ర, మయూరాక్షి డ్యాంల నిర్మాణం జరిగినప్పుడు పునరావాసం కింద తరలించిన వారికి ఇండ్ల స్థలాల రూపేణా పరిహారం లభించినప్పటికీదీర్ఘకాలికంగా, న్యాయపరమైన ఇబ్బందులకు వారు లోనవటం జరిగింది. ప్రపంచంలో ఇటువంటి గణాంకాలను పరిశీలించినట్లయితే లక్షల-కోట్ల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యారు. ఒక లెక్క ప్రకారం ప్రపంచం మొత్తంలో భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో  వివిధ ప్రాజెక్టుల కింద నిర్వాసితులయ్యారు. భూ సేకరణ ద్వారా నిర్వాసితులకు పునరావాసం, అందుకు తగ్గ చెల్లింపులు తగు విధంగా జరగలేదని ప్రస్పుటంగా కానవస్తున్నది. చట్టం కూడా నిర్వాసితులకు తగు న్యాయం చేకూర్చలేక పోయింది.

    ఆశ్యర్యం కలిగించే ఉదాహరణ చైనా దేశంలోని త్రీ గోర్జెస్ డ్యాం. ఇది ప్రపంచం లేనే అతి పెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టుగా పేర్కొనవచ్చు. ఈ భారీ ప్రాజెక్టు ఏకకాలంలో నిర్వాసితులైన 12 లక్షల మందిని తరలించటంలో రికార్డు సాధించింది. అలాగే 13 నగరాలని, 140 టౌన్ లను, 1,350 గ్రామాలను ముంపుకు లోను చేసింది. ఈ రిజర్వాయర్ పొడవు 6 వందల కిలో మీటర్లు. ఇది ప్రపంచం లోనే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాంగా ప్రాసస్త్యాన్ని సంతరించుకుంది. ఇది మూడు గోర్జెస్ మద్యలో యాంగ్టెజ్ నది మీద నిర్మించబడింది. ప్రపంచంలో మూడో స్థానాన్ని సంతరించుకొని, చైనాలోని హూబే ప్రాంతంలో ఉంది. 3937 మైళ్ళ పొడవునా, సంవత్సరానికి 960 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉత్తర చైనాలో సముద్రంలో విడుదల చేస్తుంది. ఈ త్రీ గోర్జెస్ ప్రాజెక్టు ద్వారా చైనా దేశం భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టులను ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఏర్పాటు చేయడానికి కావల్సిన పరిజ్ఙానాన్ని సంతరించుకుంది. 22500 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవడం ద్వారా ప్రపంచం లోనే అతిపెద్ద పవర్ స్టేషన్ గా పేరు తెచ్చుకుంది. 2014 సంవత్సరంలో 98.8 టిడబ్యుహెచ్ విద్యుత్ శక్తిని సాధించింది. గతంలో వేల సంఖ్యలో చోటు చేసుకున్న వరద కారణ మరణాలను, మిలియన్ల డాలర్ల సంఖ్యలో జరిగిన ఆస్తి నష్టాన్ని, ఈ త్రీ గోర్జెస్ డ్యాం ద్వారా శాశ్వతంగా నిరోధించడానికి ఆస్కారం లభించింది. చైనా ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కలిగించే పద్ధతిని ‘‘లంప్ సమ్’’ విధానం అంటారు. ఈ విధానం ద్వారా వారు కోల్పోయిన భూమి విలువ, ఇంటి విలువ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ధేశించిన విలువ ఆధారంగా ఏక మొత్తంగా చెల్లించడం జరిగింది. త్రీ గోర్జెస్ డ్యాం నిర్మాణ క్రమంలో కొన్ని సమస్యలను చవిచూసినప్పటికీ వరద నియంత్రణ విషయంలో సఫలీకృతం అయింది.


ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు  వివిధ రకాల ప్రాజెక్టుల నిర్మాణం ఎంతో అవసరం. అభివృద్ధి కూడా అంతకంటే ఎక్కువ అవసరం. అభివృద్ధి చెందే దశనుండి అభివృద్ధి చెందిన దశకు పరిణామం చెందే క్రమంలో దీర్ఘకాలిక బహుళ ప్రయోజనాన్ని పొందేందుకు కొన్ని  కొన్ని స్వల్పకాలిక అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. జాన్ స్టూవర్ట్ మిల్ పేర్కొన్న "గ్రేటెస్ట్ హాపినెస్" సూత్రాన్ని గుర్తుచేసుకోవడం తప్పనిసరి. కాబట్టి ఈ ఆక్షేపణలన్నీ ఎందుకు? End 

No comments:

Post a Comment