Sunday, September 13, 2020

దక్షప్రజాపతి జననం, సకల జీవరాశుల సృష్టి .... శ్రీ మహాభాగవత కథ-34 : వనం జ్వాలా నరసింహారావు

 దక్షప్రజాపతి జననం, సకల జీవరాశుల సృష్టి

శ్రీ మహాభాగవత కథ-34

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

చంద్రుడు ఇచ్చిన మారిష అనే కన్యకను బ్రహ్మ అజ్ఞానుసారం ప్రచేతసులు విధివిధానంగా పెళ్లి చేసుకున్నారు. దక్షుడు దైవప్రేరితుడై, మారిష కడుపున, ప్రచేతసులకు పుత్రుడై జన్మించాడు. బ్రహ్మ ద్వారా ప్రజాసృష్టిని చేయడానికి నియమించబడ్దాడు. ఈ భూమ్మీద వున్న సకల జీవరాసులన్నీ దక్షుడి సంతానమే! దక్షప్రజాపతి జగత్తంతా తన సంతానంతో నింపి వేశాడు. ఆడపిల్లలను దక్షప్రజాపతి తన ఆత్మశక్తి వల్ల సృష్టించాడు. నరులను, దేవతలను, సర్పాలను, దానవులను, యక్షులను, పక్షులను, జలచరాలను, వృక్షాలను సృష్టించి శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు. ఇంత చేసినా ఆయనకు మనస్సులో ఆనందం కలగలేదు. సృష్టి చెయ్యాలనే సంకల్పాన్ని విరమించాడు. పరాత్మను ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చాడు. తపస్సు చేయడానికి వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అఘమర్షణం అనే తీర్థంలో ప్రవేశించాడు. అందులో ప్రతిరోజు స్నానం చేస్తూ, అతి ఘోరమైన తపస్సు చేసి, శ్రీహరిని ప్రత్యక్షం చేసుకుని, ’హంసగుహ్యం’ (సప్తరాజం) అనే స్తోత్రంతో స్తుతించాడు.

         కుండలముల కాంతి అతిశయించిన బహు భూషణాలతో, మోహన స్వరూపంతో ప్రత్యక్షమైన సర్వేశ్వరుడు ప్రసన్నుడై, దక్షప్రజాపతిని మెచ్చుకున్నానని, ఆయన తపస్సు ఫలించిందని, తన వరాలను అందుకోవడానికి ఆయన అర్హుడని అంటూ తపస్సు చాలించమని ఆదేశించాడు. సృష్టి చెయ్యాలనే కోరికతో దక్షప్రజాపతి తపస్సు చేసినందున తన మనస్సులోని కోరిక ఆ విధంగా నెరవేరిందని శ్రీహరి అన్నాడు. బ్రహ్మ, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు....ఇలా వీరంతా తన నుండి పుట్టినవారే అనీ, ఈ జగత్తు పుట్టడానికి పూర్వం తనొక్కడే ఉండేవాడిననీ, తన నుండి బ్రహ్మాండం, అయోనిజుడు, స్వయంభువు అయిన బ్రహ్మ ఉదయించాడనీ, బ్రహ్మ కృతార్థుడు కానందున అతడిని తపస్సు చేయమన్నాననీ, తపస్సు అనంతరం సృష్టి కర్తృత్వాన్ని వహించి అందరినీ సృజించాడనీ చెప్పాడు శ్రీహరి. పంచజనుడు అనే ప్రజాపతి కూతురైన ’అసిక్ని’ అనే కన్యను ఇస్తున్నానని, ఆమెను భార్యగా గ్రహించి దక్షప్రజాపతి ప్రజాసర్గాన్ని బహుళంగా విస్తారిస్తాడని చెప్పి అంతర్థానమయ్యాడు. ఆయన చెప్పినట్లే చేసి అసిక్ని వల్ల దక్షప్రజాపతి పదివేల మంది పుత్రులను కన్నాడు. వారంతా తండ్రి ఆజ్ఞ ప్రకారం సృష్టించే నిమిత్తం, నారాయణ సరస్సు దగ్గర ఉగ్ర తపస్సు చేస్తున్నప్పుడు వారి దగ్గరకు నారదుడు వచ్చాడు. 

          దక్షప్రజాపతి పుత్రులను ఉద్దేశించి "మీరు మీ భవిష్యత్ తెలియని మూఢులలాగా కనిపిస్తున్నారు. మీరు పసిబిడ్డల్లాగా వున్నారు. ప్రజలను పుట్టించడానికి మీకున్న సామర్థ్యం ఏమిటి? మిమ్మల్ని చూస్తుంటే మీరు కేవలం తండ్రి మాట కొనసాగించాలనే అజ్ఞానుల్లాగా మాత్రమే వున్నారు. ముందు మీరు ఆత్మస్వరూపుడైన పురుషుడిని, బహురూపాలు కల ప్రకృతిని గురించి తెలుసుకోవాలి" అని అన్నాడు నారదుడు. ఇది విన్న వారు తమలో తామే తర్కించుకున్నారు. ముందుగా క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో తెలుసుకోవాలనీ, ఈ లోకాలన్నింటికీ మూలకారకుడు ఎవరో కనుక్కోవాలనీ, ఆయనే సృష్టికి స్వామి అనీ, అతడిని గురించి తెలుసుకోకుండా ఏం చేసినా ముక్తి లేదనీ నిర్ణయించుకున్నారు. ఈ సృష్టి చేయాల్సిన బాధ్యతను బ్రహ్మ తమ తండ్రికి అప్పగించాడని, అది చెయ్యడం ఇష్టం లేక తండ్రి తమకు అప్ప చెప్పాడని, ఘోరమైన ప్రవృత్తి మార్గం ఇష్టం లేకనే తండ్రి అలా చేశాడని వాళ్లు అనుకుని నారదముని చెప్పినట్లు చేశారు. వెనక్కు తిరిగిరాని మోక్షమార్గాన్ని అవలంభించారు. నారదుడు వెళ్లిపోయి దక్షప్రజాపతిని కలుసుకుని, ఆయన కొడుకులు నివృత్తి మార్గమైన మహాపథంలోకి వెల్లిపోయారని చెప్పాడు.  

నారదుడి మాటలకు శోకం తెచ్చుకున్న దక్షప్రజాపతికి బ్రహ్మ వచ్చి ధైర్యం చెప్పాడు. మళ్లీ పుత్రులను కనమని చెప్పగా, అతడి భార్య అసిక్ని వేలాదిమంది కొడుకులను కన్నది. పుణ్యమూర్తులైన వారినే శబలాశ్వులు అంటారు. తండ్రి మనస్సులోని భావాన్ని గ్రహించిన శబలాశ్వులు ప్రజలను సృష్టించాలన్న పట్టుదలతో బాలురుగా వుండగానే తపస్సు చేయడానికి నారాయణ సరోవరానికి వెళ్లారు. శ్రీహరిని గురించి భయంకరమైన తపస్సు చేశారు. వారిదగ్గరికి నారదుడు వచ్చి, పూర్వం వారి అన్నలకు చెప్పినట్లే చెప్పాడు. అన్నలు వెళ్లిన మార్గంలోనే వెళ్లమని సలహా ఇచ్చాడు. వాళ్లు కూడా నారదుడి మాటలు విని సృష్టి చెయ్యాలనే వ్యామోహాన్ని విడిచి, అగ్రజులు వెళ్లిన మార్గంలోనే పోయారు.

తన కుమారులు ప్రజాసృష్టికి వ్యతిరేకంగా వెళ్లిపోయారని గ్రహించిన దక్షప్రజాపతి బాధపడి, దానికి కారణం నారదుడని తెలుసుకుని, ఆయన మీద ఆగ్రహం తెచ్చుకుని, ఆయన దగ్గరకు వెళ్లాడు. చిన్నపిల్లలైన తన కొడుకులను బిక్షుమార్గంలో పొమ్మని బోధించాడని, ఆ దుఃఖాన్ని తాను తట్టుకోలేనని అంటూ నారదుడిని దారుణమైన శాపాగ్నికి గురిచేస్తున్నానని పలికాడు. ఈ పాతకాన్ని చేసినందుకు నారదుడు భాగవతోత్తములలో లజ్జాహీనుడై, యశోహానిని పొంది చరిస్తాడని, ఇక ముందు ఆయన మిత్రభేదం పెడుతుంటాడని, నిరంతరం లోకాలు తిరిగే అతడికి ఏలోకం కూడా శాశ్వతమైన నివాసంగా వుండదని శాపం ఇచ్చాడు దక్షప్రజాపతి నారదుడికి. 

ఇలా చేసిన దక్షప్రజాపతి దుఃఖంతో వుండగా బ్రహ్మ వచ్చి ప్రజలను పుట్టించే ఉపాయం చెప్పాడు. బ్రహ్మ ఉపాయానికి అనుగుణంగా, దక్షప్రజాపతి భార్య అసిక్ని అరవై మంది కూతుళ్లను కన్నది. వారిలో పది మందిని ధర్ముడికి, పదముగ్గురిని కశ్యపుడికి, ఇరవై ఏడుగురిని చంద్రుడికి, ఇద్దరిద్దరిని (ఆరుగురు మొత్తం) భూతుడికి, ఆంగిరసుడికి, కృశాశ్వుడికి, చివరి నలుగురిని తార్క్ష్యుడికి ఇచ్చి వివాహం చేసాడు. వారు ముల్లోకాలను కడుపున మోసి కన్నారు. అలా పుట్టిన వారిలో, దుర్గాభిమానినులైన దేవతలు, దుర్గాల అధిష్టాన దేవతలు, విశ్వదేవతలు, సాధ్య గణాలు, మౌహుర్తికులు అనే దేవగణాలు, అష్ట వసువులు, నగరాలు, శింశుమారుడు, విశ్వకర్మ, చాక్షుషుడు అనే మనువు, విశ్వులు, సాధ్యులు, కోట్లాది రుద్రగణం, రుద్రపారిషదులు, ప్రేతలు, వినాయకులు, పితృగణాలు, పక్షులు, కీటకాలు, గరుత్మంతుడు, సూర్యుడి సారథి అనూరుడు, నాగులు మొదలైన వారు అనేకమంది పుట్టారు.

కశ్యప్రజాపతి పదముగ్గురి భార్యల సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి. అలా పుట్టినవారిలో, జలచరాలు, వ్యాఘ్రాలు, గోవులు, డేగలు, గద్దలు, అప్సరసలు, వృక్షాలు, సర్పాలు, రాక్షసులు, గంధర్వులు, దానవులు మొదలైన వారున్నారు. రాహు, కేతువులు కూడా అలా పుట్టినవారే! కశ్యపుడి భార్య పరమ భాగ్యవతి అయిన అదితి గర్భాన శ్రీమన్నారాయణుడు వామనుడిగా పుట్టాడు. ఆ అదితి పన్నెండు మంది ఆదిత్యులను కూడా కన్నది. ఆ సంతానం-సంతానానికి శ్రాద్ధదేవుడు అనే మనువు, యముడు, యమి, అశ్వినీదేవతలు, శనైశ్చరుడు, సావర్ణి అనే మనువు, చర్షణులు, విశ్వరూపుడు కలిగారు. చర్షణుడి మూలంగానే మానవజాతి శాశ్వతంగా భూలోకంలో వుండేట్లు బ్రహ్మదేవుడు కలిగించాడు. ఇలా దక్షుడు నారదుడిని శపించి ప్రజాసర్గం చేశాడు.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment