Thursday, July 23, 2020

తిలక్ వివాహం ఒక ‘ఎపిసోడ్’ ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


తిలక్ వివాహం ఒక ‘ఎపిసోడ్’
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(ఆగస్టు 13-19, 2000)
         అభ్యుదయ రచయితల సంఘం-అరసం వ్యవస్థాపకులలో ముఖ్యులయిన తుమ్మల వెంకట్రామయ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ శ్రీ ప్రకాశగారి విద్యార్థి. స్వాతంత్ర్య సమర యోధుడు సోమూరి వెంకట్రామయ్య, కమ్యూనిస్టు అగ్రనాయకుడు కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు కూడా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే. తుమ్మల గారు తరచూ వీరి ప్రస్తావన తెచ్చేవారు. తిలక్ గారిని కల్పినప్పుడల్లా, పాత పరిచయంవల్ల శ్రీశ్రీ ప్రకాశ్, తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే కొందరు మిత్రులతో కల్సి ఆయన వద్దకు వెళ్లారు. పాత విషయాలను గుర్తుచేసుకున్నారు. తమ ముచ్చట్లను అప్పట్లో ‘సందేశం’ ‘విశాలాంధ్ర’ పత్రికల్లో వ్రాసారు శ్రీతుమ్మల. అభ్యుదయ భావాల కమ్యూనిస్టు పార్టీకి చెందిన కార్యకలాపాలకు, సాహితీ రంగానికి, చేతనైనంత సహాయపడ్తూ హైదరాబాద్ లోనే వుంటున్న సోమూరిగారిని అడపాదడపా కలిసే అవకాశం కలిగేది తిలక్ గారికి.
         ఇదంతా చెప్పటానికి కారణం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్టయి జైలు జీవితం అనుభవించిన తదుపరి తిలక్ కూడా బెనారస్ మెట్రిక్ పరీక్ష వ్రాసే ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నం ఫీజు చెల్లించటం వరకే పరిమితం కావటం.
         బొంబాయి నగరానికి మేనత్త గారితో ప్రయాణం కట్టినప్పుడే, తనకు తన పూర్వీకుల ఆస్తిపాస్తులతో సంబంధం లేదనీ, తనందులో చిల్లిగవ్వ కూడా ఆశించననీ స్టాంప్ పేపరు మీద వ్రాసి సంతకం పెట్టారు తిలక్. అయనే తన కుటుంబ సభ్యుల్లో పెద్దవారు. ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్లున్నారు. పెద్ద చెల్లెలు శేషమాంబ భర్త జె పి చౌదరి, వ్యాపారం చేస్తుండేవారు. ఆ తర్వాత చనిపోయారు. శేషమాంబ తణుకులో, వయోధికాశ్రమంలో వుండేవారు. లోగడ ఏర్పేడు ఆశ్రమంలో కొంత కాలం వేదాంత మార్గాన కాలం గడిపేవారు. మరో చెల్లెలు శ్రీమతి సుశీల హైదరాబాద్ లోనే తన కొడుకు దగ్గరుంటున్నారు. సుశీల కూతురు, కూతురు మనవరాలు, ఉత్తమ ఫిల్మ్ ఎడిటర్‌గా జాతీయ బహుమతినందుకొన్న శ్రీకరప్రసాద్ భార్య. తిలక్ మేనమామ సంజీవి (ఆయనా సినీ ఎడిటరే) కుమారుడు శ్రీకర్ ప్రసాద్. తిలక్ ఆఖరి సోదరుడు శ్రీకృష్ణారావు కూడా సినీ పరిశ్రమలోనే, ఆసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. స్నేహితులతో కల్సి తిలక్ దర్శకత్వంలో నిర్మించిన ‘కొల్లేటి కాపురం' సినిమాకు ఆయన ప్రొడ్యూసర్. స్వర్గీయ ఎన్టీ రామారావునటించి, శ్రీ ప్రత్యగాత్మ సోదరుడు శ్రీ హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన 'హిట్ సినిమా’ ‘కథానాయకుడు' చిత్ర నిర్మాణంతో సన్నిహిత సంబంధముండేది కృష్ణారావుగారికి ‘బుజ్జి‘గా స్నేహితులకు తెల్సిన ఆయన హైదరాబాద్ కు వచ్చి, అమీర్ పేటలో 'భాగ్యనగర్ కల్చరల్ క్లబ్’ ను పెట్టి, వారంవారం తెలుగువారు సాంస్కృతిక విషయాలు చర్చించుకునే వేదికను ఏర్పాటుచేసారు. ఆయనా చనిపోయారు.
         తిలక్ గారి పెద్ద తమ్ముడు విప్లవభావాల, కామ్రేడ్ నరసింహారావు నక్సలైట్ ఉద్యమంలో ప్రాణాలను కోల్పోయారు. శ్రీ ఎమ్ నారాయణరావు పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న రోజుల్లో, 1972 ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో చనిపోయారు. మొదట్లో ఆయన్ను పొరపాటుగా (?) నక్సలైట్ నాయకుడు సత్యమూర్తిగా గుర్తించినట్లు వార్తలొచ్చాయి. అప్పట్లో, ‘సృజన' మ్యాగజైన్ లో “అమరవీరుడు’ నరసింహారావు పైన గేయం కూడా వచ్చింది. వివరంగా ఈ విషయాలను మరోమారు చెప్తానన్నారు తిలక్.
         తిలక్ గారి వివాహం, ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఓ చిన్న‘ఎపిసోడ్’. సినిమారంగంలో పనిచేస్తూ, అతివాద భావాల వారితో పరిచయాలు కల్గి వున్న తిలక్ ను పెళ్లిచేసుకోవాల్సిందిగా ప్రోత్సహించారు, ఆయన భావసారూప్య మిత్రులు. వివాహం బాధ్యతలు వుండవద్దని భావించే తిలక్ చెకొస్లోవేకియాకు వెల్లి అక్కడ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరాలన్న ఉద్దేశ్యంతో, అతికష్టం మీద పాస్ పోర్ట్ కూడా సంపాదించారు. అప్పటికే ఆయన పరిచయస్తులు పలువురు చెకొస్లావేకియాకు వెళ్లటం జరిగింది. తన కమ్యూనిస్టు మిత్రులు సూచించినందున ఆ ఆలోచనను విరమించుకున్నారు. మామూలు పద్ధతిలో సినిమా గొడవల్లో పడిపో యారు, మద్రాసులో.
         దర్శకుడు శ్రీ కెఎస్ ప్రకాశరావు, ఓ సంస్థలాంటివారు. ఆయన 'వ్యవస్థ’ లో పలువురు సినీకళాకారులు చేరి వివిధ విషయాలపై చర్చించుకుంటుండేవారు. ఓ సందర్భంలో, ఆయన, దీక్ష సినిమా తీసే ముందు, రచయిత ఆరుద్రగారిని కలకత్తా పంపించారు. అక్కడ నుండి ఆయన శరత్ బాబు నవలల ఆధారంగా తెచ్చిన రెండు స్క్రిప్ట్ లలో ఒకటి 'దీక్ష' సినిమాగా ప్రకాశరావు తీయగా, మరోటి ‘ముద్దుబిడ్డ’ గా తిలక్ చిత్రీకరించారు.


         ‘ముద్దుబిడ్డ' చిత్రీకరణ వ్యవహారం నిర్వహించే పూర్వరంగంలో 'జ్యోతి' సినిమా తమిళ భాషలో తీసే ప్రయుత్నాలు చేస్తుండేవారు తిలక్, ఆ సందర్భంలో, జ్యోతి సినిమా నిర్మాతలు కడియాల వెంకటేశ్వరరావు, సూరెడ్డి వీరరాఘవయ్యగార్లతో వైట్ఫీల్డ్ కు వెళ్లారు. అక్కడే గూడూరుకు చెందిన శ్రీ గోగినేని చినవెంకట సుబ్బయ్యతోను, అన్నయ్య గారబ్బాయి శ్రీ గోగినేని చిన వెంకటేశ్వరరావుతోనూ పరిచయాలయ్యాయి. ఆ తర్వాత చినవెంకటేశ్వరరావు మద్రాసులోని కస్తూరి రంగయ్య రోడ్డులో ఇల్లు కట్టుకుని ఆ ఆవరణ లోనే థియేటర్ కూడా నిర్మించారు. అక్కడే కల్ని ముచ్చటిస్తుండేవారు పలువురు సినీరంగ ప్రముఖులు అప్పుడప్పుడూ.
         అలా అక్కడకు వచ్చిపోతుండేవారిలో దేవినేని సత్యనారాయణ ఒకరు. తిలక్ స్వగ్రామం దెందులూరులో ఆయన ప్రథమ కమ్యూనిస్టు నాయకుడు. ఆవూళ్లోనే ఉన్న తిలక్ కజిన్ ను పెళ్లిచేసుకున్నారాయన. సత్యనారాయణ వ్యాపారరీత్యా మద్రాసు వస్తుండేవారు. అదే విధంగా చింతలపూడి శాసన సభ్యుడు శ్రీ మొటపర్తి కోనేరావు కూడా మద్రాసు వచ్చినప్పుడు తిలక్ ను కలుస్తుండేవారు. దేవినేని సత్యనారాయణరావు మరదలు శ్రీమతి నాగరత్నం వలుసపల్లి మున్సబ్ దేవినేని వెంకటరత్నం పెద్దబ్బాయి వీరభద్రరావు భార్య. ఆ బంధుత్వంతో, పరిచయంతో మున్సబ్ గారి పెద్దమ్మాయి శకుంతలగారిని తిలక్ కు ఇచ్చి పెళ్లి జరిపించాలన్న ఆలోచన దేవినేని సత్యనారాయణగారిలో కలిగింది. దేవినేని వెంకటరత్నం కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతం నుండి నూజివీడు వైపు వచ్చి స్థిరపడిన కుటుంబీకుల్లో ఒకరు. మూడూళ్ల మున్సబే కాకుండా పొగాకు వ్యాపారం చేసి నష్టపడ్డవారిలో ఆయన కూడా ఉన్నారు.
         మున్సబ్ గారమ్మాయిని వివాహమాడటం  ఇష్టమేనా, అని అడిగినప్పుడు ఇల్లు వదిలి వచ్చి ఏదో ధ్యాసలో ఉంటున్న తనకు అలాంటి ఆలోచన లేదని జవాబిచ్చారు తిలక్. పర్వాలేదులే అని అమ్మాయిని చూసేందుకు ఒప్పించారు. మిత్రులు, మేనమామ సంజీవిగారితో కలిసి ఏలూరు వెళ్లటం, అక్కడ దెందులూరు నుండి వచ్చిన దేవినేని సత్యనారాయణను కల్సి వలసపల్లికి వెళ్లటం జరిగింది. పశ్చిమగోదావరి-కృష్ణా జిల్లాల మధ్యనున్న ‘తమ్మిలేరు’  వాగు ప్రక్కనున్న వూరు వలసపల్లి.
         శకుంతలను చూసిన వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించిన  తిలక్, తనకేమి ఆస్తిపాస్తులు లేవని, స్వయంకృషితో పైకొచ్చే ప్రయత్నంలో వున్నవాడిననీ అన్నప్పుడు ఫర్వాలేదని పెద్దలందరూ అన్నారు. అంతటితో ఆగక మరో నిబంధన పెట్టారు తిలక్. సాంప్రదాయం ప్రకారం వివాహం జరగటానికి తాను వ్యతిరేకినని, తన ఇష్టప్రకారం  ‘ప్రమాణాల’ తో మాత్రమే జరగాలనీ సూచించారు.  వధువు శకుంతలతో సహా అందరూ తలలూపారు.  వివాహం నిశ్చమయింది.
           సంప్రదాయం లేదనుకున్నాం, బాగానే వుంది కాని... నువ్వు మీ ఇంట్లో వాళ్లకు చెప్పకపోయినా, వాళ్లు చేయకపోయినా... కార్యక్రమం బాగా జరగాలి కదా.... అని అంటూ బెజవాడ (విజయవాడ) కు వెళ్లి బంధువులందరికీ సంప్రదాయంగా ఏమేమి బట్టలు అవసరమో అవి అన్ని కొన్నారు. అయితే వివాహం మటుకు ‘ఆదర్శవివాహమే'.
         ‘ఆదర్శవివాహాలు జరిపించేటందుకు ‘కమ్మ బ్రాహ్మణులు’,(శ్రీముక్కాముల లాంటివారు) కమ్యూనిస్టు అభిమానులు వుండేవారు. ఈ ఒరవడి బహశా త్రిపురనేని రామస్వామి చౌదరితో ఆరంభమయి ఉండొచ్చు. తిలక్ పెళ్లికి ముందే చెప్పినట్లు చింతలపూడి శాసన సభ్యుడు శ్రీ మొటపర్తి కోనేరావు అధ్యక్షతన ఓ ప్రమాణపత్రం తయారు చేసారు. వలసపల్లిలో మున్సబ్ గారింట్లో, శనివారం జూన్ నెల 12వ తేదీ, 1954 సంవత్సరం రాత్రి 9-34కు వారి వివాహం జరిగింది.
         ప్రమాణపత్రంలో, మేము ఉభయులం ఒకరినొకరం ప్రేమించుకుని నేడు మీ అందరి ఎదుటా పేండ్లి చేసుకుంటున్నాం. నేటి నుండి మేము యిరువురమూ కలిసి మెలిసి కాపురం చేసుకుంటామనీ, కలిమిలేముల్లో భాగస్వాములమై వుంటామని మీ సమక్షంలో ప్రతిన చేస్తున్నాం. దేశ సేవయే మా జీవితలక్ష్యంగా పెట్టుకుని జీవయాత్ర సాగించుకుంటామని కూడా పెద్దలైన మీ ఎదుట బాసలుచేస్తున్నాం, అని వ్రాసి తిలక్-శకుంతల సంతకాలు చేశారు. సాక్షి సంతకాలు కొర్లిపర సత్యనారాయణరావు, తిలక్ తండ్రి వెంకటాద్రి మేనమామ వడ్లపట్ల బలరామయ్య గారు చేసారు. ప్రమాణపత్రాన్ని ఎం ఎల్ ఎ. శ్రీ కోనేరావు వ్రాసారు.
         ఇన్ని ప్రమాణాలు చేసి దండలు మార్చుకునే సమయంలో తిలక్ చేతికి దండతోపాటు ‘మంగళసూత్రం' అందచేసారు ‘పెళ్లిపెద్దలు’. దండ వేస్తున్నారు కదా, దాంతోపాటు మంగళసూత్రం కూడా వేయమంటే కాదనలేకపోయారు తిలక్. ఆదేంటంటే, అదీ ఓ అలంకారమేకదా ఆన్నారటవారు. అప్పటికీ, ఇప్పటికీ తిలక్ కు అర్థం కానిది మంగళసూత్రం, సాంప్రదాయమైనదా లేక అలంకారమా అనే విషయం. అది దేనికి చిహ్నం అని మదనపడ్తుంటారు.
         ఆ తర్వాత పరిస్థితుల ప్రాబల్యమూ, మరేదో.... పది సంవత్సరాల తర్వాత, తన మరదలు 'భానుమతి’ కి సాంప్రదాయంగా పెళ్లి జరిపించి 'కన్యాదానం’ చేశారు. తమకు పిల్లలు లేనందున, తన భార్యమాట కాదనలేక 'రాజీ’ పడి తానా పనిచేసారు.
         పెళ్లైన తర్వాత మేనమామ ఎల్ వి ప్రసాద్ ఇంట్లో, మద్రాసు ఆడయార్ వీధిలో రిసెప్షన్ ఏర్పాటు చేసారు. పలువురు సినీరంగ ప్రముఖులు, భానుమతి భర్త రామకృష్ణ, నాగిరెడ్డి, అంజలి, జగ్గయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో..... అందరూ వచ్చారు.
         ఆలా మద్రాసులో మరో జీవితం ప్రారంభించారు తిలక్. పెళ్లికి ముందే తీసుకున్న ఇంట్లో (అద్దె) సంసారం పెట్టారు. సరిగ్గా ఆయన ఇంటి వెనుకనే వుండేవారు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు స్వర్గీయ తరిమెల నాగిరెడ్డిగారు.
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment