Thursday, September 10, 2020

ఖగోళ విషయ విస్తారం-2 .... శ్రీ మహాభాగవత కథ-31 : వనం జ్వాలా నరసింహారావు

 ఖగోళ విషయ విస్తారం-2

శ్రీ మహాభాగవత కథ-31

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

పూర్తిగా సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించిన కాలం ఒక సంవత్సరం. ఈ సమగ్ర సంచారంలో శీఘ్రగతి, మందగతి, సమగతి అని మూడు గతి విశేషాలున్నాయి. ఈ గతి విశేషాలవల్ల తేడా కనిపించే సంవత్సరాన్ని సంవత్సరం, పరిసంవత్సరం, ఇళాసంవత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని అయుదు విధాలుగా చెపుతారు. చంద్రుడు సూర్యకిరణాల కంటే లక్ష యోజనాలకు పైగా శీఘ్రంగా సంచరిస్తాడు. పక్షం, రాశి, నక్షత్రం, వీటి శేషాన్ని గ్రహిస్తూ ముందుకు సంచరిస్తూ చంద్రుడు పెరుగుతూ, తరుగుతూ ఉంటాడు. తద్వారా పగలు, రాత్రి కలగ చేస్తున్నాడు. చంద్రుడు ఒక నక్షత్రంలో 30 ఘడియలు ఉంటాడు. పదహారు కళలతో ఉంటాడు. చంద్రుడిని ‘సర్వసముడు అంటారు. చంద్రుడికి పైన లక్ష యోజనాల ఎత్తులో తారకలు గుమిగూడి మేరు శైలానికి ప్రదక్షిణంగా తిరిగి వస్తూ ఉంటాయి. అభిజిత్తు అనే నక్షత్రం కూడా ఈ తారా చక్రంలో ఉంది తిరుగుతూ ఉంటుంది. అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలే అని అనుకుంటాం. ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్యలో అభిజిత్తు అనే నక్షత్రం ఒకటి ఉంది. దీనితో కలిసి నక్షత్రాలు 28.

         తారలన్నింటికి రెండు లక్షల యోజనాల పైన శుక్రుడు ఉంటాడు. శుక్రుడు, సూర్యుడు ఉండే రాశికి ముందు రాశిలోకాని, వెనుక రాశిలోకాని, అతడితో సమంగా కాని సంచరిస్తూ ఉంటాడు. జనులకు అనుకూలుడై వర్షాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. వర్షానికి ఆటంకం ఏర్పరిచే శక్తుల్ని తొలగించి శుభాలను ఇస్తాడు. అటుపైన రెండు లక్షల యోజనాల పైన బుధుడు చరిస్తున్నాడు. బుధుడు ఎప్పుడూ సూర్యుడికి దగ్గరగానే ఉంటాడు కాబట్టి కనపడడు. సూర్యుడితో దూరం ఎక్కువై ఎప్పుడైనా బుధుడు మన కంటికి కనిపిస్తే అతడి సాటిలేని మహిమ వల్ల ప్రజలకు పెనుగాలులు, క్షామం, దోపిడీలు మొదలైన భయాలు కలుగుతాయి. బుధుడు చంద్రుడి కొడుకు.   

         బుధుడికి పైన రెండు లక్షల యోజనాల దూరంలో భూమికి పుత్రుడైన అంగారకుడు చరిస్తున్నాడు. యితడు ఒక్కొక్క రాశి దాటడానికి మూడు పక్షాల సమయం పడుతుంది. ఇలా పన్నెండు రాశులను దాటుతాడు. ఒక్కోసారి వెనక్కు వచ్చి మళ్లీ ముందుకు వెళ్తూ ఉంటాడు. వక్రగాతిలోనూ, శుభగ్రహయోగం లేనప్పుడూ అంగారకుడు (కుజుడు) ప్రజలకు పీడల్ని కలిగిస్తాడు. కుజుడికి రెండు లక్షల యోజనాల పైన బృహస్పతి చరిస్తాడు. ఇతడు ప్రతి రాశిలోను ఒక్కో సంవత్సరం ఉంటాడు. యితడు దేవతల గురువు. వక్రగాతిలో లేనప్పుడు బ్రాహ్మణులకు అనుకూలుడై ఉంటాడు. సూర్యుడి కొడుకు శని. యితడు బృహస్పతికి రెండు లక్షల యోజనాల పైన చరిస్తూ ఉంటాడు. ఒక్కో రాశిలో 30 నెలలు సంచారం చేస్తాడు. లోకాలకు పీడా కలిగిస్తాడు. శనికి పైన 11 లక్షల యోజనాల దూరంలో సపర్షి మండలం ఉన్నది. వీరు బ్రాహ్మణులకు సకల లోకాలకు మేలు చేస్తారు. సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో శింశుమార చక్రం ఉంది. ఇది అన్నింటికంటే పైన ఉంటుంది.

         విష్ణువు పదం శింశుమార చక్రం. భక్తుడైన ధ్రువుడు ఇంద్రుడు, అగ్ని, కశ్యప ప్రజాపతి మొదలైన ప్రముఖులతో నిత్యమూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అన్ని జ్యోతిర్గ్రహ నక్షత్ర మండలాలకు నిశ్చలమైన ఆధారంగా భగవానుడు ధ్రువుడిని స్థిరంగా నిలిపాడు. నక్షత్రాలు, సూర్యాది గ్రహాలూ, మేధి స్తంబంలా ఉన్న ధ్రువుడికి దగ్గరగా కొన్ని, దూరంగా కొన్ని, బాగా వెలుపలగా కొన్ని, ఉండేట్లు వాయువు ప్రేరణ వల్ల కల్పాంతం వరకు పరిభ్రమిస్తూ ఉంటాయి. అంతరిక్షంలో గ్రహాలన్నీ ప్రకృతి పురుష సంయోగం వల్ల ఏర్పడిన ఒక విచిత్రమైన కర్మగతి నడిపిస్తూ ఉంటే నేలమీద పడకుండా సంచరిస్తున్నాయి.

         ‘శింశుమార చక్రం’ సకల దేవతలతో నిండి వున్న వాసుదేవుడి దివ్యదేహం. వలయాకార సర్పంలాగా ఉన్న ఈ శింశుమార చక్రం తోక చివరన ముందుభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారు. తోకకు మూలంలో ధాత, విధాత ఉంటారు. కటి ప్రదేశంలో సప్తర్షులు ఉంటారు. కుడువైపున సుడిగా తిరిగి ఈ శింశుమారం ఉంటుంది. అలా దక్షిణావర్తంగా వలయాకారంగా ఉన్న శరీరం కల శింశుమారానికి దక్షిణం వైపు ఉత్తరాయణ నక్షత్రాలు అంటే అభిజిత్తు నుండి పునర్వసు వరకు (14) ఉంటాయి. ఎడమవైపు దక్షిణాయన నక్షత్రాలు పుష్యమి నుండి ఉత్తరాషాఢ వరకు ఉంటాయి. వీపు వైపున దేవా, మైన, అజవీథి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల సమూహం), కడుపున ఆకాశగంగ, ఉత్తర భాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు (కుడు-ఎడమ తుంట్ల లాగా) ఉంటాయి. ఔనర్వాసు నక్షత్రం ఉత్తరాయణానికి చివరది. పుష్యమి దక్షిణాయానానికి మొదటి నక్షత్రం.

         ఆర్ద్ర, ఆశ్లేషలు కుడి-ఎడమ పాదాల వెనక భాగంలో ఉంటాయి. కుడి పాదంలో ఆర్ద్ర, ఎడమ పాదంలో ఆశ్లేష ఉంటాయి. ముక్కుకు కుడివైపు కన్నంలో అభిజిత్తు, ఎడమవైపు కన్నంలో ఉత్తరాషాఢ ఉంటాయి. కుడి కంటిలో శ్రవణం, ఎడమ కంటిలో పూర్వాషాఢ ఉంటాయి. కుడి-ఎడమ చెవుల్లో ధనిష్టా, మూలలు ఉంటాయి. మఖ నుండి అనూరాధ వరకు ఉన్న ఎనిమిది దక్షిణాయన సంబంధమైన నక్షత్రాలు ఎడమ పక్కనున్న ఎముకల్లోను, కుడి పక్కనున్న ఎముకలలో మృగశీర్ష నుండి ప్రతిలోమ క్రమంలో పూర్వాభాద్ర వరకు గల ఉత్తరాయణ సంబంధమియన్ ఎనిమిది నక్షత్రాలు ఉంటాయి.

         కుడి భుజంలో జ్యేష్ఠ, ఎడమ భుజంలో శతభిషం ఉంటాయి. ఉత్తరపు దౌడలో అగస్త్యుడు, దక్షిణపు దౌడలో యముడు ఉంటారు. ముఖంలో అంగారకుడు, గుహ్యంలో శని, మెడ వెనుక భాగంలో గురుడు, రొమ్ములో రవి, నాభిలో శుక్రుడు, మనస్సులో చంద్రుడు, వక్షోజాలలో అశ్వినీ దేవతలు, ప్రాణాపానాలలో బుధుడు, గళంలో రాహువు, శరీరంలోని అన్ని భాగాలలోను కేతువు, రోమాలలో అన్ని తారకలు, హృదయంలో నారాయణుడు ఉంటారు. ఇది సర్వ దేవతామయుడైన పుండరీకాక్షుడి దివ్య దేహం. ఈ శింశుమార చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ జ్యోతిస్స్వరూపంలో వెలుగొందే శింశుమార విగ్రహాన్ని “వందనం, వందనం” అని నుతించాలి.

సూర్యుడికి కింద వైపున పదివేల యోజనాల దూరంలో రాహు గ్రహం అపసవ్య మార్గంలో ఉంటుంది. రాహువు రాక్షసాధముడు, అమరత్వానికి అర్హుడు కాడు. సూర్యమండలం వ్యాసం పదివేల యోజనాల విస్తృతి కలది. చంద్ర మండలం వ్యాసం పన్నెండువేల యోజనాలు. పర్వకాలాలలో రాహువు సూర్య మండలాన్ని కాని, చంద్ర మండలాన్ని కాని పూర్తిగా కప్పుతాడు. దాన్ని చూసి భూమ్మీద వుండే జనులు గ్రహణం పట్టిందని అంటారు. విష్ణువు సుదర్శన చక్రం వస్తుందేమో అన్న భయంతో ఐదారు గడియల లోపు రాహువు గ్రహణాన్ని విడిచి వెళ్తాడు. రాహువుకు పదివేల యోజనాల కింద పిశాచాలు, రాక్షసులు సేవిస్తుంటే, యక్షులు, భూతప్రేతాలు చరిస్తూ ఉంటారు. యక్ష, భూత, ప్రేతాలు చరించే అంతరిక్షానికి కింద మేఘ మండలం ఉన్నది. ఇది గాలికి చరిస్తూ ఉంటుంది. మేఘ మండలానికి కింద భూమండలం ఉన్నది.

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. కృష్ణం వందే జగద్గురు 🙏🏻❤ అద్భుత సమాచారం

    ReplyDelete