Monday, September 21, 2020

క్షీరసాగర మథనం, మోహినీ కూర్మావతారాలు, దేవాసుర యుద్ధం .... శ్రీ మహాభాగవత కథ-42 : వనం జ్వాలా నరసింహారావు

 క్షీరసాగర మథనం, మోహినీ కూర్మావతారాలు, దేవాసుర యుద్ధం

శ్రీ మహాభాగవత కథ-42

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

విష్ణువు పాలకడలిని మథించడం, కూర్మాకృతిలో మందర పర్వతాన్ని కవ్వంగా మోయడం, మోహినీ అవతారం ఎత్తడం, దేవతలకు అమృతాన్ని పంచడం లాంటి భగత్కథా విశేషాలన్నీ వీనులవిందు కలిగించేవే! క్షీరసాగర మథనం పూర్వరంగంలో, రాక్షసులు పెట్టే బాధలు పడలేక దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడప్పుడు పరమపురుషుడిని ధ్యానించి, అందరం ఆయన శరణు వేడుదాం అన్నాడు. బ్రహ్మ వారిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్లి, అదృశ్యరూపుడై వున్న శ్రీహరికి నమస్కరించి, ఆయన్ను ప్రార్థించాడు. విష్ణువు ఆయన్ను అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలు ఆయనకు నమస్కారం చేసి స్తోత్రం చేశారు. వారి స్తోత్రానికి భగవంతుడు ఆనందించాడు. వారంతా వచ్చిన కారణం గ్రహించాడు.

అప్పుడు నెలకొన్న పరిస్థితుల కారణంగా దేవతలు, దానవులతో స్నేహంగా వుండి, అమృతోత్పాదన ప్రయత్నాన్ని చేయడం మంచిదన్నాడు విష్ణుమూర్తి. అమృతం తాగిన వారికి ఆయవు పెరిగి మృత్యువు వుండదని చెప్పాడు. పాల సముద్రంలో రక-రకాల తృణాలు, లతలు, ఔషధాలు వేసి, మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని కవ్వపు తాడుగా చేసి, తన సహాయంతో సముద్ర మథనం చెయ్యమన్నాడు. దానివల్ల ఫలితం కలుగుతుందని చెప్పాడు. ఇలా చెప్పి భగవంతుడు అంతర్థానమయ్యాడు. ఇలా విష్ణువు చెప్పడంతో దేవతలు రాక్షసులకు స్నేహ హస్తం సాచి, బలిచక్రవర్తిని మంచి చేసుకున్నారు. దేవ-దానవులకు మధ్య సంధి వాతావరణం నెలకొన్నది. ఇరువురి మధ్య ద్వేషభావం వద్దనుకున్నారు. దేవదానవులిద్దరికీ బలి చక్రవర్తే రాజన్నాడు ఇంద్రుడు. అప్పుడు చిన్నగా ఇంద్రుడు అమృతం కొరకు సముద్రాన్ని మథించే ఉపాయం చెప్పాడు. రాక్షసులను ఒప్పించాడు. అంతా కలిసి ఐకమత్యంగా మందర పర్వతం దగ్గరికి వెళ్లారు.

దేవదానవులు పరస్ప్రం హెచ్చరికలు చేసుకుంటూ, ఆ పర్వతాన్ని పైకి లేపి, సముద్రం దగ్గరికి చేర్చే ప్రయత్నం చేశారు. అయితే శక్తి చాలని కారణంగా అది నేలమీదికి ఒరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే దేవతలు తమకు సహాయం చేస్తానన్న శ్రీహరిని తలచుకోవడంతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. భయపడవద్దని అంటూ, కొండను బంతిలాగా పట్టి ఆడించాడు. గరుత్మంతుడు శ్రీహరిని, పర్వతాన్ని మూపున దాల్చి సముద్రం ఒడ్డున దించాడు. అప్పుడు దేవతలు వాసుకిని ప్రార్థించి, ఆయన్ను కవ్వపు తాడుగా చేసి, క్షీరసాగరన్ని కలశంగా చేశారు. మథనానికి సిద్ధపడ్డారు. రాక్షసులు వాసుకి పడగలను, దేవతలు తోకను పట్టుకున్నారు. సంతోషంగా చిలకడం ప్రారంభించారు. అప్పుడు, కొంద అడుగు భాగంలో కుదురు లేకపోవడంతో బరువున్న పర్వతం సముద్రంలో మునిగిపోయింది. ఇది గమనించిన శ్రీహరి సముద్రంలోకి దిగాడు. ఒక మహాకూర్మంగా మారిపోయాడు.     

తాబేలుగా మారిన శ్రీహరి ముత్తెపు చిప్ప మాదిరిగా జలరాశిలోకి ప్రవేశించాడు. వాసుకితో పాటుగా మందర పర్వతాన్ని అవలీలగా ఎత్తాడు. వెంటనే సురలు, అసురులు ఉమ్మడిగా సముద్రాన్ని మథించసాగారు. వాసుకి శరీరంలో నుండి విషాగ్ని కీలలు విపరీతంగా పుట్టాయి. అతడి నోట్లో నుండి భయంకరమైన శబ్దాలు వచ్చాయి. సముద్రంలోని జీవరాశులు ఆర్తనాదాలు చేశాయి. వాసుకి తల, తోకను వదలకుండా దానవులు, దేవతలు చిలకడం కొనసాగించారు. కాసేపటికి అల్లకల్లోలంగా వున్న పాల సముద్ర్తం నుండి అగ్నిజ్వాలలతో కూడిన హాలాహలమనే విషం పుట్టింది. ఆ మహా విషం ఆకాశానికి పొంగింది. అన్ని దిశలకూ, అన్నిలోకాల్లోకి ఎగబాకింది. పాతాళానికి చేరుకుంది. అకాలంలో ప్రపంచానికి విలయం వచ్చినట్లుగా అయిపోయింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి శివుడి శరణు జొచ్చారు. పాల సముద్ర మథనంలో పుట్టిన కాలకూట విషమైన హాలాహలాన్ని లాఘవంగా గ్రహించి, ప్రాణికోటిని బతికించమని ప్రార్థించారు.  

అప్పుడు, శివుడు తన ప్రియ సతితో, హాలాహలాన్ని అణచి వేసి, ప్రాణికోటిని రక్షిస్తానని అన్నాడు. ఆమె అంగీకారంతో, దేవతల జయ-జయ ధ్వానాల మధ్య, శివుడు తన చేతిని చాచి కాలకూట విషాన్ని పట్టుకుని, ముద్దగా చేసి, నేరేడు పండులాగా విలాసంగా మింగాడు. దాన్ని లోపలికి పోనివ్వకుండా తన కంఠబిలంలో నిలుపుకున్నాడు. ఆ భాగం నల్లగా మారిపోయింది. దేవదానవులు తిరిగి పాలసముద్రాన్ని మథించడం మొదలుపెట్టారు. 

పాల సముద్రంలో నుండి మొదలు కామధేనువు పుట్టింది. దేవమునులు దాన్ని తీసుకున్నారు. తరువాత ఉచ్చైశ్రవమనే గుర్రం పుట్టింది. దాన్ని బలి చక్రవర్తి తీసుకున్నాడు. ఆ తరువాత తెల్లటి ఐరావతం అనే ఏనుగు ఉద్భవించింది. అటు పిమ్మట కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టారు. లక్ష్మీదేవి, శ్రీహరి ఒకరినొకరు చూసుకున్నారు. తాను నివసించడానికి తగిన మందిరంగా శ్రీహరి వక్షస్థలాన్ని చూసింది లక్ష్మీదేవి. లక్ష్మీనారాయణులిద్దరూ ఒకరినికరు మనసారా చూసుకున్నారు. లక్ష్మీదేవిని శ్రీహరి తన వక్షస్థలంలో ధరించాడు. అనంతరం పాలకడలిని చిలకగా వారుణి అనే కన్య, ధన్వంతరి అనే దివ్య పురుషుడు ఉద్భవించారు. విష్ణువు అంశతో జన్మించిన ధన్వంతరి వైద్యశాస్త్ర నిపుణుడు, ఆయుర్వేది, దేవతలకు వైద్యుడు. అతడి చేతిలో అమృత కలశం వున్నది.   

ధన్వంతరి చేతిలోని అమృత కలశాన్ని చూసిన అసురులు విజృంభించి దాన్ని అందుకున్నారు. దాన్ని వారు అపహరించారు. దేవతలు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. దేవదానవుల మధ్య అమంగళకరమైన కలహం బయల్దేరింది అమృతం కోసం. అప్పుడు విష్ణుమూర్తి మోహినీ రూపాన్ని ధరించి అక్కడ కనబడగానే రాక్షస వీరులు చూసి పరవశించారు. దేవతలకు, తమకు అమృతాన్ని పంచుకోవడంలో పేచీ వచ్చిందని, కాబట్టి దాన్ని సక్రమంగా పంచిపెట్టమని అడిగారు ఆమెను. ఆ అమృత కలశాన్ని దానవులు ఆమె చేతికి ఇచ్చారు. తాను పంచిన విధంగా అంగీకరించాలని నిబంధన విధించింది. దానికి వారు ఒప్పుకున్నారు. అప్పుడు మోహిని, దేవతలను ఒక పంక్తిలోను, దానవులను వేరే పంక్తిలోను కూర్చోచోబెట్టింది. రాక్షసులను వంచిస్తూ అమృతాన్ని దేవతలకు పోయసాగింది. మోహిని చూపులకు వశమైన దానవులు చూస్తూ వూరుకున్నారు. రాహువు అనే రాక్షసుడు దేవతాసమూహంలోకి ప్రవేశించి అమృతాన్ని పానం చేశాడు. సూర్య-చంద్రులు మోహినికి సైగ చేయగా, నారాయణుడు అతడి శిరస్సు ఖండించాడు. అమృతం తాగిన కారణాన ఆ శిరస్సు అమరత్వాన్ని పొంది అలా పడిపోయింది. బ్రహ్మ అ అరాహువు శిరస్సును ఆకాశవీధిలో ఒక గ్రహంలాగా నిలబెట్టాడు. ఆ రాహుగ్రహమే సూర్య-చంద్రులను గ్రహణం నాడు పట్టుకుంటుంది. మొత్తం మీద అమృతం మొత్తాన్ని ఒక్క బొట్టు కూడా మిగల్చకుండా, దేవతలకు మోహినీ ఆకారంలో పంచిన శ్రీహరి, తన నిజ రూపాన్ని ధరించాడు.      

అమృతం దక్కక పోవడంతో కోపించిన దానవులు దేవతలమీదికి యుద్ధానికి వచ్చారు. ఒకవైపు బలి చక్రవర్తి, మరోవైపు దేవేంద్రుడు వారి-వారి గణాలకు నాయకులయ్యారు. ఇరుపక్షాల వారు యుద్ధ సన్నద్ధులయ్యారు. ఇరు పక్షాలలోని వీరులు ఒకరినికరు ఢీకొన్నారు. పోరు అతి ఘోరంగా జరిగింది. ఇంద్రుడు, బలి చక్రవర్తి ముఖా-ముఖి పోరాడారు. ఒకరిమీద ఇంకొకరు అస్త్రశస్త్రాలను ప్రయోగించుకున్నారు. బలి చక్రవర్తి నాయకత్వంలో రాక్షసులు మాయా యుద్ధం చేశారు. అలా భీకర యుద్ధం జరుగుతుంటే, రాత్రి-పగలు అనే తేడా తెలియకుండా పోయింది. ఎప్పటిలాగే దేవతలు శ్రీహరిని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి రాక్షస మాయలన్నీ నిరర్థకమైపోయాయి. ఇంద్రుడికీ, బలి చక్రవర్తికీ మధ్య కాసేపు మాటల యుద్ధం కూడా జరిగింది. ఒకరినొకరు నిందించుకున్నారు. ఎంతో కాలం సాగిన ఆ యుద్ధంలో చివరకు దేవతలదే పైచేయి కాసాగింది. వారు శత్రు పక్షంవారిని గెల్వసాగారు. ఆ సమయంలో బ్రహ్మ పంపగా నారదుడు అక్కడికి వచ్చి ఇక రాక్షస సంహారం చాలని, యుద్ధాన్ని ఆపమని దేవతలతో అన్నాడు. యుద్ధం ఆగిపోగా, దైత్యులు, దానవులు బలి చక్రవర్తిని తీసుకుని వెళ్లిపోయారు.   

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment