Sunday, September 6, 2020

శ్రీరాముడిది పూర్ణావతారం ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-24 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడిది పూర్ణావతారం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-24

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-09-2020)

"గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలుచేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి నారదుడిని.

(ప్రశ్నలు పదహారు. ఇది తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు  పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు జవాబుగా శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం. శ్రీరాముడి విషయమై  తన అభిప్రాయాన్ని దృఢపర్చుకోవడానికి, భగవద్విషయం ఉపదేశ రూపంగా గ్రహించేందుకు ఈ పదహారు ప్రశ్నలడిగాడు వాల్మీకి.

బాల్యంలోనే శ్రీరాముడు గుహుడులాంటి (నీచ) జాతివారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి "వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరకపోవడం-జనకాజ్ఞ జవదాటకపోవడం-పరశురాముడిని చంపకపోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వభూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీష శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం,చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం,రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది.విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా.ఇలానే రాముడు కాంతియుక్తుడనీ-భయంకరుడనీ పలుసందర్భాల్లో అర్థమవుతుంది).

ఇన్నిగుణాలున్నవాడు ఎవరైనా వుంటారా? ఇలాంటి విషమ ప్రశ్నలు వేసి తనను పరాభవిస్తున్నాడేమోనని నారదుడనుకోవచ్చునని భావించాడు వాల్మీకి. అందుకే మళ్లా అంటాడు-వాస్తవార్థం తెలుసుకోగోరి అడిగానే గాని పరీక్షించడానికి కాదని. శిష్యుడైన వాల్మీకికి తన గురువైన నారదుడి జ్ఞానం తెలిసినందునే అలా అడిగాడు."ఇలాంటి వాడెవరో వినాలని మిక్కిలి కుతూహలంగా వుంది ఓ ఉత్తమ మహర్షీ. ఇట్టి సత్పురుషుడిని గురించి తెలపగలిగింది త్రిలోకజ్ఞుడివైన-త్రికాలజ్ఞుడివైన నీవే గాని ఇతరులకు సాధ్యపడదు" అని అంటాడు  వాల్మీకి. జవాబుగా నారదుడు: "వాల్మీకీ నీ ప్రశ్నకు తగిన సమాధానం చెప్తాను. సావధానంతో విను" అంటాడు, భగవత్ గుణ వర్ణనానుభవం కలిగిందన్న సంతోషంతో.


(తాను ఏ విషయాన్ని బ్రహ్మ దగ్గర తెలుసుకుని వాల్మీకికి ఉపదేశించాలని వచ్చాడో, ఆవిషయాన్ని గురించే వాల్మీకి ప్రశ్నించినందువల్లా, శత కోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మవల్ల విన్నందువల్లా, తనకు తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్లా సులభంగా చెప్పొచ్చునని భావించాడు నారదుడు. రామగుణస్మరణమనే అమృత పానానికి అవకాశం లభించిందని సంతోషపడ్తాడు. అయితే తెలియని విషయాన్ని అడగకుండా తెలిసిన విషయమెందుకు అడిగాడు వాల్మీకి? శ్రీరాముడిని ఆయన ఎరుగునుకదా! అయోధ్య సమీపంలోనే, ఆయన రాజ్యంలోనే వాల్మీకి ఆశ్రమం వుందికదా? శ్రీరాముడిని గురించి వాల్మీకికీ తెలుసు-నారదుడికీ తెలుసు. మరి ప్రశ్న-జవాబు ఎందుకు? వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే, వాల్మీకి వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే, ఆ భగవంతుడు సగుణుడా, నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా, ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా, అనేకతత్వమా అని అడక్క గుణాలగురించే ఎందుకడిగాడు? అనుష్ఠానం ప్రధానంగాని, వాదం కాదు. మామిడిపండు తింటేనే తీపో-పులుపో తెలుస్తుంది. అనుష్ఠాన రూపకమైన భక్తి మార్గమే శ్రేష్ఠం. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే భగవత్ గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు).

ప్రశ్నకూ, జవాబుకూ పొంతనుండాలి. అడిగిందొకటైతే చెప్పేది ఇంకోటి కాకూడదు. శిష్యుడు ఒక విషయాన్ని ఏ అభిప్రాయంతో అడిగాడో తెలుసుకోలేక మరో రీతిలో గురువు సమాధానం చెప్తే అది సరైన పద్దతి కాదు. నారదుడు వాల్మీకి అభిప్రాయాన్ని గ్రహించి అతనికి కావల్సిన రీతిలోనే సమాధానం ఇస్తాడీవిధంగా: "ముని శ్రేష్ఠా, నీవు శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తిగలవారెవరో చెప్తా, శ్రద్ధగా విను. ఏ వంశంలోనైతే-ఏ ఇంటిలోనైతే, నిత్యం భగవంతుడు ఆరాధించబడుతున్నాడో, అట్టి ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, ’రామా రామా రామా’, అని లోకులు పొగిడే రామచంద్రమూర్తి అనే పేరుగలాయన జన్మించాడు. అతివీర్యవంతుడాయన. అసమానమైన-వివిధమైన-విచిత్రమైన శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయంలేని ఆనందంగలవాడు. ఇంద్రియాలను-సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు. ఎత్తైన మూపురాలున్నవాడు. బలిసిన చెక్కిళ్లవాడు."

ఇంకా ఇలా చెప్తాడు నారదుడు శ్రీరాముడిని గురించి: "శంఖంలాగా మూడు రేఖలున్న కంఠముందాయనకు. విశాలమైన వక్షస్థలమున్నవాడు. గొప్పదైన విల్లు ధరిస్తాడు. ఆశ్రిత పాపాలనే శత్రు సమూహాలకు ప్రళయకాల యముడిలాంటి వాడు. యుద్ధంలో భయంకరుడు. శ్రీరామచంద్రమూర్తి చేతులు మోకాళ్లకు తగిలేంత పొడుగ్గా వుంటాయి. అందమైన వక్షం, అసమాన సౌందర్యమున్న నొసలు, చూసేవారిని మైమరిపించే నడక గలవాడు. అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలున్నాయి. ప్రకాశించే దేహ కాంతి, భయంకరమైన శత్రువులకు సహించలేని ప్రతాపం, మనోహరమై-బలిసిన మంచి వక్షం వున్నవాడు. కీర్తించదగిన నిడివి, వెడల్పాటి కళ్లు, ఎదుటివారు మెచ్చుకునే వేషం, శ్లాఘ్యమైన శుభ చిహ్నాలు, శుభం కలిగించే ఆకారం, మంచిగుణాల మనోహరుడాయన.

(కనుబొమలు, ముక్కు పుటాలు, కళ్లు, చెవులు, పెదాలు, చను ముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్లు, పిక్కలు, ఎవరికి సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో వుంది. జంట-జంటగా వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ రాముడికున్నాయని భావన.)

No comments:

Post a Comment