Saturday, September 12, 2020

నారాయణ నామ స్మరణతో ముక్తి పొందిన అజామిళుడు .... శ్రీ మహాభాగవత కథ-33 : వనం జ్వాలా నరసింహారావు

 నారాయణ నామ స్మరణతో ముక్తి పొందిన అజామిళుడు

శ్రీ మహాభాగవత కథ-33

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         పూర్వం కన్యాకుబ్జపురంలో అజామిళుడు అనే పాపాత్ముడైన బ్రాహ్మణుడు ఒక దాసీదాన్ని భార్యగా చేసుకుని పదిమంది కొడుకులను కన్నాడు. కొంతకాలానికి ముసలివాడయ్యాడు. నల్లవెంట్రుకలు తెల్లబడ్దాయి. శరీర అవయవాలు పట్టుతప్పాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా సంసారం మీద భ్రాంతి మాత్రం పోలేదు. అతడి చిన్నకొడుకు పేరు నారాయణ. వాడంటే అజామిళుడికి చాలా ఇష్టం. అతడికి మృత్యువు సమీపించింది. ఇంతలో ముగ్గురు యమకింకరులు అతడిని తీసుకుపోవడానికి వచ్చారు.

వారు అజామిళుడికి కనిపించగానే పుత్రభ్రాంతితో ’నారాయణా! నారాయణా! నారాయణా’ అంటూ తన కొడుకును పిలిచాడు. అది వినగానే ఆ పరిసరాలలో వున్న విష్ణుదూతలు అక్కడికి హుటాహుటిన వచ్చారు. అజామిళుడి ప్రాణాలను లాక్కుంటున్న యమకింకరులను బలవంతంగా తోసేశారు. విష్ణుదూతలకు, యమకింకరులకు వాగ్వివాదం అయింది. అతడెలా దండించతగినవాడో చెప్పమని విష్ణుదూతలు ప్రశ్నించారు. అసలు దండనకు గురికావాల్సిన వారెవరు? కాతగని వారెవరు అనికూడా అడిగారు.    

         సమాధానంగా యమభటులు ఇలా చెప్పారు. "పాపపుణ్యాల నిర్ణయం జరిగి తదనుగుణంగా జీవులు శిక్షించబడుతారు. ఈ జన్మలో చేసిన పుణ్యం, పాపం ఆధారంగా వాటి ఫలాన్ని అనుభవించాలి జీవుడు. ఈ అజామిళుడు పూర్వజన్మ సుకృతంవల్ల ఈ జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించాడు. సకల వేదాలను చదివాడు. ఎప్పుడూ సత్యాన్నే పాటించాడు. మంచి గుణాలు కలవాడు. ఇంతలో యవ్వనం వచ్చింది. యవ్వన గర్వం పొడసూపింది. మీసాలొచ్చాయి. అధిక తేజస్సుతో ప్రకాశించాడప్పుడు. ఒకనాడు వనానికి పోయి తిరిగి వస్తున్నప్పుడు, ఒక పొదరింట్లో, ప్రియురాలితో ఆనందిస్తున్న విటుడి దృశ్యాన్ని చూశాడు. ఇద్దరినీ నిశితంగా గమనించాడు అజామిళుడు. మన్మథ ప్రేరేరిపుతుడై, చిత్తం పట్టు తప్పి, సాధు లక్షణాలను వదిలిపెట్టి, దానికి బానిసయ్యాడు. అందగత్తె అయిన భార్యను వదిలిపెట్టి, వెలయాలి ఇంట్లో కాపురం పెట్టాడు. ఆ వెలయాలి కృపతో జీవించసాగాడు. ఇలా చాలాకాలం అజామిళుడు ఆ దాసీదాని కుటుంబమే తన కుటుంబంగా భావించి దుష్టవర్తనుడై, పాపాత్ముడై మెలిగాడు. అందుకే చనిపోగానే ఇతడిని మేం తీసుకునిపోతున్నాం" అని అన్నారు యమభటులు.   

ఇలా పలికిన యమదూతలతో విష్ణుభటులు, "మీ అజ్ఞానం మాకు అర్థమైంది. అసలు విషయం తెలుసుకోండి. ఇతడు కోటి జన్మల పాపాన్ని ఈ జన్మలో పారద్రోలాడు. మరణకాలం సమీపించేసరికి శ్రీహరి పుణ్యనామాన్ని సంకీర్తన చేసిన అదృష్టం అతడికి కలిగింది. బ్రహ్మహత్యాది పాపాలను తీసేసేది కదా హరినామ సంకీర్తనలు! బ్రహ్మాది దేవతలను కాపాడేది కదా హరినామ సంకీర్తనలు! బిడ్డకు నారాయణ అని పేరుపెట్టుకుని పిలిచినప్పటికీ, ఇతడి హృదయం పుత్రుడిమీదనే లగ్నం అయిందని అనుకోవద్దు. శ్రీపతి పేరు ఎలా పలికినా శ్రీహరి అక్కడే వుంటాడు. ఏవిధంగా శ్రీహరిని తలచినా సమస్త కలుషాలు దూరమౌతాయి. ఆర్తితో శ్రీమహావిష్ణువును స్మరిస్తే చాలు, యమధర్మరాజు బాధలు అనుభవించరు. మరణం వచ్చినప్పుడు పూర్వజన్మ సుకృతం వుంటేనే, ఏదో విధంగా నారయణుడిని స్మరిస్తారు. శ్రీహరి నామస్మరణ ఇతడు ప్రత్యక్షంగా చేశాడు కాబట్టి మీరు తీసుకుపోకూడదు" అని అన్నారు. చేసేదేమీలేక యమధూతలు అజామిళుడిని యమపాశ బంధాల నుండి, మృత్యువు నుండి విడిచి పెట్టి, యమలోకానికి వెళ్లి జరిగినదంతా యమధర్మరాజుకు చెప్పారు. అజామిళుడు సంతోషంతో విష్ణుదూతలకు మొక్కాడు. వారు కూడా అదృశ్యమై వెళ్లి పోయారు.  

యమభటులు, విష్ణుదూతల మధ్య జరిగిన చర్చ విన్న తరువాత, వారు వెళ్లిపోయిన తరువాత, అజామిళుడి హృదయం సద్భక్తికి స్థానంగా నిలిచి క్షణమాత్రంలో జ్ఞానం వికసించింది. తాను చేసిన తప్పులను క్షమించమని శ్రీహరిని ప్రార్థించాడు. భార్యా బిడ్దలను, తల్లితండ్రులను వదిలిపెట్టినందుకు పశ్చాత్తాపం చెందాడు. తనలో తానే అనేకవిధాలుగా తర్కించుకుని అజామిళుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. చిత్తాన్ని జయించి, ఇంద్రియాలను లొంగతీసుకుని, వాయువును కూడా నిరోధించి, శ్రీహరి దర్శనానికి ప్రయత్నించాలి అనుకున్నాడు. భవబంధాలను విడిచిపెట్టాలని, అరిషడ్వర్గాలను జయించాలని, జనన మరణాలు అనే దుఃఖ సముద్రాన్ని దాటాలని నిశ్చయించుకున్నాడు. భాగవుతలతో స్నేహం చేశాడు. బంధుమిత్రులకు దూరంగా వెళ్లిపోయాడు. గంగాతీరానికి వెళ్లి అక్కడ ఒక దేవతా భవనంలో ఆసీనుడయ్యాడు. యోగమార్గాన్ని అనుసరించాడు. అప్పుడు తనను రక్షించిన దివ్యపురుషుల దర్శనం అయింది. వాళ్లకు మొక్కాడు. ఆనందంతో పొంగి పోయాడు. గంగాతీరంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. మరుక్షణమే విష్ణుసేవకులతో కూడి బంగారు విమానాన్ని ఎక్కాడు. వైకుంఠానికి వెళ్లాడు. ఇలా, అనేక పాపాలు చేసినప్పటికీ, అంత్యకాలంలో ’నారాయణా!’ అని పిలిచినంత మాత్రాన ముక్తుడయ్యాడు. 

అజామిళుడిని మృత్యు బంధం నుండి విడిపించి, యమలోకానికి వెళ్లి జరిగినదంతా ఆయన భటులు యమధర్మరాజుకు వివరించాక, విష్ణుదూతలు ఆయన ఆజ్ఞ జవదాటవచ్చా అని తమ రాజును అడిగారు. ఆయనకంటే కూడా గొప్పవారు వున్నారా? అని ప్రశ్నించారు.

జవాబుగా యమధర్మరాజు, "నాకంటే అన్యుడైన ఘనుడు ఒకడున్నాడు. అతడు బయటకు కనపడకుండా విశ్వమంతా లీనమై సమగ్రస్ఫూర్తితో మహాద్భుతంగా వుంటాడు. అతడి ఆజ్ఞానుసారం జీవులు బంధించబడి ప్రవర్తిస్తూ వుంటారు. అతడినే నేనూ నిత్యం జపిస్తాను, స్మరిస్తాను, భజిస్తాను. నేను, మహేంద్రుడు, వరుణుడు, అగ్ని, నైఋతి, వాయుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, మరుత్తులు, మహేశ్వరుడు, రుద్రవర్గం, సిద్ధులు.....అందరం కూడి కూడా ఆయన స్వరూపాన్ని కనుగొనజాలం. పరమేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడు. ఆయన భగవంతుడు, భక్తలోకపాలకుడు. లెక్కలేనంత మంది విష్ణుదూతలు కేశవుడిని స్మరించే వారిని రక్షించడానికి అన్ని చోట్లా చరిస్తూ వుంటారు. ఎవరు కూడా భగవ్త్ తత్త్వాన్ని గుర్తించలేరు. మహాద్భుతమైన వైష్ణవ జ్ఞానాన్ని, భాగవత ధర్మాన్ని బహుశా, శివుడు, బ్రహ్మ, కార్తికేయుడు, కపిల మహర్షి, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, శుక మహర్షి, వేదవ్యాసుడు అనే పన్నెండు మంది తప్ప ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. కాబట్టి మీరు విష్ణు భక్తుల జోలికి వెళ్లవద్దు. భక్తి యోగమే ముక్తి యోగమని భావించేవారిని, వారికి సన్నిహితంగా మసలే వారిని మీరు కన్నెత్తి కూడా చూడవద్దు" అని చెప్పాడు.

         అప్పటి నుండి యమభటులు వైష్ణవ భక్తులను తేరిపార చూడడానికి కూడా భయపడుతారు. పరమ రహస్యమైన ఈ ఇతిహాసాన్ని పూర్వం విజ్ఞానవేత్త అయిన అగస్త్య మహర్షి శుక మహర్షికి చెప్పాడు.  

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment