Sunday, September 13, 2020

వాల్మీకి ప్రశ్న నారదుడు జవాబు అవతార మూర్తిని గురించే ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-25 : వనం జ్వాలా నరసింహారావు

 వాల్మీకి ప్రశ్న నారదుడు జవాబు అవతార మూర్తిని గురించే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-25

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (14-09-2020)

ఇలా ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహాన్ని గురించి చెప్పిన తర్వాత, నారదుడు ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలను చెప్పాడీవిధంగా: "శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు-క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడు-చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు-సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు-దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు-సర్వ విషయాలు తెలిసినవాడు-బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు-మిక్కిలి పరిశుద్ధుడు-ఋజుస్వభావం గలవాడు-ఆశ్రిత రక్షకుడు-ఆత్మతత్వం ఎరిగినవాడు-ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు-విష్ణువుతో సమానుడు-శ్రీమంతుడు-లోకాలను పాలించ సమర్థుడు-ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు-ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు-ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు-స్వధర్మ పరిపాలకుడు-స్వజనరక్షకుడు-వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు-కోదండ దీక్షాపరుడు-సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి-జ్ఞాపకశక్తిగలవాడు-విశేషప్రతిభగలవాడు-సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు-సాధువు-గంభీర ప్రకృతిగలవాడు-అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు-నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు-అందరిమీద సమానంగా వారి, వారి యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు-గొప్పగుణాలున్నవాడు-ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగా దర్శనమిచ్చేవాడు-సమస్తభూతకోటికి పూజ్యుడు-అన్నింటా గుణ శ్రేష్ఠుడు. ఆయనే శ్రీరామచంద్రుడు. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడు.

(రాముడు తండ్రి పేరు చెప్పలేనివాడని కానీ, అందుకే తల్లి పేరు చెపుతున్నాడే కవి అనిగానీ భావించరాదు. దశరథుడు నిష్కారణంగా శ్రీరాముడిని అడవులకు పంపాడు. కౌసల్య నవమీ వ్రతాలు చేసి రాముడిని కనింది. భర్త చనిపోయినప్పటికీ, పుత్ర వాత్సల్యం వల్ల జీవించి, శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసిన ధన్యురాలు. అట్టి ధన్యత దశరథుడికి కలగలేదు. పన్నెండు నెలలు శ్రీరామచంద్రుడిని గర్భంలో ధరించింది కౌసల్య. ప్రధమ ముఖ దర్శనం కూడా కౌసల్యదే. పాలు-నీళ్లు పోసి, ముద్దులాడిందీ కౌసల్యే. బాల క్రీడలు చూసి ఆనందించిన ధన్యత కౌసల్యకు కలిగింది. "కౌసల్యా సుప్రజ రామా" అని రాముడిని సంబోధించాడు విశ్వామిత్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖ దర్శనం మొదలు కలిగింది కౌసల్యకేగాని దశరథుడికి కాదు. దశరథ పుత్రుడంటే ఏ భార్యకు పుట్టిన ఏ కొడుకో అనుకోవచ్చు. కౌసల్యకు ఒక్కడే కొడుకు. శ్రీరాముడిని తన వెంట యాగ రక్షణకై పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు, పామరుడివలె అంగీకరించలేదు దశరథుడు. పుత్రుడి శ్రేయస్సు కోరి, కౌసల్య మారు మాట్లాడకుండా అంగీకరించిందే కాని, తన వళ్లో వుంచుకుని ముద్దులాడలేదు. అందుకే "కౌసల్యానంద వర్థనుడు" అని నారదుడు, "కౌసల్యా సుప్రజ రామా" అని విశ్వామిత్రుడు, "లోకచయభర్త శుభమతి యా కోసల తనయ గాంచె" అని సీతాదేవి చెప్పడం గమనించాలి. దశరథుడికంటే కౌసల్యే ప్రశంసనీయమైందని ఆమె పేరు చెప్పబడింది. కుశల భావమే కౌసల్యం).

"గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో హిమవత్పర్వత సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు. కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో కుబేరుడు. అసమాన సత్యసంధుడు. ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య రాజని తలచొద్దు".

(వాల్మీకి అడిగిన ప్రశ్నల్లో, నారదుడిచ్చిన సమాధానంలో, విశేషణాలన్నీ భగవంతుడికే అన్వయించి చెప్పి, రామాయణాన్ని పెద్ద వేదాంత గ్రంథం చేసారని ఆక్షేపించవచ్చు. ఆ గుణాలన్నీ ఉత్తమపురుషులకు కూడా వుండొచ్చునని అనవచ్చు. శ్రీమద్రామాయణం ధ్వనికావ్యమని అర్థం చేసుకోవాలి. అదో గూఢార్థగుంభితం. వ్యర్థ పదాలు, వ్యర్థ విశేషణాలు అసలే కనపడవు. రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి యదార్థ జ్ఞానం కలగదు. వాస్తవానికి నారదమంటే మేఘమని అర్థం. మేఘం నీళ్లిస్తుంది. నిప్పులు కురిపించదు. నారదుడంటే జ్ఞానదాత. జ్ఞానదాత చేయాల్సింది జ్ఞానముపదేశించడమో, మోక్ష విషయం చెప్పడమో అయ్యుండాలి. నారదుడు నారాయణుడి వద్ద భాగవతాన్ని విని, పాంచరాత్ర ఆగమం ఏర్పరిచాడు. అందుకే దాన్ని "నారద పాంచరాత్రం" అంటారు. ఇదే సాత్త్వతశాస్త్రం. వాల్మీకికి ఉపదేశించిదిదే. ఆ ఉపదేశంతో వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. ఋషీశ్వరులు సంభాషించుకొనేటప్పుడు లౌకిక ప్రసంగాలు చేయరు. కాబట్టే వాల్మీకి ప్రశ్నించింది అవతార మూర్తి గురించే-నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని గురించే).



"ఇటువంటి సుగుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తిని, జ్యేష్ఠ కుమారుడిని, మహాపరాక్రమశాలిని, సామగుణసంపదగలవాడిని, తనకు-ప్రజలకు ప్రియుడైన వాడిని, భూజనుల క్షేమం కోరి ప్రవర్తించేవాడిని దశరథ మహారాజు తన మంత్రుల అభీష్టం నెరవేర్చేందుకు, యువరాజును చేయాలని మనస్సులో అనుకుని, పట్టాభిషేకానికి కావలసిన ప్రయత్నం చేయసాగాడు. దశరథుడి భార్య కైకేయి ఆ ప్రయత్నాలకు అడ్డుపడింది. పూర్వం తనకిచ్చిన రెండు వరాలను నెరవేర్చమని కోరింది భర్తను. మొదటిది శ్రీరామచంద్రమూర్తిని అరణ్యాలకు పంపడం, రెండోది తన కొడుకైన భరతుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయడం.  రాముడికంటే సత్యం మీదే ప్రీతిగలవాడైన దశరథుడు తన ప్రియ కుమారుడు శ్రీరాముడిని అడవులకు పంపాడు. రాజ్యపాలన శక్తి, తండ్రిని ధిక్కరించి రాజ్యాన్ని గ్రహించే శక్తీ గల వీరుడైన రాముడు, కైకకు సంతోషాన్నిచ్చే జనకుడి ఆజ్ఞ నెరవేర్చేందుకు అరణ్యాలకు పోయాడు. అలా అడవులకు పోదలచిన శ్రీరాముడిని చూసి, ఆయనపై స్నేహభావంగల చిన్న తమ్ముడు, వినయ సంపన్నుడు, అన్న ప్రీతికి పాత్రుడు, దశరథుడి రెండో భార్య సుమిత్రా దేవి కొడుకైన లక్ష్మణుడు, పెద్దన్నగారి సేవ చేద్దామన్న కారణంతో ఆయన వెంట పోయాడు అడవులకు. శ్రీరామచంద్రమూర్తికి ప్రాణ సమానురాలైన ఇల్లాలు, మనోహర గుణవంతురాలు, స్వభావంచేతనే వినయ గుణాలు కలది, హిత బోధయందు ఆసక్తిగలది, జనక మహారాజు కూతురు, దేవమాయలా అయోనిజగా జన్మించినది, మంచి గుణాల కూడలి, లోకమంతా పొగిడే నడవడిగలిగిన పవిత్రురాలు, సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉత్తమస్త్రీలకుండాల్సిన శుభ లక్షణాలన్నీ వున్న దశరథ మహారాజు కోడలు, ఉత్తమ స్త్రీ సీతాదేవి, చంద్రుడిని రోహిణి ఏ ప్రకారం ఎల్లవేళలా అనుసరించి పోతుందో, అలానే నిండారు ప్రేమతో, తన భర్త వెంట పోయింది అడవులకు".

నారదుడు చెప్పడం కొనసాగిస్తూ ఇలా అంటాడు: "సీతా లక్ష్మణుల లాగానే, పురజనులుకూడా రాముడిని వెంబడించారు. రాముడిని విడిచిపెట్టలేక, సహించలేని వియోగ తాపంతో, తపించిన అయోధ్య వాసులు శ్రీరామచంద్రుడు రావద్దని వారిస్తున్నా వినకుండా, ఆయన వెంటబడి చాలాదూరం పోయారు. తండ్రికూడా కొంతదూరం పోయాడు. ధర్మ బుద్ధిపై అత్యంత ఆసక్తి వున్న రాముడు గంగానదీ తీరం దగ్గరున్న శృంగిబేరపురం చేరాడు. అక్కడున్న ఆత్మ మిత్రుడు-గుహుడు, అనే బోయ నాయకుడిని చూసి, సారథి సుమంత్రుడిని అయోధ్యకు పొమ్మంటాడు రాముడు. ఆతర్వాత గుహుడు ఆ ముగ్గురినీ గంగ దాటిస్తాడు".

 

No comments:

Post a Comment