Tuesday, July 28, 2020

దోపిడి విధానాన్ని ఎద్దేవా చేసిన ‘ఎం ఎల్ ఎ’ సినిమా .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


దోపిడి విధానాన్ని ఎద్దేవా చేసిన ‘ఎం ఎల్ ఎ’ సినిమా
స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక
(సెప్టెంబర్ 10-16, 2000)

         ముద్దుబిడ్డ సినిమా తీసిన తదుపరి, సెంటిమెంట్ ప్రాధాన్యత కన్నా సమస్యాత్మక చిత్రం ఒకటి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలోపడ్డారు తిలక్.  భూసంస్కరణలు, దున్నేవాడిదే భూమి... లాంటి నినాదాలకు ఆకర్షితులై, వాటితో ప్రభావితులైన వారిలో ఆరుద్ర, తాపి ధర్మారావు, తిలక్ గార్లు కూడా ఉన్నారు. ఫలితంగా రూపుదిద్దుకున్న సినిమా ఎమ్మెల్యే. అనేక నూతన ప్రయోగాలకు ఉదాహరణగా చెప్పుకోవాల్సిన కొన్ని సినిమాల్లో ఒకటైన ఎమ్మెల్యే చిత్రీకరణ చాలా భాగం ఔట్‌డోర్ లోనే జరిగింది. 'రాజకీయ చాణక్యం- బంతివడ్డన రాజకీయాలు’ ఎమ్మెల్యే సినిమా మెయిన్ థీమ్.

జమీందారులు, భూస్వాములు, ధనికులు స్వయంగా చట్టసభలకు పోటీ చేయకుండా, ప్రజలనాడికి అనుగుణంగా ఉండే వ్యక్తుల్ని ఎంచుకొని, తమ పలుకుబడితో పెట్టుబడితో వారిని ఎన్నికల్లో గెలిపించి, తమ పనులను వారిద్వారా చేయించుకునే, ఓ రకమైన దోపిడీ విధానాన్ని ఎద్దేవా చేసే చిత్రం ఎమ్మెల్యే. అయితే సంపన్న వర్గం వారి చాణక్య రాజకీయంతో గెలుపొందిన కొందరు, ప్రజల్లోంచి వచ్చిన వారైనందున, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మారే ప్రయత్నంలో, కొంత వూగిసలాటకులోనైనా, చివరకు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలనే తీసుకుంటారని తెలియచెప్పే ప్రయత్నం ఎమ్మెల్యే సినిమాలో జరిగింది. ఆలాంటి ఓ ఎమ్మెల్యే ఆ నిర్ణయాలను తీసుకున్నప్పుడు ఎదుర్కొన్న సాదకబాదకాలు యీ సినిమాలో ప్రస్పుటితమౌతాయి.

         ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామమైన మన్నెగూడెంలో, మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా పోటీచేసి  గెల్చిన స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి ఓ సందర్భంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారాన్ని తమ సినిమా కొరకు షూటింగ్ చేసారు తిలక్.  జీప్ హెడ్ లైట్ల ఆసరాతో చేసారా షూటింగు కొంతసేపు. ఓటింగ్ సందర్భంగా బారులు తీరి నిల్చున్న ఓటర్లక్యూలు, ఓటర్లను మభ్యపెట్టే సన్నివేశాలు, దొంగనోట్లు చేయించే విధానం, ఓటర్లను గడీల్లో-దొడ్ల (బందిల?) లో దాచివుంచటం ఎమ్మెల్యే సినిమాలో చూపించారు. ఆ సీన్లు అక్కడ షూట్ చేసినవే.

         ఎమ్మెల్యే సినిమాలోని గుమ్మడి పాత్ర బంతివర్గ రాజకీయం నడిపిస్తుండే జమీందారు కారెక్టర్. మొదట్లో తానీ వేషం వేయనని, రంగారావుగారైతే బాగుంటారని గుమ్మడి సూచించినా, ఆయనే వేయాలని తిలక్ చెప్పి ఒప్పించారు.

         ఎమ్మెల్యే సినిమా తీద్దామన్న కోర్కె కలిగినప్పుడే తిలక్ గారికో ఆలోచన వచ్చింది. హైదరాబాద్ నగరాన్ని వర్ణిస్తూ ఓ ఆసక్తికరమైన పాటను చక్కటి సన్నివేశాలతో చిత్రీకరించాలని ఆయన కనిపించింది. అప్పట్లో హైదరాబాదు రాజధానిగా ఎంపిక చేయకపూర్వం, ఎక్కడ రాజధాని అని ఊహాగానాలు పుట్టినప్పుడు వినిపించిన పేర్లలో కృష్ణా-గుంటూరు మధ్య ప్రదేశం, నూజివీడు (ఎందుకంటే అక్కడ జమీందారీ భవంతులున్నందున) కూడా ఉన్నాయి. ఎన్నిఅభిప్రాయాలు వెలువడినా చివరకు రాజధానిగా హైదరాబాద్ నే నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో హైదరాబాదును చారిత్రాత్మకంగా-కళాత్మకంగా వర్ణిస్తూ ఆరుద్రగారు చక్కటి పాటను వ్రాసారు ఎమ్మెల్యే సినిమాకొరకు. ఆ పాట ఇలా సాగుతుంది. “ఇదే నండి, ఇదే నండి- భాగ్యనగరం మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం, పాలించెను గోలుకొండ కులీకుతుబ్ షాహి- భాగ్యమతి అతని యొక్క ముద్దులదేవి-ప్రేయసికోసం కట్టినాడు పెద్దవూరు-ఆవూరే ఈనాడు హైదరాబాద్-ఇదేనండి-అలనాడు వచ్చెనట మహమ్మారి-అల్లా దయవల్ల ఆ పీడపోయినాది. ఆ గండం తప్పిందని గుర్తునిలిపాడు. ఆగుర్తె ఆందమైన చార్మినార్ - ఇది పాడు పడిన గోలుకొండ కోట- శ్రీరాముడు కనిపించే తానీషాకీచోట”. ఇంకా ఇలా సాగుతుంది ఆ పాట:

         బద్రాద్రి రామదాసు బందిఖానా చూడండి ఇదిగో ఈ కోటలోన ఇదేనండి.
         ఆలనాడిది తెలుగుతల్లి అందమైన తోట-ఆంద్ర శౌర్యవాహినులే పారినీచోట.
         ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడలు-కోటపట్టుకొనగ పదిఏండ్లు పట్టినాదట.
         వింత వస్తుశాలలు విశాలమగు వీధులు విద్యాలయ భవనాలు -
         కనులకింపు చేసే కమ్మని నగరం భరతమాత బడలోని పసిడినాగరం-
         ఇదేనండి... భాగ్యనగరం- మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం.

         శ్రీరమణమూర్తిని పరిచయం చేసారు తిలక్ ఈ సినిమాలో. ఆయన గిరిజ కలిసి నగరంలో తిరుగుతూ పాడుతున్నదీ పాట.

         ఎమ్మెల్యే సినిమాలో ఓం ప్రథమంగా ప్లేబ్యాక్ సింగర్ గా శ్రీమతి జానకిని పరిచయం చేశారు తిలక్. ఘంటసాల-జానకి జంటగా పాడిన అపురూపమైన పాట ‘నీ యాశ అడియాస...’ విననివారు ఆ తరంలో బహుశా ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆపాటు రికార్డు చేస్తున్నప్పుడు ‘అయ్యా మొత్తం పాటంతా... పల్లవంతా నాకే ఇవ్వరాదా, నేవే పాడుతాను' అని ఆడిగారట శ్రీ ఘంటశాల.  ‘కుదరదు.. ఆ అమ్మాయి వుండాలి, మీరు వుండాలి' అని స్పష్టంగా తేల్చేసారు తిలక్. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆయన ఆపాటను పాడుకున్నారీ విధంగా.


          'నీయాశ అడియాస చెయి జారె మణిపూస-బ్రతుకంతా అమవాస లంబాడోళ్ల రామదాస... తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి- చితికినదీ నీ మనసు ఆతుకుటకూలేరెవరు... గుండెల్లో గునపాలు గుచ్చారే నీవాళ్లు, కన్నులలో గోదారి కాలువలే కట్టింది నీయాశ-నీలాల చుక్కలకై నిచ్చెనలేశావు-ఆకాశం అందేనా ఆశయమే తీరేనా'.

         భూసంస్కరణల చట్టపు బిల్లు విషయంలో అటు జమీందారు నుండి, ఇటు తన నెన్నుకున్న ప్రజల నుండి వస్తున్న వత్తిడి వల్ల వూగిసలాట ధోరణిలో కొట్టుకుంటున్న తన భర్త (ఎమ్మెల్యే జగ్గయ్య) ను గురించి సావిత్రి తపన పడ్తున్న నేపథ్యంలోని పాట ఇది.

         నియాశ అడియాస.. పాటకు స్ఫూర్తి పలనాడులో మిషనరీల ముందు ప్రచారం కోసం పాడుకునే జానపద గీతం నుండి పొందామని చెప్పారు తిలక్. ఆ పాటను ‘మీయమ్మా, మాయమ్మా, కారంపూడెళ్లారు. కారంలో పోటెయరో, లంబాడోళ్ల రామదాసా’ అని పాడుకుంటారట.

         అంధ్రప్రదేశ్ లో భూసంస్కరణల చట్టం తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కలగటానికి ఎంతో ముందుగానే ఆ థీమ్ ను తన సినిమాలో ఎంచుకున్నారు తిలక్. సెప్టెంబర్ 19, 1957న ఎమ్మెల్యే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1958లో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించినప్పటికీ, వాస్తవంగా ఆది 1972లో మాత్రమే చట్టరూపం పొందింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసింది. తర్వాత కాలంలో, ఇంతకూ చెప్పాంచింది ఏమిటంటే... ఎమ్మెల్యే సినిమా ప్రభావం ప్రభుత్వాన్ని ల్యాండ్ సీలింగ్ గురించి ఆలోచింప చేసిందేమోనన్న తిలక్ గారి అభిప్రాయం గురించి మాత్రమే.

         మాజీ రాష్ట్రపతి మాజీ లోక్ సభ స్పీకర్, స్వర్గీయ నీలం సంజీవరెడ్డిగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయనగారి సమక్షంలోనూ, ఇతర శాసనసభ సభ్యుల సమక్షంలోనూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యే సినిమా ప్రీవ్యూను ప్రదర్శించే ఏర్పాటు చేసారు హైదరాబాద్ లో.  అప్పట్లో మంత్రిగా వున్న స్వర్గీయ కళావెంకటరావుగారి పాత్రను 'రాజుగారు' అనే నటుడు పోషించారు. ఎమ్మెల్యే సినిమాలో ప్రివ్యుకు వచ్చిన వారిలో  కళావెంకట్రావు, బ్రహ్మానందరెడ్డి గార్లు కూడా వున్నారు.

         రిమోట్ కంట్రోల్ రాజకీయ హత్యలను మొదటిసారిగా ఎమ్మెల్యే సినిమాలో షూట్ చేసి చిత్రీకరించారు. ఎమ్మెల్యే పాత్రను పోషించిన జగ్గయ్యగారికి తనను ఎన్నుకున్న ఓటర్ల వత్తిడి మేరకు ఆసెంబ్లీలో ల్యాండ్ సీలింగ్ బిల్లు ప్రవేశపెట్టాలన్న ఆలోచన కలుగుతుంది. సంబంధిత బిల్లును అసెంబ్లీకి తీసుకు వస్తున్న సమయంలో, ఆయన ప్రమాదవశాత్తు చనిపోయే సీన్ చిత్రీకరణను రిమోట్‌ కంట్రోల్‌ హత్యగా వివరిస్తారు తిలక్. జగ్గయ్యపైన నిజానికి జరిగింది హత్యాప్రయత్నం. హైదరాబాద్ - బేగంపేట పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత వచ్చే గేటు వద్ద, జగ్గయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీతో గుర్తించి యాక్సిడెంట్ కు గురిచేయటం జరుగుతుంది. ఆయన వ్యతిరేక ముఠావాళ్లు పన్నిన కుట్ర అది. ఈ విధమైన రాజకీయ హత్యలు భవిష్యత్ లో చోటుచేసుకోపోతున్నాయని తన సినిమాలో సూచనప్రాయంగా తెలియచేస్తారు తిలక్.

ఇప్పుడున్నన్ని భవంతులు బేగంపేట ప్రాంతంలో లేవా రోజుల్లో.  మొత్తం మీద జగ్గయ్య తనపై జరిగిన హత్యాప్రయత్యం నుంచి బ్రతికి బయట పడటం బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. హంతకుల ముఠాను అరెస్టు చేస్తారు. సినిమాలోనూ-సినిమా తీసిన కాలంలోనూ-నాటికీ, నేటికీ-అభ్యుదయ భావాల అనుకూల చట్టాలను తెచ్చే ప్రయత్నాలు అడపాదడపా ఎప్పుడన్నా ప్రభుత్వాలు చేపట్తే దానికి సూత్రధారులైన 'ప్రోగ్రెసివ్' రాజకీయ నాయకులపైన ఒత్తిడులు తెచ్చే ప్రెషర్ గ్రూపులు వున్నాయనేది వాస్తవం అని అంటారు తిలక్.

         స్వర్గీయ అయ్యదేవర కాళేశ్వరరావు అప్పట్లో శాసనసభాపతి.  శాసనసభ ఆవరణలో సినిమా షూటింగ్ కు తిలక్ అనుమతి కోరితే సరేనన్నారు ఆయన. ఆయితే షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో, నాటి శాసనసభ కార్యదర్శి శ్రీ జివి చౌదరి అభ్యంతరం పెట్టారు. సెక్రటరీ హోదాలో అనుమతి మంజూరు చేయాల్సిన అధికారి తాను మాత్రమేనని, స్పీకర్‌కు సంబంధం లేదని పేచీ పెట్టారు. విషయం ఏంటని ఆరాతీస్తే, చౌదరిగారికెవరో తిలక్ కు వ్యతిరేకంగా నూరిపోసారని తేలింది. చల్లపల్లి రాజా గారికి సంబంధించిన భూముల వ్యవహరం ఎమ్మెల్యే సినిమాలో కథావస్తువుగా వుందని ఆయనకు సమాచారం మోసారు. వారిద్దరి మధ్యన ఉన్న అనుబంధం మూలాన తిలక్ ను షూటింగ్ చేయనీయలేదు. అయితే, అప్పటికే అసెంబ్లీ ఆవల సినిమాకు కావాల్సిన ఎన్నో సన్నివేశాలను చిత్రీకరించటం జరిగినందున ఘర్షణ ఇష్టంలేని తిలక్ చౌదరిగారి అభ్యంతరానికి విలువిచ్చి షూటింగ్ అపుచేసుకున్నారు. సంబంధిత సీన్లను ఇండోర్ షూటింగ్ లో చిత్రీకరించారు.

         ఎమ్మెల్యే సినిమా హైదరాబాద్ లో ప్రీవ్యూ సందర్భంగా విచ్చేసిన ప్రేక్షకులలో చల్లపల్లి రాజాగారు కూడా వున్నారు. కాకపోతే మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ సాయంత్రమే అనుకోకుండా సికింద్రాబాద్ క్వాలిటి బార్ లో కల్సుకుంటారు తిలక్-ఆయన, ‘ఏంటి అట్లా తీసావు ఆ సినిమాను’ అని రాజాగారు ప్రశ్నించగా ‘అయ్యా’ మీరు రామబ్రహ్మం గారితో రైతుబిడ్డ సినిమాను ఏవుద్దేశంతో తీయించారు? వెలమ జమీందార్లకు వ్యతిరేకంగానా? లేక జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగానా? అని ప్రశ్నగా బదులు ఇచ్చారు. ఏదేమైనా, కేవలం వాస్తవాలను ప్రజల ముందుంచాలనే ప్రయత్నమే తప్ప తనకు ఏ దురుద్ధేశం లేదన్న తిలక్ వివరణతో, జవాబుతో సంతృప్తి చెందిన చల్లపల్లి రాజావారు ‘సరే’ నంటూ సౌమ్యంగా స్పందించి క్వాలిటీ బార్ నుండి నాటికి నిష్క్రమించారు.
(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment