Sunday, September 20, 2020

గజేంద్ర మోక్షం .... శ్రీ మహాభాగవత కథ-41 : వనం జ్వాలా నరసింహారావు

 గజేంద్ర మోక్షం

శ్రీ మహాభాగవత కథ-41

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

క్షీరసాగరంలో త్రికూటం అనే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద అనేక రకాల, వృక్షాలు, లతలు, తీగెలు ఉన్నాయి. దాని దగ్గరున్న అరణ్యంలో భయంకరంగా ఉండే మట్టగజాలు దిగ్గజాలను మించి ఉన్నాయి. అవి భయంకరంగా విహరిస్తుంటే వాటిని చూసి అడవి జంతువులన్నీ పారిపోతాయి. అల అఒకనాడు అవి స్వైర విహారం చేస్తున్నాయి. ఆ సమయంలో ఆ ఏనుగుల గుంపు ముందుకు సాగిపోతుంటే, ఆ సమూహంలోనే ఉన్న గజనాథుడు వెనుకబడ్డాడు. దాని భార్యలైన ఏనుగులు మాత్రం దాని పక్కనే కనిపెట్టుకుని అనుసరిస్తున్నాయి. అలా వెళ్తుంటే ఆ గజరాజుకు ఒక పెద్ద కొలను కనిపించింది. తన్మయత్వంతో ఆహ్లాదకరమైన ఆ కొలనులోకి ఏనుగుల సమూహం ప్రవేశించాయి. అందులో గజరాజు ఆనందంగా ఈదులాడాడు.

అప్పుడు ఆ గజరాజును ఆ మడుగులో దాగివున్న ఒక మొసలి చూసింది. సరస్సు నుండి కుప్పించి ఒక్క ఎగురు ఎగిరి, మకరరాజు కరిరాజును పట్టుకుంది. గజరాజు దాని పట్టు విడిపించుకోవడానికి పోరాడాడు. మొసలి ఏనుగును నీళ్లలోకి లాగుతుంటే, ఏనుగు మొసలిని గట్టుమీదికి లాగింది. దాన్ని వర్ణిస్తూ పోతన గారు ఇలా రాశాడు:

కం:      కరి దిగుచు మకరి సరసికి, గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

గరికి మకరి మకరికి గరి, భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్      

         ఇలా కరి, మకరి భీకరంగా పోరాడుతుంటే, నీళ్లలో జీవించే మొసలికి సహజంగా బలం, పట్టుదల అంతకంతకూ పెరిగసాగాయి. గజరాజు బలం క్షీణించసాగింది. మొసలి ఏనుగు కుంభస్థలం మీదికి దూకింది. కంఠాన్ని, వెన్నునూ గాయపరచింది. అలా గజేంద్రుడిని రకరకాల భాదించింది. అయినా అలసిపోకుండా, వెనుకంజ వేయకుండా, గజరాజు తన పరాక్రమంతో వేయి సంవత్సరాల కాలం ఆ మొసలితో పోరాడింది. చివరకు ఓపిక క్షీణించడంతో, దాన్ని గెలవడానికి తన శక్తి చాలదని నిర్ణయించుకున్నాడు. లోకాల సృష్టికి, సంరక్షణకు, లయం కావడానికి, మూలకారకుడైన ఆ పరమేశ్వరుడిని శరణు వేడుతానని అనుకుంది.

ఆ భావనను, ఆలోచనను, పోతన మహాకవి ఇలా పద్యరూపంలో వర్ణించాడు;

ఉ:       ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై

యెవ్వని యందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం

బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా

డెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ 

         కర్మ, గుణ, భేదాలు లేని ఆ పరమేశ్వరుడిని అనేక విధాల ప్రార్థించిందా ఏనుగు. చివరకు ఒక సందర్భంలో ఇలా అనుకుంది: దీనులపాలిట ఉంటాడు ఆ భగవంతుడు అని అంటారు. పరమయోగీశ్వరులైన వారి చెంతనే ఉంటారని చెప్పుతారు. అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనే ఆ భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహిస్తాడు గజరాజు. ఉంటే తన మీద ఎందుకు దయచ్ప్పాడు, ఎందుకు వేగంగా రాడు  అనుకుంటాడు. చివరకు దీనంగా  ప్రార్థిస్తూ, భగవంతుడు తప్ప తనకు ఎవ్వరూ లేరనీ, నిస్సహాయ స్థితిలో ఉన్న తనను మన్నించి కాపాడమనీ, రమ్మనీ పిలుస్తాడు. ఈ సందర్భంలో పోతన రాసిన రెండు పద్యాలు ఆబాలగోపాలానికి చిరపరిచయమైనవే!

ఆ రెండు పద్యాలు:

కం:      కల డందురు దీనుల యెడ, గల డందురు పరమయోగి గణముల పాలం

గల డందు రన్ని దిశలను, గలడు కలండనెడు వాడు గలడో లేడో!

శా:      లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;

రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!   

అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న విష్ణుమూర్తి గజరాజును కాపాడాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో విష్ణువు ఎలా వైకుంఠపురంలో ఉన్నాడు, ఎలా లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు, ‘పాహి పాహి’ అన్న గజేంద్రుడి మొర వినగానే ఎలా బయల్దేరిందీ, ఆయన వెనకాలే ఎలా లక్ష్మీదేవి, అంతఃపుర పరివారం, గరుత్ముంతుడు, వైకుంఠపురంలో ఉన్నవారందరూ వచ్చేసిందీ, అమోఘంగా మూడు పద్యాలలో వర్ణించారు పోతన కవి ఇలా:

మ:      అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

మ:      సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై

మ:      తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వె

న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ

క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వొచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలమున్

విష్ణువు మొసలిని ఖండించడానికి తన చక్రాయుధాన్ని పంపాడు. అది ఆ మొసలిని సమీపించింది. మొసలి తల నరికింది. ఏనుగు రక్షించబడగానే ఆడ ఏనుగులు గజరాజును జలాలతో అభిషేకించాయి. విష్ణువు ఏనుగును బయటకు తీసుకువచ్చి దాని దుఃఖం పోగొట్టాడు. అలా గజేంద్ర మోక్షం కలిగింది. మొసలికి శాపవిమోచనం కలిగి గంధర్వుడుగా మారి, హరికి మొక్కి, తనలోకానికి చేరుకున్నాడు. అనంతరం శ్రీహరి తన చేత్తో ఒక్కసారి స్పృశించేసరికి గజరాజు తన అజ్ఞానాన్ని పోగొట్టుకుని విష్ణురూపాన్ని పొందాడు. మొసలితో యుద్ధం చేసిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే రాజు. గొప్ప వైష్ణవ భక్తుడు. ఒకసారి ఆయన అచ్యుతుడిని మనస్సులో మౌనంగా ధ్యానిస్తూ అక్కడికి వచ్చిన అగస్త్య మహామునికి తగిన సపర్యలు చేయలేకపోయాడు. కోపంతో రాజును ఏనుగై పుట్టమని శపించాడు ముని.  

ఆ తరువాత విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి తన లోకానికి వెల్లి పోయాడు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్ష గాథను భక్తిగా వింటారో, చదువుతారో వారికి సకల శుభాలు కలుగుతాయని, ప్రాణం పోయే సమయంలో ఉత్తమ గతులను ప్రసాదిస్తాననీ విష్ణుమూర్తి అంటాడు.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

 

No comments:

Post a Comment