Tuesday, July 21, 2020

“పొట్టి శ్రీరాములును బలి చేసారు”-తిలక్ .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


పొట్టి శ్రీరాములును బలి చేసారు”-తిలక్
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూలై 23-30, 2000)
         సమాజంలో గుర్తింపు వచ్చిన వ్యక్తికి, రాని వ్యక్తికి గూడ, వారి వారి గత చరిత్రల్లో స్ఫూర్తి దాయకమైన కొన్ని సంఘటనలు వుండటం సహజం. ఆ వ్యక్తి ధనవంతుడు కావచ్చు, పేదవాడూ కావచ్చు. జీవన పోరాటంలో స్వయం కృషితో ఓ సముచిత స్తాయికి వచ్చిన వారెందరో వున్నారు. అలాంటి వారిలో ఒకడ్ని అవునో కాదో  ఇదమిద్దంగా తేల్చి చెప్పలేకపోయినా, జ్ఞాపకాలను ఇతరులతో పంచుకోవాలని వున్నది. ఇతరుల అనుభవాలను, జ్ఞాపకాలను తెల్సుకోవాలన్న అభిలాష వుందని చెప్తూ, ఆ సందర్భంగా 'కేసరి' అనే వ్యక్తిని గుర్తు చేసుకున్నారు తిలక్. వీధి దీపాల క్రింద కూర్చొని చదువుకున్న ఆ వ్యక్తి ఎన్నో విద్యాసంస్థలను నెల కొల్పాడనీ, ‘కేసరి తైలంగా’ ప్రఖ్యాతి పొందిన తైలం ఆయన ప్రోడక్టేననీ అన్నారాయన.
         బారసాలనాటి తిలక్ గారి పేరు ‘కొర్లిపర బాల గంగాధరరావు'. తాత గారి పేరు గంగాధరయ్య అయినందున ఈయన కాపేరు పెట్టారు. అభ్యుదయ భావాల వెంకటాద్రిగారు (తిలక్ గారి తండ్రి) ఆ భావాలను తన వరకే పరిమితం చేసుకున్నారు. ఎప్పుడూ ఖద్దరు దుస్తులే ధరించేవారట. సిగరెట్, బీడీ, ఇతర మత్తుపానీయాలకు ఎప్పుడూ దూరమే. వార్తా పత్రికలు క్రమం తప్పకుండా చదివేవారు. ఎందరి మధ్యనో, మధ్యవర్తిగా వుంటూ, సమస్యల పరిష్కారం చేస్తూ, తనకు తెలీకుండానే సమస్యల్లో ఇరుక్కుపోయే వారు పాపం. అది ఆయనకో హాబీ. 'స్వాతంత్ర్యం నా జన్మ హక్కు' అని పిలుపునిచ్చిన బాల గంగాధర తిలక్ పై వున్న భక్తి, గౌరవాలతో స్కూల్లో చేర్పించేటప్పటికి గంగాధరరావు కాస్తా 'బాలగంగాధర తిలక్’ ఆయిపోయి మనందరికీ తెలిసిన కె బి తిలక్ గా మారిపోయారు.  
         ఎందుకో ఈసారి, ఈ విషయాలను చెప్పాలనిపించింది అన్నారు తిలక్. త్యాగధనుడు కీర్తి శేషులు పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కొరకు మద్రాసులోని మైలాపూర్ లో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు తిలక్. ప్రఖ్యాత చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ బాలసుందరరావు (గాలి) గారు అప్పట్లో మద్రాసు 'టీ నగర్’ లో వుండేవారు. సినీ నటుడు చంద్రమోహన్ మామగారు గాలి బాలసుందరరావు గారు. ఆయన గారింట్లో రాజకీయ సమావేశాలు జరుగుతుండేవి రెగ్యులర్ గా, ఆ విధంగా ఆయనతో పరిచయం అయింది. అక్కడే పద్మభూషణ్ డాక్టర్ తిరుమలరావు గారితో కూడ పరిచయమేర్పడింది. టీ నగర్లోనే వుంటున్న బులుసు సాంబమూర్తి గారితో కూడ సాన్నిహిత్యం ఏర్పడింది. తిలక్ తన కుర్రకారు గ్యాంగ్ తో కనిపించిన ప్రతినాయకుడింటికి పోయి, పొట్టి శ్రీరాములు గారి నిరాహారదీక్ష విరమింపచేసే ప్రయత్నాలు చేయమని ఒత్తిడి తెచ్చేవారట. ఆయన్నొక్కడినే ఎందుకు బలికానివ్వాలని వాదించే వారట.
          సరిగ్గా అదే రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి పెద్ద కుమారుడి ఇంటి ఆవరణలో వుంటుండేవారు తిలక్. అది టీ నగర్లోనే వుండేది. ఆ ఇంటికి వెనుక భాగాన వున్న కారు షెడ్డు దానిపైన ఓ పాక అప్పట్లో తిలక్ గారి బిచానా. అదే ఆయన స్వంత ఇల్లుగా చూసుకునే అద్దె ఇల్లు. పాకలో స్వయం పాకం. రాజకీయాలతో బిజీ - సినిమాల్లో అరకొర పనీ-- సంపాదన సరేసరి!
         ప్రకాశం గారి మనస్తత్వం ‘బోళా’ అన్నారు తిలక్. ఎవరితోనైనా మంచిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. ఆయనతో తన భేటీని గుర్తు చేసుకున్నారు తిలక్. కేసీపీ సిమెంట్ సంస్థాపకుల్లో ఒకరైన రిటైర్డ్ ఐసీఎస్ అధికారి రామకృష్ణ గారి భవంతి వున్న ఆవరణలోనే 'ఇండియన్ రిపబ్లిక్' పత్రిక కార్యాలయం కూడా వుండేదట. ఓ రోజున ఇంక పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగానికి మరికొన్ని గంటల వ్యవధే వున్న సమయంలో, ప్రకాశం పంతులుగారు ఇండియన్ రిపబ్లిక్ పత్రికాఫీస్ కాంపౌండ్ లోకి ప్రవేశించి కారుదిగుతున్న క్షణంలో, తిలక్ గారి కుర్రకారు బృందం ఆయన్ను చుట్టు ముట్టింది. కారు దిగుతున్న ప్రకాశం గారిని తిలక్ చేత్తో పట్టుకుని బరబరాలాగేసారట. అది ఊహించని ఆయన, 'ఒరే--ఒరే- ఏం చేస్తున్నావురా?' అని మాత్రమే అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును అందరూ కల్సి ఏకాకిని చేసి, బలి చేస్తున్నారన్న ఆవేదన, ఆవేశం, బాధ తన్ను అలా పిచ్చివాడిగా చేసిందని ఆంటూ -- ప్రకాశం గారిలాంటి గుండె ధైర్యం వున్న మనిషి కూడా, ఆ సందర్భంలో అంతకన్నా ఎక్కువ రియాక్టు కాకపోవటం విశేషమని అన్నారు తిలక్.


         అప్పట్లో, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో సహా పలువురు నాయకులు రాష్ట్రాల విభజనకు వ్యతిరేకమని, ప్రజల ఒత్తిడి మేరకే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించటం జరిగిందని అంటారు తిలక్. అప్పట్లో ఫజలాలీ కమిషన్  కార్యదర్శిగా పనిచేసిన శ్రీ ఎ ఆర్ బాజీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌గా, ప్రభుత్వ సమాచార సలహాదారునిగా వున్నారని ఆయనతో కూడ తనకు బాగా పరిచయమనీ చెప్పారు శ్రీ తిలక్.
         పొట్టి శ్రీరాములు మరణంతో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావటం, కర్నూలు రాజధాని కావటం, సమకాలీన చరిత్ర అందరికీ తెలిసిందే. ఆంధ్రరాష్ట్ర అవతరణ ఉత్సవాలు సందర్భంగా నెహ్రూ గారు కర్నూలు వచ్చినప్పుడు, అక్కడికి పలువురు సినీ కళాకారులు వెళ్లారని, అందులో శ్రీమతి లక్ష్మీరాజ్యం ఒకరనీ గుర్తు చేసుకున్నారు తిలక్.
         ఇవన్నీ ఇలా వుండగా... మళ్లీ... ఇంగువ వాసనలాగా... సినీ రంగంపై మనసు మళ్లింది. ఆ విషయాలు కాసేపు ముచ్చటించారు ఆయన.
          ఎడిటర్స్ గా రాజన్-తిలక్ కాంబినేషన్ లో ‘శ్రీ ఛత్రపతి ప్రొడక్షన్స్' బ్యానర్ క్రింద తీసిన ఓ చిత్రం 'రాధిక’, రాధాకృష్ణులు ప్రేమగాథ ఇతివృత్తం. చిత్ర కథా రచయిత సదాశివబ్రహ్మం కాగా, దర్శకత్వం వహించింది కాళ్లకూరి సదాశివరావుగారు. ‘నేప్ట్యూన్' స్టూడియోలో షూటింగ్ జరిగిన ఈ సినిమాలో రాధిక వేషం వేసిన ఆమె ప్రప్రథమ ప్లేబ్యాక్ గాయని శ్రీమతి ‘రావు బాల సరస్వతీదేవి’ గారు. ప్రఖ్యాత హాస్యనటుడు శ్రీ పద్మనాభం హీరోగా నటించిన మొదటి చిత్రం కూడా ఇది. ఓ ముస్లిం వ్యాపారవేత్త నిర్వహణలో వున్న నెప్ట్యూన్ స్టూడియోలో తమిళ-తెలుగు చిత్రాలతో పాటు శ్రీలంక నుండి వచ్చిన దర్శక -నిర్మాతలు సింహళ భాషలో కూడ సినిమాలు షూట్ చేస్తుండే వారు అప్పట్లో.
         రాజన్-తిలక్ ఎడిటర్లుగా సువర్ణా ఫిలిస్ బ్యానర్ క్రింద తీసిన మరో చిత్రం పేరు ‘సువర్ణమాల’ దానికి కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించారు. హీరోయిన్ అందులోనూ బాల సరస్వతీ దేవి. హీరోగా నటించిన సూర్యనారాయణ గారనే ఆయన ఆంధ్రాబ్యాంకులో అధికారిగా పనిచేసేవారు. ఓ జూనియర్ కళాకారుడు  ఈర్శ్యతో సూర్య నారాయణరావును హత్య చేసారు. ఆ కేసింకా తేలలేదు అని గుర్తు చేసుకున్నారు తిలక్.
         శ్రీమతి రావు బాలసరస్వతీదేవిని, రాజన్-తిలక్ లు సెట్లలో 'పాప' అనే పేరుతో సంబోధించేవారు ఆరోజుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు. స్టూడియోకు వచ్చి పోతుండేవారిలో డ్యాన్సర్లు లలిత, పద్మిని, వాళ్లమ్మగారు వుండేవారనీ, వాళ్లంతా తనకు బాగా పరిచయముని తిలక్ గుర్తు చేసుకున్నారు.
         రాజన్-తిలక్ కాంబినేషన్ లో, ఎడిటర్లుగా తీయబడిన మరో చిత్రంపేరు 'మంత్ర దండం’. జ్ఞానాంబికా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో కథానాయకుడుగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, కథానాయకిగా శ్రీమతి జానియర్ శ్రీరంజని నటించారు. దర్శకత్వం శ్రీ కె. రామచంద్రరావు వహించారు. 'రాధిక, ‘మంత్రదండం’ సినిమాలకు సంగీత దర్శకుడు శ్రీ ఎస్ రాజేశ్వరరావు,
         హెచ్ ఎమ్ రెడ్డిగారి కజిన్ హెచ్ వి బాబు గారిని గుర్తు చేసుకున్నారు తిలక్. ఆయన ఎక్కువగా వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంసల సాహిత్యం చదవటం, వారికి సంబంధించిన విషయాలను పలువురితో చర్చించటం తిలక్ గారికి ఎంతగానో నచ్చేదట. రాజమండ్రి నుండి మద్రాసుకు చేరుకున్న ఓ ప్రొడ్యూసర్ నిర్మించిన 'ధర్మాంగద’ అనే చిత్రానికి శ్రీ బాబు దర్శకత్వం చేసారు. రాజన్-తిలక్ కాంబినేషన్ ఎడిటర్స్. కృష్ణవేణి హీరోయిన్. ఈ సినిమాలో నటనకు ఆవకాశం దొరికిన శ్రీమతి సూర్యకాంతం ‘వాయిస్' బాగా లేదని డైలాగులు చెప్పనవసరంలేని 'మూగ’ పాత్రకు ఆమెను ఎంపిక చేసారు అప్పట్లో,  అని చెప్పారు తిలక్. ఆ తర్వాత కాలంలో ఆమెదో ప్రత్యేక తరహా గొంతుగా, డైలాగ్ డెలివరీగా, విశిష్టనటనగా, ఆశేషాంధ్ర ప్రేక్షకులు గుర్తించటం తెలిసిన విషయమే.
         రాజన్ తో ఎడిటింగ్ లైన్ లో పనిచేస్తున్న తిలక్ గారు తన జీతభత్యమెంత అనే ఆలోచనను రానిచ్చినట్లు లేదు. ఆసక్తిగా 'మీ జీత భత్యమెంత?’ అని అడుగితే, ' ‘అంతా--ఇంతా --కాదు, ఇబ్బంది లేనంత’ అని సమాధానం ఇచ్చారు. భోజనానికి ఇబ్బంది లేదు--జీవనం గడుస్తుండేది -- ఆదో తృప్తి అని అన్నారు. అని అంటూనే గుర్తుచేసుకున్నారు' ‘మన దేశం’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లోని ఓ సంఘటనను.
         ‘మనదేశం' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ ఇన్ చార్జ్ గా రామచంద్రన్ అనే ఆయన పూండేవారట. టెక్నిషియన్లను ప్రతిరోజు భోజనం చేయించటం, కాఫీటీ, ఫలహారాలు ఇప్పించటం ఆయన డ్యూటీ. ఆ కార్యక్రమం కొరకు నిత్యం టెక్నీషియన్ల బృందాన్ని మౌంట్ రోడ్లో వున్న నేషనల్ కెఫే అనే ఓ ఇరాని హోటలుకు తీసుకెళ్లేవారట ఆయన.  చెప్తూ.. చెప్తూ.. నవ్వుకున్నారు చాలాసేపు. ఓ రోజున టీ త్రాగింతర్వాత పెద్ద మొత్తంలో సమోసాలను ప్యాక్ చేయించారు తిలక్.  స్టూడియో ఫ్లోరుకు వెళ్లగానే రుచిగా వున్నాయని తలోకటీ పంచారు. అందరూ తిన్నారు. హీరోయిన్ కృష్ణవేణి, దర్శకుడు శ్రీ ఎల్ వి  ప్రసాద్ గారితో సహా. మర్నాడు మళ్లీ అందరూ వెళ్లినప్పుడు, ఈ ఖర్చును తిలక్ గారి పర్సనల్ ఖాతా జమకట్టే ప్రయత్నం చేసారట శ్రీ రామచంద్రన్. తిలక్, దాన్ని వ్యతిరేకించి, సమోసాలు అందరూ తిన్నందువల్ల 'కామన్ ఆక్కౌంట్లో’ పడాల్సిందే అని పట్టుపట్టారు. చివరకు ఈ వ్యవహారం సినీ నిర్మాతయిన మీర్జాపూర్ రాజాగారి వరకూ వెళ్లింది. సమస్యకు, ఇబ్బందికరం లేని పరిష్కారం కుదిరింది. జీతభత్యాలు ఆ రోజుల్లో అలానే వుండేవని ఈ సంఘటనను ఉదహరించారు.
         తిలక్ గారి సినీ జీవితంలో మరో మైలు రాయి నవయుగ ప్రొడక్షన్స్ బ్యావర్ క్రింద నిర్మించిన 'జ్యోతి’ చిత్రం, తిలక్ రాజన్ లు ఈ చిత్రానికి కూడ సంయుక్తంగా ఎడిటర్స్. గోగినేని చినవెంకట సుబ్బయ్య గారి (కృష్ణాజిల్లా) అల్లుళ్లు, సూరెడ్డి వీర రాఘవయ్య, కడియాల వెంకటేశ్వరరావులు పెట్టుబడి పెట్టి సినిమా తీసారు.
         జ్యోతి సినిమాను ఒకేసారి రెండు భాషల్లో తెలుగు, తమిళం చిత్రీకరించారు. సావిత్రి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రామచంద్ర కాష్యప్ హీరో.  ప్రజా నాట్యమండలికి చెందిన పలువురు కళాకారులతో సహా ఈ చిత్రంలో నటించిన ఇతరులలో శ్రీమతి జి వరలక్ష్మి, శ్రీ ఎమ్ శ్రీరామమూర్తి గార్లున్నారు. సుంకర - వాసిరెడ్డి రచయితలుగా మంచి పేరు తెచ్చుకున్న సినిమా ‘జ్యోతి'. అభ్యుదయ రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కథా రచనలో తన సహకారం అందచేసారు.
         సుంకర-వాసిరెడ్డిలు మంచి సాహితీవేత్తలని, ఇతిహాసాలు, పురాణాలు, ఆధునిక సాహిత్యం క్షుణ్ణంగా చదువుకున్న వారిద్దరిలో, డెప్త్ వుండేదనీ, వారు పాటలు కూడా వ్రాసేవారనీ అన్నారు తిలక్.
         ‘జ్యోతి' సినిమా దర్శకుడు శ్రీధర్ కు, నిర్మాతలకు మధ్యన చెలరేగిన గొడవల మూలాన్న, శ్రీధర్ దర్శకత్వం కొనసాగించకుండా మధ్యనే విరమించుకున్నారు. నిర్మాతలు కూడా ఆయన్ను వదిలించుకోదల్చారు. దర్శకత్వ బాధ్యత శ్రీ కె బి తిలక్ గారిపైన పడింది. ఛాలెంజ్ గా స్వీకరించిన శ్రీ తిలక్, తాను దర్శకుడుగా షూట్ చేసిన రెండు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. సుంకర-వాసిరెడ్డి వ్రాసిన, ‘పదువురు కలిసి పని చేయరే', అనే పాటను సావిత్రి నటనలో చిత్రీకరించిన సన్నివేశం ఒకటి. అందులో ఓ పాఠశాలకు పాకను వేయాలి. తనకు ఎడిటర్ గా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని, ఆ సన్నివేశాన్ని రివర్స్ లో...అంటే--పాకను వేయటానికి బదులుగా, వేసిన పాకను పీకటంతో చిత్రీకరణను ప్రారంభించానని అన్నారు. అది చూసిన సావిత్రి తండ్రి ‘చిలక కొట్టుడు’ కొట్టావయ్యా అని తిలక్ గారితో అన్నారట.
         మరో సన్నివేశం, తిలక్ తన దర్శకత్వం చేపట్టిన తర్వాత, కొండేపూడి గారితో వ్రాయించిన పాట చిత్రీకరణ. అక్షరాస్యత ప్రాముఖ్యాన్ని చాటుతూ, నిరక్షరాస్యతను ఓ సామాజిక సమస్యగా వర్ణిస్తూ రాసిన ఆ పాట చిత్రీకరణ సన్నివేశంలో పాల్గొన్నవారు నాటి 'బాలానంద’ సంఘ సభ్యులు. బాలానంద సంఘానికి అధ్యక్షుడు రేడియో అన్నయ్యగా సుపరిచితులైన న్యాపతి రాఘవరావుగారు. ఆ పాటలో ఆభినయించిన నటీమణి (బాలనటి) నిడదవోలు వెంకటరావుగారి అమ్మాయి, నేటి మేటి నటి జయసుధ తల్లి శ్రీమతి. జోగమాంబగారు. ఆ పాటలో ఆమెతో పాడించిన చరణాలను వల్లెవేసారు తిలక్.  ఈ సందర్భంగా... బలే బలే విన్నావా -- పిల్లగాడి ఎద్దేవా -- కూలి పనికి పోడంట--కావాలీ సదువంట- అని పాడారు తిలక్.  కలకటేర్ కొడుకు కలకటేర్ కావాలా? -- కూలోడి కొడుకు కూలోడే అవ్వాలా? కరణం తప్పుడు లెక్కలు పట్టుకునేదెవురు? --- అనే ప్రశ్నలు వేయించారు రచయిత ఆపాట ద్వారా. పెండ్యాల ఆ సినిమాకు సంగీత్య దర్శకుడు.
         జ్యోతి సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో వహిదా రహ్మాన్ మద్రాసుకు వచ్చారు. నాటక కళా పరిషత్ సభ్యులు శ్రీ కనకారావు ఆమెను తిలక్ గారికి, ఆందరితో పాటు పరిచయం చేసారు స్టూడియోలో. తిలక్ గారి సలహా మేరకు ఆమెను సారథీ యూనిట్ కు  పంపటం, ఆ తర్వాత  'రోజులు మారాయి’ సినిమాలో నటించటం తెలిసిందే.
         జ్యోతి సినిమా టైటిల్సో లో దర్శకుడి పేర్లుగా శ్రీధర్ - తిలక్ అనీ, ఎడిటర్‌గా రాజన్-తిలక్ అని వేసారు. అలా, ఆ సినిమాతో తిలక్ గారు దర్శకుడిగా స్థిరపడిపోయారు. ఆనుపమ చలనచిత్ర దర్శక, నిర్మాతగా అందరి మన్ననలను పొందారు.                                                  
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment