Saturday, August 6, 2016

చిక్కడపల్లి సత్యం మామయ్య ఇక లేరు : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
చిక్కడపల్లి సత్యం మామయ్య ఇక లేరు
వనం జ్వాలా నరసింహారావు
(17-04-2016)


చిక్కడపల్లిలో దాదాపు ఏడెనిమిది దశాబ్దాలకు పైగా నివసిస్తున్న మా మేనమామ కంకిపాటి సత్యనారాయణ రావు మొన్న ఏప్రియల్ 16, 2016 న స్వర్గస్థులయ్యారు. అంత్య క్రియలు (ఆయన చిన్న కుమారుడు గోపి అమెరికా నుంచి రావడం ఆలశ్యమైనందున) నిన్న ఏప్రియల్ 18, 2016 న సికిందరాబాద్ బన్సీలాల్ పేట శ్మశానవాటికలో జరిగాయి. మామయ్య సమీప బంధువులందరూ హాజరయ్యారు. మా అమ్మమ్మ-తాతయ్యల ఎనిమిది మంది సంతానంలో ఏడవ వాడైన మామయ్య ఆయన అక్కా చెల్లెళ్లలో, అన్నా తమ్ముళ్లలో మరణించిన వారిలో చివరి వాడు. రెండేళ్ల క్రితం మామయ్య కంటే ముందు మా అమ్మ సుశీల మరణించింది. మామయ్య చనిపోయిన నాడు మేము ఖమ్మంలో వున్నాం. ఆ క్రితం రోజున మా గ్రామం ముత్తారంలో శ్రీ సీతారాముల కల్యాణం జరిగినందువల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. మామయ్య మరణించిన రోజు అటు భద్రాచలం లోను, ఇటు మా గ్రామం ముత్తారం లోను శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. మామయ్యకు రామకోటి రాయడం ఎంతో ఇష్టం. ఐదారేళ్ల క్రితమే కోటి పర్యాయాలు రామకోటి రాయడం పూర్తయిన సందర్భంలో మామయ్య కుటుంబం, మా శ్రీమతితో సహా నేను, కలిసి భద్రాచలం వెళ్లొచ్చాం. చాలా సరదాగా గడిచిందా పర్యటన. మామయ్య గత ఐదారేళ్లుగా అస్వస్థతకు గురైన నేపధ్యంలో తరచుగ ఆయనను చూడడానికి నేను మా శ్రీమతి కలిసి వెళ్లినప్పుడల్లా భద్రాచలం వెళ్లొచ్చిన సంగతులను మామయ్య పదే పదే నెమరేసుకునేవారు. మామయ్య చనిపోయినప్పుడు ఒక్క సారిగా ఎన్నో సంగతులు జ్ఞాపకానికొచ్చాయి. అన్నింటికన్నా ముఖ్యమైంది...నేను, మామయ్య ఇంట్లోనే వుండి డిగ్రీ చదువుకున్నాను. అత్తయ్య విమలమ్మ పెట్టిన భోజనం ఎప్పటికీ మరవలేను. సత్యనారాయణరావు మామయ్య డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ రావడమే కాకుండా, మా కుటుంబానికి చెందినవారిలో మొదటి గ్రాడ్యుయేట్.


మా వివాహం అయిన కొత్త రోజుల్లో కూడా నేను మా శ్రీమతితో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మామయ్య ఇంట్లోనే వుండేవాళ్లం. ఆ తరువాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో నివసించడం మొదలైన తరువాత గడిచిన నాలుగు దశాబ్దాలుగా కనీసం నెలకో సారైనా మామయ్య ఇంటికి వెళ్లి రావడం జరిగేది. నాకన్నా ఎక్కువగా మా శ్రీమతి విజయలక్ష్మి అంటే మామయ్యకు, అత్తయ్యకు ఎక్కువ ప్రేమ. వాళ్ల పెద్ద కూతురుగా భావించే వారిద్దరూ. కొన్ని సంవత్సరాలు మేం వాళ్లింటి ఎదురుగా వున్న ఓ పోర్షన్ లో అద్దెకుండే వాళ్లం. అప్పుడైతే ప్రతి రోజూ కలిసే వాళ్లం.

మరిన్ని వివరాలు....


మా అమ్మ సుశీల పుట్టింది బలపాలలోనైనా, పెరిగింది దత్తతొచ్చిన నాచేపల్లి గ్రామంలో. మా వరకు మాకు అమ్మమ్మ గారంటే నాచేపల్లిలోని సుభద్రమ్మ గారు, తాతయ్యంటే ముదిగొండ వెంకట్రామనర్సయ్య గారే. వారికి సంతానం కలుగనందున మా అమ్మను చిన్నతనంలోనే తెచ్చుకొని పెంచుకున్నారు. మా అసలు అమ్మమ్మకు పురుడు సమయంలో కొంచెం మతిస్థిమితం తప్పేదని అంటారు. అందుకే పసిగుడ్డుగా వున్నప్పుడే అమ్మను నాచేపల్లికి తెచ్చుకున్నారు. బలపాల అమ్మమ్మ-తాతయ్యల(లక్ష్మీ నర్సమ్మ-వెంకటేశ్వర రావు గార్లు) కు నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు కలిగారు. ఆమ్మ లలితమ్మ గారు అందరి లోకి పెద్ద. ఆమెను గోకినేపల్లి గ్రామానికి చెందిన రావులపాటి సీతారాంరావు గారికిచ్చారు. తర్వాత రమణారావు గారు (భార్య మా గ్రామంలో పుట్టిన మధురమ్మ గారు). మూడో ఆమె రుక్మిణమ్మ గారు. నాలుగో ఆమే మా అమ్మ. నాచేపల్లికి దత్తతగా వచ్చింది. ఐదో సంతానం వెంకట కిషన్ రావు-భార్య మా గ్రామంలో పుట్టిన లక్ష్మిబాయి గారు-మధురమ్మ గారి చెల్లెలు. (వారి రెండో కూతురునే మా దత్తత పోయిన తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు). కిషన్ రావు గారి తర్వాత రాజేశ్వర రావు గారు-భార్య లక్ష్మీ నర్సమ్మ. వీరి పెద్దమ్మాయిని మా రెండో తమ్ముడు వివాహం చేసుకున్నాడు. ఆయనా దత్తత పోయి జగన్నాథరావుగా పేరు మార్చబడి నేలకొండపల్లిలో వుండేవారు. తర్వాత మా చిన్న మామయ్య సత్యనారాయణ రావు గారు. ఆఖరున భారతమ్మ గారు పుట్టారు. ఆమెను భైర్నపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు గారు వివాహమాడారు. మా అమ్మ అసలు (జన్మస్థానంలో) పుట్టింటి వారి పేరు "కంకిపాటి" కాగా, దత్తత పోయినవారి పుట్టింటి పేరు "ముదిగొండ".


          మామయ్య ఇంటి పేరైన కంకిపాటి వారి గోత్రం "కణ్వస"-ఋషులు అంగీరస, అజామీళ, కణ్వస. మా బలపాల అమ్మమ్మ గారి పుట్టిల్లు, మా నాచేపల్లి అమ్మమ్మగారి పుట్టిల్లు మా పక్కనున్న కమలాపురం గ్రామానికి చెందిన "వనం" వారి కుటుంబం. నాచేపల్లి అమ్మమ్మకు స్వయానా మేనకోడలు బలపాల అమ్మమ్మ. ఆమె స్వయానా తమ్ముడి కొడుకే, నాకు అత్యంత ఆప్తుడు, కమ్యూనిస్ట్ పాఠాలు నేర్పిన బాబాయి వనం నరసింగరావు. ఆయన అక్క గారే, మా నేలకొండపల్లి మామయ్య రాజేశ్వర రావు గారి భార్య.


          ఖమ్మంలో బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకున్న నేను, మిగతా రెండేళ్లు హైదరాబాద్ లో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. నేను-మా నాన్న గారు, హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఉద్యోగం చేస్తూ, చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క సందులో నివాసముంటున్న మేనమామ కంకిపాటి సత్యనారాయణ రావు గారిని సంప్రదించాం. మామయ్య అని నేను సంబోధించే సత్యనారాయణ రావు గారు హైదరాబాద్‌లోనే తన డిగ్రీ చదువు పూర్తి చేశారు. విశ్వవిద్యాలయంలో టాప్ రాంకర్‍గా (యూనివర్సిటీ ఫస్ట్) డిగ్రీ పరీక్ష పాసయ్యారాయన. మంచి స్టయిలిష్‍గా, ఎల్లప్పుడూ టిప్-టాప్‌గా వుండేవారు. సచివాలయంలో ఎల్డీసి గా చేరిన మామయ్య సహాయ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. నీతికి-నిజాయితీకి మారు పేరు. లక్షలాది రూపాయలు లంచంగా పొందగలిగే అవకాశమున్న గనుల శాఖలో ఉద్యోగం చేసినప్పటికీ పైసా అక్రమ సంపాదన చేయని ఉన్నతమైన వ్యక్తి ఆయన. మా అత్తయ్య విమలమ్మ ఆయనకు అన్ని విధాల తగిన సహధర్మచారిణి. తింటే ఆమె చేసిన వంటే తినాలి...అంత రుచిగా వుంటుంది.


            అప్పట్లో మామయ్య కుటుంబం మాకు వరసకు బంధువైన గూడూరు వారింట్లో ఒక పోర్షన్‌లో అద్దెకుండేది. పక్క పోర్షన్‌లో మా అత్తయ్య సొంత అన్న గారు (ఆయన ఎజి కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు) వెంకట్ రామారావు గారు అద్దెకుండేవారు. దరిమిలా ఆ ఇంటిని ఆయన కొనుక్కున్నారు. సుమారు ఐదు దశాబ్దాల క్రితం, ఆ ఇంటి ఎదురుగా వున్న 150 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని మామయ్య కొనుక్కుని, అందులో చిన్న రెండస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. 83 సంవత్సరాల వయస్సులో చనిపోయేంత వరకూ, మామయ్య, 80 సంవత్సరాల వయస్సులో వున్న మా అత్తయ్య, ఆయన ఉమ్మడి కుటుంబం ఆ ఇంటిలోనే నివసిస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో మామయ్యకు నలుగురు (విజయ్ రాధా కిషన్, నాగన్న, జయ, పద్మ) పిల్లలుండేవారు. తరువాత మరో నలుగురు (శీను, గోపి, జానకి, చిట్టి) పుట్టారు. మామయ్య కుటుంబం, మా అత్తయ్య సోదరుడి కుటుంబం (ఆయనకు ముగ్గురు పిల్లలు) ఎంత కలిమిడిగా వుండేవారంటే, ఇరు కుటుంబాలకూ కలిపి ఒకే వంట ఇల్లుండేది. ఒక నెలంతా ఒకరి పోర్షన్‌లోని కిచెన్‌లో వండితే మరుసటి నెల మరొకరి పోర్షన్‌లో ఆ పని జరిగేది. అందరూ ఒకే చోట భోజనం చేసేవారు. ఖర్చు చెరిసగం పంచుకునేవారు. ఎవరింటికి బంధువులొచ్చినా, వారిని, ఇరువురూ తమ బంధువులాగానే చూసుకునేవారు. నాకు గుర్తున్నంతవరకు కనీసం పాతిక-ముప్పై సంవత్సరాలన్నా అలా కలిసి మెలిసి భోజనాలు చేశారు. పిల్లలు పెరిగిన తరువాత క్రమేపీ ఎవరి వంట వారే చేసుకోవడం మొదలైంది. ఇద్దరి పిల్లలూ చక్కగా పైకొచ్చారు...ఉద్యోగాలు చేసుకుంటున్నారు.


          మామయ్య పిల్లలందరూ చక్కగా సెటిల్ అయ్యారు. మామయ్య దంపతులు మనుమ రాళ్ల పెళ్లిల్లు చూశారు. పెద్ద వాడైన కృష్ణ బుద్ధిమంతుడు. అలానే మిగతా అందరూ. అందరూ కలిసి బాధ్యతగా మరణానంతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భగవంతుడు మామయ్య ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాను.


(ఆగస్ట్ 8, 2008 న మా షష్టిపూర్తి సందర్భంగా మామయ్య, అత్తయ్య కృష్ణా ఒబెరాయ్ రోడ్డులో వున్న ఎంకేఎం గ్రాండ్ హోటెల్ లో జరిగిన కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ నాటి ఫొటోలను నేను భద్రపరుచుకున్నాను. ఆ ఫొటోలతో పాటు, మామయ్య డిగ్రీ పూర్తి చేసుకున్నప్పుడు కాన్వొకేషన్ కు హాజరైనప్పటి ఫొటో కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను....జ్వాలా)

No comments:

Post a Comment