Monday, August 8, 2016

కమలాక్షీ! అప్రియమైన పని చేయకు! ...... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు ఎనిమిదవ భాగం-బాలకాండ, అయోధ్య కాండ : వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

కమలాక్షీ! అప్రియమైన పని చేయకు!
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
ఎనిమిదవ భాగం-బాలకాండ, అయోధ్య కాండ

వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (20-06-2016)

విశ్వామిత్రుడు అడిగినప్పుడు కామధేనువును ఇవ్వనని వశిష్టుడు చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు.అప్పుడా కామధేనువు-శబల మిక్కిలి విషాదంతో, తనేం తప్పుచేసానని,ఎందుకీ మునీశ్వరుడు తననీవిధంగా వదిలిపెడుతున్నాడని, దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, తన్నీడుస్తున్నవారిని నేలపై పడవేసి-తన్ని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. దీన్ని "సుగంధి" వృత్తంలో పద్యంగా రాసారు కవి ఇలా:

సుగంధి:        ఇట్టు లామునీంద్రుఁ  డాడి యీయ నన్న థేనువున్
                బట్టి  కట్టి  కొంచుఁ  బోవ బార్థివుండు  బల్మి మైఁ
                దొట్టఁ గన్  దురంతచింత  దుఃఖితాత్మ యౌచు న
                న్నిట్టు  వాయఁగా  మునీంద్రుఁ డేమి  తప్పు చేసితిన్-15

ఛందస్సు:      సుగంధి వృత్తానికి  ర-జ-ర-జ-ర గణాలు. తొమ్మిదింట యతి.

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలన్న తలంపుతో ఘోరమైన-కఠోరమైన తపస్సు చేస్తున్న సమయంలో,సమీపంలోని తీర్థంలో స్నానమాడేందుకు,అతి మనోహరమైన సౌందర్యంతో-మన్మథుడి ఆయుధమేమోనని అనుకుండే విధంగా కనిపిస్తున్న ఒక అప్సరస, విశ్వామిత్రుడిని మోసగించే ఉద్దేశంతో వచ్చింది. ఆమె సౌందర్యాన్ని వర్ణించేందుకు "కవిరాజవిరాజిత వృత్తం" లో ఒక పద్యాన్ని రాసారీవిధంగా వాసు దాసుగారు.

 కవిరాజవిరాజితము:
నళినవిలోచన  నూనమనోహర  నవ్యశరీర విహారరతన్
జలదవినీల శిరోరుహఁ గోరక చారురదన్ శిశిరాంశుముఖి
న్జలకము  లాడ ఘనాంతరచంచల నాఁ గని మారశరాహతుఁ డై
కలఁ గుచుఁ దామరపాకుజలం  బనఁ గాంతను డాసి వచించె నిటుల్-16
ఛందస్సు:      కవిరాజ విరాజితము ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము". దీనికి ఒక సిద్ధాంతం ప్రకారం 8-7-7స్థానాలలోనూ, ఇంకో సిద్ధాంతం ప్రకారం 14వ స్థానంలోనూ యతి వుంటుంది.

తాత్పర్యం:    
కమలాల లాంటి కళ్లతో, పూవువలె మనోహరమైన మెచ్చుకోవాల్సిన శరీరంతో, రతిక్రీడలో ఆసక్తితో, మేఘాలలాంటి నల్లటి కురులతో, మొగ్గలలాంటి దంతాలతో, చంద్రుడిలాంటి ముఖంతో అందంగా వున్న ఆ అప్సరస, మేఘాల మధ్య మెరుపుతీగలాగా నీళ్లల్లో స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు.చూసి, కామ బాణ పీడితుడై, మనస్సు కలవరపడగా, తామరాకుమీద పడిన నీళ్లు చలించినట్లు మనస్సు చలించడంతో, ఆ అందగత్తెను సమీపించి ఇలా అన్నాడు.

బాల కాండ చివరి పద్యం "తరలము" వృత్తంలో ఈ విధంగా రాస్తూ కాండలో మొత్తం ఎన్ని పద్యాలున్నాయో వివరిస్తారు వాసు దాసుగారు.
తరలము:      జలజవైరిమహీధరాగ్ని  శశాంకపద్యనిరూపితా
        తులితబాల్యవినోదఖేలన  తోయజాక్ష ! రమాధవా !
        కలశవారిధితుల్యసజ్జన  కాండ  చిత్తనివాసకా !
        కలుషసంహార ! యొంటిమిట్టని కాయి ! జానకి వల్ల భా ! -17

ఛందస్సు: ------ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
తాత్పర్యం:     జలజవైరి (చంద్రుడు)=1 , మహీధర (పర్వతాలు)= 7, అగ్ని అంటే త్రేతాగ్నులు= 3, శశాంక అంటే చంద్రుడు= 1. బాల కాండలో వాసు దాసుగారు ఎన్ని పద్యాలు రాసారో ఈ చివరి పద్యంలో పరోక్షంగా చెప్పారు. ఈ కాండలో మొత్తం 1371పద్యాలున్నాయి.

అయోధ్యా కాండ
          దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకొని అందరినీ సంప్రదించి వారి సమ్మతిని పోందాడు. తనకు కలిగిన అభిప్రాయాన్ని రాముడికి తెలియచేస్తూ, అతడికి పుట్టుకతోనే వినయం-సుగుణాలు వచ్చాయని, అతనికి సమానులైన వారు మనుష్యులలో ఎవరూ లేరని అంటూ దశరథుడన్న మరికొన్ని విషయాలను చెప్పేందుకు "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకుంటారు వాసు దాసుగారు. ఆ పద్యమిలా సాగింది:

మత్తకోకిలము:         నీ వెరుంగని యట్టినీత్యవి నీతు  లున్న వె  యెందునే ?
                        నేవి  క్రొత్తగ నీకు  నేర్పఁ గ నేను  నేర్తుఁ గుమారకా !
                        భావితాదృతిఁ జేసి  పుత్రక వత్సలత్వము పేర్మి  నే
                        నేవియో  యొకకొన్నిటిన్ వచి యించెద న్విను  నందనా !-18

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     కుమారా ! నీకు తెలియని నీతులు-అవినీతులు లేవు. నేను నీకు కొత్తగా ఏం నేర్పగలను? అయినా నీవు నా కొడుకువు కనుక, పుత్రవాత్సల్యం వల్ల కలిగిన ఆదరణతో, తండ్రులు కొడుకులకు హితోపదేశం చేయడం ధర్మం కనుక ఏవో కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను. నువ్వు నా కొడుకువు కావడంవల్ల నన్ను సంతోషపర్చడం నీకు తగిన కార్యం. తండ్రి బతికున్నంతవరకు ఆయన చెప్పినట్లు నడుచుకొనేవాడినే పుత్రుడంటారు. కాబట్టి నేను చెప్పినట్లు నీవు నడుచుకుంటే సంతోషిస్తాను. అలా అయితే నన్ను ఏమి చేయమందువా?



శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుంటాయి. ఆ సంబరం చూద్దామనుకుంటున్న అయోధ్యా పురజనులు గుంపులుగా వీధుల్లో తిరుగుతుంటారు. జనులలా గుంపులుగా గూడిన విధానాన్ని వర్ణించిన తర్వాత, ఆ వివరాలన్నీ గురువర్యుడైన వశిష్ఠుడి ద్వారా తెలుసుకొని, ఆయన అనుమతితో తన ఇంటికి పోతున్న వైనాన్ని వర్ణిస్తూ "మానిని" వృత్తంలో రాసారీ పద్యాన్ని కవి ఇలా:

మానిని:        వారల  నెల్లరఁ బోవఁ గఁ  బంచి నృపాలుఁ డు సింహము  శైలగుహన్
                జేరెడిరీతి సమగ్ర్యసువేషవి  శేషవధూజనతాకులజం
                భారినిశాంతమనోహరరాజగృ హంబును  జొచ్చి  సఋక్షగణో
                దారనభంబును జందురునట్టులు దా వెలిఁ గించె  స్వదీధితులన్ - 19

ఛందస్సు:      22 అక్షరాలతో, ఏడు "భ" గణాల గురువుతో, యతిస్థానంలో 7-13-19 అక్షరాలు కలిగి వుంటుంది. ప్రాస నియమం వుంది.
తాత్పర్యం:     దశరథ మహారాజు (సభలోని) సభ్యుల నందరినీ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చి, సింహం తన గుహలోకి పోయిన విధంగా,నానా విధాలైన నూతన అలంకారాలతో వుండి, స్త్రీ సమూహాంతో నిండిన, ఇంద్రుడి మేడలాంటి అందమైన తన గృహంలోకి ప్రవేశించి, తన (దశరథుడు) కాంతులతో, నక్షత్ర సమూహం మధ్య ఆకాశంలో వున్న చంద్రుడి లాగా ప్రకాశింప చేశాడు.

శ్రీరాముడికి దశరథుడు జరిపించదల్చుకున్న పట్టాభిషేకం గురించి తెలుసుకున్న కైకేయి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఆమె కోరిన వరాలకు పరితపించిన దశరథుడు కైకను దూషించాడు-శ్రీరాముడి గుణాలను వర్ణించాడు-కైకను వేడుకున్నాడు. చివరకు న్యాయ నిష్ఠూరాలాడాడు. రాముడిని అడవులకు పంపి జీవించ లేనన్నాడు. ఇలా కాదనుకొని మరొక్కసారి మెత్తని మాటలతో వేడుకోవడాన్ని"తరలము" వృత్తంలో చక్కగా రాసారీవిధంగా:
తరలము:      వనజలోచన ! కాననంబుల  పాలుగాఁ గ సుతుండు  నే
                మనుటె  కల్ల నిజంబు, సౌఖ్యము  మాట  యేటికె  చెప్పగా ?
                మనితిఁ బో పని యేమి నీవు ? సు మాళి  నౌదునె ? విప్రియం
                బును  ఘటింపకు  నీదు  కాళ్లకు  మ్రొక్కెదన్ మరి మ్రొక్కెదన్ - 20

ఛందస్సు: ------ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
తాత్పర్యం:     (ముఖ ప్రీతిమాటగా "కమలముల వంటి కన్నుల దానా-వనజలోచన" అని దశరథుడితో అనిపించాడు కవి). కోపం పట్టలేక తిట్టిన దశరథుడు, తిట్టడంవలన కార్యసాధన కాదని భావించి, మెత్తటి మాటలతో చెప్తున్నాడు. కమలాక్షీ ! నా కొడుకు అడవులకు పోతే, నేను జీవించడం అసత్యం. అలాంటప్పుడు నీతో ఎలా సుఖపడతాను ? ఒకవేళ బతికినా, శోకంలో మునిగి వుండేవాడినేగాని, సంతోషంతో వుండలేనుకదా ! అప్పుడు నీతో నాకేంపని ? కాబట్టి నాకు అప్రియమైన పని చేయకు. నీ కాళ్లకు మొక్కుతాను-మరీ,మరీ మొక్కుతాను.

కైక కోరిన విధంగా శ్రీరాముడు తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చడానికి అడవులకు పోయేందుకు నిశ్చయించుకుంటాడు. తాను అడవులకు వెళ్తున్న సంగతిని తల్లి కౌసల్యకు తెలియచేస్తాడు. పట్టాభిషేకం గురించి చెప్పడానికి వచ్చాడని భావించిన కొసల్య ప్రియంగా-హితంగా ఇచ్చిన దీవెనలను అందుకున్నాడు రాముడు. మెల్లగా భయంకరమైన వార్తను తెలిపాడామెకు. భరతుడికి యౌవరాజ్యమిచ్చే విషయాన్నీ చెప్పాడు. ఆ విషయాన్ని విన్న కౌసల్య దుఃఖిస్తుంది. ఆ సమయంలో, లక్ష్మణుడు కౌసల్యతో, శ్రీరాముడు అరణ్యానికి పోరాదని చెప్పే క్రమంలో, ఆయన గుణగణాలను వర్ణించడానికి-లక్ష్మణుడితో చెప్పించడానికి "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకున్నారు వాసు దాసుగారీవిధంగా:

మత్తకోకిలము:           దేవకల్పు ఋజున్ సుదాంతుని దేవి ! శత్రుల  నైన స
                 ద్భావుఁ డై  దయఁ జూచు  వాని నితాంతపుణ్యునిఁ బూజ్యునిన్
                 భూవరుం  డొకతప్పు  లేక  యుఁ బుత్రు  నెట్టిస్వధర్మ  సం
                 భావనం  బురిఁ బాసి  పొ మ్మనె  బ్రాజ్ఞు  లియ్యది  మెత్తురే ? – 21
ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు.పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     పరదైవంతో సమానుడై, చక్కటి నడవడిగలవాడై, ఇంద్రియ నిగ్రహం గలవాడై, శత్రువులనైన మంచి అభిప్రాయంతో దయతో చూసేవాడిని, మిక్కిలి పుణ్యవంతుడిని, ఎల్లవారికి పూజించేందుకు యోగ్యుడైనవాడిని, జ్యేష్ఠ పుత్రుడిని, ఒక్క తప్పైన చేయనివాడిని, మనుష్య మాత్రుడు-వక్రవర్తనుడు-ఇంద్రియ లోలుడు-నిష్కారణంగా భార్య కొరకై దండించేందుకు సిద్ధపడినవాడైన వాడు ఏ రాజధర్మాన్ని అనుసరించి నగరాన్ని విడిచి అడవులకు పొమ్మన్నాడు ?వివేకంగలవారు దీన్ని మెచ్చుకుంటారా ?


No comments:

Post a Comment