Friday, July 31, 2020

‘అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథ.....స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

‘అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథ

బాపు ఆర్ట్ గ్యాలరీలో చోటు చేసుకుంటున్న అనుపమ చిత్రం

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(అక్టోబర్ 1 - 7, 2000)

         'ముద్దుబిడ్డ' తర్వాత సెంటిమెంట్ కన్నా సమస్యాత్మక ప్రాధాన్యత కల చిత్రాలనే నిర్మించాలన్న ఆశయంతో తీసిన ఎమ్మెల్యే సినిమాకు అపురూపమైన ఆదరణ ప్రజాభిమానం లభించిందన్న తృప్తి కలిగినా, మహిళా ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేదన్న అసంతృప్తి కూడా మిగిలి పోయింది. ఆ భావనతో,  స్త్రీల నుండి ఎక్కువ ఆదరణ లభించే రీతిలో, వాస్తవానికి చేరువగా వుండే, కుటుంబ పరమైన ఓ సమస్యాత్మక చిత్రాన్ని నిర్మించాలనుకోవటం, పర్యవసానంగా తన దర్శకత్వంలోనే అత్తా ఒకింటి కోడలే  అనే మరో సమస్యాత్మక చిత్రాన్ని తీయటం జరిగిందని చెప్పారు తిలక్.  

         ఈ సినిమాలో ఓ అత్తా - ఆ అత్తకో అత్త, అత్తకో కోడలు, ఆ కోడలుకో కోడలు, ఇలా అత్తా కోడలు, వారి సంవాదం ఇతివృత్తంగా వుంటుంది. ఈ లాంటి సినిమా తీయటానికి మరో బలవత్తరమైన కారణం - సంఘటన కూడా వుంది. అదే  బరంపురం కొల్లాడి  అనే ఒక ఒరియా రచయిత వ్రాసిన నాటకంలోని ఓ సీన్. దాన్ని ' బేస్' గా తీసుకుని నిర్మించిందే ఈ చిత్రం. ఒక గుడిలో ఇద్దరాడవాళ్లు పోట్లాడుకుంటుంటారు. వాళ్లను విడదీసే ప్రయత్నం చేస్తారు. అక్కడనే వున్న మరో ఇద్దరు-ఓ యువతి, మరో పెద్దావిడ. ఇంతకూ పోట్లాడుకుంటున్నది ఆత్తా-కోడలు అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఈ మధ్యవర్తులు. బుద్దుందా లేదా, అత్తా కోడలు అంటే తల్లీ కూతుళ్లవలె వుండాలి కాని, ఇలా తగవులాడుకుంటారా అని మందలించుతారు నీతులు చెప్తారు. ఆ సందర్భంలోనే, ఎందుకు తామిద్దరం అత్తా కోడలు కాకూడదని అనుకుంటారు. చివరకు అలానే కావటం, వారూ అందరివలెనే కలిసి మెలిసి వుండలేకపోవటం ఆ నాటకంలోని ఇతివృత్తం. అదే ' అత్తా ఒకింటి కోడలే సినిమాకు స్ఫూర్తినిచ్చిన సంఘటన.

         చిత్రం ఇతివృత్తం, నటీ నటవర్గం, నిర్మాణ - దర్శకత్వం లాంటి వాటికన్నా, ఈ చిత్రానికి సంబంధించినంత వరకు, తిలక్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది, సమష్టి కృషిలో ఆరుద్ర ద్విపద రచనకు బాపు వేసిన బొమ్మల కథతో వెలువడిన ప్రచార కార్టూన్లు. ఆదో నూతన ఒరవడి!

         హైదరాబాద్ లో నిర్వహించిన ఒక పుస్తకావిష్కరణ సభలో తిలక్ గారు తన పాత మిత్రులు ముళ్లపూడి వెంకటరమణ గారిని, రామచంద్ర రావు గారిని కలవటం జరిగింది. రమణ గారిని గురించి అందరికీ తెలుసు, రామచంద్ర రావుగా మేటి టెన్నిస్ క్రీడాకారుడు భూపతికి కజిన్ - ఆయన లాగే గొప్ప టెన్నీస్ ప్లేయర్. పి పుల్లయ్య గారి సమీప బంధువు. పాటలంటే అమితంగా ఇష్టపడే ఆయన ఇంట్లో అపురూపమైన రికార్డులెన్నో వున్నాయి. ముగ్గురూ సభానంతరం, రామచంద్ర రావు గారింటికి వెళ్లారు. దారిలో రమణ గారు చెప్పిన విషయాలకు సంతోషం గర్వం కలిగించాయి తిలక్ కు.

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల ఖర్చుతో హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో, శిల్పారామం ప్రక్కన స్థాపించతలపెట్టిన బాపు ఆర్ట్ గ్యాలరీ లో ఎంపిక చేయబడిన అపురూపమైన కళాఖండాలు శాశ్వతంగా ప్రదర్శించబడతాయి. అందులో చోటుచేసుకోనున్న అత్యంత ప్రాధాన్యతగల వాటిలో 'అనుపమ చిత్రం-అత్తా ఒకింటి కోడలే – బొమ్మలకథ’ ఒకటి. దాని తాలూకు కాపీ ఇస్తానని కూడా అన్నారు రమణ గారు. అది విన్న తిలక్ ఎంతో ఆనందంతో అలనాటి, దానికి సంబంధించిన విషయాలను వివరంగా చెప్పారు. రమణ గారు ఇచ్చేటంత వరకు ఆగకుండా మిత్రుడు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్న శ్రీ ఆర్ వి వి కృష్ణారావు గారిని అడిగి, ఆయన దగ్గరనున్న బాపు - రమణల పుస్తకం తెచ్చి, అందులోని బొమ్మలకథ  కాపీలను తీసుకున్నారు.


         ఎప్పుడూ, ఏ సినిమాకు, ఎవరూ చేయనిరీతిలో పబ్లిసిటీ చేయాలన్న ఆలోచన కలిగింది తిలక్ గారికి.  సినిమా కథ ఆసాంతం, లోగడ ఎవరో రామాయణం కావ్యాన్ని వ్రాసిన విధంగా,  'ద్విపద'లో వ్రాయించి మంచి కార్టూన్లను వేయించి పబ్లిసిటీ ఇవ్వాలని అనుకున్నారు. ‘క్రియేటివిటీ' అనేది ఓ సృష్టి కార్యంలాంటిదనీ, అదెప్పుడూ సమాజ పరంగా ఉపయోగపడేదిగా వుండాలని, అలాంటి అవకాశాలు కూడా రావాలని తిలక్ భావన. అదే జరిగింది. 'తిలక్-ఆరుద్ర-బాపు-రమణ’ల కాంబినేషన్లో. రమణ గారు అప్పుడు ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నారు. ఆరుద్రగారు వ్రాసిన సినిమా 'ద్విపద'కు అనుగుణంగా బొమ్మలు వేస్తే బాగుంటుందని రమణ సూచించారు. బొమ్మలు వేసేటందుకు ఆయన మిత్రుడు, అప్పట్లో ‘వాటర్ థామ్సన్' కంపెనీలో పనిచేస్తున్న బాపు గారిని రప్పించారు. నలుగురూ కల్సి సినిమా వీక్షించారు. చూస్తూ చూస్తూనే బాపుగారు ఓ కాగితంపై గబ గబా, రమణారెడ్డి, ఇతర నటుల బొమ్మలు గీసి చూపించారు. అవన్నీ ఎంతగానో నచ్చాయి. అందరికీ. అందరినీ మించి తిలక్ గారికి.

         వెంటనే ఆరుద్ర రచనతో బాపు బొమ్మలతో రూపుదిద్దుకొంది అనుపమ చిత్రం 'అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథ. దాన్ని ఆంధ్రపత్రికలో, ఓ మళయాళీ మేనేజర్ సహాయంతో డబుల్ కలర్ లో ముద్రించారు, పంచిపెట్టారు. ఆంధ్రపత్రికలో కూడ వేయించారు. అలానే వారం వారం, పబ్లిసిటీలో భాగంగా, ఆరుద్ర గారు సామెతలు వ్రాయటం, ‘అత్తింటి కాపురం, కత్తిమీదసాము' లాంటివి, వాటికి బాపు ఇల్లస్ట్రేషన్ వేయటం జరుగుతుండేది.

         ఆ తర్వాత కాలంలో, అప్పటికే మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న బాపు-రమణలు సినీ పరిశ్రమలో కూడా ఖ్యాతి తెచ్చుకున్నారు. కాకపోతే సినీ పరిశ్రమకు పరిచయమయింది 'అత్తా ఒకింటి కోడలే’ బొమ్మల కథా ద్వారానే. ఏదేమైనా బాపుకు సినీ పరిశ్రమ ఉపయోగపడింది. పరిశ్రమకు బాపు మరింత ఉపయోగపడ్డారు.

         అప్పటి నుండి బాపు-రమణల కాంబినేషన్ ఆరంభమైందనటంలో అతిశయోక్తి లేదు. మిత్రుడు ఆర్ వి వి కృష్ణారావు గారి సౌజన్యంతో లభించిన ఆ బొమ్మల కథ కాపీని యధాతథంగా ఫోటోలలో చూడవచ్చు.

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment