Tuesday, September 8, 2020

జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి ... శ్రీ మహాభాగవత కథ-30 : వనం జ్వాలా నరసింహారావు

 జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి

శ్రీ మహాభాగవత కథ-30

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

వర్షాలన్నింటిలోను భారత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షంలో ఎవరు ఎలాంటి సుఖదుఃఖాలను అనుభవించినా దానికి కారణాలైన పుణ్యకర్మలనీ, పాప కర్మలనీ ఆచరించే స్థలం భారత వర్షం. మిగతా ఎనిమిది వర్షాలు పుణ్యకర్మలను అనుభవించే స్థానాలు. పుణ్యకర్మలను అనుభవించే స్థానానికి స్వర్గం అని పేరు. ఆ కర్మలో కొంతమేరకు కర్మఫలాన్ని అనుభవించి, మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతూ ఉంటారు. అలా చేరి, మిగిలి ఉన్న పుణ్యఫలాలను అనుభవిస్తారు. వాటిని భౌమ స్వర్గాలని అంటారు. అలాంటి భౌమ స్వర్గాలు ఎనిమిది వర్షాలు. దానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించే స్థానం భారత వర్షం. ఇక శ్రేష్టమైన భారత వర్షం కథ ఏమిటంటే:

స్వాయంభవ మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి నాభి అనే వాడు పుట్టి బాలి చక్రవర్తితో స్నేహం చేశాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి. అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరుమీద ‘భారతవర్షం అని ఏర్పడి, క్రమేపీ జగత్ప్రసిద్ధం అయింది.

ఇలావృతం మొదలుగా గల తొమ్మిది వర్షాలలోనూ భగవానుడైన నారాయణుడు అవతరించి, నిత్యం లోకాలను అనుగ్రహిస్తూ, లోకులందరికీ జ్ఞానం ఇస్తాడు. ఇలావృత వర్షానికి అధిపతి త్రిపురాలను హరించిన రుద్రుడు. భద్రాశ్వ వర్షానికి అధిపతి భద్రశ్రవుడు. హరి వర్షానికి అధిపతి నరసింహస్వామి. కేతుమాల వర్షంలో భగవానుడు కామదేవుడు (ఈయన్నే ప్రద్యుమ్నుడు అని అంటారు) అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. ఈ వర్షానికి అధిపతులు ప్రజాపతైన సంవత్సురిడి కుమార్తెలు, కుమారులు. కొడుకులు పగళ్లు, కూతుర్లు రాత్రులు. రమ్యక వర్షానికి అధిదేవత మత్స్యరూపంలో ఉంటాడు. అతడు హరే! ఈ వర్షాధిపతి మనువు. ఇతడు మత్స్యమూర్తిని ఆరాధిస్తుంటాడు. ఇక హిరణ్మయ వర్షం అధినేత కూర్మావతార రూపుడైన పద్మగర్భుడు శ్రీమహావిష్ణువు. పితృదేవతల అధిపతైన అర్యముడు హిరణ్మయవర్ష పాలకుడు. ఉత్తర కురు భూములకు వరాహదేవుడు అధిపతి. భూదేవి అతడికి పూజ చేస్తుంటుంది. కింపురుష వర్షానికి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామభద్రుడు అధిపతి. భారత వర్షానికి అధిపతి నారాయణుడు. బదరికాశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. భారత వర్షంలో ఎన్నో పుణ్యశైలాలు, గంబీరంగా ప్రవహించే అనేక నదులు ఉన్నాయి. అవి....

పుణ్యశైలాలు: మలయ పర్వతం, మంగళ ప్రస్థం, మైనాకం, ఋషభం, కూతకం, కొల్లకం, సహయం, వేదగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రం, వారిధరం, వింధ్యపర్వతం, శుక్తిమత్పర్వతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణపర్వతం, చిత్రకూటం, రైవతకం, కుకుభం, నీలగిరి, గోకాముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి.

పవిత్ర నదులు: పైన చెప్పిన పర్వతాలకు పుత్రికలైన పుణ్యనదులు: చంద్రపట, తామ్రపర్ణి, కృతమాల, వైహాయాసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రెవ, సురస, చర్మణవతి, వేదస్మృతి, ఋషికుల్వ, త్రిసోమ, కౌశికి, మందాకిని, యమునా, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వరుథ, వితస్త, అసిక్ని, విశ్వ అనే మహానదులు. నర్మదానది, సింధువు, శోణ అనే నదాలు భారత వర్షంలో ప్రవహిస్తున్న మహా ప్రవాహాలు. వీటిల్లో పవిత్రంగా స్నానాలు చేస్తే మానవులు ముక్తిని పొందుతారు.

భారత వర్షం ఎంతో ఉత్తమమైనదని మహాపురుషులు స్తుతిస్తారు. భారత వర్షంలో జన్మించిన వారి భాగ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. భారత వర్షంలో శ్రీహరి ఎన్నో అవతారాలను ఎత్తి, జీవులకు తత్త్వం ఉపదేశించాడు. అందువల్ల భారత వర్షంలోని జనులకు సాధ్యం కానిదేదీ లేదు. నారాయణుడిని స్మరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. భారత వర్షంలో ఒక్క క్షణకాలం మనఃపూర్వకంగా సర్వ సంగ పరిత్యాగం చేస్తే, అతడు పురుష శ్రేష్టుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత వర్షం మోక్షాన్ని పొందడానికి అనువైన కర్మ భూమి, యజ్ఞాభూమి.

ఏడు వర్షాల ప్లక్ష ద్వీపం

జంబూ ద్వీపానికి చుట్టూ లక్ష యోజనాల మేర ఉప్పు సముద్రం చుట్టి ఉన్నది. ప్లక్ష ద్వీపానికిచుట్టూ చెరకు రసం నిండిన సముద్రం ఉన్నది. అది రెండు లక్షల యోజనాల మేర చుట్టి ఉన్నది. ద్వీప మధ్య భాగంలో ప్లక్షం అనే జువ్వి చెట్టు ఉన్నది కాబట్టి ఈ ద్వీపానికి ప్లక్ష ద్వీపం అన్న పేరు వచ్చింది. అగ్నిదేవుడు దీనికి అధిపతి. (ప్రియవ్రతుడి కొడుకు ఇధ్మజిహ్వుడు దీని పాలకుడు). ఈ ప్లక్ష ద్వీపాన్ని ఏడు వర్శాలుగా విభజించడం జరిగింది. అవి శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అనేవి.

ఈ సప్త వర్షాలకు సప్త కుల పర్వతాలున్నాయి. వాటి పేర్లు: మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం. ఈ వర్షాలకు సప్త మహానదులున్నాయి. అవి: అరుణ, నృమ్ణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంభర అనేవి. ప్లక్ష ద్వీపానికి ముందు, జంబూద్వీపానికి మధ్య లవణ సముద్రం ఉన్నట్లే, ప్లక్ష శాల్మలీ ద్వీపాలకు మధ్యలో ఇక్షురస జలంతో నిండిన ఇక్షురస సముద్రం ఉన్నది. ఇది రెండు లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్షురస సముద్రానికి రెట్టింపు వైశాల్యం కలిగినది శాల్మలీ ద్వీపం.

శాల్మలీ ద్వీపంలో శాల్మలీ వృక్షం (బూరుగు చెట్టు) విస్తీర్ణం ప్లక్ష ద్వీపం విస్తీర్ణమంత ఉంటుంది. ఈ వృక్షం వల్లనే ఆ ద్వీపానికి శాల్మలీ అన్న పేరొచ్చింది. ఈ వృక్షం మూలంలో, వేదాలే అవయవాలుగా ఉన్న పతత్రి రాజు-పక్షిరాజు గరుత్మంతుడు నివసిస్తూ ఉంటాడు. శాల్మలీ ద్వీపానికి యజ్ఞబాహువు పాలకుడు. ఇతడు ప్రియవ్రతుడి కొడుకు. యజ్ఞబాహువు తన ఏడుగురు కొడుకుల పేర్లతో ఏడువర్షాలను విభజించి వారికిచ్చాడు. అవి: సురోచనం, సామనస్యం, రమణకం, దేవబర్హం, పారిభద్ర, అప్యాయనం, అభిజ్ఞాతం అనేవి. ఈ వర్షాలలో సరిహద్దు పర్వతాలు ఏడు ఉన్నాయి. అవి: సురస, శతశృంగ, వామదేవ, కుంద, ముకుంద, పుష్పవర్ష, శతశ్రుతులు అనేవి. ఏడునదులు అక్కడ ప్రవహిస్తున్నాయి. అవి: అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాకలు అనేవి.

శాల్మలీ ద్వీపానికి చుట్టూ సురా సముద్రం ఉంది. దాని విస్తీర్ణం నాలుగు లక్షల యోజనాలు. సురా సముద్రానికి చుట్టూ కుశ ద్వీపం ఉన్నది. దాని విస్తీర్ణం ఎనిమిది లక్షల యోజనాలు. కుశ ద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉన్నది. ఆ ద్వీపంలో దేవతలు నిర్మించిన కుశస్తంబం ఉన్నది. ఆ స్తంబం ఉండబట్టే దాని పేరు కుశ ద్వీపం అని వచ్చింది. కుశ ద్వీపానికి ప్రియవ్రతుడి కొడుకు హిరణ్యరేతసుడు అధిపతి. యితడు తన కొడుకుల పేర్లతో వర్షాల్ని విభజించి ఏర్పాటు చేశాడు. కుశ (ద్వీప) వర్షం లో బభ్రువు, చతుశ్సృ౦గం, కపిల, చిత్రకూటం, దేవానీకం, ఉర్ధ్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలున్నాయి. రసకుల్య, మధుకుల్య, శ్రుతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి.

కుశ ద్వీపానికి చుట్టుకుని ఘృతసముద్రం ఉన్నది. దాని వైశాల్యం ఎనిమిది లక్షల యోజనాలు. దానికి అవతల పదహారు లక్షల యోజనాల విస్తీర్ణంతో క్రౌంచ ద్వీపం ఉంది. దాని మధ్యలో క్రౌంచం అనే ఒక పర్వతం ఉంది. దీని మూలంగానే ఆ ద్వీపానికి ఆ పేరొచ్చింది. ఈ ద్వీపానికి అధిపతికూడా ప్రియవ్రతుడి మరో కొడుకు ఘృతవృష్టుడు. తనకొడుకులైన ఆమోద, మధువహ, మేఘవృష్ణ, సుధామ, ఋషిజ్య, లోహితార్ణ, వనస్పతులానే వారి పెళ మీద వర్షాలను ఏర్పాటు చేశాడు. ఆ వర్షం (క్రౌంచ ద్వీపం) లో శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, సర్వతోభద్రము అనే ఏడు పర్వతాలు; అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రవతి, శుక్ల అనే ఏడు నదులున్నాయి.

క్రౌంచ ద్వీపాన్ని చుట్టుకుని పాల సముద్రం ఉన్నది. దాని విస్తీర్ణం పదహారు లక్షల యోజనాలు. దానిలో శాక ద్వీపం ఉన్నది. ఇది 32 లక్షల యోజనాల విస్తీర్ణంతో ఉన్నది. ఆ ప్రదేశమంతా శాక వృక్ష సుగంధంతో నిండి ఉండడం వల్ల ఆ ద్వీపానికి శాక ద్వీపం అన్న పేరొచ్చింది. ప్రియవ్రతుడి కొడుకైన మేధాతిథి ఈ శాక ద్వీపానికి అధిపతి. ఇతడి ఏడుగురు కొడుకుల పేర్ల మీద వర్షాలను విభజించి పట్టం కట్టాడు. అవి: పురోజన, పవమాన, ధూమ్రానీక, చిత్రరథ, బహురూప, విశ్వాధార. ఈ శాక ద్వీపానికి ఏడు సరిహద్దు పర్వతాలున్నాయి. అవి: ఈశాన, ఉరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్ర స్రోత, దేవపాల, మహానస అనేవి. ఈ ద్వీపంలో అనఘ, ఆయుర్ద, ఉభయసృష్టి, అపరాజిత, పంచనది, సహస్రసృతి, నిజధృతి అనే సప్త మహానదులున్నాయి.

శాక ద్వీపాన్ని ఒరుసుకుంటూ చుట్టూ పెరుగు సముద్రం ఉన్నది. దాంట్లో పుష్కర ద్వీపం ఉన్నది. దీని విస్తీర్ణం 64 లక్షల యోజనాలు. ఇది మహాద్వీపం. దీంట్లో పదివేల బంగారు రేకులతో పద్మం ఉన్నది. ఇది బ్రహ్మదేవుడి పీఠం. పుష్కర ద్వీపం మధ్యన మానసోత్తరం అనే పర్వతం ఉన్నది. ఇది వర్షాల మధ్య సరిహద్దు గిరిలాగా ఉంటుంది. మానసోత్తర పర్వతం ఎత్తు పదివేల యోజనాలు. వైశాల్యం కూడా అంతే. దీనికి చుట్టూ నాలుగు పురాలున్నాయి. అవి: ఇంద్ర, అగ్ని, వరుణ, కుబేరు లోకపాలకుల పురాలు. ఈ పర్వతానికి పైన సంవత్సరాత్మకమై సూర్యరథ చక్రం మేరు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. అది ఒకసారి ప్రదక్షిణం చేసే కాలమే అహోరాత్రం అనబడుతుంది. ప్రియవ్రతుడి కొడుకు వీతిహోత్రుడు పుష్కర ద్వీపానికి అధిపతి. అతడి ఇద్దరి కొడుకుల పేర్లమీద రమణక, దాతక అనే రెండు వర్షాలుగా ఈ ద్వీపాన్ని విభజించడం జరిగింది.

ఇదీ, శుద్ధోదక సముద్రం వరకు ఉండే సప్తద్వీప రూపంగా ఉన్న భూమండల వర్ణన.

పుష్కర ద్వీపాన్ని చుట్టుకుని 64 లక్షల యోజనాల విస్తీర్ణంతో శుద్ధోదక సముద్రం ఉన్నది. ఈ సముద్రానికి అవతల లోకాలోకం అనే పర్వతం ఉన్నది. ఇది వెలుగుకు, చీకటికి మద్యన ఉండడం వల్ల దీనికి లోకాలోకం అన్న పేరు వచ్చింది. శుద్ధోదక సముద్రానికి, లోకాలోక పర్వతానికి మధ్యలో ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యోజనాలకు విస్తరించి బంగారు రంగులో అద్దంలాగా ఒక ప్రదేశం ఉన్నది. అది దేవతలు ఉండడానికి వీలుగా ఉంటుంది. అక్కడ నేలమీద పెట్టిన ఏ వస్తువైనా తిరిగి తీసుకోవడం కుదరని పని. అక్కడి నుండి లోకాలోక పర్వతం ఎనిమిది కోట్ల యోజనాలు. సూర్యుడు మొదలుకుని ధ్రువుడి వరకు ఉండే జ్యోతిర్మండలం కిరణాలకు (లోకాలకు) సరిహద్దుగా ఉన్నందున, ఆ తరువాత మొత్తం ఆలోకం (చీకటి) ఉన్నందున, దానికి లోకాలోక పరవటం అన్న పేరొచ్చింది.

సప్త ద్వీపాలతో కూడిన భూమండలం మొత్తం విస్తీర్ణం ఏభై కోట్ల యోజనాలు. దాంట్లో నాల్గవ వంతు లోకాలోక పర్వతం ప్రమాణం. దీంట్లో సకల జగద్గురువైన బ్రహ్మ అంతర్యామిగా ఉంటాడు. బ్రహ్మదేవుడు, ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే పేర్లుకల నాలుగు దిగ్గజాలను లోకాలను రక్షించడానికి అక్కడ నిలిపి ఉంచాడు. భగవంతుడు సకల లోకాలను రక్షించడానికి లోకాలోక పర్వతం మీద కల్పాంతం వరకు వేచి ఉంటాడు.

వివిధాలైన ఈ లోకయాత్రలన్నీ భగవంతుడి చిఛ్చక్తిస్వరూపిణి అయిన యోగమాయా విరచితాలే! ఇలా అనేక మంత్ర రహస్యాలతో ఆ లోకాలోక పర్వత శిఖరం మీద ఉన్న భగవంతుడికి తప్ప ఆ పర్వతానికి ఆవల వైపు ఇతరులెవ్వరికీ సంచరించడానికి వీలుపడదు. సూర్యుడు బ్రహ్మాండమధ్యంలో ఉన్నాడు. సూర్యుడి నుండి అండగోళం అంచులు రెండింటికి 25 కోట్ల యోజనాల మేర ఉన్నది. ఇలా ఉన్న సూర్యుడి వల్లనే దిక్కులు, స్వర్గం, మోక్షం, నరకం మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి. దేవతలకు, జంతువులకు, మనుష్యులకు, నాగులకు, పక్షులకు, గడ్డికి, లతలకు, పొదలకు, భూమి నుండి మొలిచే సర్వ జీవ సమూహానికీ సూర్యుడే ఆత్మగా ఉన్నాడు.

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

 

No comments:

Post a Comment