Wednesday, July 22, 2020

ఇంకా ఫలించని ‘కొల్లేటి’ కల .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


ఇంకా ఫలించని ‘కొల్లేటి’ కల
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(ఆగష్టు 6-12, 2000)
         తిలక్ సోదరి, శేషమాంబగారి భర్త శ్రీ జాస్తి పాపయ్య చౌదరి (జే పి చౌదరి) కొల్లేటి ప్రాంతానికి చెందినవారు. ఆ చుట్టు ప్రక్కలున్న జూలిపూడి, చాటపర్రు, పోతునూరు, గుండుగొలను, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొల్లేరు లంకల సరిహద్దు గ్రామాలు.  ఆయన తండ్రిగారు, శ్రీ నాగినీడు రైతుగా ఓ 'ఇంజన్ దారు’ భూములను సూపర్ వైజ్ చేస్తూండేవారు లంకల్లో.  బావగారైన జె పి చౌదరితో, అప్పుడప్పుడూ తిలక్ కొల్లేటి ప్రాంతానికి చెందిన లంకల్లోకి వెళ్లోస్తూ వుండేవారు. అలా అక్కడి పరిస్థితులను తిలకించిన ఆయనకు సినీ రంగంలో ప్రవేశించిన తొలి రోజుల్లోనే ఆ ప్రాంతం కథా వస్తువుగా ఓ సినిమా తీయాలన్న కోర్కె బలంగా మనస్సులో నాటుకుంది. ఆ తర్వాత కాలంలో పలువురి అభిమానాన్ని చూరగొన్న ‘కొల్లేటి కాపురం'గా వెలుగుచూసింది.
         జే పి చౌదరి తండ్రి నాగినీడుగారు మోతే గంగరాజు అనే ఓ మోతుబరి 'ఇంజన్ దారు’ భూముల్లో వ్యవసాయం చేయిస్తుండేవారు. ఏలూరు సబ్ జైలులో తిలక్ సహచరులు, సీనియర్ కాంగ్రెసు నాయకుడు శ్రీ మోతె నారాయణ రావు గారి సోదరుడాయన. నారాయణరావు గారి కూతురు మోతె వేదకుమారి 1957-62 మధ్య కాలంలో ఏలూరు లోక్ సభ స్థానానికి కాంగ్రెసు పార్టీ పక్షాన ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఆయన ఓడించిన కమ్యూనిస్టు అభ్యర్థి శ్రీమతి విమల, ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో వేదకుమారిపై గెలుపొందారు. వేదకుమారి సోదరి అనంతమ్మగారు ప్రముఖ సర్వోదయ సేవకురాలు. భర్త  రామలింగారెడ్డితో వినోబా ఆశ్రమంలో వుంటుండేవారు.
         బాహ్య ప్రపంచంలో 'జమీందారు’ వ్యవస్థ దోపిడీ విధానానికి చిహ్నంగా ఎలా వేళ్లూనుకుని పోయిందో, ఆ మోతాదులోనే కొల్లేరు ప్రాంతంలో ‘ఇంజన్ దార్' వ్యవస్థ పెత్తనం చలాయించేది. పెద్ద పెద్ద ఆయిల్ ఇంజన్ల ఉపయోగంతో వందల ఎకరాల భూముల్లో వ్యవసాయం చేస్తుండే భూస్వాములను 'ఇంజన్ దార్లు' (జమీందార్ల తరహాలోనే) అని సంబోధించే అలవాటుండేది. కొల్లేరుకు వరదలొచ్చినప్పుడు, పొర్లిపోయిన నీటితో పరీవాహక భూములు ముంపునకు గురయి గ్రామ రికార్డుల్లో ‘అసలే' లేని భూములుగా చూపుతుండే 'కరణాలు’ ఇంజన్ దార్ల దోపిడీ విధానానికి దోహద పడ్తుండేవారు, వత్తాసు పలుకుతుండేవారు.
         కృష్ణా-గోదావరి (పశ్చిమ) జిల్లాల ఉమ్మడి ఆధీనంలో ఉన్న కొల్లేరు ప్రాంతం, ఓ సీజన్లో, ప్రతి ఏటా, రష్యానుండి వలసొచ్చే పక్షులకు ఆశ్రయమిస్తుంది. అక్కడ ప్రయాణం భయానకంగా వుండేదా రోజుల్లో. అందుకే, ఆ కొల్లేరును అన్ని కోణాల్లో 'పిక్చరైజ్’ చేయాలన్న తాపత్రయంతో, తపనతో, ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు తిలక్ ఎన్నోమార్లు. 'కొల్లేటి పడవ’ ల్లో కాపురం చేస్తూ తయారు చేసారు స్క్రిప్ట్.  సినిమాతీసే ప్రయత్నం జరిగే వరకూ, కొల్లేటి లంకల్లో వుండే జనానికి తప్ప, ఇతరులకు ఆదోక చొరరాని చోటు. ఆ రోజుల్లో నెలకొన్న పరిస్థితుల్లో, ఆ ప్రాంతపు మురుగు నీటిలో, అక్కడ కక్షలకు- కార్పణ్యాలకు గురయి, హత్య కావించబడిన ఎందరివో అమాయక మూగశవాలను కొల్లేటి సరస్సుల్లో వెళ్తుండగా చూసిన తిలక్ గారి మనస్సు చలించిపోయింది. దోపిడీ వ్యవస్థకు గురయిన కొల్లేరు జీవన విధానాన్ని పట్నవాసపు జీవన విధానానికి ముడివేసి, కష్టపడి చిత్రీకరించిన సినిమా ‘కొల్లేటి కాపురం'.
         ‘కొల్లేటి కాపురం-గుంటూరు చాంతాడు' అనే సామెతను గుర్తు చేసుకున్న తిలక్ సినిమా తీయటానికి ముందు ఆ తర్వాత సంఘటనలకు చెందిన ఎన్నో అనుభవాలను కూడా మననం చేసుకున్నారు. అక్కడ నివసిస్తున్న'వడ్డీ' కులస్తులందర్నీ తిలక్ కలిసారు. వారినక్కడ ‘ఆగ్నికులక్షత్రియులు' అని కూడా అంటారు. వారిలో ఆ ప్రాంతంలో బాగా పేరు ప్రఖ్యాతులున్న 'సైదులు గంగరాజు’, ‘కృష్ణంరాజు' (కొల్లేటి కాపురం సినిమా హీరోయిన్ ప్రభ బావగారు)లు తిలక్ సినిమా తీసేటప్పుడు బాగా సహకరించేవారు. అక్కడి వడ్డీ కులస్తులందర్నీ ఓ సంఘంగా ఏర్పడమని ప్రోత్సహించారు తిలక్.
         ఓ పర్యాయం, షూటింగ్ చేస్తున్న సందర్భంలో కొల్లేరు సరస్సులో, ఓ లాంచిలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు తిలక్. విజయవాడకు చెందిన పత్రికా విలేఖరులను తీసుకెళ్లారప్పుడు. వారిలో ప్రముక పాత్రికేయుడు రచయిత విశాలాంధ్రకు చెందిన కామ్రేడ్ ముక్కామల నాగభూషణం వున్నారు. పాత్రికేయునిగా ఎందరికో పరిచయమున్న ఆయనకు ప్రజానాట్యమండలితో సన్నిహిత సంబంధాలుండటమే కాకుండా, తన భార్యతో కల్పి ఎన్నో ప్రదర్శనల్లో పాల్గొనే వారు, ఆదో మహా భారతం. గ్రీక్ మైథాలజీలను పోలుస్తూ ఆయన కలం నుండి వెలువడిన ఓ పుస్తకం మేధావులను ఆకర్షించింది కూడా.
         వడ్డీల సాంప్రదాయం గురించి ముచ్చటించేటప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడి వారెప్పుడూ పలుకుతుండే ‘దోనె', 'గడ’ అనే ఆ పదాల గురించి. వాటర్థం... ఈ రెండూ వుంటే, ఎంత లోతు నీళ్లలో కైనా వెళ్లగలుగుతామని.  పెళ్లిల్ల సందర్భంలో కూడా, మాట మంతీ-మంత్రాలలో కూడా ‘దోనె', 'గడ’ పదాలు దొర్లుతుంటాయి. అంటే బహుశా ఎంతకైనా సిద్దమేమోనని కావచ్చు. కొల్లేరులో షూటింగ్ జరుగుతున్నప్పుడే ‘కొల్లేటి కాపురం' షూటింగ్ యూనిట్లోని కొందరికి అక్కడ ‘వడ్డి’ కులస్తులవారితో ఏర్పడ్డ పరిచయాలు బంధుత్వాలుగా మారాయి. రెండు మూడు ఆదర్శ వివాహాలకు దారితీసాయి. కైకలూరులో జరిగిన ఓ వివాహానికి ప్రముఖ సి పి యమ్ నాయకుడు శ్రీ పుట్టగుంట సుబ్బారావు అధ్యక్షత వహించారు. సైదులు గంగరాజు కూడా పాల్గొన్నారు.


          ‘భూమి కోసం' సినిమా తీసిన తదుపరి నిర్మించిన ‘కొల్లేటి కాపురం’ చిత్రానికి దుర్గానంద్ సోదరుడు రాజశివానందగారితో స్క్రిప్ట్  వ్రాయించారు తిలక్. శ్రీశ్రీ, ఆరుద్రలు పాటలు వ్రాసారు. పెండ్యాల సంగీత దర్శకుడు కాగా, సామాజిక ప్రయోగమైన ఆ చిత్రంలో నటీ నటులు కృష్ణ, ప్రభ, సత్యనారాయణ, గుమ్మడి, జగ్గయ్య, మమత, ప్రభాకరరెడ్డి, త్యాగరాజు ప్రబృతులు. పిట్టల్ని వేటాడే 'గువ్వలచెన్నడు'గా ప్రభాకరరెడ్డి నటన ఆ సినిమాలో ఓ ప్రత్యేక ఆకర్షణ. దర్శకుడు తిలక్. ఆ సినిమాలో శ్రీశ్రీ, ఆరుద్రల వరుసలో ‘సుగుంబాబు' అనే పాటల-గేయ రచయితను పరిచయం చేసారు. తర్వాత కాలంలో సినీరంగ పరిచయాలతో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్న శ్రీ సుగుంబాబు కలం నుండి వెలువడిన ‘ఏలే మాలీ...ఏలేమాలీ-ఏటి మన జరుగాలి’ అనే పాట శ్రీశ్రీ రచన కొల్లేటి కొలనులో, ‘ఇద్దరమే మనమిద్దరమే......’ ఇప్పటికీ అందరి నోళ్లల్లో కదిలాడే పాటలు.
         ‘విరసం' ప్రభావంతో విప్లవగేయాలు వ్రాస్తున్న అనేకానేక గేయ రచయితలలో ఒకరైన 'శ్రీ సుగుంబాబు’ అప్పటికీ ఓ చిన్న పుస్తకంలో ప్రచురించిన  ఓ గేయాన్ని కొద్ది మార్పులతో, తన సినిమాకు వర్తించేలా ఎంచుకున్నారు పై పాటను. నిజానికి సుగుంబాబును తిలక్ కు పరిచయం చేసింది శ్రీశ్రీ.
         కొల్లేటి కాపురం సినిమా ప్రింట్స్ నిజాం ప్రాంత డిస్ట్రిబ్యూటర్ మాజీ కమ్యూనిస్టు (అభిమాని) కృష్ణా జిల్లా వాస్తవ్యుడు, లక్డికాపూల్ (హైదరాబాద్) ప్రాంతంలోని అశోకా హోటల్ యజమాని స్వర్గీయ బాలకోటయ్య గారు. కొల్లేటి కాపురం సినిమా తీయటంతో తిలక్ గారిలోని సామాజిక స్పృహ కొల్లేరుకు సంబంధించినంతవరకు ఆగిపోలేదు. ఆయనలోని ‘వన్ డైమెన్షనల్’ పర్సనాలిటీకి కొల్లేరు ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించటం ఓ దిన చర్య అయిపోయింది.
         అప్పట్లో సుప్రసిద్ధ బాలల కథా రచయిత్రి శ్రీమతి బుర్రారాణి తండ్రిగారు శ్రీ బుర్రా వెంకటప్పయ్య 'ఇండియన్‌ సివిల్ సర్వీస్’ అధికారిగా పదవీ విరమణ చేసి కేంద్ర ప్రభుత్వ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ చైర్మన్ గా పనిచేస్తుండేవారు. సినిమా రిలీజ్ కు ముందర న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘కొల్లేటి కాపురం'  ప్రివ్యూకు బుర్రాగారు,  ఆయనతో పాటు నాటి కేంద్ర పర్యాటక శాఖమంత్రి హాజరయ్యారు. దాదాపు అదే రోజుల్లో హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ఏర్పాటు చేసిన మరో ప్రీవ్యూకు నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ భండారి హాజరయ్యారు. ఇవన్నీ చేయటానికి వెనుకున్న పుద్దేశ్యం కొల్లేరు ప్రాంత సమస్యలను వారి దృష్టికి తీసుకురావటమే. ఫలితంగా, బుర్రా వెంకటప్పయ్యగారు కొల్లేరు సరస్సు పరిసరాల్లో విద్యుదీకరణ జరగటానికి తన వంతు సహాయాన్ని చేశారు.
         ఒకప్పటి కర్నాటక గవర్నర్ శ్రీమతి రమాదేవి భర్త శ్రీ రామావతార్ అప్పట్లోకేంద్ర ప్రభుత్వ గ్రామీణ విద్యుదీకరణ సంస్థలో ఉన్నతాధికారిగా పని చేస్తుండేవారు. రమాదేవి - రామావతార్  గార్లు తిలక్ కు బంధువులు-బాగా పరిచయస్తులు. విద్యుత్ స్తంభాలు కొల్లేరు సరస్సులో పాతటం ఎలా అన్న సమస్య వచ్చిపడినప్పుడు, స్థానికుల తోడ్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు తిలక్.  సహకారం అందించనుని ‘వడ్డీ’లను కోరి, ఒప్పించారు కూడా.
         నార్ల తాతారావుగారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు చైర్మన్ గా వున్నప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన విద్యుత్ సరఫరా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిలక్ కూడా హాజరయ్యారు. అప్పట్లో కొల్లేటి కోటలోని ‘పెద్దింటమ్మ’ గుడి వద్ద వేసిన శిలాశాసనం - ప్లేట్, పైన పెద్దలందరి సరసన తన పేరు కూడా వున్నందుకు ఎంతో తృప్తి పడ్డారు తిలక్.
         కొల్లేటి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న భావనతో అప్పట్లో (మొదటి విడత) రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి ‘కొల్లేరులో ఓ రోజు’ అనే పథకాన్ని సమర్పించారు తిలక్. అప్పుడు పర్యాటక శాఖ మంత్రిణిగా శ్రీమతి రోడామిస్త్రీ వ్యవహరించేవారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీ పరకాల శేషావతారం కూడా మంత్రి వర్గంలో వుండేవారు.
         కొల్లేరు ప్రాంతంలోకి పర్యాటకులను ఏటేటా, ఏ విజయ దశమి లాంటి రోజునో రప్పించ టానికి తయారు చేసిన ఆ స్కీమ్, స్కీమ్ గానే మిగిలిపోయింది.
         తిలక్ తన స్కీమ్ ను పైలట్ పద్ధతిన కార్యరూపం దాల్చే ప్రయత్నం కూడా చేసారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ సీనియర్ ఐ ఎ ఎస్. అధికారి, అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పని చేస్తున్న శ్రీ కె మాధవరావు టూరిజం కార్యదర్శిగా వున్నప్పుడు కొల్లేటి సరస్సులో ‘దోసె'ల పోటీలు నిర్వహించారు. నాటి రాష్ట్ర మంత్రులు శ్రీమతి రోడామిస్త్రీ, శ్రీ పరకాల శేషావతారం ఆ సందర్భంగా మాధవ రావుగారితో సహా ఆ ప్రాంతానికి వెళ్లారు. కొల్లేరు లంకల్లో జరిగిన ఆ పోటీలు వాటర్ స్పోర్ట్స్ లాంటివి. అవి నిర్వహించేటందుకు లంకల ప్రజలు ఎంతగానో సహకరించారు. తన స్కీమ్ ఏమయిందో కాని, అది అమలు చేయలేదనే ఆవేదనమటుకు తిలక్ లో మిగిలిపోయింది.
         ఆ తర్వాత జలగం వెంగళరావుగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, కొల్లేరు ప్రాంత వాసులు ఆయన్ను అక్కడకు ఆహ్వానించి తమ సమస్యలపై ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. దానికి రెస్పాన్స్ అంతంత మాత్రమే,
         ఫిష్ కల్చర్ కొరకు, కొల్లేరు ప్రజలకు మేలు జరిగేటందుకు, చేపల చెరువులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడి ప్రజలు కోరుకునే వారు. వారి కోరికైతే నెరవేరింది కాని అభిలషణీయమైన పద్ధతిలో మాత్రం కాదు తిలక్ దృష్టిలో.
         నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఐ ఎ ఎస్ అధికారి శ్రీ కుమారి స్వామిరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ మరో ఐ ఎ ఎస్ అధికారి శ్రీ సంతానంలు, తమ తమ జిల్లాల పరిధిలోకి వచ్చే కొల్లేరు ప్రాంతంలో, పోటీపడి, ఇష్టమొచ్చిన రీతిలో చేపల చెరువుల నిర్మాణానికి గాను, సొసైటీలకు అనుమతి మంజూరు చేసారు. అలా అనుమతి పొందిన ఎన్నో సొసైటీలు బినామీవి కావటం కూడా గమనించలేదు అప్పట్లో.  అభివృద్ధి కార్యక్రమాల అమలులో జాప్యం చేయటం ప్రభుత్వాలకు ఓ రకమైన అలవాటైతే, అనవసరమైన చోట అభిలషించని పోటీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించటం కొందరు అధికారులకు మరో రకమైన ఆలవాటు. ఆవక తవకలతో వృద్ధి, అసమగ్ర ప్రణాళికలు, దూరదృష్టి లోపంతో నిర్మించిన రహదార్లు కొల్లేరుకు మేలు చేసిందా, కీడు చేసిందా అని ప్రశ్నించుకున్నారు తిలక్. ఇదిలా వుండగా కొల్లేరు అభివృద్ధి కొరకు రూపొందించిన మిత్రా కమిటీ నివేదికలోని అంశాలు ఎంతవరకు వెలుగు చూసాయన్నాది ప్రశ్నార్థకమే.  చివరకు ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే' అన్న విధంగా అయింది.
          ఇవన్నీ మదిలో మెదుల్తున్నా....
‘ఇద్దరమే....మన మిద్దరమే.... కొల్లేటి కొలనులో.... కులికేటి అలలమై..... ’
‘సరితోడు నీడగా... పలికింది చేతగా... పదిమంది కోసమే...’
‘బ్రతకాలి నీతిగా... ఇద్దరమే.. మనమిద్దరమే...’
 ‘ఏలేమాలి... ఏలేమాలి, ఏటిమీద ఓరుగాలి...
 ఏటెవారయ్య ఏసెట్టు... ఎక్కిసూస్తే ఎర్రకోట...
తిప్పండి బడినేల... కొట్టండి వుసిగా.. పట్టండి
కొడవళ్లు...ఎత్తండి కసిగా... సర్రూన కొడవళ్లు... పరవళ్లు తొక్కాల.....’
         అని ఆ సినిమాలోని పాటలను హుషారుగా పాడుకుంటూ పరవశించారు తిలక్.              
(మరిన్ని విశేషాలు మరోసారి)

1 comment:

  1. చాలా బాగుందండీ ఈప్రాంతలో నేను ఉంటున్నా చరుత్ర తెలుసుకేలేదా ఇంతకాలంనుండీ నేను ....అని అనిపించింది...

    ReplyDelete