Wednesday, September 23, 2020

సత్యవ్రతుడి చరిత్ర, మత్స్యావతార కథ ... శ్రీ మహాభాగవత కథ-44 : వనం జ్వాలా నరసింహారావు

 సత్యవ్రతుడి చరిత్ర, మత్స్యావతార కథ

శ్రీ మహాభాగవత కథ-44

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

గత కల్పంలో ద్రవిడ దేశ రాజైన సత్యవ్రతుడు కృతమాలికా నదీతీరంలో నిష్టగా తపస్సు చేస్తుండేవాడు. ఒకనాడు ఆ రాజు జలతర్పణం చేయ్యడానికి నీటిని దోసిట్లో తీసుకున్నాడు. అందులో ఒక చిన్న చేప పిల్ల కనిపించగానే ఉలిక్కిపడి దాన్ని తిరిగి నీటిలో వదిలిపెట్టాడు. అప్పుడా చేప పిల్ల రాజును, ఆ నదిలో చిన్న-చిన్న చేప పిల్లలను పట్టుకుని మింగే పెద్ద చేపలున్నాయని, అందువల్ల వుండలేక ఆయన దోసిట్లోకి వచ్చానని, తనను అలా నీటిలో తిరిగి విడిచి పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించింది. తనమీద రాజుకు దయలేదా అని అడిగింది. అంతే కాకుండా జాలరులు కూడా వచ్చి వల విసిరి తనను పట్టుకు పోయే ప్రమాదం వున్నదని, అందువల్ల తనను రక్షించమని వేడుకుంది. ఆ మాటలకు కరుణాకరుడైన రాజు నీళ్లలో వున్న చేప పిల్లను మెల్లిగా తన కమండలం జలంలో పెట్టి, తాను వుండే చోటుకు తీసుకుపోయాడు.  

ఒక్క రాత్రి అయ్యేసరికి ఆ చేప పిల్ల కమండలమంతా నిండిపోయి, అందులో కదలడానికి చోటు లేక, తనను వేయడానికి కొంచెం పెద్ద పాత్ర తెమ్మని అడిగింది రాజును. క్షణంలో ఆ పాత్ర అంతా నిండింది చేప పిల్ల. మరొక పాత్ర కావాలని అడిగింది రాజును. అప్పుడు దాన్ని ఇక చిన్న మడుగులో విడిచాడు రాజు. అప్పుడా చేప ఆ సరోవర జలం కంటే కూడా పెద్దదై, తాను తిరగడానికి అది కూడా చాలదని అనేసరికి, రాజు దాన్ని మరొక పెద్ద జలాశయంలో విడిచాడు. చేప పిల్ల ఆ జలాశయం కంటే అధికంగా పెరిగే సరికి, చేసేదేమీలేక దాన్ని మహాసముద్రంలో విడిచిపెట్టాడు. వెంటనే, పెద్ద-పెద్ద మొసళ్లు తనను మింగుతాయని, బయటకు తీయమని ఎలుగెత్తి అరిచింది ఆ చేప. అప్పుడు, ఇది సాధారణ మత్స్యం కాదని నిశ్చయించుకున్నాడు రాజు. ఎవారా చేప అని, ఒక్క రోజులోనే ఎలా ఇన్ని యోజనాలు విస్తరించావని, దాని లాంటి చేపను తానెప్పుడూ చూడలేదని, ఎందుకు తనను ఇలా తిప్పుతున్నావని అడిగాడు రాజు ఆ చేపను. ఆపన్నులను రక్షించే శ్రీహరిగా ఆ చేపను గుర్తించిన రాజు,’వందనాలు పురుషోత్తమా!’ అని అన్నాడు. ఎందుకు మత్స్యావతారం ఎత్తావని భగవంతుడిని ప్రశ్నించాడు సత్యవ్రతుడు.    

యుగాంతంలో ప్రళయ సమయంలో ఒంటరిగా విహరించడానికి వచ్చానని జవాబిచ్చాడు మత్స్య రూపంలో వున్న శ్రీమన్నారాయణుడు. ఇంకా ఇలా అన్నాడు: ’ఈ రాత్రి గడిచిన తరువాత రాబోయే ఏడవ రోజుతో బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. అప్పుడు భూలోకంతో సహా ముల్లోకాలు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరికి వస్తుంది. దాంట్లో ఓషధీ సమూహం, సమస్త బీజరాసులు వుంచి ఆ ప్రళయ సముద్ర జలాలలో విహరించు. సప్తర్షులు నీతో కలిసి వుంటారు. అప్పుడు పెనుచీకటి కమ్ముకుంటుంది. మిణుకు-మిణుకుమనే మునుల శరీర కాంతిలో నావ తేలుతూ వుంటుంది. దాన్ని సముద్ర అలలకు లోను కాకుండా, ప్రమాదం జరగకుండా నేను కాపాడుతాను. నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద సర్పం కనిపిస్తుంది. నావ తిరగబడకుండా అ అపాముతో నా కొమ్ము చివర నావకు కట్టి బంధించు. నీకూ, మునులకూ ఎలాంటి అలజడి లేకుండా ఆ రాత్రి పూర్తయ్యేదాకా నేను రక్షిస్తాను. దీనికొరకే మత్స్యావతారం ధరించాను’ అని చెప్పి అదృశ్యమయ్యాడు. తరువాత దర్భశయ్యను తలగడగా చేసుకుని పడుకుని, సత్యవ్రతుడు ప్రళయ కాలం కోసం వేచి చూడసాగాడు. 

ఇంతలో కల్పాంతం ప్రవేశించింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. జలరాశి చెలియలి కట్ట దాటి భూమండలాన్ని ముంచేసింది. సముద్ర జలాలు హద్దులు దాటి ఆకాశమంతా వ్యాపించాయి. సమస్త జీవరాశులూ ప్రాణాలు కోల్ఫొయాయి. బ్రహ్మ శరీర బడలికతో సృష్టికార్యాన్ని మానేశాడు. గురక పెట్తూ నిద్రపోయాడు. ఆయన ముఖం నుండి వేదరాశి ఉత్పన్నమైంది. హయగ్రీవుడనే రాక్షసుడు వాటిని అపహరించి, సముద్రంలోకి ప్రవేశించాడు. లక్ష యోజనాల పొడవు కల మత్స్యరూపాన్ని ధరించిన మహా విష్ణువు ఆ వేదాలను రక్షించాలని నిర్ణయించుకున్నాడు.

సాగర గర్భంలో, ఆ ప్రళయ జలాలలో వేదాలను అన్వేషించడం ప్రారంభించాడు. ఇది జరగడానికంటే ముందు నారాయణుడు చెప్పినట్లే వచ్చిన నావలో సత్యవ్రతుడు, మునులు ప్రయాణిస్తుండగా మహా మీనాన్ని చూశారు. దాని కొమ్ముకు పెద్దపామును తాడుగా కట్టాడు. మహావిష్ణువును కీర్తించసాగారు. ఇలా కీర్తిస్తున్న మునులకు మత్స్యరూపాంలో మహా సముద్రంలో విహరిస్తున్న శ్రీహరి సాంఖ్య యోగంతో కూడిన వేద సంహితను ఉపదేశించాడు. ఆ విధంగా ప్రళయరాత్రి పూర్తయ్యేదాకా జలచరాకారంలో నారాయణుడు సంచరిస్తూనే వున్నాడు. ఇంతలో వేదాల దైన్యాన్ని చూసి, తోకను సారించి, పెద్ద చేప ఆకారంలో వున్న శ్రీమహావిష్ణువు హయగ్రీవుడిని వధించాడు. అంతటితో ప్రళయకాలం ముగింపుకు వచ్చింది. బ్రహ్మ మేల్కొని సృష్టి చెయ్యడం ప్రారంభించాడు. హయగ్రీవుడిని చంపిన శ్రీహరి వేదరాశిని తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. విష్ణువుకు అర్ఘ్యం ఇచ్చిన సత్యవ్రతుడు తదుపరి కల్పానికి మనువయ్యాడు.

విష్ణువు మత్స్యావతార కథ చదివినవారికి, విన్నవారికి పరమపదం లభిస్తుంది. కోరికలన్నీ నెరవేరుతాయి.  

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment