Monday, September 28, 2020

యయాతి-దేవయాని, దుష్యంత-శకుంతల, భరతుల వృత్తాంతం .... శ్రీ మహాభాగవత కథ-49 : వనం జ్వాలా నరసింహారావు

 యయాతి-దేవయాని, దుష్యంత-శకుంతల, భరతుల వృత్తాంతం  

 శ్రీ మహాభాగవత కథ-49

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

నహుషుడి కొడుకు యయాతి తండ్రి అనంతరం రాజై శుక్రుడి కుమార్తెను, వృషపర్వుడి కుమార్తెను వివాహమాడి భూచక్రాన్నంతటినీ పరిపాలించాడు. వివరాల్లోకి పోతే....

రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్ట ఒకనాడు తన చెలికత్తెలతో, గురువు (శుక్రాచార్యుడు) గారి కూతురు దేవయానితో, కలిసి ఉద్యానవనంలోని కొలనుకు వెళ్లింది. బట్టలు విప్పి కొలనులోకి దిగి ఉత్సాహంగా స్నానం ఆడసాగారు. అదే సమయంలో శివుడు, పార్వతీదేవి అక్కడికి రావడం జరిగింది. పరమేశ్వరుడిని చూసిన ఆ యువతులంతా సిగ్గుపడి తొందర-తొందరగా బట్టలు కట్టుకుంటుండగా, రాకుమారి శర్మిష్ట పొరపాటున గురువుగారి కూతురు దేవయాని బట్టలు ధరించింది. దానికి ఆక్షేపణ తెలియచేసిన దేవయాని, ’తెలిసి-తెలిసి దాసి అయిన శర్మిష్ట’ తన బట్టలు కట్టుకున్నదని, బ్రాహ్మణ కులంలో పుట్టిన తన బట్టలు రాక్షస కులంలో జన్మించిన పనికత్తె లాంటి ఆమె ఎలా కట్టుకుంటుందని దూషించింది. తనను తూలనాడుతున్న దేవయాని మీద కోపంతో, ఆమె అలా మాట్లాడినందుకు ప్రతిగా, శర్మిష్ట తన చెలికత్తెలతో దేవయానిని పట్టించి, బట్టలు కూడా ఇవ్వకుండా నూతిలోకి తోయించి రాచనగరుకు వెళ్లిపోయింది. అదే సమయంలో యయాతి అడవిలో వేటాడుతూ, దైవవశాత్తూ దేవయాని పడివున్న నూతి దగ్గరికి వచ్చాడు. నూతిలో దుఃఖిస్తున్న దేవయానిని చూశాడు.

దేవయానిని ఆ పరిస్థితిలో చూసిన యయాతి ఆమెకు తన చేయి అందించి, నూతి నుండి పైకిలాగాడు. తనను అలా పైకి లాగిన యయాతిని, అతడు తన చేయి పట్టుకున్నందున, ఆయనే తన భర్త అన్నది. ఇది దైవ సంకల్పం అన్నది. తాను శుక్రాచార్యుడి కుమార్తెనని, తన పేరు దేవయాని అని చెప్పింది. తాను బ్రాహ్మణుడిని వివాహమాడనని శాపం వున్నందున, యయాతే తనను పెళ్లిచేసుకోవాలని, ఆయనే తన ప్రాణనాథుడని అన్నది. సరే అని యయాతి ఆమెను వరించాడు. దేవయాని తండ్రికి శర్మిష్ట చేసిన విషయమంతా చెప్పి, కన్నీరు-మున్నీరుగా ఏడ్చింది. వృషపర్వుడి కొలువులో వుండవద్దనుకుని, శుక్రాచార్యుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని రాజధాని విడిచి వెళ్లిపోయాడు. వృషపర్వుడు క్షమించమని కోరడంతో కోపాన్ని విడిచి వెనక్కు వచ్చాడు. వేయిమంది చెలికత్తెలతో సహా ఆయన కూతురు శర్మిష్ట తన కూతురుకు చెలికత్తెగా వుండాలన్న నిబంధనను అంగీకరించి, కూతురును దేవయానికి చెలికత్తెగా చేశాడు వృషపర్వుడు. ఆ తరువాత శుక్రాచార్యుడు దేవయానిని యయాతికిచ్చి వివాహం చేశాడు. కుమార్తెను యయాతితో పంపేటప్పుడు, శర్మిష్టతో సంగమం కూడదని అల్లుడికి చెప్పి పంపాడు శుక్రాచార్యుడు.

దేవయాని, యయాతులకు యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. ఒకనాడు దేవయాని లేని సమయాన, సమయం కొరకు వేచివున్న శర్మిష్ట ఒంటరిగా వున్న యయాతి దగ్గరికి పోయి తన అభీష్టాన్ని వెలిబుచ్చింది. రాకుమార్తె కోరికను అంగీకరించి ఆమెతో అప్పటి నుండి రహస్యంగా కాలం గడుపుతూ వచ్చాడు యయాతి. శర్మిష్ట యయాతి వల్ల గర్భం దాల్చి, ద్రుహ్యువు, అనువు, పూరువు అనే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది. ఇదంతా దేవయానికి తెలిసింది. ఈ విషయం శుక్రాచార్యుడికి కూడా తెలిసింది. ముసలివాడివి కమ్మని యయాతిని శపించాడు. తనకు ఇంకా దేవయానిమీద మోజు తీరలేదని, అది తీరిన తరువాత ఆయన అన్నట్లే వృద్ధాప్యాన్ని పొందుతానని అన్నాడు యయాతి మామగారితో.

రాజధానికి తిరిగొచ్చిన యయాతి కొడుకులను పిలిచి తనకు వారి యవ్వనం ఇవ్వమని అడిగాడు. పూరుడు తప్ప అంతా కాదన్నారు. ఆయన తండ్రి ముదిమిని తీసుకుని తన యౌవనాన్ని తండ్రికిచ్చాడు. యయాతి యువకుడయ్యాడు. యయాతి, దేవయానులు ఇష్టభోగాలను ఆనందంగా అనుభవించారు. యయాతి ధ్యానిస్తూ అనేక శ్రీహరిని యాగాలు కూడా చేశాడు. కాలం అలా గడిచిపోతుంటే జరిగినదానికి యయాతి విచారించసాగాడు. పూరుడి యవ్వనాన్ని అతడికి ఇచ్చివేసి, తన ముసలితనాన్ని పొందాడు. పూరుడికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఇంద్రియ సుఖాలను విడనాడాడు. శ్రీహరి దయవల్ల భగవత్ భక్తులు పొందే ఉత్తమ గతిని పొంది వాసుదేవ పరబ్రహ్మంలో లీనమయ్యాడు. ఆ తరువాత దేవయాని కూడా ముక్తిపథాన్ని చేరుకుంది.

     పూరుడికి జనమేజయుడు జన్మించాడు. అతడి వంశాను క్రమంలో రైభ్యుడికి జన్మించాడు దుష్యంతుడు. అతడు మహారాజుగా సకల వైభవాలతో వర్థిల్లాడు. ఒకనాడు అడవికి వేటాడడానికి పోయాడు. వేటాడుతూ, కణ్వమహాముని ఆశ్రమం చేరువలోకి వచ్చాడు. అక్కడ జాతివైరం కల జంతువులన్నీ కలిసిమెలిసి ఆడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. తన సేవకులను ఆశ్రమం బయటే వుండమని చెప్పి, తాను లోపలి వెళ్లి కణ్వమహామునికి నమస్కారం చేసి వస్తానన్నాడు. లోపలికి వెళ్లి అక్కడ శకుంతలను చూశాడు దుష్యంతుడు. ఆమె మీద మనసుపోయింది అతడికి. ఆమె ముఖకవళికలను బట్టి ఆమె రాచకన్య కావచ్చునన్న నిర్ణయానికి వచ్చాడు దుష్యంతుడు. ఆమె ఎవరని ప్రశ్నించాడు. మేనకా, విశ్వామిత్రులు తనను కన్నవారని, కణ్వమహర్షి పెంచాడని, ఈ అడవిలో తన జన్మ ధన్యమైందా అన్నట్లు ఆయన్ను కలవగలిగానని అన్నది శకుంతల. ఇద్దరూ గాంధర్వ పద్ధతిలో వివాహమాడారు.

శకుంతల గర్భం దాల్చిన తరువాత దుష్యంతుడు రాజధానికి చేరుకున్నాడు. కొంతకాలానికి శకుంతల మగబిడ్డకు జన్మనిచ్చింది. కొండకోనల్లో. అడవిలో బిడ్దతో  అవస్థలు పడవద్దని, భర్తదగ్గరికి వెళ్లమని కణ్వమహాముని శకుంతలకు చెప్పాడు. సమస్త విద్యల్లో ఆరితేరిన కొడుకును వెంటబెట్టుకుని శకుంతల రాజధానికి వచ్చింది. వచ్చి, దుష్యంతుడు కొలువు తీర్చి వున్న సభామండపంలో ప్రవేశించింది. కుమారుడిని, తనను చూసికూడా రాజు మాట్లాడకపోవడంతో శకుంతల ఆందోళనకు గురైంది. శకుంతల దుష్యంతుడి భార్య అని, ఆమెను అతడు చేపట్టాలని, భరించాలని ఆకాశవాణి మాటలు వినిపించాయప్పుడు. అలా ఆకాశవాణి అన్నందున అతడి పేరు భరతుడు అయింది. దుష్యంతుడు వారిని చేరదీసి, కొంతకాలం రాజ్యం చేసి, పరలోకానికి చేరుకున్నాడు. తరువాత భరతుడు రాజ్యపాలన చేశాడు. మొత్తం 133  అశ్వమేధ యాగాలు చెసి బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించాడు. బలపరాక్రమాలతో, చక్కటి ప్రవర్తనతో, సంపదతో, నాటి రాజులందరికంటే అధికుడై 27 వేల సంవత్సరాలు ఈ భూమిని పాలించాడు. భరతుడు పుత్రుల కొరకు తపిస్తుంటే, బృహస్పతి, ఆయన అన్న భార్య మమత, విడిచి వెళ్లిన భరద్వాజుడు అనే బిడ్దను మరుత్తులు భరతుడికి ఇవ్వడంతో అతడు స్వీకరించి పెంచాడు. అతడి సంతతిలో వాడే రంతిదేవుడు. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment