Thursday, July 16, 2020

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత (రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ): వనం జ్వాలా నరసింహారావు


మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)
శ్రీ మహాభాగవతము, దశమ స్కందం-పూర్వ భాగం
భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది
వనం జ్వాలా నరసింహారావు 

              కంII    చదివెడిది భాగవతమిది,
                       చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
                       చదివినను ముక్తి కలుగును
                      చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై 

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. డాక్టర్ అపర్ణా శ్రీనివాస్ అనువదించారు. 478 పేజీల ఈ దశమ స్కందం పూర్వ భాగంలో శ్రీకృష్ణావతార ఘట్టంలో భాగంగా, దేవకీ దేవి-వసుదేవుల వివాహం దగ్గరనుంచి, రుక్మిణీ-శ్రీకృష్ణుల కళ్యాణం వరకు 70 అంశాలున్నాయి. చివరగా ‘గోపికా తత్త్వం-రాసలీల అనే అంశం కూడా వుంది. క్లుప్తంగా ఆ 70 అంశాల వివరాలు:
దేవకీదేవి-వసుదేవుల వివాహం, కంసుడికి ఆకాశవాణి హెచ్చరిక-అతడికి ఉద్రేకం కలగడం, వాసుదేవుడి ప్రార్థన, యోగమాయ మహిమ, బలరాముడి జననం, బ్రహ్మాది దేవతలా స్తుతి, శ్రీకృష్ణ భగవానుడి జననం, వసుదేవుడు శ్రీకృష్ణుడిని నందవ్రజంలో యశోద-నందుడి ఇంటికి చేర్చడం, కృష్ణుడు పూతనను చంపడం, శకటాసురుడిని కూల్చడం, తృణావర్తుడి మరణం, శ్రీకృష్ణుడి బాల్య క్రీడలు, మన్ను తినడం, ఆయన నోటిలో యశోదా దేవి సకల చరాచర ప్రపంచాన్ని చూడడం ఉన్నాయి.
శ్రీకృష్ణుడు వెన్నను దొంగిలించడం, యశోదాదేవి శ్రీకృష్ణుడి మీద కోపగించుకోవడం, రోటికి బంధించడం, ఆయన మద్దిచెట్లను కూల్చడం, నలకూబరుడు-మణిగ్రీవుల శాప విముక్తి, శ్రీకృష్ణుడు లేగలను మేపడం, వత్సాసుర సంహారం, బకారూపంలో వచ్చిన దైత్యుడి సంహారం, సర్పరూపదారి అఘాసురుడిని రూపుమాపడం, బ్రహ్మదేవుడు ఆవుదూడలను అంతర్థానం చేయడం, బదులుగా కృష్ణుడు గోవత్సాలను-గోపాలబాలకులను సృజించడం, బ్రహ్మ శ్రీకృష్ణుడిని స్తుతించడం, గార్ధభాకారంలో వున్నా ధేనుకాసురుడిని నిర్మూలించడం, కాళీయ మర్దన, బలరాముడు ప్రలంబాసురుడిని చంపడం, శ్రీకృష్ణుడు దావాగ్నిని మింగడం ఉన్నాయి.
గోపకన్యల వ్రతం, గోపికలు కాత్యాయనిని భజించడం, గొల్లభామల చీరెలు కృష్ణుడు అపహరించడం, బ్రాహ్మణ పత్నులు ఇచ్చిన అన్నాన్ని కృష్ణుడు తినడం, ఇంద్రయాగం మాన్పించడం, నంద-ముకుమ్దల సంభాషణ, ఇంద్రుడు రాళ్ళవాన కురిపించడం, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తడం, శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవిని ఊదడం, కృష్ణుడి సన్నిధికి గోపికలు రావడం, యమునానదీ తీరం వనంలో శ్రీకృష్ణుడు విహరించడం, కృష్ణుడు అదృశ్యంకావడం, గోపికలు ఆయన్ను వెతకడం, గోపికాగీతాలు, శ్రీకృష్ణుడు ప్రసన్నుడు కావడం, రాసక్రీడ, జలక్రీడ ఉన్నాయి.



శ్రీకృష్ణుడి కాలి స్పర్శతో సర్పరూపుడైన విద్యాధరుడు స్వస్వరూపాన్ని పొందడం, కుబేర భటుడైన శంఖచూడుడిని శ్రీకృష్ణుడు చంపడం, వృషభాసుర సంహారం, నారదుడి మాటలకు భయపడి కంసుడు దేవకీ-వసుదేవులను బంధించడం, అశ్వరూపంలో వున్న కేశియను వధించడం, వ్యోమాసుర సంహారం, అక్రూరుడు నందగోకులానికి రావడం, బలరామ కృష్ణులతో కలిసి మథురకు బయల్దేరడం, అక్రూరుడు యమునా నదీ జలాలలో శ్రీహరి విశ్వరూపాన్ని దర్శించడం, ఆయన శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించడం, కృష్ణుడు మథురలో ప్రవేశించడం ఉన్నాయి.
మథురలో ప్రవేశించిన కృష్ణుడు అక్కడ తమకు బట్టలు ఇవ్వ నిరాకరించిన వాడిని సంహరించడం, సాలె అతను ఇచ్చిన వస్త్రాలను-సుదాముడు సమర్పించిన పూలదండలను బలరామకృష్ణులు స్వీకరించడం, శ్రీకృష్ణుడు కుబ్జకు ప్రసన్నుడు కావడం, ఆయన ధనుశాలకు పోయి వింటిని విరచడం, కువలయాపీడం అనే ఏనుగును కృష్ణుడు చంపడం, శ్రీకృష్ణ బలరాములు చాణూర-ముష్టికుడు అనే మల్లయోధులను చంపడం, కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించడం, దేవకీ-వసుదేవులను చెర విడిపించడం, ఉగ్రసేనుడికి రాజ్యం పట్టం కట్టడం ఉన్నాయి.
ఆ తరువాత శ్రీకృష్ణ బలరాములు సాందీపని దగ్గర చతుషష్టి విద్యలు నేర్చుకొనడం, గురుదక్షిణగా యమపురికి పోయి సాందీపని కుమారుడిని తెచ్చి ఆయనకు అప్పగించడం, ఉద్దవుడు గోకులానికి రావడం, శ్రీకృష్ణుడు కుబ్జ ఇంటికి పోవడం, హస్తినాపురానికి అక్రూరుడు వెళ్లి కుంతీదేవిని ఓదార్చడం, జరాసంధుడు కృష్ణుడి మీదకు యుద్ధానికి రావడం, జరాసంధుడు మథురాపురాన్ని ముట్టడి చేయడం, యుద్ధంలో పదిహేడు సార్లు జరాసంధుడు పారిపోవడం, కాలయవనుడు మథురానగరిమీద దండయాత్ర చేయడం, శ్రీకృష్ణుడు ఆదేశంతో విశ్వకర్మ సముద్ర మధ్యలో ద్వారాకానగారాన్ని నిర్మించడం, కృష్ణుడు తన యోగ మహిమతో మథురానగర ప్రజలను ద్వారకాపురికి చేర్చడం ఉన్నాయి.
కాలయవనుడు మాధవుడి వెంట పడి ఒక కొండగుహలో నిద్రిస్తున్న ముచుకుందుడు కోపాగ్నికి భస్మం కావడం, ముచుకుందుడు తపస్సు చేసుకోవడానికి పోవడం, జరాసంధుడు మళ్లీ కృష్ణుడి మీదకు దండయాత్రకు రావడం, బలరామకృష్ణులు ప్రవర్షణగిరి ఎక్కడం, జరాసంధుడు దాన్ని దహించడం, రామకృష్ణులు పర్వతం దిగి ద్వారాకాపురికి రావడం, రుక్మిణీదేవి జననం, ఆమె క్రుష్ణుడుకి సందేశం పంపడం, శ్రీకృష్ణుడు కుండిన నగరానికి పోవడం, రుక్మిణిని ఎత్తుకొని పోవడం, ఆయన్ను ఎదిరించిన రాజసమూహం యుద్ధంలో ఓడిపోవడం, రుక్మిణి అన్న రుక్మి భంగపాటు, రుక్మిణీదేవి-శ్రీకృష్ణుల వివాహం ఈ దశమ స్కందంలో ఉన్నాయి.
ఇవన్నీ చదవగలగడం పూర్వజన్మ సుకృతం.  

No comments:

Post a Comment