Friday, July 10, 2020

గోవు పవిత్రం, సామాజిక జీవితానికి అవసరం : వనం జ్వాలా నరసింహారావు


గోవు పవిత్రం, సామాజిక జీవితానికి అవసరం
వనం జ్వాలా నరసింహారావు

బ్రహ్మర్షి కావడానికి ముందు, విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తూ, ఒక పర్యాయం, సేనలతోగూడి భూమంతాతిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. అప్పుడు వశిష్టుడు, సేనలతో సహా వచ్చిన అతడికి ఆతిథ్యమిచ్చి గౌరవించాడు. ఆతిధ్యానికి అవసరమైన సమస్త వస్తువులను సమీకరించడానికి వశిష్ఠుడు తన కామధేనువైన (గోవు) శబలకు అప్పచెప్పాడు.  అన్ని రకాల భోజ్యాల్ని ఏర్పాటుచేయమని శబలను ఆదేశించాడు. వశిష్ఠుడు చెప్పిన విధంగానే, కామధేనువు, రకరకాల భక్ష్యభోజ్యాలను, ఎవరేదికోరితే దాన్నిసృష్టించింది. మంత్రులతోను, బ్రాహ్మణాదులతోను, సైన్యంతోను కలిసి రాజు సంతృప్తిగా, కడుపునిండా భోజనంచేసాడు.

భోజనానంతరం, విశ్వామిత్రుడు, తనకు కామధేనువు శబలనివ్వమని అంటాడు. శబలను ఎడబాయనంటాడు వశిష్ఠుడు. తనను విడిచి శబల కూడా వుండలేదన్నాడు. తాను సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నాననీ, దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చనీ, తనకది అవ్యానందానికి కారణమైందని, అలాంటి దాన్ని తను విడిచి ఎలా వుండాలనీ విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు వశిష్థుడు.

వశిష్ఠుడలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. తనను ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. క్షత్రియ బలమొక బలమేకాదని, బ్రాహ్మణబలం లెక్కలేని మహిమగలదని, రాజెంత బలవంతుడైనా వశిష్ఠుడికంటే గొప్పవాడుకాదనీ, తనకాజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తాననీ కామధేనువైన శబల అంటుంది. ఆలా ప్రార్థించిన శబలను, శత్రువులు నివ్వెరపోయేట్లు, వారి రూపం చెడిపోయేట్లు చేయగల, అనేకమంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు.

వశిష్ఠుడి ఆజ్ఞ లభించగానే, శత్రు సమూహాలకు భయంకలిగించే పప్లవులనే శూరులను తన హుంభారవంతో శబల సృష్టించింది. కామధేను కల్పిత శూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపుమాపి విజృంభించారు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు, బట్టిసాలు ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు, శకులు, కార్చిచ్చు అడవిలో పడ్డట్లు, రాజు సైన్యం మీదపడి దహించి వేశారు. ఒక గోవు మహాత్మ్యాన్ని సవిరరంగా తెలిపే ఈ అంశం ఒక వాల్మీకి రామాయణ గాథ.
ఇదిలావుంటే, కృష్ణ యజుర్వేదంలో గోవుల గురించిన ప్రస్తావన పలుమార్లు ఉన్నది. ఆ ఆమాటకొస్తే, అన్ని వేదాలలోనూ ప్రస్తావన ఉన్నది. అన్వయించుకోవడం, అర్థం చేసుకోవడం మన అవగాహన మీద ఆధార పది ఉంటుంది.  అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య ఈ విషయాన్ని క్లుప్తంగా విశదీకరించారు కూడా.
‘గోవులు, విప్రులు, వేదాలు, పతివ్రతలు, సత్యవచనులు, లుబ్దులు కానివారు, దానశీలురు, ఈ ఏడుగురి వల్లనే భూమి నిలిచి ఉంది. గోవునకు వేదం ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. గోవును పవిత్రంగా భావించింది. గోవును దేవత అన్నది. మానవుడు సుఖజీవనం సాగించడానికి నిరంతర పరిశోధన జరిగింది. ఆవుపాలను గురించి వేదం బహుదా ప్రశంసించింది. ఏనాడైనా పాడి ఆహారానికి తప్పనిసరి. ఎంతో ఆధునికం అనుకుంటున్న ఈ కాలంలోనూ పాడి తప్పని సరి. పాడికి గోవు అవసరం. పాడి జీవనాధారం. భారత వ్యవసాయానికి ఈ నాటికీ పశువే పట్టుగొమ్మ. యజ్ఞానికి నేయి అవసరం. ఆహారానికి సహితం ఘృతం తప్పని సరి. “ఘృతంవినా భోజనమప్రశస్తం”. ఇన్నింటి వల్ల గోవు సామాజిక జీవితానికి అవసరం అని అర్థం అయింది.
యావత్ భారత దేశంలో, అ ఆమాటకొస్తే ప్రపంచంలో ఎక్కడైనా కానీ, నివసిస్తున్న హిందువులకు ఆవు అత్యంత పవిత్రమైన ఆరాద్య దైవం లాంటిది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు విస్తృతంగా, సవివరంగా చెప్పాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపులో కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం వుందని పురాణాలు చెప్పాయి. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగమములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్యభాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో చతుర్థశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెబుతున్నది. గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత పుణ్యం, ఫలితం కలుగుతుందని నమ్మిన అనేకమంది భారతీయులు గోవుకు ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు.

గోవు పాలలో, పెరుగులో, వాటిద్వారా వచ్చిన నెయ్యిలో, పేడ, మూత్రంలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని చెప్తుంటారు. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు వైద్యులు కూడా ఒప్పుకున్నారు. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలే శరణ్యం. ఆహారంగానే కాకుండా అరాద్యంలోను, అంటే పూజ పునస్కారాలలోను వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ, యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది.


ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు మూత్రాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది.

ప్రపంచంలో ఆహారాన్ని ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి 'నహుషం'లో ప్రవచించారు. చతుర్వేదాలలోనేకాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు, శ్రీ ఆది శంకరాచార్యులు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద యొక్క రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు.

ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుడిని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక చేసిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమవుతుందో చెప్పవలసినదిగా ప్రార్థించింది.

దయామయుడైన పరమశివుడు "ఓ పార్వతీ! గోవులో సమస్త దేవతలు ఉన్నారు. అలాంటి గోవును పూజిస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఆ గోవు పాదాలలో ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళాలు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతీ కూడా వుంటారు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉంటాయి”.

“ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు, సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది”.

“కాబట్టి ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను”.

“ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది" అని బోధించాడు.

యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు.

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలైనవాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమైన వస్తుజాతకమును అగ్నినుండి ఉత్పన్నం చేయాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందునుంచి ఆవిర్భవించింది. అగ్ని సంబంధమైన హోమం వల్ల గోవు జన్మించడంతో, గోవు అగ్నిహోత్ర సమానమైంది.

ఇంతకు ముందే రాసినట్లు, గోమాతలో సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటారు. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. ఆవు కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే, త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ, బిళ్వ దళాలతో పూజిస్తే, సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందట. గోవు నాసికను పూజిస్తే సంతాన నష్టం వుండదని అంటారు. ఆవు చెవిని పూజిస్తే, సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నులను పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయట. ఆవు నాలిక దగ్గర పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతారు. అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే, విద్యాప్రాప్తి లభిస్తుంది.

ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని, కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడట, అందువల్ల కంటాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే, ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే, నాగలోక ప్రాప్తి లభిస్తుందని, భూమిపై నాగుపాముల భయం ఉండదని చెపుతారు. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారట. కనుక గిట్టలను పూజిస్తే, గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారట, ఆ భాగాన్ని పూజిస్తే, సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

గోవును ప్రతి దినం పూజించవచ్చు. అయినప్పటికీ, గో పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులు కూడా వున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా ‘ఆశ్వయుజ బహుళ ద్వాదశి’ కనిపిస్తుంది. దీనినే ‘గోవత్స ద్వాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున ఆవు, దూడలను పసుపు కుంకుమలతో, పూల దండలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం ఉంది. దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయట.

దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

గోమాతను శుక్రవారం పూజిస్తే ఇంట్లో సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. ఇంట్లో గోపూజ చేయడం కుదరని పక్షంలో ఆలయాల్లోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా కూడా శుభఫలితాలుంటాయి. ఆవుకు గో గ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి. శుభ ముహూర్త కాలంలో గోపూజ చేయించడం, గోమాతను ఆలయాలకు దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

గోమాతను దానం చేస్తే, కోటి పుణ్యాలు చేసినంత ఫలం, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యము దక్కుతుంది. పశువులకు మేతను దానం చేస్తే పాపాలు హరించబడతాయి అని పురాణాలు చెబుతున్నాయి.

మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. గోమాతలు మనల్ని పోషిస్తున్నాయి. గోమాత లక్ష్మీదేవి స్వరూపం. గోవుకు వేద ప్రమాణమయిన విశిష్టత ఉంది. కవ్వంచేత గో క్షీరాన్ని మధిస్తే వచ్చేటువంటి వెన్న, నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదాన, హిరణ్య దానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ, పితృకర్మల్లోనూ చేయాలని మనుస్మృతి బోధిస్తోంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని చెబుతున్నారు.

గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాం.

1 comment:

  1. To start with, it is your blog and you can write what you believe.

    Hindus BELIEVE that cow is sacred. For that matter any life form is sacred and needs to be protected. In line with this, all the support arguments cited are either beliefs or conjectures based on some books.

    Problem with this line of thinking is, it lacks rationality. I can believe what i believe, as it is personal. The issue is that the same is being thrust on others. This creates friction. Also it encourages unscrupulous elements in unlawful and extra judicial activities. The problem gets exacerbated when the politicians support these activities for their personal gains.

    If we take legal perspective, law is not same in all states. Supreme court took cognizance of anti cow slaughter law in 20 out of 28 states. This in itself shows that the idea is a belief.

    The purpose of my comment is to highlight that there is no scientific evidence shown as to why cow(and only cow) is sacred.

    That said, i am agnostic. I believe that men should not be slaughtered for the sake of cows(as had happened) and all life forms have equal right to live on this planet.

    ReplyDelete