Thursday, September 24, 2020

సూర్యవంశారంభం, వైవస్వత మనువంశ క్రమం ..... శ్రీ మహాభాగవత కథ-45 : వనం జ్వాలా నరసింహారావు

 సూర్యవంశారంభం, వైవస్వత మనువంశ క్రమం

 శ్రీ మహాభాగవత కథ-45

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

సత్యవ్రతుడు విష్ణువును ఆరాధించి తత్త్వజ్ఞానాన్ని పొంది, సూర్యదేవుడికి వైవస్వతుడు అనే పేరుతో జన్మించాడు. అతడికి ఇక్ష్వాకుడు మొదలైన పదిమంది కుమారులు పుట్టారు. వారే సూర్యవంశపు రాజులుగా వర్ధిల్లారు. దీనికి పూర్వరంగంలో, కల్పాంతకాలంలో ప్రాకృతప్రళయం సంభవించిన తరువాత, ఆదిమూలమైన విశ్వపురుషుడు, మహాపురుషుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడి బొడ్డు నడుమ నుండి ఒక పద్మం పుట్టుకొచ్చింది. దాని కోశం నుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ మనస్సులో సంకల్పించగా మరీచి కలిగాడు. ఆయనకు కశ్యప ప్రజాపతి జన్మించాడు. అతడికీ, దక్ష ప్రజాపతి కుమార్తె అదితికీ సూర్యుడు కుమారుడుగా జన్మించాడు. ఆ సూర్యుడి భార్య సంజ్ఞ. ఆ దంపతులిద్దరికీ శ్రాద్ధదేవుడనే మనువు పుట్టాడు. అతడికి శ్రద్ధ అనే భార్యవల్ల ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడు, నరిష్యంతుడు, పృషద్ధ్రుడు, నభగుడు, కలి అనే పదిమంది కీర్తిమంతులైన కుమారులు కలిగారు.

వీరు పుట్టడానికి ముందు కొడుకులకోసం మనువు మిత్రావరుణులను గూర్చి యజ్ఞం చేశాడు. ఆయన భార్య కూతురు కావాలని కోరుకున్నందున వారికి ఇళ అనే ఆడపిల్ల పుట్టింది. కొడుకు కోసం మనువు వశిష్టుడి దగ్గరికి వెళ్లాడు. అప్పుడు వశిష్టుడు తన శక్తిని ఉపయోగించి అతడికి కుమారుడు కలిగేట్లు చేస్తానన్నాడు. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మనువుకు ఇళగా పుట్టిన కన్యను కుమారుడిగా మార్చి సుద్యుమ్నుడు అని పేరుపెట్టాడు. అతడే రాజ్యం చేస్తూ వచ్చాడు. ఒకనాడు అతడు వేటకు వెళ్లి, మృగాలను వేటాడుతూ, పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ రాసక్రీడలో మునిగితేలుతూ వుండే మేరు పర్వత సమీపంలోని కుమారవనంలోకి ప్రవేశించాడు. వెంటనే ఆ రాజుకు, ఆయన అనుచరులకు, చివరకు ఆయన గుర్రానికి, స్త్రీ రూపం వచ్చింది. రాకుమార్తె ఆకారంలో చెలికత్తెలతో అతడు సంచరిస్తూ బుధుడి ఆశ్రమానికి చేరారు. భగవత్సరూపుడైన బుధుడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు సంతాపంతో స్త్రీరూపంలో వున్న సుద్యుమ్నుడు వశిష్టుడిని తలచుకోవడంతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన శివుడిని ప్రార్థించగా అతడు ప్రసన్నమై, సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీగానూ, ఒక నెల పురుషుడుగానూ వుంటూ రాజ్యాన్ని పాలిస్తాడని చెప్పాడు.       

సుద్యుమ్నుడు వశిష్టుడి దయతో స్త్రీగా నెల, పురుషుడుగా నెల వుంటూ, రాజ్యపాలన చేయసాగాడు. అతడికి ముగ్గురు కొడుకులు కలిగారు. సుద్యుమ్నుడు వృద్ధుడుకాగానే రాజ్యాన్ని బుధుడి వల్ల కలిగిన పురూరవుడికి అప్పచెప్పి అడవులకు పోయాడు. కొడుకు అడవులకు పోవడంతో వైవస్వత మనువైన శ్రాద్ధదేవుడు దిగులు పడి శ్రీహరిని గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక్ష్వాకుడు మొదలైన పదిమంది కుమారులు కలిగేట్లు భగవంతుడు మనువును అనుగ్రహించాడు. వారిలో పృషద్ధ్రుడనే కొడుకు శాపవశాన దారీతెన్నూ అంటూ లేకుండా భూములు పట్టి తిరుగుతూ, అడవిలోకి వెళ్లి, కార్చిచ్చుకు ఆహుతై పోయి, హరిమీద భక్తి కలావాడైనందున, చివరకు బ్రహ్మత్వాన్ని పొందాడు. చివరి కొడుకైన కవి పరాత్పరుడి ధ్యానంలో మునిగి మోక్ష సిద్ధిని పొందాడు. కరూశుడి సంతతి కారూశులనే క్షత్రియులుగా ఉత్తరాపథానికి ప్రభువులయ్యారు. ధృష్టుడి వల్ల ధార్ష అనే వంశం ఏర్పడి, బ్రాహ్మణత్వం నెలకొన్నది. ఇలా ఒక్కొక్క కొడుకు వశం అభివృద్ధి చెందింది.

మనువు మరో కుమారుడు దిష్టుడికి నాభాగుడు జన్మించాడు. అతడికి వైశ్యత్వం ప్రాప్తించింది. అతడి వంశంలో పన్నెండవ తరంలో జన్మించిన మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతడు చేసిన ఒకానొక మహాయాగానికి సాక్షాత్తూ అంగిరసుడి కుమారుడు, మహాయోగి అయిన సంవర్తుడు యాజకత్వం వహించాడు. ఇంద్రుడు సోమపానం కావించి తృప్తిచెందాడు. మరుత్తుడి వంశక్రమంలో పదవ తరంలో తృణబిందుడు జన్మించాడు. అతడిని అలంబన అనే అప్సరస వరించింది. వారికి ఇలబిల అనే కుమార్తె పుట్టింది. ఆమెను విశ్రవసుడు వివాహం చేసుకున్నాడు. వారికి కుబేరుడు జన్మించాడు. తృణబిందుడికి పుట్టిన ముగ్గురు కొడుకుల్లో విశాలుడు వైశాలి నగరాన్ని నిర్మించాడు. అతడి వంశీకులు వైషాలురు అని పిలవబడ్దారు.

మనువు మరో కొడుకు శర్యాతి. ఆయన తన కుమార్తె సుకన్యను చ్యవన మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ చ్యవన మహర్షి దేవ వైద్యులైన అశ్వినుల దయవల్ల వార్ధక్యం పోగొట్టుకుని సుందరమూర్తిగా అయ్యాడు. ఆయన్ను చూడడానికి వచ్చిన శర్యాతి అతడు తన అల్లుడేనా అని అనుమాన పడ్దాడు. ఆయన అనుమానాన్ని నివృత్తి చేసింది కూతురు సుకన్య. తరువాత చ్యవన మహర్షి భార్యా సమేతంగా మామగారి రాజధానికి వచ్చి ఆయనతో యాగం చేయించాడు. సోమరసాన్ని అశ్వినీ దేవతలకు అర్పించాడు. ఇది చూసి ఇంద్రుడికి కోపం వచ్చింది. మునిమీదికి వజ్రాయుధం ఎత్తడం, ముని దాన్ని ఆయన భుజంమీదే వుంచడం జరిగిపోయాయి. శర్యాతికి ఆనర్తుడితో సహా ముగ్గురు కొడుకులు కలిగారు.

ఆనర్తుడికి రైవతుడు, అతడికి రేవతి అనే కుమార్తె కలిగారు. ఆమె భర్త ఎవరో తెలుసుకోవాలని రైవతుడు కూతురును వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్లాడు ఒకనాడు. అదే ప్రశ్న బ్రహ్మకు వేశాడు. ఆయన నవ్వి, ఆమె కొరకు నిర్ణయించిన వారంతా కాలవశులై వెళ్లిపోయారని, రైవతుడు బ్రహ్మలోకానికి వచ్చేలోపల 27 పర్యాయాలు, 4 యుగాలు జరిగిపోయాయని అన్నాడు. సర్వ భూతాత్మకుడు, దేవదేవుడు అయిన హరి భూభారాన్ని తొలగించే నిమిత్తం బలదేవుడు అనే పేరుతో జన్మించాడని, కాబట్టి రేవతిని అతడికి ఇవ్వాలని సూచించాడు బ్రహ్మ. రైవతుడు అలాగే చేసి, తపస్సు చేసుకోవదానికి బదరికావనానికి వెళ్లిపోయాడు.

ఇదిలా వుండగా, వైవస్వత మనువు శ్రాద్ధదేవుడి మరో కొడుకు నభగుడు అనే రాజుకు నాభాగుడు అనే ఉత్తముడు జన్మించాడు. అతడికి జన్మించిన వాడే అంబరీషుడు.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment