Tuesday, September 29, 2020

రంతిదేవుడి చరిత్ర, పాంచాల వంశం .... శ్రీ మహాభాగవత కథ-50 : వనం జ్వాలా నరసింహారావు

 రంతిదేవుడి చరిత్ర, పాంచాల వంశం

 శ్రీ మహాభాగవత కథ-50

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

రంతిదేవుడి కీర్తి ప్రత్యేకంగా ఇలాంటిదని చెప్పలేనంత గొప్పది. సంపాదించినదంతా దానధర్మాలు చేసి ధనహీనుడయ్యాడు. ఐనప్పటికీ అధైర్యపడక దొరికింది తింటూ 48 రోజులవరకూ ఎలాగో కాలక్షేపం చేశాడు. ఒకరోజు ఉదయాన తనకు లభించిన నేయి, పాయసం, నీరు సేవించడానికి కుటుంబం సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో, ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఆహారం అడిగాడు. తనకు వున్న ఆహారంలో సగం పెట్టాడు. అంతలో ఒక శూద్రుడు వచ్చి ఆకలిగా వుందన్నాడు. మిగిలిన అన్నంలో అతడికి సగ భాగం ఇచ్చి సంతృప్తి పరిచాడు. ఆ తరువాత కుక్కల గుంపుతో ఒకడొచ్చి ఆకలి అన్నాడు. మిగిలిందంతా వాడికిచ్చాడు. ఆ కాసేపటికి ఒక చండాలుడు వచ్చాడు. ఆకలి, ఆహారం కావాలన్నాడు. తన దగ్గర మంచినీరు మాత్రమే వుందని చెప్పి, పాత్రలో వున్న నీటిని పోశాడతడికి రంతిదేవుడు. అప్పుడు బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా తమ ద్వారా జరిగిన విష్ణుమాయ అని చెప్పారు. వారినేమీ వరం కోరుకోకుండా రంతిదేవుడు పరమపదానికి, ముక్తిపదానికి చేరుకున్నాడు.

ఇదిలా వుండగా, బృహత్‍క్షత్రుడికి పుట్టిన హస్తి అనేవాడు హస్తినాపురాన్ని నిర్మించాడు. హస్తికి అజమీఢుడు అతడికి బృహదిషుడు జన్మించారు. అతడి వంశక్రమంలో బ్రహ్మదత్తుడు అనేవాడు జన్మించి, యోగతంత్రాన్ని అభ్యసించాడు. అజమీఢుడికి నళిని అనే భార్య వల్ల కలిగిన నీలుడి సంతతి వాడే భర్మ్యాశ్వుడు. అతడికి తనలాంటి ఐదుగురు కొడుకులు కలిగారు. వారికి ఆయన పాలనలో వున్న ఐదు ప్రాంతాలను పంచాడు. ఆనాటి నుండి వారికి పాంచాలురని పేరొచ్చింది. ఐదుగిరిలో పెద్దవాడైన ముద్గులుడి కొడుకు దివోదాసుడు, కూతురు అహల్య. ఆమె గౌతమ మహర్షిని వివాహమాడింది. వారి కొడుకు శతానందుడు. అతడి మనుమడైన శరద్వంతుడు ఒకనాడు ఊర్వశిని చూడగా అతడి వీర్యం రెల్లు దుబ్బుమీద పడి ఇద్దరు బిడ్దలు పుట్టారు.   

శంతనుడనే మహారాజు వేటకొచ్చి, ఆ ఇద్దరు బిడ్డల్ని చూసి ఇంటికి తెచ్చి, వారికి కృపి, కృపుడు అని పేర్లు పెట్టి పెంచాడు. కృపి ద్రోణుడి భార్య అయింది. ముద్గులుడి కుమారుడు దివోదాసుడి సంతతిలో ద్రుపదుడు జన్మించాడు. ద్రుపదుడికి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. ధృష్టద్యుమ్నుడికి ధృష్టకేతువు జన్మించాడు. పాంచాల రాజులనేది వీరినే! అజమీఢుడికి ఋక్షుడు కూడా జన్మించాడు. అతడికి సంవరణుడు, అతడికి సూర్యుడి కుమార్తె తపతి వల్ల కురువు జన్మించారు. ఆ కురువు పేరు మీద ఏర్పడిందే కురుక్షేత్రం. కురువు సంతతిలోనే బృహద్రథుడికి జరాసంధుడు పుట్టాడు. అలాగే జయత్సేనుడనేవాడు జన్మించాడు. అతడి సంతతిలో పుట్టినవాడే శంతనుడు. అతడి అన్న దేవాపి రాజ్యం చేయడానికి ఇష్టపడక అడవులకు పోయినందున శంతనుడు రాజ్యం చేయసాగాడు. శంతనుడికి, గంగానదికి పుట్టినవాడే భీష్ముడు. శంతను మహారాజుకు సత్యవతి వల్ల చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రాంగదుడిని గంధర్వ వీరులు చంపారు. సత్యవతికి శంతనుడితో పెళ్లికాక పూర్వం, పరాశర మహర్షి సాంగత్యం వల్ల వ్యాస మహర్షి విష్ణుమూర్తి అంశతో జన్మించాడు.

         విచిత్రవీర్యుడికి భీష్ముడు అంబిక, అంబాలికలను బలవంతంగా తెచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్లకు విచిత్రవీర్యుడు చనిపోయాడు. సత్యవతి ఆజ్ఞానుసారం వ్యాస మహర్షి విచిత్రవీర్యుడి భార్యల ద్వారా ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులకు తండ్రిగా జన్మ ఇచ్చాడు. ధృతరాష్ట్రుడికి గాంధారి వల్ల దుర్యోధనుడితో సహా నూర్గురు కుమారులు, దుశ్శల అనే కూతురు జన్మించారు. దుర్యోధనాదులను కౌరవులంటారు. పాండురాజు కుంతీదేవి వల్ల యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుల వరప్రసాదాన యుధిష్టర, భీమ, అర్జున అనే ముగ్గురు కుమారులను; మాద్రి వల్ల అశ్వినీదేవతల వరప్రసాదాన నకుల, సహదేవులనే ఇద్దరిని; మొత్తం అయిదుగురు కుమారులను పొందారు. వారి భార్య ద్రుపదరాజు కుమార్తె ద్రౌపది. వీరినే పాండవులంటారు. ఉప పాండవులు కాకుండా భీముడికి ఘటోత్కచుడు, అర్జునుడికి భభ్రువాహనుడు, అభిమన్యుడు పుట్టారు. అభిమన్యుడు కురువంశ కర్త అయ్యాడు. ఆయన కొడుకు పరీక్షిత్తు తల్లి గర్భంలో వుండగా అశ్వత్థామ వేసిన బాణం వల్ల ప్రాణాలు కోల్పోయి శ్రీహరి దయవల్ల బతికాడు. పరీక్షిత్తు కుమారులు జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే నలుగురు.

తక్షక శాపం వల్ల తండ్రి పరీక్షిత్తు మరణిస్తున్నాడని తెలుసుకున్న జనమేజయుడు సర్పలోక సంహారాన్ని కోరి సర్పయాగం చేయనున్నాడు. ఆయన  సర్వ భూమండలాన్నీ జయిస్తాడు. హస్తినాపురి యమునానది ముంపుకు గురి అకవడం వల్ల ఆయన కొశాంబిలో నివసిస్తాడు. ఆయన సంతతిలోనే కలియుగంలో కూడా జీవించిన బ్రహ్మక్షత్రుడు జన్మిస్తారు. జరాసంధుడి వంశ క్రమంలో చివరగా పురంజయుడు జన్మిస్తాడు. వీరంతా మగధ దేశ ప్రభువులు. వీరు కలియుగంలో వేయి సంవత్సరాల లోపున జన్మించి చెల్లిపోతారు. 

యయాతి వంశ పరంపరలో చిత్రరథుడు జన్మించాడు. అతడినే రోమపాదుడని కూడా అంటారు. అతడికి సంతానం లేనందున దశరథుడు తన కుమార్తె శాంతను ఆయనకు దత్తత ఇచ్చాడు. ఆమెను రోమపాదుడు ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశాడు. దశరథుడు ఆ ఋష్యశృంగుడి కృపతోనే యాగం చేసి సంతానాన్ని పొందాడు. యయాతి పెద్దకొడుకు యదువు సంతతిలో వాడే హైహయుడు. అతడి వంశ క్రమంలో జన్మించిన వాడే అర్జునుడు. కార్తవీర్యుడు అనిపించుకున్నాడతడు. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment