Wednesday, July 22, 2020

సందేశం నుంచి విశాలాంధ్ర వరకు .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


సందేశం నుంచి విశాలాంధ్ర వరకు
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(జూలై 31- ఆగస్టు 5, 2000)

         సినిమాల్లోకి వచ్చాంగదా! ఆ రంగంలోని వ్యక్తుల గురించి, వారితో పరిచయాలను గురించి సందర్భానుసారంగా వివరిస్తాననీ, అదే విధంగా కమ్యూనిస్టు పార్టీవైపు ఆదిలో ఆకర్షితులై, ఆ తర్వాత, కారణాలు ఏమైనా ఆ పంథాను వీడిన వారి ఆత్మవిమర్శకు చెందిన సంఘటనలను గురించి కూడా చెప్పాల్సి వుందని తిలక్ అంటారు.  తను కూడా ఆత్మవిమర్శ చేసుకున్న వారిలో, ఇంకా చేసుకుంటున్న వారిలో ఒకడినని అన్నారు.
         తనకు ఇప్పటికీ అర్థంకాని ఓ విషయం ఉందంటారు ఆయన. సమాజంలోని ఉన్నత వ్యక్తులు, ఉన్నవారు, దాదాపు అందరూ, వీధుల్లో అడుక్కుని జీవించేవారికి ‘పైసలు’ దానం చేస్తారు కాని... స్వచ్చంద సామాజిక సేవకులమని చెప్పుకునే వారెవరూ ఆలా ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. ఆమాటకొస్తే, ఆడుక్కునేవాడి  ఆశయం, ‘కోటి విద్యలు, కూటి కొరకే కదా’! డబ్బులు ఇస్తే, ఈ బీదవారిని, బీదరికాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని కొందరు వాదిస్తారు. అదో ’నెపం' మాత్రమే అంటారు  తిలక్. అందరూ సమానం' అని చెప్తుండే వీరు ఈ బీదవారి గతి ఏం కావాలి అనే విషయం ఎందుకు మాట్లాడరు? అనేది ఆయన సంధించిన ప్రశ్న.
         సోషల్ ఏక్టివిస్టుకు  ‘ఫైటర్’ గుణాలున్నా, ఈ విషయాలను గురించి పట్టించుకోరు, అని అంటూ, ఇది ధార్మికమేనా? అన్న మీమాంస తన అంతర్మథనంలో ఎప్పుడూ రగుల్తూనే వుంటుందని చెప్పారు తిలక్. తన ఈ ప్రశ్నలకు జీవితానుభవం రంగరించుకున్న సోషల్ యాక్టివిస్టు సమాధానం చెప్పాలనీ, బీదవారికి షెల్టర్ కలిగించే, మరో సోషల్ యాక్టివిస్ట్ లేదా వ్యవస్థ ఎప్పుడు ఆవిర్భవిస్తుందో చూడాలని కూడా వుందని ఆయన  ఆవేదనతో అన్నారు.  అమెరికా అప్పటి అధ్యక్షుడు క్లింటన్ పర్యటన ఆ సందర్భంగా అరెస్ట్ చేసి దాచిపెట్టిన బీద  బిచ్చగాళ్ళు మళ్లీ అవతరించారనీ, వీరికి శాశ్వతంగా ఉపాధి ఎందుకు కలిగించరనీ తిలక్ ప్రశ్నించారు.
         ప్రఖ్యాత దర్శకులు శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారితో పరిచయం కలిగిన తర్వాత, ఆయనతో తానీ విషయాలు కొన్ని ప్రస్తావించాననీ, అదే కథా వస్తువుగా సినిమా తీస్తానని ఆయన చెప్పేవారని, పర్యవసానంగా ‘కోటి విద్యలు కూటి కొరకే' అనే సినిమా తీయటం జరిగిందని తిలక్ చెప్పారు. హైదరాబాద్ లో విశాలాంధ్ర ఎడిటర్ గా పదవీ విరమణ చేసిన శ్రీ సి.రాఘవాచారి గారి సత్కార కార్యక్రమానికి తానూ వెళ్లాననీ, ఆ సందర్భంగా, తన పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నానని చెప్పారు తిలక్. మొదలు కమ్యూనిస్టు పార్టీకి ప్రజాశక్తి అనే ఓ పత్రిక వుండేది. కాలం మార్పులు, వాటి ప్రభావం, దానిపై పడి, ‘ప్రజలు’-‘శక్తి’ విడిపోయారు. పోనీ విడదీసారు, అని భావగర్భితంగా ఉన్నారు తిలక్.
         ఎస్ వి నర్సయ్య కమ్యూనిస్టు పార్టీ కో ఆర్డినేటర్ గా చెన్నపట్నంలో అజ్ఞాత కార్యకలాపాలు సాగిస్తున్న రోజుల అనంతరం, కృష్ణా జిల్లాకు చెందిన కోటేశ్వరావు అనే వ్యక్తి పేరు పైన, డిక్లరేషన్ వేయించి, ‘సందేశం' అనే ఓ వారపత్రికను ప్రారంభించారట. తెలంగాణ ఉద్యమం నిలుపుదల, పోనీ, ఆణచివేత తర్వాత జరిగిన సంఘటన ఇది.
         ప్రఖ్యాత జర్నలిస్ట్ శ్రీ రాంభట్ల కృష్ణమూర్తి సహా, ‘సందేశం' సంపాదకవర్గంలో అభ్యుదయ భావాల వారు మరి కొందరున్నారు. వాళ్ళ ఆర్టికల్స్ అందులో ప్రచురించటం జరిగేది. రాంభట్ల గారు ఆందులో బొమ్మలు కూడా వేసినట్లు తనకు గుర్తని అంటారు తిలక్.


         ఆదే రోజుల్లో శెట్టి ఈశ్వరరావుగారి చొరవతో ఎ-4 పేపరు సైజులో ఓ పత్రిక ప్రారంభమయింది. దాని పేరే 'విశాలాంధ్ర’, కమ్యూనిస్టు పార్టీ అండదండలతో భవిష్యత్ లో ఆ పత్రిక నేటి 'విశాలాంధ్ర’ దినపత్రిక గా మారిందని చెప్పారు. తిలక్, ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే నినాదం స్ఫూర్తితో, పత్రికకు ఆ పేరు పెట్టివుండవచ్చునని కూడా అన్నారు తిలక్.
         ఆనాటి సంగతులు, పత్రికల్లో ప్రచురితమయిన విషయాలను గుర్తు చేసుకుంటూ, మధ్య మధ్యన, అందులో (విశాలాంధ్రలో) తాను కూడా ‘తాతారావు' అనే కలం పేరుతో వియత్నాం యుద్ధ విషయాలపై వ్యాసాలను వ్రాసానని చెప్పారు తిలక్.
         అప్పట్లో ఎమ్ ఎన్ వాఘ్ లే అనే ముంబాయి నగరానికి చెందిన ఓ విలేఖరి, ఆజ్ఞాతంగా, వియత్నాంలోని యుద్ధ భూమిలోకి చేరి పోరాటాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తిరుగు ప్రయాణంలో బాంబేకు వెళ్తూ, మధ్యే మార్గంలో మద్రాసులో ఆగారు. ఆయనకు అప్పట్లో ఆతిథ్యమిచ్చారు తిలక్, మద్రాసులో. వాఘ్ లే చెప్పిన విషయాలను, తిలక్ 'తాతారావు' పేరుతో పత్రికకు పంపగా వారు ప్రచురించారు వాటిని. వాటికి సంబంధించిన రెండు మూడు విషయాలను చెప్పారు. ఫ్రెంచ్ వారిని మభ్యపెట్టటానికి, వియత్నామీయులు, పైకి మాత్రం వారి కరెన్సీ నోటునుంచి, క్రింద తమ కరెన్సీ నోట్లను పెట్టుకుని, మార్కెట్ లో సరకులను కొనుక్కునేవారు. ఆ విధంగా ఫ్రెంచ్ కరెన్సీ చెలామణిని అడ్డుకునేవారట. అది వారి దేశభక్తికో ఉదాహరణ అంటారు తిలక్.  అదే విధంగా, యుద్ధ మారణ హోమంలో కూడా, తమపిల్లలు, ఆక్షరాస్యులు కావాలన్న కోరికతో, ఫుట్ పాతుల పైన వుండే చెట్లను చెక్కి, వియత్నాం 'లిపి'లో, ఇతరులు నేర్చుకునే రీతిలో అక్షరాలు వ్రాసేవారట. అరకలకు కట్టిన ఎద్దులపైన ‘అక్షరాలు' దిద్దేవారట. స్వాతంత్ర్యోద్యమంలో అక్షరాస్యతా వ్యాప్తి ఆలాచేసారు వారు అంటారు తిలక్.
         వియత్నాంపై వేసిన బాంబుల ‘షెల్స్' ను పాత్రలుగా మలచేవారు. చంటి పిల్లలను వీపుకు కట్టుకుని, ఓ చేత్తో తుపాకితో ఉద్యమంలో పాల్గొనే వారు వియత్నమీయులు, అక్కడ మహిళలు.
         తను వ్రాసిన, ఈ సంఘటనలు, తనకు 'జ్యోతి' సినిమా తీస్తున్నప్పుడు స్పూర్తినిచ్చాయనీ, పర్యవసానమే 'బలే బలే’... పాటనీ చెప్పారు తిలక్.
         ఈ విషయాలను చెప్తున్న తిలక్ గారి ఆలోచనలు ఒక్కసారిగా గూడవల్లి రాంబ్రహ్మంగారి దర్శకత్వంలో నిర్మించిన సారథి ఫిల్మ్స్ వారి 'రైతుబిడ్డ' సినిమా వ్యవహారం వైపు మళ్లాయి. దానిలోని కథా వస్తువు జమీందారీ వ్యవస్థకు, ఆ వ్యవస్థకు బ్రిటిషు వారిచ్చిన మద్దతుకు వ్యతిరేకంగా ఉన్నందున నాటి ప్రభుత్వం ఆ సినిమా ప్రదర్శనను నిషేధించింది. అయితే చల్లపల్లి రాజాగారు, తన అవసరాలకు, ఆయనకున్న పలుకుబడి వుపయోగించి, కొన్ని కొన్ని జిల్లాల్లో, ఆ జిల్లా కలెక్టర్లకున్న విశేషాధికారాల సాకుతో, రైతుబిడ్డను దొంగచాటుగానో, దొరచాటుగానే ప్రదర్శించే ఏర్పాటు చేస్తుండేవారు. దాన్ని, పోనీ ఆ పద్దతినీ తిలక్ గారు బాహాటంగా విమర్శించారు. 'నిషేధం’ ఎత్తివేతకు ఆందోళన చేయాలి కాని, ఎందుకీ అడ్డదారులు తొక్కాలని ఆయన వాదన. ఇలా తన అవసరాలకు ‘రిలీజ్’ చేయించటం తప్పంటారు.
         ఆ రోజుల్లో, 'సామాజిక స్పృహ అంతగా లేని’ (తిలక్ గారి మాటల్లో) ఎల్ వి ప్రసాద్ గారు ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాన్ని, నిషేధాన్ని సమర్థించారు. ప్రభుత్వం ఇది మంచిది అని అనుకొని చేస్తే ఎందుకు వ్యతిరేకించాలని పత్రికా ప్రకటన ఇచ్చారట కూడా. తన మేనమామ అని కూడా ఆలోచించకుండా, ఆయన ఇంట్లో వుంటున్నప్పటికీ, తిలక్ ఆ ప్రకటనను ఖండిస్తూ మరో స్టేట్‌మెంట్ పత్రికలకు రిలీజ్ చేసారు. ఆది ఎల్ వి గారికి ఎంతో మనస్థాపం కలిగించింది పాపం. కాని తిలక్ దారేవేరు.
         జమీందార్ వ్యతిరేకపోరాటం ఇతివృత్తంగా నిర్మించిన ‘రైతుబిడ్డ' చిత్రంలో బళ్లారి రాఘవ, టంగుటూరి సూర్యకుమారి, కొసరాజు రాఘవయ్య చౌదరి, తదితరులు నటించారు. గూడవల్లి రామబ్రహ్మంగారు జర్నలిస్టుగా వచ్చి, తీసిన సినిమా అది. ఆయనే కె ఎస్ ప్రకాష్ రావు గారిని సినీరంగానికి తీసుకొచ్చారు. రైతు బిడ్డపై నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనన్నా ఎత్తివేయాలని చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఆ తర్వాత కాలంలో చల్లపల్లి రాజాగారు కాంగ్రెస్ లో చేరి అందులో ఓ ప్రముఖ నాయకుడయ్యారు. అది వేరే సంగతి. ఆ విషయాలు మరోసారి చేప్తానన్నారు తిలక్.
          తిలక్, తన ఎమ్ ఎల్ ఎ సినిమా ప్రివ్యూ సందర్భంగా ఎన్నో ఏళ్ల తర్వాత సికింద్రాబాద్ క్వాలిటీ బార్లో చల్లపల్లి రాజాగారిని కలిసినప్పుడు, ఈ విషయాలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయట. అప్పుడు కూడా తిలక్ గారు మరోసారి ప్రశ్నించారు. చల్లపల్లి రాజా గారిని.... ఎందుకు మీరు రైతుబిడ్డ సినిమాను అడ్డదారిలో ప్రదర్శించే ప్రయత్నాలు చేశారని?. ఈ విషయాలు కూడా మరోసారి వివరంగా చేప్తానన్నారు.
         సమాజంలోని అభ్యుదయ భావాల వ్యక్తులు ఎలా కాలప్రభావం వల్ల మారిపోతుంటారో మరోమారు గుర్తుచేసుకున్నారు తిలక్. తానూ ఆ కోవలోనివాడివేననీ అంటారాయన. ఒకప్పుడు అభ్యుదయ భావాల ఆరుద్ర, శ్రీశ్రీ, కొడవటిగంటి, తాపీ ధర్మారావు గార్లు కలిసి చర్చించి, ఆ సినిమా ఎవరు తీసిందైనా, అభ్యుదయ ఇతివృత్తమైతే, కథల-పాటల రచనలో సహకరించేవారు. కె ఎస్ ప్రకాశరావు గారు వీరిని ప్రోత్సహించేవారు. సుంకర-వాసిరెడ్డిల స్రిప్ట్ నయితే వారు తప్పక పరిశీలించి, సహకరించేవారు. అప్పటి అభ్యుదయ రచయితలు, ఆత్రేయ లాంటివారు పోరాటాల్లోంచి వచ్చిన వ్యక్తులు. వారు రచించిన ప్రతిపాటను, వ్రాసిన ప్రతిమాటను ఏదో విధంగా, ఆభ్యుదయ భావాల బాటలో ఇరికించే ప్రయత్నమే చేసేవారు.
         తిలక్ ప్రత్యేకంగా ఎవర్ని ఉద్దేశించి చెప్పక పోయినా, ఆయన మాటల్లో సమాజ ప్రభావం వల్ల అభ్యుదయ భావాలు, వ్యక్తులు, వేరవుతున్నారనే అర్థం వ్యక్తమయింది. సమాజంలోని వ్యక్తులందరిలాగానే, తిలక్ ను కూడా అంతస్తు పెరగకపోయినా, కొద్దిగా  మారుతున్నందున - కొన్ని వ్యసనాలకు లోనుచేసాయి. ఆడపాదడపా మద్యం సేవించటం, ఆలవాటున్న సిగరెట్ ను అధిగమించి చుట్ట, పైపుల వైపు దృష్టి మళ్లించటం దాంతో పాటే తానూ ఓస్టూడియో ఎందుకు నిర్మించరాదో అని ఆలోచించటం జరిగాయి. వాటి తప్పొప్పుల వివరాలలోకి ఆయన వెళ్లలేదు.
         ఆదే అంటారు తిలక్. అందరి లాగానే, తనపై కూడా, తానూ ఆకోవలోని వాడినే అయినందువల్ల, సామాజిక ప్రభావం అప్పుడప్పుడూ పడ్తూండేదనీ, అది, అధిగమించే ప్రయత్నం చేసానని చెప్పారు తిలక్. సఫలుడు అయిందీ లేనిదీ చెప్పలేనన్నారు.                                    
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment