Wednesday, July 1, 2020

నిలువెత్తు నిస్వార్థం (దశరథుడి మృతి, అడవికి భరతుడి ప్రయాణం) : వనం జ్వాలా నరసింహారావు


నిలువెత్తు నిస్వార్థం
(దశరథుడి మృతి, అడవికి భరతుడి ప్రయాణం)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ చింతన (02-07-2020)

శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన ఆరవనాటి అర్థరాత్రి దశరథుడు చింతిస్తూ ప్రాణాలు విడిచాడు. రాజు మరణ వార్త చెప్పడానికి పరిచారకులు కౌసల్య దగ్గరకు పోయారు. కౌసల్య మూర్చపోయింది. తక్కిన స్త్రీలు, కైక, సుమిత్ర దుఃఖ పడ్డారు. బంధువులందరూ రాచపీనుగు చుట్టూ గుమిగూడి ఏడవసాగారు. కైకను కౌసల్యతో పాటు అందరూ దూషించారు.

ఇలా విలపిస్తుండగా, రాజకీయ వ్యవహారాలు తెలిసినవారు వచ్చి, కౌసల్యను ఓదార్చి, రాజు దేహాన్ని నూనె కాగులో వుంచి, దశరథుడి కొడుకులు ఒక్కరైనా లేకపోవడంతో దహనం చేయడానికి బదులు ఇంట్లోనే భద్రపరిచారు. ఆ తరువాత చేయాల్సిన పనుల గురించి ఆలోచన చేశారు. దశరథుడి భార్యలందరూ దుఃఖంలో మునిగిపోయారు.

ఆ తరువాత శ్రీరాముడు అడవులకు పోయిన ఎనిమిదవ రోజు ఉదయం రాజును నిర్ణయించే అధికారం కల బ్రాహ్మణ పెద్దలు గౌతముడు, మౌద్గల్యుడు, కాత్యాయనుడు, మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, వామదేవుడు, మంత్రులతో సభ తీరారు. వీరంతా వసిష్ట మహర్షిని చూసి “మునీంద్రా! రాజు మరణించడం వల్ల, రాజకుమారులెవరూ దగ్గర లేకపోవడం వల్ల, గొప్పవారైన రాజకుమారులలో ఎవరినైనా ఒకడిని పురానికి రాజుగా చేయాలి. అలా కాకపొతే సంకటంలో పడిపోతాం” అన్నారు. 

         రాజపురోహితులు, మంత్రులు చెప్పిన మాటలు విన్న వశిష్ఠుడు, భరతుడికేకదా రాజు రాజ్యాన్ని ఇచ్చింది కాబట్టి, మేనమామ ఇంట్లో వున్న భరతుడిని దూతలను పంపి రమ్మని చెప్దాం అని అంటాడు. వశిష్ఠుడి మాటలకు వారందరూ సరే-సరే అన్నారు. అదే రాజనియమం అన్నారు. అదే బాగుంటుందని అందరూ అంగీకరించిన తరువాత, సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే పేర్లుగల దూతలను పిలిచి భరతుడి దగ్గరకు పోయి, వశిష్ఠుడి ఆజ్ఞగా, ఏదో ముఖ్యమైన పని ఉన్నందున ఎంత మాత్రం ఆలశ్యం చేయకుండా వెంటనే బయల్దేరి రమ్మన్నారని మాత్రం చెప్పండి అని అన్నాడు. శ్రీరాముడు అరణ్యానికి పోయాడని కాని, తండ్రి మరణించాడని కాని, భరతుడితో చెప్పవద్దు అని కూడా చెప్పాడు. వారలాగే వేగంగా పరుగెత్తే గుర్రాలను ఎక్కి ప్రయాణమై పోయి, కేకయ రాజు పట్టణమైన గిరివజ్రపురానికి చేరారు. దూతలు రాత్రంతా ఒక చోట గడిపి భరతుడి దర్శనం కొరకు ఎదురుచూశారు.

           ఏ రాత్రైయితే దూతలు భరతుడున్న నగరం ప్రవేశిoచారో అదే రోజు రాత్రి భరతుడు తెల్లవారు ఝామున ఒక చెడ్డ కల కని భయపడ్డాడు. ఆ కలలో, మాసిన దేహంతో, తల విరియబోసుకుని, కొండమీద నుండి తాను పేడమడుగులోకి దూకినట్లు, అందులో కప్పగంతులు పెట్టుకుంటూ, నవ్వుతూ, దోసెట్లో నూనె తీసుకుని నూనె అన్నం తిని తాగినట్లు, తలకిందికి కాళ్లు పెట్టుకుని పైనుండి నూనె దేహానికి రాసుకున్నట్లు, నూనెలో మునిగునట్లు, సముద్రాలు ఎండినట్లు, చంద్రుడు నేలమీద పడ్డట్లు, గాడాంధకారం లోకమంతా వ్యాపించినట్లు, పట్టపు ఏనుగు దంతం విరిగినట్లు కల వచ్చింది. నిప్పు చల్లగా అయిందనీ, భూమి పగుళ్లు పారిందనీ, చెట్లు ఎండిపోయాయనీ, కొండలు పోగరాజుకున్నాయనీ, నల్ల ఇనుప పీటమీద నల్ల కాంతిగల వస్త్రం ధరించి, దశరథుడు ఆయన్ను నల్లటి, పచ్చటి స్త్రీలు పరిహసిస్తుంటే, నవ్వుతుంటే, ఎర్రటి పూడండలు ధరించి గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా పోయినట్లు కలగన్నానని స్నేహితులతో అన్నాడు.

“ఎర్రటి గుడ్డ కట్టుకున్న ఒక స్త్రీ రాజును చూసి నవ్వుతున్నది. వికారపు ముఖం కల ఒక రాక్షసి నా తండ్రిని బలాత్కారంగా లాగుతున్నది. ఇలాంటి భయంకరమైన కలగన్నాను. ఈ కల ఫలితం ఏమంటారు? దశరథుడో, రాముడో, లక్ష్మణుడో, నేనో మరణించడం కలుగుతుంది. ఇంతకు ముందు ఎన్నడూ రాని ఇలాంటి పీడకల నన్ను నానా విధాలుగా పీడిస్తున్నందువల్ల, నా జనకుడికి ఏదో కీడు కలిగిందని అనుమానిస్తున్నాను” అని అన్నాడు భరతుడు.

         రామాయణంలో దశరథ, భరత, త్రిజటలు స్వప్నాలు కన్నట్లు చెప్పడం జరిగింది. ముగ్గురి కలలు నిజమయ్యాయి. ఈ విషయం శాస్త్ర, ఇతిహాసాలలో కూడా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి స్వప్నాలు నిజమవుతాయే కాని అబద్ధం కాదు.


         ఈ విధంగా తన కల గురించి స్నేహితులకు వివరిస్తూ, పిచ్చివాడిలాగా తిరుగుతూ, తండ్రిని స్మరించుకుంటూ, చింతిస్తుండగా, రాజ దూతలు వచ్చారు ఆయన దగ్గరకు. అయోధ్యకు ప్రయాణానికి సిద్ధం కమ్మని వసిష్ట మహర్షి ఆజ్ఞగా చెప్పారు. సమ్మతించిన భరతుడు అయోధ్యకు ప్రయాణమై పోయాడు. మొత్తం ఏడు రాత్రులు ప్రయాణం చేశాడాయన. ఎనిమిదవ దినం ఉదయాన్నే దూరం నుండి అయోధ్యను చూసి సారథితో ఇలా అన్నాడు.

          “చూశావా సారథీ! అయోధ్య ఎలా వుందో? నెత్తురులేనివాడి ముఖంలా, తెల్లగా పాలిపోయి, దూరంనుండి చూస్తుంటే, ఈ అయోధ్య విషయంలో నాకు సంతోషం కలగడం లేదు. కారణం ఏమై వుంటుంది? మనుష్య సంచారం లేని అడవిలాగా కనిపిస్తున్నది నాకు అయోధ్య. ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఏదో సందేహం కలుగుతున్నది. శకునాలు మంచిగా లేవు. హృదయం కలత చెందుతున్నది. ఇది నిశ్చయం. నా సమీప బందువులెవరికో, ఏదో, అశుభం కలిగింది” అని అంటూ భరతుడు నగరంలో ప్రవేశించి సారథితో మరల ఇలా అన్నాడు.

         “సారథీ! పెద్దలు దశరథుడు, శ్రీరాముడు వుండగా, వసిష్ఠుడు నన్నెందుకు పిలిపించాలి? తొందరగా రమ్మని వసిష్ఠుడు పిలిచినప్పుడు  దానికేదో కారణం వుండాలికదా? ఇవన్నీ చూస్తుంటే ఏదో కీడు జరిగిందన్న అనుమానం కలుగుతున్నది. రాజు మరణిస్తే ఏం జరుగుతుందో అవన్నీ ఇప్పుడీ వూళ్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పరితాపం కలుగుతున్నది”. ఆ తరువాత కలతచెందిన మనసుతో తండ్రి వుండే మేడవైపు పోయాడు భరతుడు.

తండ్రి ఎప్పుడూ వుండే మేడకు పోయి అక్కడ ఆయన లేకుంటే, తల్లి కైకేయి ఇంటికి పోయి, ఆమె పాదాలకు నమస్కరించాడు. “ఎందుకు రాజబంధువులు, రాజునకు సంబంధించిన ఇతరులు దుఃఖపడుతున్నారు? రాజెప్పుడూ నీ ఇల్లు విడిచిపోడుకడా? ఇప్పుడెందుకు లేడు?” అని అన్నాడు.

          తాను చెప్పబోయే వార్త భరతుడికి సంతోషం కలిగిస్తుందన్న ఆశతో కైక ఇలా అంది. “నాయనా! నీ తండ్రి సామాన్యుడా? భూమ్మీద పుట్టినవారు ఏ తోవన పోతారో ఆ దారిలోనే ఆయనా పోయాడు. అని తండ్రి మరణవార్తను భరతుడికి చెప్పింది. ఆ వార్త విన్న భరతుడు ఆర్తుడై “హా! తండ్రీ” అని నేలమీద చచ్చిపోయినవాడిలాగా పడిపోయాడు. కైక కొడుకును తన చేతులతో పట్టి మెల్లగా లేపింది. తండ్రి మరణించే ముందర చివరిగా తనకు చెప్పమని చెప్పిన హితవాక్యాలు వినాలని వుంది” అని అన్నాడు. కైక ఉన్నదున్నట్లు ఇలా చెప్పింది భరతుడికి.

         “రామా! సీతా! లక్ష్మణా! అని మిక్కిలి దుఃఖంతో ఏడుస్తూ, ఏడుస్తూ, రాజు స్వర్గానికి పోయాడు. నారచీరెలు కట్టుకుని శ్రీరాముడు సీతతో, లక్ష్మణుడితో దండకారణ్యానికి పోయాడు. కారణం ఏమిటంటావా? శ్రీరాముడిని అడవులకు పంపమని, నిన్ను రాజుగా చేయమని, నేనేరా నీ తండ్రిని కోరాను. తాను చెప్పిన మాటపై నిలిచి నీ తండ్రి తమ్మునితో, సీతతో, శ్రీరాముడిని అడవులకు పంపాడు. అలా పంపిన తరువాత తన ప్రియకుమారుడిని చూడకుండా వుండలేక దుఃఖంతో చనిపోయాడు. పురోహితులు నీ రాకకొరకు ఎదురు చూస్తున్నారు. ధైర్యం తెచ్చుకుని పట్టాభిషేకానికి సిద్ధంకా. రాజునకు కావాల్సిన సంస్కారాలు ముగియగానే బ్రాహ్మణులు నీకు అభిషేకం చేస్తారు”.

         కైక ఇలా భరతుడితో చెప్పగానే, తల్లితో, “నా తండ్రిని, తండ్రితో సమానమైన రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రమూర్తిని విడనాడి ఏడిచే ఈ అనాధకు, నిర్భాగ్యుడికి ఐశ్వర్యం ఎందుకు? రాజ్యం ఎందుకు? ఓసీ క్రూరురాలా! రాజును చంపావు. సాదుగుణాలున్న శ్రీరామచంద్రుడిని అడవుల పాలు చేశావు. పుండుమీద కారంలాగా తీవ్ర దుఃఖంలో వున్న నాకు మరింత బాధ కలిగించావు. ఓసీ దుష్ఠురాలా! మా వంశాన్ని నాశనం చేయడానికి నువ్వెక్కడనుండి దాపరించావే? సమస్త లోకాలను నాశనం చేసే కాళరాత్రిలాగా రాజును చంపావుకదా? బుద్ధిలేని దానా! అజ్ఞానంతో, ధనకాంక్షతో, నీ వంశ సుఖాలన్నీ నాశనం చేశావుకదా? నిన్ను పెళ్లి చేసుకున్న కారణాన రాజు దిక్కులేనివాడిలాగా చచ్చిపోయాడు కదా! ఓసీ పాపాత్మురాలా! నా తండ్రిని చంపినట్లే నన్ను చంపాలనుకున్నావు. నా తండ్రిలాగా నీ మాయ మాటలకు లోబడను. నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తాను. ఆ శ్రీరాముడిని పట్టణానికి మరల వచ్చేట్లు చేస్తాను. అగ్నిప్రభ కల ఆయన్నే రాజుగా చేసి స్థిరమైన అంతఃకరణతో ఆయనకు దాసుడనై, చత్రచామరాదుల సేవ చేస్తూ, ఆయనకు సంతోషం కలిగిస్తాను. ఇది నా స్వరూపస్వభావం. నా స్వరూపం వల్లే నేను ఆయనకు దాసుడిని”.

         “శ్రీరామచంద్రమూర్తి రాజైతే కౌసల్య రాజమాత అవుతుందనీ, గౌరవించబడుతుందనీ, సవతికి ఇలాంటి గౌరవం రాకుండా నీకు రావాలని ఆలోచన చేశావు. నువ్వు ఏడుస్తుండగానే శ్రీరాముడిని రాజును చేస్తాను. కౌసల్యకే రాజమాత అనే గౌరవం కలిగిస్తాను. శ్రీరాముడెలా మునివేషంతో అడవులకు పోయాడో, అలాగే నేను, నువ్వు చూస్తుండగానే మునివేషంతో అడవులకు పోతాను. ప్రజలు ఏడుస్తున్నది శ్రీరాముడికి రాజ్యం రాలేదని కాదు, శ్రీరాముడు అన్యాయంగా అరణ్యాలపాలైనాడని ఏడుస్తున్నారు. లోకులెలా ఏడ్చారో అలానే నువ్వూ ఏడవాలి. శ్రీరాముడిని అడవులకు పంపిన పాపం పోవాలంటే ఆయన్ను మరల తీసుకువచ్చి రాజును చేయడమే. ఆయనను భూమికి రాజును చేసి నేను పుణ్యుడనవుతాను”.

         ఇలా కైకతో మాట్లాడిన భరతుడు, శత్రఘ్నుడితో కలిసి, కౌసల్య ఇంటికి పోయాడు. వినయంగా చేతులు ముకుళించి కౌసల్యతో ఇలా అన్నాడు: “తల్లీ! ఇక్కడి పట్టాభిషేక విషయంకాని, అది నాతల్లి విఘ్నం చేసిన సంగతికాని, శ్రీరాముడిని అడవులకు పంపిన పాపపు చరిత్రకాని, నాకు తెలియదు. అన్నను అడవుల పాలు చేసేంతటి పాపాత్ముడనా?”. ఇది భరతుడు కేకయపురం విడిచిన ఎనిమిదవనాటి సంగతి.

ఇక ఆతరువాత, ఆచార్యులు, ఋత్విక్కులు, పురోహితులు జరగాల్సిన పనులు శాస్త్రప్రకారం జరిపించడానికి సన్నాహాలు చేశారు. గంధం చెక్కలతో పేర్చిన చితిమీద రాజు దేహాన్ని వుంచారు. ఋత్విజులు మంత్రాలు చెప్పారు. భరతుడు అగ్ని మండేట్లు చేశాడు. రాజస్త్రీలైన కౌసల్య, ఇతరులు, పల్లకెక్కి పురాన్ని విడిచి భరతుడున్న చోటుకు పోయి, శవానికి ప్రదక్షిణగా, అప్రదక్షిణగా తిరిగారు. తరువాత పల్లకీలలో సరయూ నదీతీరం చేరి, స్నానం చేసి, పదిరోజులు సూతకంతో నేలమీద పడుకుని గడిపారు. పదకొండో రోజున భరతుడు అశౌచాన్ని ముగించాడు. పన్నెండో రోజున పున్యాహవచనం లాంటి కర్మలన్నీ జరిపాడు. తరువాత పదమూడోరోజున రాజకుమారుడు అస్తికల సంచయనం చేసి, వెక్కి-వెక్కి ఏడుస్తూ మూర్చపోయి నేలమీద పడ్డాడు. ఇలా పడ్డ భరతుడిని పక్కనున్న వారు లేపారు.

అప్పుడు, జ్ఞాని అయిన మౌని వశిష్ఠుడు భరతుడితో, “భరతా! పదమూడవ రోజు జరుగుతున్నది, వ్యర్థంగా కాలం గడపడం తగదు అనగానే, ఆ కార్యక్రమం అయిన తరువాత, పదునాల్గవ నాటి ఉదయాన, సింహాసనానికి రాజును చేయడానికి అధికారం వున్న రాజకర్తలు భరతుడితో, రాజ్యాన్నంతా తీసుకుని పాలించమని కోరారు. అన్న శ్రీరాముడిని రాజును చేసి, ఆయనకు బదులుగా, తానే అడవుల్లో పద్నాలుగేళ్లు వుంటాననీ, ప్రయాణ సన్నాహాలు చేయమనీ, అన్న శ్రీరాముడిని నగరానికి తెస్తాననీ, అభిషేక వస్తువులను అడవికే తెమ్మనీ, అరణ్యంలోనే ఆయనకు పట్టాభిషేకం చేద్దాం అనీ, కాబట్టి ఆయన వున్న చోటుకు పోవడానికి దారి ఏర్పాటుచేయండనీ అంటూ అడవికి ప్రయాణమయ్యాడు భరతుడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment