Thursday, July 23, 2020

శ్రీ మహాభాగవతము, ప్రథమ, ద్వితీయ స్కందాలు: వనం జ్వాలా నరసింహారావు


శ్రీ మహాభాగవతము, ప్రథమ, ద్వితీయ స్కందాలు
భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది
వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,
                   చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
                   చదివినను ముక్తి కలుగును
                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. ప్రధమ స్కందాన్ని విశ్వనాథం సత్యనారాయణ మూర్తి, ద్వితీయ స్కందాన్ని డాక్టర్ దావులూరి కృష్ణకుమారి అనువదించారు. ప్రధమ స్కందం 162 పేజీలు , ద్వితీయ స్కందం 115 పేజీలు  ఉన్నాయి. ప్రథమ స్కందంలో  ఉపోద్ఘాతం దగ్గరనుంచి, శుక మహర్షి పరీక్షిన్మహారాజు దగ్గరికి రావడం వరకు 30 అంశాలున్నాయి. ద్వితీయ స్కందంలో శుకుడు పరీక్షిత్తుకు ముక్తి మార్గాన్ని తెలియచేయడం దగ్గరనుండి నారాయణుడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి వరాలు ఇవ్వడం దాకా వివరంగా 6 అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 36 అంశాల వివరాలు తెలుసుకునే ముందర ‘ఉపోద్ఘాతం’, ‘పోతన గారి నిర్ణయం’ అనే శీర్షికల కింద చెప్పబడ్డ పోతన గారి మూడు పద్యాలను మననం చేసుకుందాం.   

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌
పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?
ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబుల వాహనంబులున్‌
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెట వ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పెనీ
బమ్మెర పోత రాజాకడు భాగవతంబు జగద్ధితంబుగన్‌

పోతన ఆనాటికే అంటే పదిహేనవ శతాబ్దాంలోనే రాజ్యానికి వ్యతిరేకంగా, రాజుకు వ్యతిరేకంగా కవితను భక్తితో కాపాడుకున్నాడు. స్పష్టమైన తన భావాన్ని సూటిగా చెప్పి రాజుల ఆశ్రయాన్ని తిరస్కరించిన కవి పోతన. భాగవతాన్ని తెనిగించి పోతన్న తనజన్మను సఫలం చేసుకున్నాడు. ఆ భాగవత పద్యాలను పఠించి తెలుగు ప్రజలు తమ జీవితాలనే పండించుకున్నారు.

         ప్రధమ స్కందంలో, పోతన గారి ఉపోద్ఘాతం, పోతనగారి  నిర్ణయం, పోతనామాత్యుడి వంశ వర్ణన, ఆరు అంత్య ప్రార్థనలు, భాగవత కథా ప్రారంభం, శౌనకాది మహామునుల ప్రశ్న, సూత మహాముని నారాయణ కథను ప్రశంసించడం, భగవంతుడి 21 అవతారాల వర్ణన ఉన్నాయి. ఆ ఇరవై ఒక్క అవతారాలు:

         శ్రీమన్నారాయణుడి విరాజమనామైన దివ్య రూపం మొదటి అవతారం. ఆ మొదటి అవతారమైన నాభి కమలం నుండి సృష్టి కర్త అయిన బ్రహ్మ పుట్టాడు. శ్రీమన్నారాయణుడి అవయవ స్థానాల నుండి అనేక లోకాలు సృష్టించ బడ్డాయి. మొదట ఆ దేవుడు కౌమార సర్గాన్ని ఆశ్రయించి బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించాడు. రెండవ సారి విశ్వ సృష్టి కొరకు రసాతలానికి పోయిన భూమండలాన్ని ఎత్తుతూ వరాహ దేహాన్ని ధరించాడు. మూడవ అవతారం నారదుడు అనే దేవర్షిగా. నాల్గవది నర-నారాయణ రూపం. పంచమావతారం కపిలుడుగా. ఆరవ అవతారం దత్తాత్రేయుడుగా అనసూయాదేవికి-అత్రిమహర్షికి పుట్టాడు. ఏడవ అవతారం యజ్ఞుడు పేరుతో అకూతికి-రుచికి జన్మించాడు. అష్టమ అవతారంలో ఉరుక్రముడు అనే పేరుతో జన్మించి విద్వాంసులకు పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. తొమ్మిదవ అవతారంలో పృధు చక్రవర్తిగా జన్మించాడు.

         పదవ అవతారంలో మహా మీనావతారం దాల్చాడు. పదకొండవ అవతారంలో తాబేలుగా పుట్టి మందరాచలాన్ని మోశాడు. పన్నెండవ అవతారంలో ధన్వంతరిగా జన్మించాడు. పదమూడవ అవతారంలో మోహినీ వేషం ధరించి రాక్షసులను మొహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచాడు. పద్నాలుగోది హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం. పదిహేనవది బలిని మూడు అడుగులు అడిగిన వామనావతారం. పదహారవది పరశురామావతారం. పదిహేడవది వేదవ్యాస అవతారంగా ఎత్తి వేదాలను విభజించడం చేశాడు. పద్దెనిమిదో అవతారం శ్రీరామావతారం. పంతొమ్మిది-ఇరవైవది బలరామ-కృష్ణావతారాలు. ఇరవై ఒకటో అవతారం బుద్ధావతారం. ఇవికాక కలియుగంలో, యుగసంధిలో కల్కి అనే పేరుతో ఇరవై రెండో అవతారంగా పుట్తాడు.

         ప్రథమ స్కందంలో ఇంకా, వ్యాసుడు వ్యాకులపడి చింతించడం, ఆయన వద్దకు నారదుడు రావడం, నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం, అర్జునుడు పాండవ పుత్రులను చంపిన అశ్వత్థామను బంధించి తేవడం, ద్రౌపది అతడిమీద జాలి చూపగా విడిచి పెట్టడం, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఉత్తర గర్భస్థ శిశువు (పరీక్షిత్తు) ను రక్షించడం, కుంతీదేవి శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయడం, ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి మరణించడానికి సిద్ధంగా వున్న భీష్ముడి దగ్గరికి పోవడం, భీష్ముడు శ్రీకృష్ణుడిని స్తుతించడం, శ్రీకృష్ణుడు ద్వారకానగారానికి వెళ్లడం, నగరం ప్రవేశించి అంతఃపుర కాంతలనందరినీ చూడడం ఉన్నాయి.

         ఇంకా, ఉత్తరకు పరీక్షిత్తు జన్మించడం, గాంధారీ-ధృతరాష్ట్రులు దేహత్యాగం చేసుకోవడం, ధర్మరాజు దుశ్శకునాలు చూసి విచారపడడం, అర్జునుడు ద్వారక నుండి వచ్చి శ్రీకృష్ణ నిర్యాణం గురించి ధర్మరాజుకు చెప్పడం, పరీక్షిత్తు పట్టాభిషేకం-పాండవుల స్వర్గారోహణం, పరీక్షిత్తు మహారాజుగా భూదేవి-ధర్మదేవతల సంవాదం వినడం, కలిపురుషుడు ధర్మ దేవతను తన్నడం,  పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపాలన చేయడం,  పరీక్షిత్తు శమీక మహర్షి మీద మృత సర్పాన్ని వేయడం, శమీక పుత్రుడు శృంగి పరీక్షిత్తును శపించడం (ఏడు రోజుల్లో తక్షకుడి చేతిలో చావు), మునికుమారుడి శాపం విని ప్రాయోపవేశానికి పరీక్షిత్తు సిద్ధపడడం, శుకమహర్షి పరీక్షిత్తు దగ్గరకు రావడం వరకు ఉన్నాయి ప్రథమ స్కందంలో.

         ద్వితీయ స్కందంలో, శుకుడు పరీక్షిత్తుకు ముక్తిమార్గాన్ని తెలియచేయడం, భక్తి మార్గమే ముఖ్యమని శుకుడు పరీక్షిత్తుకు చెప్పడం, నారదుడు బ్రహ్మను జగత్ సృష్టి గురించి అడగడం, శ్రీమన్నారాయణుడి లీలావతారాల వర్ణన, పరీక్షిత్తు శుక మహర్షిని ప్రపంచోత్పత్తి క్రమాన్ని గురించి అడగడం,  బ్రహ్మ తపస్సుకు మెచ్చి నారాయణుడు వరాలు ఇవ్వడం ఉన్నాయి.


         మరింత వివరంగా చెప్పుకోవాలంటే: పరీక్షిత్తుతో శుకముని సంభాషణలు, భాగవత పురాణ మహాత్మ్యం, ఖట్వాంగుడు ముక్తిపొందిన విధానం, ధారణా యోగానికి చెందిన ఆ మహావిష్ణువు అవయవాలలో సమస్త లోకాలున్న తీరు, సజ్జనుల ప్రవృత్తి, ముక్తికన్నా ఇతరంగా కోరుకున్న వాటన్నిటినీ సిద్ధింపచేయడానికి దేవతలను సేవించే సరణి, ముక్తిప్రదాత ఒక్క శ్రీవిష్ణువే అని చెప్పడం, విష్ణు సేవనం లేని మానవులకు నీచత్వం ఆపాదించడం, పరీక్షిన్మహారాజు ప్రశ్నించడం, శుకముని శ్రీహరిని స్తుతించడం, వాసుదేవుడి దయవల్ల బ్రహ్మ బ్రహ్మాధిపత్యం సంపాదించడం ఉన్నాయి.

అలాగే, శ్రీవిష్ణువు వల్ల బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచం ఉద్భవించడం, శ్రీమన్నారాయణ దివ్య లీలలుగల జన్మల పరంపర, అవతార వైభవ విశేషాల్ని సూచించడం, భాగవత వైభవం, పరీక్షిత్తు శుకయోగిని ప్రశ్నించిన ప్రపంచాది ప్రశ్నలు, వాటిల్లో శ్రీహరి కర్తృత్వ ప్రాధాన్యం గల అంశాన్ని చెప్పడం, భగవత్సేవ ఔన్నత్యం, బ్రహ్మ చేసిన తపస్సుకు నారాయణుడు ప్రసన్నుడై వైకుంఠపదంతో సహా సాక్షాత్కరించడం, బ్రహ్మ అతడిని పొగిడి దైవానుగ్రహంతో అతడి ప్రభావాన్ని వినడం, విష్ణువు ఉపదేశం ప్రకారం బ్రహ్మ నారదుడికి భాగవత పురాణంలో ప్రధానమైన పది లక్షణాలు వివరంగా చెప్పడం, నారాయణుడి గొప్పదనం, జీవాదితత్త్వసృజన, శ్రీహరి నిత్యవిభూతి లాంటి విషయ వర్ణన, కల్పాదుల తీరుల సూచనలు, విదుర-మైత్రేయ సంవాదం వినిపించమని సూతుడిని శౌనకుడు అడగడం అనే వృత్తాంతాలు ఉన్నాయి. 
  
         శుకుడు పరీక్షిత్తుకు ముక్తిమార్గాన్ని తెలియచేయడంలో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్తాడు. క్లుప్తంగా అవి: ‘విరాట్పురుషుడైన శ్రీమన్నారాయణుడిలో పద్నాలుగు లోకాలలో జరిగిన-జరుగుతున్న-జరగబోతున్న సమస్త విషయాలు కనిపిస్తాయి. నేల, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అహంకారం, మహత్తు అనే తత్త్వాలు ఈ విగ్రహం యొక్క ఆవరణాలు. ఇవి బ్రహ్మాండకోశమైన విరాట్ రూపుడి చుట్టూ పొరలు-పొరలుగా చుట్టి ఉంటాయి. ఈ దేహంలో తేజరిల్లే ఆ విరాట్ స్వరూపుడే చిత్తం, ఏకాగ్రతకు చోటైన వాడు. ఆ మహాపురుషుడి రూపం ఎలా ప్రకాశిస్తుంది అంటే.....’

         ‘ఆయన పాదం మోపడానికి ఆధారమైన అరికాలు పాతాళం. ముంగాళ్లు రసాతలం. చీల ప్రదేశం మహాతలం. పిక్కలు తలాతలం. మోకాళ్లు రెండూ సుతలం. తొడలు రెండూ వితలం, అతలం. పిరుదు మహాతలం. బొడ్డు రంధ్రం ఆకాశ స్థలం. రొమ్ము ప్రదేశం సువర్లోకం. ఇది గ్రహాల, నక్షత్రాల తేజస్సముదాయంతో కూడి ఉంటుంది. మెడ మహర్లోకం. ముఖం జన లోకం. నొసలు తపోలోకం. శిరస్సు సత్యలోకం (చివరి ఏడు ఊర్ధ్వ లోకాలు)’.

         ‘ఆయన బాహువులు ఇంద్రుడు మొదలైన వాళ్లు. చెవులు దిక్కులు. శ్రోతేంద్రియం శబ్దం. ముక్కుపుటాలు అశ్వినీ దేవతలు. వాసన చూసే ముక్కు గంధం. నోరు అగ్నిహోత్రుడు. కళ్లు అంతరిక్షం. చూసే ఇంద్రియం అయిన కన్ను సూర్యుడు. కనురెప్పలు రేయి-పగలు. కనుబొమలు బ్రహ్మపదం. అంగిట్లోని రెండు భాగాలైన తాలుపులు వరుణుడు. నాలుక అనే ఇంద్రియం రసం, అంటే రుచి. మాటలు నాలుగు వేదాలు. కోరలు యముడు. దంతాలు పుత్రాదుల మీద వుండే ప్రేమ. నవ్వులు మాయలు. పుట్టుకల పరంపర కడగంటి చూపు. పై పెదవి సిగ్గు. కింది పెదవి ఆశ. రొమ్ములు ధర్మ మార్గాలు. వీపు అధర్మం.

         ‘పురుషాంగం సృష్టి కర్త. అండ కోశాలు మిత్రావరుణులు. మనస్సు చంద్రుడు. అహంకారం రుద్రుడు. గోళ్లు గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు. నడుము ప్రదేశం పశువులు, మృగాదులు. మాటల నేర్పులు పక్షులు. బుద్ధి స్వాయంభవ మనువు. నివాసం పురుషుడు. షడ్జాది స్వరాలు గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు. ప్రహ్లాదుడు స్మృతి. వీర్యం దైత్యులు, దానవుల సమూహం. ఇలాంటి సర్వమయుడైన విరాట్ పురుషుడి విగ్రహంతో మోక్షగామి (ముముక్షువు) తన మనస్సును సంధానించాలి’.    

         అదే విధంగా శ్రీమహా విష్ణువు బ్రహ్మకు, బ్రహ్మ నారదుడికి, నారదుడు వేదవ్యాసుడికి, ఆయన శుకమునికి చెప్పిన మహాభాగవతం లోని ‘పరాత్పరుడి వల్ల ఈ సమస్త లోకాలు ఎలా ఉద్భవించాయి అనే అంశం శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన విధానం కూడా ఆసక్తిగా ఉంటుంది. ఆ వివరాల్లోకి పోతే:

         నారాయణుడి మహిమను వర్ణించడం ఎవరి తరం కాదు. ఆ విరాట్ పురుషుడి హృదయాకాశం నుండి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. జీవుడి వెన్నంటి ఆ ప్రాణాలు బయటకు పోతుంటాయి. ఆకలిమంటలు, ఓర్చుకోలేని దాహం కలుగుతాయి. నోటి నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. ముఖం నుండి శోభిల్లి ‘పలుకు తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. విరాట్ పురుషుడి ముఖం నుండి వాక్కు పుట్టింది. దీనికి దేవత అగ్ని. అగ్ని, వాక్కు (మాట) కలయిక వల్లే సంభాషణం వెలువడింది.

మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. తేజస్సు నుండి రెండు కళ్ళు పుట్టాయి. సాక్షాత్తు భగవంతుడే చెవికి కారకుడయ్యాడు. దీని దేవత దిక్కులు. పుట్టుకలను కల్పించే పురుషుడి వల్ల చర్మం పుట్టింది. దాన్నుండి రోమాలు పుట్టాయి. వాయువు నుండి చేతులు పుట్టాయి. ఈశ్వరుడి శరీరం నుండి పాదాలు పుట్టాయి. వీటి దేవత విష్ణువు. భగవంతుడి వల్లే పురుషాంగం, స్త్రీ అంగం పుట్టాయి. స్త్రీ-పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఒక శరీరం నుండి మరో శరీరానికి చేరుకోవాలనుకున్నప్పుడు బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణ-అపాన వాయువులను బంధించడానికి స్థానమయింది ఆ బొడ్డే. ఆ బంధం తొలగించడమే మరణం. అలాగే పేగులు, పొట్ట, నాడీ మండలం నిర్మితమయ్యాయి. కామానికీ, సంకల్పానికీ నెలవైన హృదయం పుట్టింది. ఆ తరువాత విరాట్ పురుషుడి తనువు నుండి సప్త ధాతువులు (త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధ, మజ్జ, ఎముకలు), ఏడు ప్రాణాలు (భూమి, నీరు, తేజస్సు వగైరా), ఇంద్రియాలు, అహం నుండి పుట్టిన స్వభావాలు, మనస్సు, మతి పుట్టాయి. ఇవన్నీ ఆ పరమేశ్వరుడి స్థూల శరీర భాగాలే! ఇలా ఆ విరాట్ పురుషుడి ఈశ్వర రూపానికి తుదీ-మొదలు ఉండదు.         

ఇలాంటి విషయాలన్నీ ప్రధమ, ద్వితీయ స్కందాలలో చదవగలగడం పూర్వజన్మ సుకృతం.  
మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

No comments:

Post a Comment