Sunday, September 6, 2020

పిండోత్పత్తి క్రమం, సప్త ద్వీపాల, సప్త సముద్రాల ఆవిర్భావం .... శ్రీ మహాభాగవత కథ-28 : వనం జ్వాలా నరసింహారావు

 పిండోత్పత్తి క్రమం, సప్త ద్వీపాల, సప్త సముద్రాల ఆవిర్భావం

శ్రీ మహాభాగవత కథ-28

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

జీవుడికి పూర్వ జన్మలో చేసుకున్న కర్మానుసారం తిరిగి పునర్జన్మ ఇచ్చే మహానుభావుడు ఈశ్వరుడు మాత్రమే!! కాబట్టి జీవుడు దేహ సంబంధాన్ని పొందే క్రమంలో పురుషుడి వీర్యంగా మారి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి ‘కలిలమై (శుక్ర-శోణిత సంయోగం), అయిదు రాత్రులకు ‘బుద్బుద మై (బుడగ), పడవ దినానికి రేగు పండంత అయ్యి, ఆ పైన మాంస పిండమై, ఆపై గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. ఆ మీద నెలకు శిరస్సు, రెండు నెలలకు కాళ్లు-చేతులు పుడతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు కలుగుతాయి. నాల్గవ నెలకు రసం, రక్తం, మాంసం, మేధస్సు, ఆస్థి, మజ్జ అనే సప్త ధాతువులు ఏర్పడుతాయి. అయిదవ నెలకు ఆకలి దప్పికలు కలుగుతాయి. ఆరవ నెలలో మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడి భాగాన తిరుగుతూ, తల్లి తిన్న అన్నపానాదాల వల్ల తృప్తిని పొందుతాడు.

ఇక అక్కడి నుండి ధాతువులు (వాత, పిత్త, శ్లేష్మాలు) కలిగి, సూక్ష్మ జీవులతో నిండిన మలమూత్రాదుల గోతులలో తిరుగుతూ, క్రిములు పాకి భాద పెటుతుంటే మూర్చలో మునిగిపోతాడు. తల్లి తిన్న కారం, చెడు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రమైన రసాలతో బాధపడుతున్న శరీరావయవాలు కలవాడై మావితో కప్పబడి, బయటకు ప్రేగులతో కప్పబడి, మాతృగర్భంలో శిరస్సు వంచుకుని, వంగి పడుకుని ఉంటాడు. తన అవయవాలు కదల్ప లేక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఉంటాడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో పూర్వ జన్మలలో చేసిన పాపాలను తలచుకుని దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ, కొంచే సుఖం కూడా లేకుండా ఉంటాడు.

ఏడవ నెలలో జ్ఞానం కలిగి, కదలికలు ప్రారంభమై, మలంలోని క్రిములతో కలసి ఒక్క దిక్కున ఉండకుండా, గర్భంలో సంచరిస్తూ, ప్రసూతి వాయువులకు కంపించిపోతూ ఉంటాడు. అప్పుడు దేహాత్మ దర్శనం కలిగి, తిరిగి గర్భవాస దుఃఖానికి చింతిస్తూ, బంధవ రూపములైన సప్త ధాతువులతో బద్ధుడై, రెండు చేతులు జోడించి, దీనవదనుడై, జీవుడు తాను ఎవ్వనిచే గర్భవాసవ క్లేశాన్ని అనుభవించడానికి నియమించా బడ్డాడో ఆ సర్వేశ్వరుడిని స్తుతిస్తాడు.  ఇలా స్తుతిస్తూ, స్వచ్చమైన జ్ఞానం కలవాడిన జీవుడు గర్భం నుండి బయటకు రాకుండా తొమ్మిది మాసాలు గడుపుతాడు. ఆ తరువాత పదవ మాసం రాగానే జీవుడు అధోముఖుడై ఉచ్చ్వాస నిస్శ్వాసాలు లేకుండా దుఃఖంతో బాధపడుతూ, జ్ఞానాన్ని కోల్పోయి, రక్తసిక్తమైన శరీరంతో క్రిమిలాగా నేలమీద పడి ఏడుస్తూ జ్ఞానహీనుడై జడుడి లాగా అయిపోతాడు. తన భావాన్ని అర్థం చేసుకోలేని ఇతరుల వల్ల పెంచబడుతూ, తన కోరికలను చెప్పుకోలేక, అనేక పురుగులతో కూడిన ఒక పక్కమీద పడుకుంటాడు. అవయవాలలలో ఎక్కడ దురద వేసినా గోక్కోలేక, కూర్చోలేక, లేవలేక, నడవలేక, ఓపిక చాలక, జనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రకారం శైశవంలో ఆ అనుభవాలను పొందుతూ పెరుగుతుంటాడు జీవుడు.

సప్త ద్వీపాల, సప్త సముద్రాల ఆవిర్భావం

స్వాయంభవ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, బ్రహ్మ ఆదేశానుసారం, తనకు మనస్సులో తపస్సు చేయాలని కోరిక ఉన్నప్పటికీ, రాజ్యాపలన చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా సుఖంగా రాజ్యపాలన చేస్తూ, విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల సంతానం-పదిమంది కొడుకులను, ఒక కూతురును పొందాడు. రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో ఒకనాడు, సూర్యుడు మేరుపర్వతానికి ఒకవైపున చీకటి కలిపించే సందర్భంలో, ఆ చీకటిని పోగొట్టడానికి, సూర్యుడి రథంతో సమానమైన వేగం, తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి, రాత్రులను పగలుగా చేస్తానని ఏడురోజులపాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు. రథ చక్రం తాకిడికి భూమ్మీద గోతులు ఏర్పడ్డాయి. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ఏడు దీపాలయ్యాయి. మేరుపర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కాబట్టి సముద్రాలు, ద్వీపాలి సప్త సంఖ్యలో వచ్చాయి.

ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి కలది. అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందుదాని కంటే తరువాతది రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక సప్త సముద్రాలు ఇవి: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేటి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తల లాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసి పోకుండా, సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడడం చూసి, సకల జీవులూ విస్తుపోయాయి.

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment