Saturday, August 6, 2016

రాజకీయ వివేకం, ఆర్థిక దార్శనికత : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
రాజకీయ వివేకం, ఆర్థిక దార్శనికత
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (16-03-2016)

          తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి 2016-2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఇంతకీ ఈ బడ్జెట్ అంటే ఏమిటి? ఇది కేవలం ఆర్థిక శాఖకు సంబంధించిన అంశమేనా? ఇతరులకు దాని విషయంలో-వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? బహుశా ఇలాంటి ఆలోచనలన్నీ అపోహలే. మనది బ్రిటీష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వారసత్వం. వాస్తవానికి చాలా విషయాలలో, బ్రిటీష్ కాలం నాటికీ, నేటికీ, బడ్జెట్ స్వరూప-స్వభావాలలో విప్లవాత్మకమైన మార్పులు అంతగా లేవంటారు ఆర్థిక నిపుణులు. ఇది కొంత మేరకు వాస్తవమేమో కాని, ప్రస్తుతం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ను గమనిస్తే, ఓ సమగ్రమైన అధ్యయనం జరిగిన నేపధ్యంలో దీని రూపకల్పన జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. క్షుణ్ణంగా గమనిస్తే, ప్రణాళికా కేటాయింపులంటే ఏమిటి? ప్రణాళికేతర కేటాయింపులేంటి? కేంద్రం విడుదల చేసే నిధులకు, మాచింగ్ గ్రాంట్‌లకు ఒక తీరు-తెన్ను అనేది వుందా? ఏ రంగానికి-ఎప్పుడు-ఎందుకు-ఎంత మేరకు నిధుల కేటాయింపులు పెంచాలి, లేదా, తగ్గించాలి అన్న విషయం గురించి సవివరమైన అధ్యయనం జరిగినట్లు కూడా స్పష్టంగా బోధపడుతుంది. వాస్తవ పరిస్థితులకు, ఎన్నికలలో చేసిన వాగ్దానాలకు, అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు, బడ్జెట్ అంచనాలకు-ఏడాది చివరలో జరిగిన వ్యయానికి పొంతన అనేది వుంటుందా? వుండదా? అనే ప్రశ్నలకు సరైన సమాధానం ఈ బడ్జెట్ లో దొరికే వీలుంది.

          ప్రభుత్వం అంటే అతిపెద్ద వ్యవస్థ. అందులో వివిధ శాఖలు, ఉప శాఖలు, వందల-వేల సంఖ్యలో కార్యాలయాలు, వీటి ద్వారా ప్రజలకు చేరాల్సిన లక్షలాది పనులు వుంటాయి. వీటన్నిటి నిర్వహణకు, రకరకాల కార్యక్రమాల అమలుకు, వనరుల సేకరణ జరగాలి. అందుకే బడ్జెట్‌ను, "వార్షిక ఆర్థిక వివరణ", "వార్షిక విత్త వివరణ" గా పిలుస్తారు. వివిధ శాఖల అవసరాల మేరకు, ఆయా శాఖాధిపతుల సూచన మేరకు ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం తప్పనిసరి. కనీసం ఐదారు నెలల సుదీర్ఘ అధ్యయనం బడ్జెట్ రూపకల్పన నేపధ్యంలో జరిగిందని అనుకోవాలి.

            బడ్జెట్‌లో ఒక యూనిట్‌కు కేటాయించిన మొత్తాన్ని వినియోగం (అప్రోప్రియేషన్) అంటారు. బడ్జెట్ సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఏప్రిల్ మొదటి తేదీ నుంచి మరుసటి సంవత్సరం మార్చ్ 31 వరకు. ఏ సంవత్సరానికి ఆమోదించిన మొత్తాన్ని అదే సంవత్సరం ఖర్చు చేయాలి. చేయక పోతే మురిగి పోతుంది. ప్రతి శాఖ మంత్రి తన శాఖ నిర్వహణకు కొంత మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా శాసన సభను కోరడాన్నే "డిమాండు" అంటారు. శాసన సభ ఆ డిమాండును ఆమోదించిన తరువాత దాన్ని "గ్రాంట్" అంటారు. ఇలా అన్ని శాఖల గ్రాంటులు కలిపి, బడ్జెట్ సమావేశాల చివరలో "ద్రవ్య వినియోగ బిల్లు" (అప్రోప్రియేషన్ బిల్) ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందుతారు. సభ ఆమోదం పొందిన దాన్ని "అప్రోప్రియేషన్ యాక్ట్" అంటారు. ప్రభుత్వం చేసే ప్రతి ప్రతిపాదనను క్షుణ్ణంగా చర్చించే అవకాశం-అధికారం శాసనసభ్యులకు వుంది. చట్ట సభల్లో జరిగే ఈ ప్రక్రియ అంతా ఆర్థిక మంత్రి బడ్జెట్ ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది. అంతకు ముందు సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది. ఈ నేపధ్యంలో సార్వజనీన పునరారంభ విత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.


బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమీక్షలు చేశారు. ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు, అవసరాలకు, అనుగుణంగా, రాష్ట్ర వనరులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో వివిధ శాఖలకు నిధుల కేటాయింపు జరగాలని ఆయన ఆ సమీక్షలలో సూచించారు. ఏదో లాంఛనంగా సమీక్షలు జరపడం కాకుండా, గత బడ్జెట్ లో వివిధ శాఖలకు జరిగిన కేటాయింపులు ఎన్ని? అందులో ఖర్చయినవి ఎన్ని? నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో ఖర్చు కాకపోవడానికి కారణాలేంటి? ఒక ఏడాది కోసం కేటాయించిన నిధులు అదే ఏడాదిలో ఖర్చు చేసి, ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? తదితర అంశాలపై సంబంధిత శాఖ మంత్రులతో, అధికారులతో కూలంకషంగా చర్చించారు సీఎం. రాష్ట్రం మాత్రమే యూనిట్ గా కాకుండా, జిల్లా యూనిట్ గా, అవసరమైతే శాసన సభ నియోజకవర్గం యూనిట్ గా ప్రజల అవసరాలేంటి? శాఖల వారీగా ఎన్ని నిధులు అవసరం ? గత బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారు? ఇంకా ఎన్ని నిధులు కావాలి? తదితర అంశాలు పొందుపరుస్తూ డిస్ట్రిక్ట్ కార్డులు తయారు, నియోజక వర్గ కార్డులుండాలని సీఎం సూచించారు. మూస పద్ధతి వద్దని, ప్రజలకు ఏది అవసరమో దాన్నే రూపొందించుకుందాం అని, అవినీతిని తొలగించే చర్యలు చేపడ్దాం అని పదే పదే సమీక్షా సమావేశాల్లో అధికారులకు స్పష్టంగా చెప్పారు. తదనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా వున్న కొత్త పద్ధతులను అవలంభించారీ బడ్జెట్ లో. నిశితంగా పరిశీలిస్తే చాలా విషయాల్లో చాలా మార్పులకు నాంది పలికిందీ బడ్జెట్. రాష్ట్రాని కుండే వనరుల్లో ప్రజలకు అందించాల్సిన సేవలు మెరుగవుతూ-పెరుగుతూ పోవడానికి అనుగుణంగా తయారైందీ బడ్జెట్. ప్రజలకిచ్చిన వాగ్దానాలను దృష్టిలో పెట్టుకుని వాటినే ప్రాధాన్యతాంశాలుగా పెట్టుకుని రూపొందీచారీ బడ్జెట్. ఒక్క ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఈ ఏడాది హైదరాబాద్ లో లక్ష టు బెడ్ రూమ్ ఇళ్లు, రాష్ట్ర వ్యాప్తంగా మరో లక్ష టు బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెటేతర నిధులను దీనికొరకు కేటాయించారు.

ఆర్థిక మంత్రి బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పినట్లు, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టే మూడవ బడ్జెట్ అయినప్పటికి పూర్తి సమాచారంతో, సమగ్ర అధ్యయనంతో, వాస్తవాల ఆధారంగా రూపొందిన మొదటి బడ్జెట్ ఇదే. ఇంత స్పష్టంగా వున్నది వున్నట్లు, దాపరికం లేకుండా, ఒక వాస్తవాన్ని సభ దృష్టికి, తద్వారా యావత్ తెలంగాణ ప్రజల దృష్టికి తేవడం అభినందించాల్సిన విషయం. వాస్తవానికి, 2014-15 లో, 2015-16 లో రాష్ట్ర ఆదాయం ఎంతో, ఖర్చు ఎంతో, కేంద్రం ఏమి ఇస్తుందో నిర్దిష్టంగా తెలిసుండే అవకాశం లేదు. తెలియకపోయినా 2014-15 బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటికే అదే ఏడాది మార్చిలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో వున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టి ఉందిదానికి కొనసాగింపుగా మాత్రమే కేవలం 10 నెలల బడ్జెట్ ను తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆరెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తిరిగి 2015-16 రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పటికి కూడా ఓ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితమైన అంచనా లేదు. ఒక ఏప్రిల్ 1తో మొదలై మరుసటి సంవత్సరం మార్చి 31తో ముగిసే 12 మాసాల లెక్కలు అందుబాటులో ఉంటే తప్ప అసలైన బడ్జెట్ తయారు కాదు.

          ఇదే విషయాన్ని వివరిస్తూ ఆర్థిక మంత్రి, 2015-16 బడ్జెట్ కు ప్రాతిపదిక 2014-15 ఆర్థిక సంవత్సరం లెక్కలనీ, 2014 ఏప్రిల్ నుండి 2015 మార్చి నాటికి వచ్చిన ఆదాయం, పెట్టిన ఖర్చు, సాధించిన ఫలితాలు తేలాలనీకానీ తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ లో ఏర్పడిందని, అంటే రాష్ట్ర్రం ఏర్పడక ముందే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిందనికాబట్టి  పూర్తి స్థాయి లెక్కలు అప్పటికి అందుబాటులో లేవనీ, కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయనీ చెప్పారు. ఇవన్నీ వాస్తవాలే. ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా వుంది. అదే జరిగింది ఆర్థిక మంత్రి ఉపన్యాసంలో. ఈ నేపధ్యంలో 2016-17 బడ్జెట్ వాస్తవాల ఆధారంగా  తయారయిందనేది అక్షర సత్యం. 2015 ఏప్రిల్ 1 నుండి ఓ ఏడాది కాలం ప్రభుత్వం దాని ఆర్థిక పరిస్థితిని గమనించుకోగలిగిందిరాష్ట్రంలో వచ్చే ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? కేంద్రం నుంచి ఎంత వస్తుంది? ప్రజలకు ఏమి అవసరం ఉంది? తదితర విషయాలలో ఇప్పుడు స్పష్టత ఉందివీటి ఆధారంగా ఈ ఏడాది సమగ్ర బడ్జెట్ రూపొందించడం జరిగిందనాలి.

ఇక కేటాయింపుల విషయానికొస్తే....సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమపాళ్లలో, అవసరానికి తగ్గట్టుగా నిధులున్నాయి. ప్రాధాన్యతాంశాలను స్పష్టంగా గుర్తించడం జరిగింది. సాగునీటి రంగానికి మిషన్ భగీరథతో కలిపి పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది ప్రభుత్వం. ఇంత పెద్ద మొత్తంలో సాగునీటిపై గతంలో ఎప్పుడూ ఖర్చు చేసిన సందర్భాలు లేవు. రైతులకు సాగునీరు అందివ్వడమే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. అలానే మిషన్ భగీరథ విషయంలోను జరిగింది. త్వరితగతిన అన్ని గ్రామాలకు మంచినీరందివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదీ ప్రభుత్వం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్ లో నిధులు కేటాయించకపోయినా, బడ్జెటేతర ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. హడ్కో, నాబార్డ్, ఇతర బాంకుల నుండి ఆర్థిక రుణాలను పొందనుంది ప్రభుత్వం. వ్యవసాయ అనుబంధ రంగాలకు సముచిత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందీ బడ్జెట్ లో. ఎక్కువ మంది ఆధారపడి బతికే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి,  రైతులకు మేలుచేసే పద్ధతులు తేవడానికి వ్యవసాయ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు. లక్షలాది మంది రైతులు ఆధారపడి జీవించే వ్యవసాయ శాఖపై చాలా బాధ్యత వుందని, వ్యవసాయం కోసం భిన్న కోణాల్లో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించాలని కూడా ఆయన చెప్పారు. ఆరోగ్య-వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజారోగ్యంలో సంస్కరణల ప్రాధాన్యతను బడ్జెట్ లో విశదీకరించింది. "స్టాండర్డైజేషన్, స్టెబిలైజేషన్, కన్సాల్డేషన్" సిద్ధాంతంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయీ రంగానికి. ఆసుపత్రుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రజలు పెద్ద మొత్తంలో ప్రయివేట్ వారికి డబ్బులు ఇవ్వడం గమనించిన ప్రభుత్వం ఇక ముందు నుంచి ఆ సదుపాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కలిగించనుంది. గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు పనిచేయడానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇక సంక్షేమ పథకాలకు ఎప్పటి లాగానే పెద్ద పీట వేసింది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని విస్తరించింది. బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది.


ప్రతి ప్రభుత్వ శాఖకు ఒక నిర్దుష్టమైన విధానాన్ని రూపొందించి, తదనుగుణంగానే, ఆ శాఖకు అవసరమైన నిధులు కేటాయించడం ఈ బడ్జెట్ ప్రత్యేకతగా కనిపిస్తోంది. అంతిమంగా జరిగేదేంటంటే, ఈ విధానం ద్వారా రాష్ట్రానికి శాశ్వత ఆస్తుల రూపేణా దీర్ఘకాలిక వనరులు సమకూరుతాయి. బడ్జెట్ రూపొందించడమంటే కేవలం జమా ఖర్చుల పద్దు కాదు...ప్రభుత్వ విధి-విధానాల సమగ్ర ప్రమాణపత్రం...ఒక దస్తావేజు లాంటిది. ప్రతి శాఖకు సంబంధించిన విధి-విధానాలు మొదలు తయారు చేసుకున్న తరువాతే, బడ్జెట్ లో అవి అమలు చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపులు జరగాలి. అప్పుడే న్యాయ బద్ధమైన, సమ ధర్మంతో కూడిన అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా జరుగుతుంది. ఈ బడ్జెట్ ఆ ప్రాతిపదికపైనే జరిగిందనడంలో సందేహం లేదు.End

No comments:

Post a Comment