Thursday, July 16, 2020

ధర్మాధర్మ విచారణ....శ్రీరామ పాదుకా పట్టాభిషేకం : వనం జ్వాలా నరసింహారావు


ధర్మాధర్మ విచారణ....శ్రీరామ పాదుకా పట్టాభిషేకం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ చింతన (16 &17-07-2020)

వనవాసం ఆరంభంలో వున్న తనను, భరతుడు అయోధ్యకు పిలుచుకుని పోవడానికే వచ్చాడని గ్రహించిన శ్రీరాముడు, రాజ్యభారం మోయాల్సినవాడివి అరణ్యానికి ఎందుకొచ్చావని ప్రశ్నించాడు. వేటకొచ్చావా? అలా అయితే ఈ జడలెందుకు? ఈ కృష్ణాజినం ఎందుకు? ఈ నారచీరెలు కట్టుకోవడానికి కారణం ఏమిటి? ఎందుకని నువ్వు రాజ్యాన్ని వదిలి వచ్చావు?” అని ప్రశ్నించాడు. జవాబుగా భరతుడు చేతులు జోడించుకుని, “నీ రాజ్యాన్ని నువ్వే తీసుకో. నువ్వే రాజై అందరినీ సంతోషపెట్టు. నేను నీకు తమ్ముడిని, శిష్యుడిని, దాసుడిని. నా మీద దయ చూపు. ఇది నా కోరిక. దీనికోసమే నేను వచ్చాను” అని అంటాడు.
భరతుడి మాటలకు స్పందిస్తూ శ్రీరాముడు, “రాజ్యభారం మోయలేనంటున్నావు భరతా! అలా అయితే నీకొక ఉపాయం చెప్తా విను. దానివల్ల నీకు భారం తగ్గుతుంది. తండ్రి వాక్యాన్ని మనం ఇరువురం పాలించినట్లవుతుంది. నువ్వు రాజ్యాన్ని, జనపదాలను, నగరాలను, అయోధ్యలోనుండి విచారించు. నేను అడవుల్లో నారచీరెలు కట్టి, జింక చర్మం ధరించి, ఏ భయం లేకుండా ధర్మాధర్మాలు విచారిస్తా. నాకు తండ్రి ఇచ్చింది వనవాస భాగం. దానిని పద్నాలుగు సంవత్సరాలు అడవిలోనే వుండి అనుభవించి ముగించాలి. ఇదే ఆయనకు, నాకు గొప్ప హితమైన కార్యమని నా భావన. ఉభయలోక పూజ్యుడైన తండ్రి ఏం చెప్పాడో అది చేయడమే నాకు శ్రేయస్కరం” అని చెప్పాడు.
భరతుడు ప్రేమతో, భక్తితో, గౌరవంతో అన్న శ్రీరాముడితో ఇలా అన్నాడు.  “నువ్విక్కడ ఒంటరిగా వుండి ఎవరికీ మేలుచేస్తావు? గృహస్తాశ్రమం తప్ప తక్కినవన్నీ పరాదీనపు బతుకులే. గృహస్తుడుగా వుండడానికి అసమర్థుడే సన్న్యాసి లేదా వనవాసి అవుతాడు. ఇక్కడ నీ ఇంటికి ఏ అతిథి వస్తాడు? ఏ అభ్యాగతి వస్తాడు? వచ్చినా ఎంతమంది వస్తారు? వచ్చినవారికి ఏం పెట్టుతావు? కాబట్టి గృహస్థ ధర్మాన్ని అవలంభించి పాలించు రామచంద్రా! నువ్వు మాకందరికీ రక్షకుడివి. మేం నీకు భృత్యులం. మమ్మల్ని నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు? అలాగే నువ్వు  గొప్పవాడివయ్యావు కాబట్టి ఇతరులకు ఆరాధ్యుడివి అయ్యావు? నువ్వు మహా వృక్షానివి అయ్యావు. మాలాంటివారు మరుగుజ్జులు. నువ్వు పట్టాభిషేకానికి అంగీకరించడం చెట్టు పూయడం లాంటిది”.
         భరతుడు శ్రీరాముడితో ఇంకా ఇలా అన్నాడు: “క్షత్రియుడికి వానప్రస్థ ఆశ్రమ చర్య, వేషం శాస్త్ర విరుద్ధం కాదు కదా? అంటావేమో? క్షత్రియుడి ప్రథమధర్మం ప్రజాపాలన. ప్రజాపాలన చేసేవాడు పట్టాభిషేకం చేసుకుని సింహాసనం అధిష్టించాలి. ఇలా అని ప్రాజ్ఞులు చెప్తారు. నువ్వు వారిలో శ్రేష్ఠుడివి. ఇది నేను నీకు చెప్పాలా? క్షత్రియుడికి ప్రజాపాలన ముఖ్య ధర్మం అని శాస్త్రం కూడా చెప్తున్నది. నువ్వు వుండాలని అనుకుంటున్న తాపస ధర్మం ప్రత్యక్ష ఫలం కాదు. దాని ఫలమిప్పుడు కనబడదు. క్షత్రియుడికి ప్రప్రథమంలోనే తాపసచర్య ఏ శాస్త్రం విధించలేదు. ఇలాంటి తాపస ధర్మం ఏ క్షత్రియుడు అనుసరిస్తాడు? రాజధర్మం రక్షారూపంగా, దండరూపంగా, భోగరూపంగా కళ్లకు కనపడుతుంది. కాబట్టి ఫలం వుందో, లేదో అనే విషయంలో సందేహం లేదు. రాజు ప్రజాపాలన చేయాలని శాస్త్రం నిర్ణయించింది. ఇలా చేయడానికి క్షత్రియుడు ఎందుకు సందేహించాలి? రాజధర్మం సుఖ-భాగాలతో కూడింది. కష్టించి ధర్మం చేయాలంటావా? ప్రజాపాలన తాపస ధర్మం కంటే కూడా కష్టమైంది. ఇక్కడ నీ ఒక్కడి యోగక్షేమాలు చూసుకుంటే చాలు. రాజ్యపాలనలో కోట్లాది మంది యోగక్షేమాలు ఆలోచన చేయాలి. కాబట్టి దానినే అంగీకరించు. ఇప్పుడు నువ్వు వానప్రస్థుడివై బ్రహ్మచర్యాన్ని అవలంభించావు. ఇవి రెండూ గృహస్థధర్మం కంటే గొప్పవేంకాదు. ధర్మం అంటే ఆసక్తికల నువ్వు అలాంటి ధర్మాన్ని వదిలి ఇలా వుండడం ధర్మం కాదు”.



         “నిన్ను నేను ఇంతగా ప్రార్థించడం నా సుఖం కొరకు కాదు. నువ్వు పట్టాభిషేకం చేసుకుంటే, నా తల్లికి పాపనింద పోతుంది. తండ్రికి నరకబాధ తప్పుతుంది. ఈ రెండు పనులు నీవల్ల జరిగితే భగవంతుడు జీవకోటులందరినీ రక్షించినట్లు నువ్వు మమ్మల్ని రక్షించినవాడివవుతావు. నువ్వు పట్టాభిషేకం చేసుకుంటే ఈ మూడు పుణ్యాలు నీకు కలుగుతాయి. నేను రానని నువ్వు అంటావా? నీతో నేనుండాల్సిన వాడిని. నిన్ను విడిచి వుండను. నువ్వు అయోధ్యకు వస్తే అక్కడే కలిసి వుంటా. నువ్వు అరణ్యాలలో వుంటే ఇక్కడే కలసి వుంటా. ఇది నా నిర్ణయం. ఆత్మను విడిచి శరీరం ఎలా వుంటుంది?”. భరతుడు ఇంత చెప్పినా శ్రీరామచంద్రుడు అయోధ్యకు పోవడానికి అంగీకరించలేదు.
          భరతుడి ప్రార్థనకు బదులుగా, దానికి సమాధానంగా శ్రీరాముడిలా అన్నాడు: “భరతా! దశరథుడు అధర్మాత్ముడై రాజ్యం నీకివ్వలేదు. నీ తల్లి వివాహకాలమందు కన్యాశుల్కంగా తన రాజ్యాన్ని ఆమె కొడుక్కి ఇస్తానని దశరథుడు ప్రమాణం చేశాడు. ఇది ప్రమాణపూర్వకంగా చేసిన పని కాబట్టి, అలా చేసిన దశరథుడు ఎలా అధర్మాత్ముడవుతాడు? ఆ మాట ప్రకారం రాజ్యాన్ని నీకిచ్చినా, నన్నెందుకు అడవులకు పంపాలంటావా? దేవ, రాక్షస యుద్ధంలో నీ తల్లి తనకు సహాయం చేసిన కారణాన మన తండ్రి ఆమెకు రెండు వరాలిచ్చాడు. ఆ రెండు వరాలిప్పుడు ఆమె కోరింది. అందులో ఒకటి నీకు రాజ్యాభిషేకం, రెండోది, నా వనవాసం. ఆ రెండు వరాలూ మన తండ్రి ఇచ్చినవే! కాబట్టి ఆయన మాట ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు నేను అడవుల్లో వుండడానికి సీతాలక్ష్మణులతో వచ్చా. ఇలా నేను చేయడానికి కారణం తండ్రిని సత్యవాక్యపాలకుడిని చేయడమే కాని కామ-క్రోధాలు కావు”.
         “తండ్రిని నేను సత్యవచననిష్ఠుడిని చేసినట్లే, నువ్వు కూడా తండ్రిని సత్యవాదిని చేయాలికదా? కాబట్టి రాజ్యలక్ష్మిని అంగీకరించు. తండ్రి తరువాత తండ్రి అంతటివాడిని నేను కదా? నేను చెప్తున్నా. పెద్దవాడు చెప్పాడని నాకొరకు నామాట విను. నష్టమైనా, కష్టమైనా, ఇష్టం అయినా, కాకపోయినా పెద్దవారి మాట వినాలికదా? కాబట్టి తండ్రి ఋణం ఆయన మాట ప్రకారం నడిచి తీర్చు. తల్లి కూడా సంతోషించే విధంగా ప్రవర్తించు. తండ్రి వాక్యం ప్రకారం నడుచుకుని, తండ్రికి అసత్య దోషం వల్ల కలిగే నరక బాధ నుండి రక్షించు. అయోధ్యకు పోయి రాజువు కా”.
         అని శ్రీరాముడనగానే, విన్న భరతుడు నిరాశతో, ఇక వాదనలతో లాభం లేదనుకుంటాదు. మొండికేసి పని పూర్తి చేయాలని భావించాడు. అన్న అయ్యో, పాపం అనేట్లు చేయాలనుకుంటాడు. సుమంత్రుడితో తనకొరకు ఒక దర్భాసనం ఏర్పాటు చేయమని కోరాడు. రామచంద్రమూర్తికి తన మీద దయకలిగి అయోధ్యకు వస్తానని మాటిచ్చేవరకు, అప్పు ఇచ్చిన బ్రాహ్మణుడు ఇచ్చిన అప్పు రాబట్టుకోవడానికి అప్పు తీసుకున్న వాడి ఇంటి వాకిట్లో ముఖానికి గుడ్డ వేసుకుని కూడు-నీళ్లు ముట్టుకోకుండా ఎలా వుంటాడో అలా పండుకుంటానని, ఇది తన నిశ్చయం అని భరతుడు సుమంత్రుడితో చెప్పాడు. దర్భలు పరచుకుని పండుకోవడానికి సిద్ధపడ్డ భరతుడిని చూసి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు: “తమ్ముడా! నీకు నేను ఏ అపకారం చేశానని నువ్వలా చేస్తానంటునావు? రాజ్యమేలాల్సిన క్షత్రుయుడికి ఇది ధర్మమా? లేలే! ఇలాంటి  వ్రతాన్ని వదులు. నా మాట విని మళ్లీ అయోధ్యకు పో”.
ఇలా రామచంద్రమూర్తి చెప్పగా విని భరతుడు ప్రజల వైపు తిరిగి, “ప్రజలారా! మా అన్నకు నామీద దయరాలేదు. మీరు ఆయనకు ముఖ్యులుకదా! మీరైనా చెప్పి అయోధ్యకు పిలుచుకుని పొండి. మీరే ఆయనకు సరైన సమాధానం చెప్పండి” అన్నాడు. ప్రజలప్పుడు భరతుడితో, “భరతా! నువ్వు చెప్పినదానికంటే ఎక్కువగా మేమేం చెప్తాం? నీకు ఆయన చెప్తున్న ప్రతి మాటను బట్టి ఆయన మనసు తెల్సిపోయింది. తప్పొప్పులు తెల్సినవాడు కాబట్టి అన్నీ చక్కగానే చెప్పాడు. ఆయనేం తప్పు చెప్పాడని మేం ఆయనకు చెప్పగలం? తండ్రి వాక్యపాలన చేయాలన్నదే ఆయన కోరిక. ఆయనకు దానిమీద వున్న ప్రీతి రాజ్యం మీద కాని, మరి దేనిమీదా కాని లేదు. ఇలాంటివాదిని ఒప్పించడం మాకు సాధ్యమా?”
ప్రజలు చెప్పిన మాటలు విన్న రామచంద్రమూర్తి, “భరతా! లోకులు చెప్పిన మాటలు విన్నావు కదా? నిష్పక్షపాతంగా చెప్పేవారి మాటలు ఇలాగే వుంటాయి. నువ్వు ధర్మ పక్షపాతివిగా కాకుండా నామీద ప్రేమతో మాట్లాడుతున్నావు. కాబట్టి వీరి మాట, నామాట మనసులో పెట్టుకుని న్యాయమార్గంలో పో. క్షత్రియుడు దర్భలమీద పండుకో కూడదు. అది స్వధర్మ విరుద్ధం.” అన్నాడు.
శ్రీరాముడిలా చెప్పగానే భరతుడు దర్భల మీద నుండి లేచి, నీటిని తాకి, ప్రజలందరూ వినేట్లు ఇలా అన్నాడు: “తండ్రిని నాకు రాజ్యం ఇవ్వమని నేను అడగలేదు. ఇలాంటి తప్పుడు పని చేయమని తల్లిని కూడా కోరలేదు. శ్రీరాముడు అడవికి పోయిన వార్త కూడా నాకు తెలియదు. తండ్రి మాట పరిపాలించడం ఆవశ్యకమైతే మా అన్నగారికి మారుగా నేనుంటా. ప్రతినిధులను ఏర్పాటుచేయడం శాస్త్ర సమ్మతమైనదే కదా? కాబట్టి ఈ పద్ధతికి అంగీకరించండి”.
         శ్రీరాముడు తెగేసి చెప్పిన దానికి సమాధానంగా భరతుడిలా అన్నాడు. “అన్నా! సరే! నీ మాట వింటా. నేనెంత ప్రార్థించినా నీ మనసు కరగడం లేదు. నీకు నామీద నిర్మలమైన మనసుంటే, ఈ బంగారు పాదుకలమీద నీ పాదాలను వుంచు”. శ్రీరాముడు అలాగే చేశాడు. భరతుడు వాటిని భక్తితో తీసుకుని రెండు చేతులు జోడించి అన్నతో ఇలా అన్నాడు: “అన్నా! నేను చెప్పే మాట సావాధానుడవై విను. రోజులు లెక్కపెట్టుకుంటూ, జడలు ధరించి, జింక చర్మం కప్పుకుని, ఊరి బయట ఇల్లు ఏర్పాటు చేసుకుని, రాజ్యతంత్రం అంతా పాదుకలకు అప్పచెప్పి, ప్రాణం బిగబట్టి వుంటా. పదిహేనవ సంవత్సరం మొదటి రోజున నువ్వు రాకపోతే నేను అగ్నిలో దూకుతా”. భరతుడి మాటలకు శ్రీరాముడు మాట ఇచ్చాడు. ఇక పోయిరమ్మని చెప్పి పంపాడు భరతశత్రుఘ్నులను.
         భరతుడు పాదుకలను పట్టపు ఏనుగు కుంభస్థలంలో వినయంగా పెట్టి, శ్రీరాముడికి నమస్కరించాడు. రామచంద్రమూర్తి కూడా అందరికీ వీడ్కోలు పలికాడు. ఆ తరువాత, భరతుడు పట్టుపు ఏనుగు మీద వున్న పాదుకలను తీసి తన తలమీద పెట్టుకుని, శత్రుఘ్నుడితో కలిసి రథం ఎక్కాడు. దారిలో చిత్రకూటం సమీపంలో వున్న భరద్వాజ ఆశ్రమాన్ని చూశాడు. రథం దిగి భరద్వాజుడిని సమీపించి, అభివాదం చేశాడు. వసిష్ఠుడి మాట ప్రకారం శ్రీరామచంద్రుడు పాదుకలమీద ఎక్కి దిగి, వాటిని ప్రజాపాలనార్థమై ఇచ్చిన విషయం కూడా చెప్పాడు. ఆ రెండు పావుకోళ్లు తీసుకుని అయోధ్యకు పోతున్నానన్నాడు. భరతుడు అయోధ్యకు పోయి, తండ్రి-అన్న లేని అయోధ్యను చూశాడు. సీతారామలక్ష్మణులు లేని అయోధ్యలో తాను బతకలేనన్నాడు వసిష్టుడితో. నందిగ్రామంలోనే శ్రీరాముడి రాకకొరకు వేచి వుంటానన్నాడు. భరతుడి మాటలను సుమంత్రుడు, ఇతర మంత్రులు, గురువైన వసిష్ఠుడు శ్లాఘించారు. శత్రుఘ్నుడు తోడురాగా, గురువు, మంత్రులు సేనలు, వెంటరాగా, పాదుకలను రెంటినీ తలమీద పెట్టుకుని భరతుడు నందిగ్రామం చేరాడు. పావుకోళ్లు రెంటినీ బంగారు సింహాసనం మీద వుంచి సంతోషంతో వాటికి పట్టాభిషేకం చేశాడు.
         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment