Monday, July 27, 2020

ముద్దుబిడ్డ-‘బాంబే మీనాక్షి’ తొలి పరిచయం .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


ముద్దుబిడ్డ-‘బాంబే మీనాక్షి’ తొలి పరిచయం
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(సెప్టెంబర్ 3-9, 2000)
         ప్రజానాట్యమండలితో సన్నిహిత సంబంధాలున్న కృష్ణాజిల్లా వాస్తవ్యులు ఏసుదాసు, అమృతయ్య గార్లతో డప్పుల వాయింపు కాంబినేషన్లో, ముద్దుబిడ్డ సినిమాలో రికార్డు చేసిన రెండు మంచి పాటల్లో ఒకదానిలో నలుగురైదుగురు నాట్యం చేసే సన్నివేశం ఒకటుంది. ప్రధానంగా అందులో, డ్యాన్సర్‌గా 'బాంబేమీనాక్షి’ గారిని పరిచయం చేస్తారు తిలక్.  ప్రముఖ హిందీ చలన చిత్ర దర్శక నిర్మాత శాంతారామ్ గారు తీసిన ‘తీన్ బత్తి-చార్ రాస్తా’ సినిమాలో అప్పటికే ఆమె హీరోయిన్ గా నటించింది.

         సినిమాలోని కారెక్టర్లు మధు (జగ్గయ్య), రాధ (జమున)ల వివాహం అయిన తర్వాత ఏర్పాటు చేసిన రిసెప్షన్ సందర్భంగా చిత్రీకరించిన పాటలో బాంబే మీనాక్షి ప్రధాన డ్యాన్సర్.  పలువుర్ని ఆకర్షించిన ఆ పాటను పరోక్షంగా ఆందం-అన్యోన్యం (జమున-జగ్గయ్య) గురించిన ప్రస్తావనతోపాటు, మూర్చ జబ్బున్న రాధ (జమున), డాక్టర్ మధుతో (జగ్గయ్య) ఎలా సంసారం చేయనున్నదో-చేయాలో కూడా జానపద గీతంగా మలచారు శ్రీ ఆరుద్ర.  ఇలా సాగుతుందా పాట.

‘పదరా సరదాగా పోదార పదరా -బావా చిందేసుకుంటూ-
ఘల్లు ఘల్లుమని గుండెలదరగ- చల్లని రేతిరి సరసాలాడగా-
పదరా- బావా -ఈడూ జోడూ ఇంపుగా కుదిరే- పాలు తేనె కలిసినట్లుగ-బావా పదరా-
నా సోగ కన్నులు కాయలు కాచెను- కాసుకొని వున్నాను నీకోసమే-
దాచిన వలపంత దోచుకొని పోయావు- కాసుకొని నీకోసమే
మొక్కజొన్న చేలలోన పక్క పక్క నడుచుకుంటూ
చక్క చుక్కని కలలు కంటూ సుతారంగా చూపులు చూస్తూ
- చూస్తూ చూపులతోనే సోలిపోదాం - బావా పదరా’

         ముద్దుబిడ్డ సినిమాలో ఇ వి సరోజ డ్యాన్సును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. డాన్సు డైరెక్టర్ వేణుగోపాల్‌ పొగడ్తనందుకున్నారామె ఆ డాన్సుకు. జమీందారుగారి బంగ్లా ఆవరణలో చేసిన ఆ డ్యాన్సు పాట కూడా భావగర్భితమైందే. డ్యాన్సు పూర్వరంగంలో, సినిమాలోని తోటి కోడళ్లు (జమున, లక్ష్మీరాజ్యం) తగవులాడుకుంటారు. జమున తన భర్త జగ్గయ్యతో తమ స్వంత (కొత్త) ఇంటికి వెళ్తుంది. అయితే బావగారు (నాగయ్య), తోడికోడలు (లక్ష్మీరాజ్యం) రాకుండా గ్రహప్రవేశం జరుగటానికి వీలు లేదంటుంది జమున. భర్త జగ్గయ్య వదినగారిని తీసుకొస్తారు ఒప్పించి. అయితే, ఆడబిడ్డ సూర్య కాంతం స్వార్థంతో తన కొడుకునే పిల్లల్లేని జమున-జగ్గయ్యల కొడుకుచేయాలని ఆలోచించి, ముద్దుబిడ్డ’ (నాగయ్య, లక్ష్మీరాజ్యం కొడుకు) తో ఎవరికి తెలియకుండా ఒట్టేయించుకుంటుంది. తాను తన పెంపుడు తల్లి జమునకు కనిపిస్తే ఆమెకేదైనా అవుతుందని నమ్మకం కలిగిస్తుందా బిడ్డకు. ఒక వేళ ఆవిషయం ఎవరినా చెప్తే తలపగిలిపోతుందని కూడా చెప్పింది. ఆ నేపథ్యంలో ‘పట్టు’ మీద వ్రాసిన పాట ఇవి. సరోజా డ్యాన్సుతో చిత్రీకరించారు తిలక్. ఆ పాట ఇలా సాగుతుంది.

‘ఓరోరీ మామా వయ్యారి మేన మామా! వస్తావా లేకపోతే ఒట్టేస్తా కాచుకో...
పట్టిన పంతం వదిలేయ-పట్నం పోవాలి పిల్లా- పొట్టి బతిమాలుకుంటా
వట్టేసుకుంటే మామా ముట్టనురా అన్నం ముద్దా-
కట్టునురా పట్టు చీరా- జట్టు ముడివేయను మామా-
వొట్టేసి కైకపోతే- నట్టడవి పట్టెరాముడు-
వట్టేసిన ద్రౌపదివోలె-సుట్టాలు కొట్టుక సచ్చిరి-
సూరేడు గహనం ఆడిన -సుమతీ కథ తెలుసా మామా.
కట్టుకున్నాడే ప్రానం- వట్టేసి నిలుపుకుంది--
ఎంతేసి మొనగాళ్ళైనా-పంతాల కాంతకు దాసులు-
ఒట్టు తీసి గట్టున పెట్టు-వస్తానే సంతనపిల్ల.....


         ముద్దుబిడ్డ సినిమాలో ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటలున్నాయి. 'దీక్ష’ సినిమాలో ఆత్రేయ వ్రాసిన ‘పోరా బాబు పోయి చూడరా లోకం పోకడ' అన్న మోస్తరిగా ఆరుద్ర ముద్దుబిడ్డకు ‘చూడాలని వుంది- అమ్మా నిను చూడాలని వుంది’... అనే పాట వ్రాస్తారు. సుశీల పాడిన ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు జలుబు గొంతుకతో ఎలా పాడగలను అని ఆవిడ సందేహం వెలిబుచ్చగా, మీకెందుకు ఆలానే పాడమని తిలక్ ప్రోత్సహించారు. అన్నిట్లోకి ఆ పాటే బాగా వచ్చిందట. ఆ పాటను గుర్తు చేసుకుంటూ, పూర్వరంగాన్ని కూడా చెప్పారు. తిలక్, వట్టేసుకున్న 'ముద్దు బిడ్డ’ గృహ ప్రవేశానికి పోడు. ఆ తర్వాత వంటరిగా ఇంట్లో వుంటాడో సందర్భంలో.  తల్లిని (జమునను) చూడాలని వుంది, కాని చూస్తే అమెకేదన్నా అవుతుందేమోనన్న భయం. ఆ విధంగా పాడినే ఆపాట ఇలా సాగుతుంది.

‘చూడాలని వుంది అమ్మా నిను చూడాలని వుంది
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి అమ్మా
కంటికి నిదరరాదే నేతింటే నోటికి పోదే చేశా చిన్న తప్పు
నువువేశావెంతో వొట్టు- ఒకసారి మాత్రం నిను చూస్తే-
చాలులే అమ్మా చూడాలని-కాళ్లు ఆటే పోయెనే
నా కళ్లు ఆటో లాగేనే- చూడక పోతే దిగులు నిను చూస్తే
ఏమవుతావో- చూడటం మరి కూడదంటే ఏడుపొస్తుందమ్మా
అమ్మా చూడాలని వుంది – అమ్మా’

         అలాగే ఆరుద్రకలం నుండి వెలువడిన మరోపాట ‘ఎవరు కన్నారెవరు పెంచారు’..... మద్రాసు పానగల్ పార్కులో కలిసినప్పుడల్లా మల్లాది రామకృష్ణ గారు, ఈ పాటను ప్రస్తావిస్తూ, ఆరుద్రను తెగ పొగిడేవారట. సినిమా కథలో, మూర్చ జబ్బుతో బాధపడుతున్న జమున (తన దగ్గరి బొమ్మను అత్త లాగేసుకున్న తర్వాత మూర్చపోవటంతో ప్రారంభమైన జబ్బు) కు తోడికోడలు లక్ష్మీరాజ్యం-బావగారు నాగయ్య తమ బిడ్డను ఎత్తుకోవటానికి ఇస్తారు (జమున-జగ్గయ్యల పెళ్లి ఆయింతర్వాత). బిడ్డ టచ్ తో మూర్చ జబ్బు పోతుంది. బొమ్మపోతే చంటిబిడ్డ దొరికినందుకు మురిసిపోతుంది రాధ (జమున). లోగడ నాగయ్య, లక్ష్మీరాజ్యంలకు కలిగిన సంతానం పుట్టిన కొన్నేళ్లకు చనిపోతుంటారు. జమున వచ్చింతర్వాత (మరదలుగా) ఆమె పెంపకంలో వున్న ఆ బిడ్డ బ్రతుకుతాడు. జమునను ‘యశోద’తో లక్ష్మీరాజ్యంను ‘దేవకి’ తో పోలుస్తూ వ్రాసిన ఆ పాట ఇలా సాగుతుంది.

‘ఎవరు కన్నారెవరు పెంచారు-నవనీత చోరుని గోపాల బాలుని
నోము నోచి నెలలు మోసి- నీలమేఘశ్యాము కన్నది దేవకి
లాలపోసి పాలుపట్టి -జోలపాడే కలిమి కలిగి యశోదకి
తడవతడవకు కడుపు శోకము తాళజాలక పెంచనిచ్చెను దేవకి
తాను గనుకయె తల్లియయ్యెను
తనయుడామెను దేవుడే యశోదకు, ఎవరు కనినా ఎవరు పెంచినా
చివరికతడానందమిచ్చినదెవరికి -అవనిలో తనపై ఎన్నో ఆశలుంచినవారికి -
తన నాశ్రయించిన వారికి ఎవరు కన్నారెవరు పెంచారు ---‘

         అలానే లీల పాడిన మరో పాటను కూడా చెప్పుకోవాలి. ఆ పాట:
'జయ మంగళ గౌరీదేవి- కొలిచే వారికి కొరతలు లేవు
కలిగిన బాధలు తొలగజేయ-కాపుర మందున కలతలు రావు
దయచూడుము చల్లని తల్లీ-ఇలవేలుపుపై వెలసిననాడే
నెలకొలిపావా నిత్యానందం-నోచే నోములు పండించావు
చేసే పూజచే కొమ్మా!-గారాబముగా గంగానీవు
బొజ్జగణపతిని పెంచిరెతల్లి  ఇద్దరు తల్లుల ముద్దుల పాపకి
బుద్ధి జ్ఞానము నిమ్మా అమ్మా అమ్మా
జయమంగళ గౌరీదేవి’...

         ముద్దుబిడ్డ సినిమాను కన్నడంలో, హిందీలో కూడా తీసారు. తెలుగులో 99 రోజులు ఆడిన తర్వాత శతదినోత్సవం జరపకుండా వుండాలని, దుబారా ఖర్చు చేయరాదని తలచిన తిలక్ వందరోజులు నడిపంచలేదా సినిమాను.

         శతదినోత్సవానికి అవుతుందనుకున్న ఖర్చుకు సరిపోను పైకాన్ని 'బోనస్’ రూపంలో ముద్దుబిడ్డ సినిమా యూనిట్ వారికి పంచారు తిలక్.
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment